ఎక్కడైనా బావ.. - ఎం బిందు maadhavi

Ekkadainaa baava

ఇంటర్మీడియెట్ చదువుతున్న గోపాల్, జై రాం, శిరీష్..స్టేషనరీ షాపులోకి వెళ్ళి రెండు పైలట్ బాల్ పాయింట్ పెన్స్, నాలుగు పెన్సిల్స్, ఒక డ్రాయింగ్ షీట్ కొన్నారు.

కౌంటర్ లో క్యాషియర్ బిల్ 1000/- చేతిలో పెట్టాడు.

"మా అంకుల్ వాళ్ళదే ఈ షాపు. మేము కూడా డబ్బివ్వాలా" అన్నాడు శిరీష్ నిర్లక్ష్యంగా.

"మీరు..చదువుకుంటున్న స్టూడెంట్స్. మీకు చెప్పక్కరలేదనుకుంటాను. డబ్బివ్వకుండా వస్తువులు ఎలా వస్తాయి బాబూ" అన్నాడు క్యాషియర్.

"మేము అంకుల్ తో మాట్లాడతాం లే" అని బయటికి నడవబోయారు.

"అలా కుదరదు బాబూ. డబ్బైనా ఇవ్వండి. మీ చేతుల్లో వస్తువులైనా అక్కడ పెట్టండి. సర్ కి తెలిస్తే మమ్మల్ని కేకలేస్తారు" అన్నాడు మర్యాదగా.

"ఒరేయ్ జయరాం..ఇదేంట్రా. మా ఇజ్జత్ తీసేశావ్. అతను అంత గట్టిగా మాట్లాడుతుంటే..నువ్వేం మాట్లాడవేంటి" అన్నాడు శిరీష్.

"అతనితో గొడవెందుకురా..మనం బయట షాపులో కొంటే డబ్బులివ్వకపోతే వాళ్ళు ఊరుకుంటారా? జైరాం మాట్లాడట్లేదంటే..వాడికి ఇక్కడి రూల్స్ తెలిసే ఉంటాయి. డబ్బులిచ్చెయ్..వెళ్ళిపోదాం" అన్నాడు గోపాల్ అక్కడి వాతావరణం తేలిక పరచటానికి.

వీళ్ళు గొడవ పడుతున్న టైం లో శ్రీనివాస రావు గారు లోపలికి వచ్చారు. 'ఎంతయింది' అని అడిగి 'కోటీ ఇదిగో' అని జేబులోంచి డబ్బు తీసి క్యాషియర్ కి ఇచ్చారు.

ఈ హఠాత్సంఘటనకి నిర్ఘాంత పోయిన మిత్ర బృందం..నోరు తెరిచి మాట్లాడే లోపు.."అబ్బాయిలు మీరు బయలుదేరండి. ఇతర కస్టమర్స్ కి ఇబ్బంది అవుతుంది" అన్నారు.

శిరీష్ అర్ధం కాని అయోమయంలో పడ్డాడు. క్యాషియర్ ముందు జై రాం నిశ్శబ్దంతో... ఒకింత అవమానం ఫీల్ అయ్యాడు.

@@@@

"జై ఇదిగో ఈ నెల నీ పాకెట్ మనీ" అని ప్రతి నెలా ఇచ్చే రెండు వేల బదులు ఒక వెయ్యి చేతిలో పెట్టారు శ్రీనివాసరావు గారు.

అతను మాట్లాడే లోపే.."మన షాపే అని ఇష్టం వచ్చినట్లు అందులో వస్తువులు ఎప్పుడంటే అప్పుడు ఫ్రీగా తీసుకుని వాడుకుంటే.. ముందుగా మన బిజినెస్ దెబ్బ తిని..చిల్లు కుండలా తయారవుతుంది. పెట్టుబడికి..ఆదాయానికి పొంతన ఉండదు."

"రెండోది..మనం ఇలా చెయ్యటం చూసి..మనం కనిపెట్టలేము అనుకుని..అందులో పని చేసే వాళ్ళు కూడా క్రమ శిక్షణ లేకుండా..విచ్చలవిడిగా వస్తువులు స్వంతానికి వాడేసుకుంటారు. షాపు వాళ్ళ మీద వదిలేస్తున్నాము అంటే..ముందు కొన్ని పద్ధతులు అలవాటు చేసి..వారి మీద మనకి నమ్మకం కలిగాకనే!"

"మీ తాతగారి టైం నించి..ఈ షాపు నడుపుతున్నాము. ఇప్పుడు అవి ఒకటికి రెండు షాపులు అయ్యాయంటే తాతగారు పాటించిన నిబద్ధత. ఆయన మాకు నేర్పిన క్రమశిక్షణ మేము కూడా అనుసరించటం వల్లనే!"

“మేమందరం ఆ ఆదాయంతోనే చదువుకుని పెరిగి పెద్దయ్యాము. ఆయనకి ఆ క్రమశిక్షణ..నిబద్ధత లేకపోతే ఇన్నేళ్ళు సంసారం నడిచేది కాదు. మీ ఫ్రెండ్స్ తో ఎలా చెప్పుకుంటావో నువ్వు ఆలోచించుకో" అని ముగించారు.

నాన్నగారు అన్యాపదేశంగా ఏం చెప్పదల్చుకున్నారో అర్ధం అయిన జై రాం మాట్లాడకుండా పక్క గదిలోకి వెళ్ళిపోయాడు.

గత వారం షాపు నించి నోట్ బుక్స్ తెచ్చుకున్న పావనికి కూడా..తన తప్పు తెలియాలనే అలా గట్టిగా చెప్పారని అర్ధం అయింది.

@@@@

"ముఖేష్..మీ ఫ్రెండ్స్ తో హాలిడేస్ ఎంజాయ్ చెయ్యటం అయింది కదా! ఈ రోజు నించి ఆఫీసుకు రా. ముందు ప్లాంట్ లో పని నేర్చుకో. ఆరు నెలలు అక్కడ అప్రెంటిస్ లాగా వర్క్ చేశాక ప్యాకింగ్ సెక్షన్ కి మారుస్తాను. తరువాత స్టోర్స్, ఆ పైన డిస్పాచ్ సెక్షన్" అన్నారు ఆ ఫ్యాక్టరీ ఓనర్ ముకుందం గారు.

"తనని తమ ఫ్యాక్టరీలో చేరమని ఇంతకు ముందు రెండు-మూడు సార్లు నాన్నగారు చెప్పినప్పుడు ..తనకి ఇవ్వబోయే క్యాబిన్..ఇంటీరియర్స్ ఊహించుకుంటున్న ముఖేష్... చూడమ్మా.. బీ టెక్ డిస్టింక్షన్ లోపాస్ అయిన నన్ను..నాన్నగారు మిగిలిన వర్కర్స్ తో పాటు యాప్రాన్ వేసుకుని ప్లాంట్ లో పనిచెయ్యమంటున్నారు" అని తల్లికి కంప్లెయింట్ చేశాడు.. మొహాన గంటు పెట్టుకుని.

"అవును నాన్నా..ఫ్యాక్టరీ మనదే అని మొదటి రోజేనిన్ను మేనేజర్ సీట్ లో కూర్చోబెడితే..క్షేత్ర స్థాయి పని నీకు తెలియదు. ఆ వర్కర్స్ మీద నీకు కంట్రోల్ ఉండదు. యజమాని కొడుకు తమతో పాటు ప్లాంట్ లో పని చేస్తున్నాడని తెలిస్తే వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తారు. వారి కష్ట సుఖాలు కూడా నీకు తెలుస్తాయి. చీటికి మాటికి సమ్మెలు చెయ్యటానికి వాళ్ళు సిద్ధమవరు."

"అలాగే అన్ని శాఖల్లోను నీకు క్షేత్ర స్థాయి బరువు సులువులు తెలియాలనే నాన్నగారు అలా చేస్తున్నారు. అప్పుడే నువ్వు మంచి యజమానివి కాగలవు."

సరిగ్గా అప్పుడే కాలేజి నించి వచ్చిన శిరీష్ అమ్మా..నాన్న..అన్నయ్య సంభాషణ విని.. ఆ రోజు జై రాం వాళ్ళ నాన్నగారి షాపులో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నాడు.

స్టేషనరీ కొన్న తమని క్యాషియర్ డబ్బు అడగ్గానే..తాము అతనితో గొడవ పెట్టుకోవటం.. అప్పుడే వచ్చిన అంకుల్ తన జేబులో నించి డబ్బు తీసి ఇచ్చి "ఎక్కడైనా బావ కానీ..వంగ తోట దగ్గర కాదు" అని తమకి ఒక పాఠం నేర్పారు.

అలాగే క్యాషియర్ కి..అతను షాపులో ఒక చాక్లెట్ తీసుకోవాలన్నా..తమ యజమాని లాగా డబ్బు గల్లాపెట్టెలో వెయ్యాలి అని నిశ్శబ్దంగా ఒక మెసేజి కూడా ఇచ్చారు.

నిజమే నాన్నగారు కానీ, శ్రీనివాసరావు అంకుల్ కానీ..అంత కట్టుదిట్టంగా తమ బిజినెస్ నడపబట్టే తమని మంచి కాలేజీల్లో చదివించగలుగుతున్నారు. అడిగినవన్నీ కొనిపెట్టగలుగుతున్నారు.. అనుకున్నాడు శిరీష్..తన తప్పు తెలుసుకున్న పశ్చాత్తాపంతో.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి