మరో కోణం - గాయత్రి

Maro konam

"ఛీ ఛీ. వెధవ బతుకు. నెమ్మదిగా నిద్ర పోయేందుకు కూడా వీలు లేదు ఈ కొంపలో," గొణుగుతూ చేతిలోని చాపా దిండు కింద పడేసింది పావని. దివాన్ కాట్ మీద పడుకుని అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న వర్ధనమ్మ మేలుకొని "ఏమైయ్యిందే?" అంది. దిండు సరిచేసుకొని చాప మీద పడుకుంటూ "ఆ గదిలోనేమో వాడు చదువుకుంటున్నాడు. ఈ గదిలో దీనికి మీటింగు. నాకు చూస్తే కాస్త వెలుతురు వున్నా నిద్ర రాదు. ఈయన గారికి ఇదేం పట్టవు. కడుపు నిండితే చాలు హాయిగా నిద్రపోతారు." విసురుగా చెప్పిన పావని "నువ్వు నిద్రపో పిన్నీ ఇది మా యింట్లో మామూలే. అంతా నా ఖర్మ" అంటూ కళ్ళు మూసుకుంది. వర్ధనమ్మ కూడా నిట్టూరుస్తు అటువైపు తిరిగి పడుకుంది.

బద్దకంగా కళ్ళు విప్పిన పావని కిటీకీలో వెలుతురు చూపి అయ్యబాబోయ్ తెల్లారి పోయింది అనుకుంటూ త్వరత్వరగా లేచి, పక్క సర్ది, కాలకృత్యాలు తీర్చుకొని వంట ఇంట్లోకి వస్తూ భర్తను కేకేసింది, "తెల్లవారి పోయింది. కాస్త లేపగూడదూ. నేనెలా పోతే మీకేం. లేటుగా వెళితే హెడ్మాస్టర్ తో తిట్లు తినేది నేనే కదా" వంటిట్లో గ్యాసు మీద పాలు వేడి చేస్తోంది వర్ధనమ్మ. "అయ్యో, రెండు రోజులు చుట్టం చూపుగా వచ్చిన దానివి, నీకెందుకు పిన్నీ శ్రమ" అంటూ వచ్చిన పావని "ఈ గిన్నె తీసుకున్నారా! ఇది పాలగిన్నె కాదు. ఏం చేస్తాం. వుండనీలే" అంది. "అలవాటు కొద్దీ పెందరాళే లేచాను. ఏమైనా పని చేద్దామంటే ఏం చెయ్యాలో తోచలేదు. కొత్తచోటుకదా! అల్లుడు గారు పాలు తెచ్చిపెట్టారు. వేడి చేద్దామనుకొన్నా చెప్పింది వర్ధనమ్మ. "ఫర్లేదులే పిన్ని. నువ్వలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో కాఫీ ఇస్తాను" అంటూ పావని చకచకా పనులు చేయసాగింది. కాఫీ చేసి, గ్లాసుల కోసం ర్యాకు దగ్గరకు వెళ్ళింది. "వెయ్యిసార్లు చెప్పాను ఈయనకు. కాఫీ గ్లాసులు కింది ర్యాకులో పెట్టొద్దని, అయినా అక్కడే పెడతారు. నా మాటంటే అసలు లెక్కలేదు", అంటున్న పావనిని చూసి అప్పుడే లోపలికి వచ్చిన ఆమె భర్త సురేష్, "ఇప్పుడే మయ్యింది" అన్నాడు. "ఏమైంది, ఏమీ కాలేదు. అదే నేనూ చెబుతున్నా. "మన బతుకుల్లో అసలేమీ కాలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు వున్నాము" విసురుగా జవాబిచ్చింది పావని. "చీ, పొద్దున్నే మొదలు పెట్టింది" అంటూ బయటికి వెళ్ళబోయాడు సురేష్ " ఎక్కడికీ, ఈ కాఫీ తీసుకొని వెల్లండి. పొద్దున్నే కాఫీ లేకపోతే మీకు తలనొప్పి వస్తుంది. రోజంత బాధ పడతారు. అది కూడా నా ప్రాణానికే" చిటపటలాడుతూ కాఫీ గ్లాసు భర్త చేతిలో పెట్టింది. ఇదంతా చూస్తూ మౌనంగా కూర్చొన్న వర్థనమ్మకు కాఫీ గ్లాసు అందిస్తూ "ఏం అనుకోకు పిన్నీ, మా ఇంట్లో ఇది మామూలే" అంది.

ఇలాగే భర్తమీద, పిల్లల మీద విసుగుతూ చకచకా -స్నానం చేసి, పూజ చేసి, టిఫిన్ రెడీ చేయసాగింది. అంతలోనే స్నానం చేసి వచ్చిన వర్ధనమ్మ, దేవుడికి దండం పెట్టి, కొన్ని స్తోత్రాలు చదువుకొని, పావనీ, కూరగాయ లేమైనా తరిగి ఇవ్వనా?" అని అడిగింది. "అపురూపానికి వచ్చిన నీకు కూడా పని పెట్టేస్తా పిన్నీ" అంటూ, కత్తిపీట, కూరగాయలు ఆమె ముందు వుంచింది పావని. "మునక్కాయలు కాస్త పొడుగ్గా ముక్కలు చేయి. అలా వుంటే చిన్నాగాడికి ఇష్టం. వుల్లి పాయలు కాస్త ఎక్కువే తరుగు. బంగాళాదుంపల కూరలో ఎక్కువ వుల్లిపాయలు వేస్తేనే గాని బుజ్జి తినదు". ఇలా మధ్య మధ్యలో చెబుతూనే, గ్యాస్ మీద కుక్కర్ పెట్టింది. కొబ్బరి పచ్చడి చేసి, దోశలకు పెనం పెట్టింది. ఈ లోపు సురేష్ కూడా స్నానం చేసి రెడీ అయ్యాడు. తనకు, పావనికి మధ్యాహ్నం భోజనానికి కావలసిన క్యారియర్లు, బ్యాగులు అన్నీ రెడీ చేసి డైనింగ్ టేబుల్ పై పెట్టాడు. దోశలు చేసి, బంగాళాదుంపల కూర, కొబ్బరి పచ్చడితో భర్తకు ఇచ్చింది. ఫ్రిడ్జిలో వెన్నవుంది కాస్త వేసుకు తినండి. మొన్న నెయ్యి కాచి నప్పుడు అయ్యగారికి ఇష్టమని తీసిపెట్టాను." చెప్పింది పావని. సురేష్ తీసి వేసు కున్నాడు. " ఏం చేసినా లాభం లేదు ఈ యింట్లో", సణుగుతూనే వుంది పావని. బ్యాంక్ పరీక్షల కోసం పొద్దు పోయే దాకా చదివిన చిన్నా అనబడే 22 సంవత్సరాల ఉదయ్, రాత్రి రెండు, మూడు గంటల దాకా పని చేసే బుజ్జి అనబడే 24 సంవత్సరాల చిత్ర ఇంకా లేవలేదు. అన్నం, సాంబారు చేసి తనకు, భర్తకు క్యారేజీలు సర్దిన పావని, "పిన్ని నీకు దోశలు చేసి ఇస్తాను వేడిగా తినేసేయ్" అంది. " వద్దమ్మా నాకు ఇంత త్వరగా తిని అలవాటు లేదు. తర్వాత నేను చేసుకొని తింటానులే. నువ్వు తిను. నీకు ఆలస్యమవుతుంది" చెప్పింది వర్ధనమ్మ.

ఒక దోస పేట్లో వేసుకుని, మరొకటి పెనం మీద వేసి తింటూనే బయటకు వెళ్ళి పిల్లలపై అరుస్తోంది పావని. " "ఒరే చిన్నా, బుజ్జి లేవండి. బారెడు పొద్దెక్కినా పడుకుంటారు. త్వరగా లేచి తయారయితే దోశలు వేసి ఇస్తాను. తరువాత మీకు చేసుకోవడానికి సరిగ్గా రాదు. కడుపునిండా తినరు." మాట్లాడు తూనే లోపలికి వచ్చింది. అప్పటికే పెనం మీద దోశని తీసి మరో దోశ పోస్తుంది వర్ధనమ్మ. " నువ్వుండ బట్టి వేడిగా వేస్తున్నావు. లేకపోతే నేనే చెయ్యి కడుక్కొని వేసుకోవాల్సి వచ్చేది పిన్నీ. నీకు శ్రమ ఇస్తున్నాను. కొంచెం నూనె తక్కువ వెయ్యి పిన్ని. అదొక్కటే చాలు నాకు" లొడలొడా మాట్లాడుతూనే ప్లేట్లో దోశ, పచ్చడి వేసుకుంది పావని. "అమ్మగారూ అంట్లు వేస్తారా." పనిమనిషి గొంతు వినిపించింది. "'వేస్తాను తల్లి వేస్తాను. లేకపోతే అవన్నీ నా ప్రాణనికే మూలం". సణుగుతూనే "ఆ "వస్తున్నా పనిమనిషికి జవాబిచ్చింది పావని, ప్లేటు కింద పెట్ట బోయేంతలో నిద్ర కళ్ళతో వచ్చిన చిత్ర "నువ్వు తిను నేను అంట్లు వేస్తాలే. అంతగా అరవక పోతే మెల్లిగా చెప్పలేవూ" అంటూ అంట్లు బయట పెట్ట సాగింది. నా ఖర్మ. అందరూ నన్ను అనేవాళ్ళే". అంటూ గబగబ తిని క్యారియర్ తీసుకుని భర్తతో వెళ్ళింది. "వెళ్ళొస్తా పిన్నీ, సాయంత్రం ఒక్క గంట పర్మిషన్ తీసుకొని త్వరగా వస్తా. నువ్వు టిఫిన్ చెయ్యి. మధ్యాహ్నం భోజనానికి వడియాలు వేయించమని బుజ్జికి చెప్పాను. అందరూ కలిసి భోంచేయండి". గడప దాటే వరకు చెబుతూనే వుంది పావని.

పావని ప్రైవేటు స్కూల్లో పనిచేస్తుంది. సురేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంటుగా పని చేస్తాడు. వర్ధనమ్మ పావనికి స్వయానా పిన్ని కాదు. వాళ్ళమ్మకు పినతల్లి కూతురు. ఇద్దరూ చిన్నప్పుడు ఒకే ఊళ్ళో వుండడంతో స్వంత అక్క చెల్లెళ్ళలాగే వుండేవారు. పెళ్ళయి వేరే ఊర్లకు పోయినా తరచు రాకపోకలు వుండేవి. పావని వాళ్ళ నాన్న రైసు మిల్లులో గుమాస్తా ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు. భార్యాభర్తలిద్దరు గుట్టుగా కాపురం చేసి పిల్లలను కాస్తా చదివించి వాళ్ళ స్తోమతకు తగ్గ సంబంధాలు చూసి పెళ్ళి చేశారు. వర్ధనమ్మ భర్త Bsc ag చదివి, వ్యవసాయం మీద మక్కువతో పల్లెలో స్థిరపడ్డాడు. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు వాళ్లకు. ఇద్దరూ చదివి, వుద్యోగాల్లో చేరారు. పెళ్ళిళ్ళు అయిన తరువాత సిటీలో కాపురం పెట్టారు. పావని వాళ్ళు చిన్నప్పుడు వేసని సెలవుల్లో వర్థనమ్మ వాళ్ళ పల్లెకు వెళ్ళేవారు. పిల్లలందరూ కలిసి సెలవుల్లో ఆడుకోనేవారు. వర్థనమ్మ తమ పొలాల్లో పండిన పంటలను ఇచ్చి పంపేది. -పావని వాళ్ళ అమ్మ నాన్న పోవడంతో, ఎవరి సంసారాలు వాళ్ళకు కావడంతో రాకపోకలు తగ్గిపోయాయి.

పావని వుండే వూళ్ళోనే వర్ధనమ్మ ఆడపడుచు కొడుకు పెళ్ళి వుండడంతో పెళ్ళికి వచ్చిన వర్థనమ్మని బలవంతంగా తన ఇంట్లో రెండు రోజులు వుండి పొమ్మని తీసుకొచ్చింది పావని.

మధ్యాహ్నం మూడున్నర కల్ల వచ్చేసింది పావని. అప్పటికే సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న చిత్ర పనంతా ముగించి, ఆఫీస్ పనికోసం లాప్టాప్ ముందు పెట్టుకొని గదిలో కూర్చుంది. టిఫిన్ చేసి కాసేపు చదివి మళ్ళీ భోజనం చేసి వర్ధనమ్మతో ఎదో కబుర్లు చెబుతూ కూర్చోన్నాడు ఉదయ్. చిత్రకు మధ్యాహ్న రెండు గంటల నుంచి ఆఫీస్ మొదలవుతుంది. పావని వచ్చి కాళ్లూ చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొనే లోపల ఉదయ్ కాఫీ చేసి, పావనికి, వర్ధనమ్మకు, చిత్రకు ఇచ్చి తనో కప్పు తీసుకొని చదువుకుంటానని గదిలోకి వెళ్ళిపోయాడు. "వీడు కాఫీ చేస్తాడు కానీ, చక్కెర వెయ్యడు. అబ్బ సొమ్ము పోతుందేమో అన్నట్టు", పావని లోపలికెళ్ళి కాస్త, చక్కెర వేసుకుని "నీకు కావాలా పిన్నీ" అంది. "వద్దు "అంది వర్దనమ్మ.

కాసేపు ఏదో మాట్లాడుతూ వుండగానే "టీచర్ "అంటూ ట్యూషన్ పిల్లలు వచ్చారు. ఈ రోజు ట్యూషన్ లేదు. ఎలాగూ రేపు ఎల్లుండి శెలవు. సోమవారం వచ్చేయండి" చెప్పి పంపింది పిల్లలని. పనిమనిషి ఉతికిన బట్టలు మడిచిపెట్టడం, సాయంత్రం వంట ఇలా అన్ని పనులూ బొంగరంలా తిరుగుతూ చేస్తూనే, ఐదింటికి వచ్చిన భర్తను కలిపి, పిల్లలపై కూడా ఏదో ఒక విషయానికి విసుక్కుంటూనే వుంది పావని. మధ్య మధ్యలో వర్ధనమ్మతో తన గోడు వెళ్ళబోసుకుంటూ, తమకెన్ని కష్టాలో, మధ్యతరగతి జీవితాలు ఎన్ని ఒడిదుడుకులతో సాగుతాయో అంతా ఏకరువు పెట్టింది. మరుసటి రోజు వేకువనే భర్త, కొడుకుని తీసుకొని బ్యాంక్ పరీక్షలు రాయించడానికి ఊరు వెళ్తున్నారని చెప్పింది. కూతురు తన ఫ్రెండ్స్ తో రెండురోజులు ట్రిప్ వెళుతోందని చెప్పింది.

మరుసటి రోజు వెళ్ళొస్తానని చెబుతూ కాళ్ళకు దండం పెట్టాడు ఉదయ్ పావని ఆశీర్వదిస్తూ, "నీవు కూడా B.Tech చదివుంటే ఈ పాటికి ఉద్యోగంలో చేరి వుండేవాడివి. చెబితే వినలేదు," అంది. "ఎన్నిసార్లు ఈ మాట అంటావు అమ్మా! ఏం ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ B.Tech చదివారా? ఇప్పుడు నేను రాయబోయే బ్యాంకు పరీక్ష రాయటానికి ఎంత మంది B.Tech చదివినవాళ్ళు వస్తారో వచ్చి చూడు నీకే తెలుస్తుంది" అంటూ గయ్యిమన్నాడు ఉదయ్. "ఇప్పుడు నేనేమన్నానని అలా అరుస్తావు చిన్నా! పోనీలే వెళ్లేటప్పుడు గొడవ దేనికి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఏమండీ, జాగ్రత్త ప్రయాణంలో నిద్ర పోకండి. మీ కసలే నిద్ర ఎక్కువ",చెప్పింది పావని. మరి కాస్సేపటికి చిత్ర తన ఫ్రెండ్స్ రావటంతో వాళ్ళతో పాటు వెళ్ళింది. అప్పుడు కూడా పావని ఏదో అనటం తో చిత్ర కూడా మొహం మాడ్చుకుంటూ వెళ్ళింది. 'సరే పిన్నీ ఏదైనా టిఫిన్ చేస్తాను మనిద్దరికీ", అన్న పావనిని వారిస్తూ, ఏమీ వద్దు పావనీ! ఒక్కసారే భోజనం చేద్దాం. ఈ రోజు నేను వంట చేస్తాను. ఏ సామాను ఎక్కడుందో చెప్పుచాలు" అంది వర్ధనమ్మ. "ఎన్నాళ్ళయింది పిన్నీ! నీ చేతి వంట తిని. కడుపు నిండి పోయింది". అంటూ భోజనం ముగిం చింది పావని. వంటిల్లు అంతా సర్దిన తరువాత వర్థనమ్మ పిలిచింది, "ఇలారా పావని, ఇలా కూర్చో. నీతో తీరికగా మాట్లాడటమే కుదర లేదు" అంది." ఎక్కడ తీరిక పిన్నీ! ఎప్పుడు చూసినా పరుగే పరుగు. ఇంత చేసినా అందరికీ నా పైన కోపమే. క్రిందటి జన్మలో ఏం పాపం చేసానో మరి!" వాపోయింది పావని. "ఎందుకలా మాటి మాటికీ నిన్ను నువ్వు కించ పరుచుకుంటావు? నీకేం తక్కు వైంది? అనుకూలుడైన భర్త ముత్యాల్లాంటి పిల్లలు", సమాధాన పరిచింది వర్ధనమ్మ .

"అందరూ అలాగే అంటారు. అనుభవించే వారికే తెలుస్తుంది. కట్నాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో నాన్న చిన్న వుద్యోగం చేసుకుంటున్న ఈయనతో పెళ్ళి చేసారు. చాలీ చాలని జీతాలతో బ్రతుకు ప్రారంభించాము. నేను కూడా ఉద్యోగం చేయడం మొదలు పెట్టాను. కొంచెం కుదుట పడ్డాం. మా మామగారు కాస్త డబ్బిచ్చారు. ఇంకాస్త అప్పు తీసుకొని -ఈ ఇల్లు తీసుకున్నాము. అప్పు తీర్చాలని తంటాలు పడ్డాము. అది ముగిసే లోపల పిల్లలు, వాళ్ళ చదువులు, బుజ్జి ఫైనల్ ఇయర్ వున్నప్పుడు క్యాంపస్ ఇంటర్వూలు జరుగుతాయి, తనగు వుద్యోగం దొరుకుతుందని ఆశతో చూస్తుంటే, ఈ కరోనా వచ్చింది. ఏ ఇంటర్వూలు జరగలేదు. డిగ్రీ అవుతూనే వాడిని బ్యాంక్ పరీక్షల కోచింగ్ కు పంపాలను కున్నాము. కరోనా వల్ల అవి కూడా మూత పడినాయి. ఎలాగో తంటాలు పడిన తరువాత అర్నెల్ల క్రితం బుజ్జికి వుద్యోగం వచ్చింది. అదేమో ఇలా వూల్లెంబడి తిరిగి డబ్బు వృథా చేస్తుంది. నాలుగు డబ్బులు కూడ బెట్టుకోవే, నీ పెళ్ళికి పనికొస్తాయి. అంటే, ఎప్పుడూ పెళ్ళి గొలేనా అని నా మీద అరుస్తుంది. చిన్నా గాడు నేను చదివాను పరీక్ష రాయగలను అంటాడు. ఏం చదివాడో, ఏం రాస్తాడో వాడికే తెలియాలి! జీవితమంతా సర్దుబాట్లు చేసుకోవడం లోనే అయిపోతోంది పిన్నీ. . నా బతుకు ఇలాగే తెల్లవారి పోతుం దేమో! మధ్య తరగతి జీవితాలు ఇంతేనేమో! " తన గోడంతా. వెళ్ళబోసుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకొంది పావని.

"చూడు పావనీ ఇలారా. నా దగ్గర కూర్చో" అని పావనిని తన పక్కలో కూర్చో చెట్టుకొని వర్ధనమ్మ చెప్పసాగింది. "నిజమే పావనీ నువ్వు చెప్పేది. మధ్య తరగతి వాళ్ళకు బ్రతుకు పోరాటమే. ఒకదాని తరువాత ఒకటి సమస్యలు వస్తూనే వుంటాయి, సముద్రపు అలల లాగా. కొంతమంది చెప్పేస్తారు, సమస్యలు వచ్చినప్పుడు, నీకంటే తక్కువగా వున్న వాళ్ళని చూడు, వాళ్ళ సమస్యల ముందు నీవి తక్కువ అని పిస్తాయి అని. కానీ చెప్పడం సులువు. ఎవరి సమస్యలు వారికి పెద్దవే ఈ మధ్యతరగతి వాళ్ళున్నారే, పైకి ఎగబాకడానికి ప్రయత్నిస్తూ క్రిందికి జారి పోతామేమో అని భయపడుతూనే జీవితాన్ని సాగిస్తారు. ఒక్కటి గుర్తుపెట్టుకో పావనీ మధ్యతరగతి వాళ్ళు కుంగి పోతారు గానీ లొంగిపోరు. ఎన్ని ఒడి దుడుకులు వచ్చినా, కాస్త కుంగి నట్లే వుంది మళ్ళీ లేచి నిలబడి పోరాడు తారు. అందువల్లనే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఇంకా నిలిచివుంది. జీవితాన్ని అనుభవించటం కూడా మనలాంటి మధ్యతరగతి వాళ్ళను చూసే నేర్చుకోవాలి. చిన్న చిన్న విషయాలకే పొంగి పోతారు. ఏ చిన్న అవకాశమున్నా ఆనందిస్తారు. సినిమా హాళ్ళు, తీర్థయాత్రలు, వ్యాపారస్థలాలు ఎక్కడ చూసినా సగం కంటే ఎక్కువ మధ్యతరగతి వాళ్ళే. అందరికీ సమస్యలు వుంటాయి. వాటిని చూసే దృష్టి మాత్రం వేరు వేరుగా వుంటుంది. కొంత మంది సమస్యలతో పోరాడుతూనే జీవితాన్ని ఆస్వాదిస్తారు. మరికొంత మంది సమస్యలని నెత్తి మీద వేసుకొని భారాన్ని మోస్తారు. నీలాగా"

"భారాన్ని మోయక తప్పదు కద పిన్నీ"

"మోయక తప్పదను కున్నప్పుడు కాస్తా నవ్వుతూ మోస్తే పోలా"

"అదెలా కుదురు తుంది పిన్నీ"

" భారాన్ని బాధ్యత అనుకున్నప్పుడు ఎక్కువ బాధ కలుగదు."చెప్పడం కొనసాగించింది వర్ధనమ్మ. " నిన్నటి నుంచి చూస్తున్నాను. నీవు అన్ని విషయాల్లోను లోపాలను మొదట చూస్తున్నావు. పాలు వేడి చేయడానికి నాకు తోచిన గిన్నె నేను తీసుకున్నాను. నేను పాలు వేడి చేయడం నీకు సహాయమయ్యిందని చూసే ముందు వేరే గిన్నె తీసుకున్నానన్నది మొదట కనిపించింది నీకు. నీ భర్త, పిల్లలూ నీకు సహాయపడుతున్నారు. వాళ్ళ ప్రతి పనిలో లోపాలే మొదట కనిపిస్తాయి నీకు. వెలుతురు వుంటే నిద్ర పట్టదని గొణిగే బదులు కళ్ళకు ఏ టవలో చుట్టుకొని పడుకోవచ్చుగా. నీ పిల్లలు ఊరికే టైం వేస్ట్ చేస్తూ మేలుకొని లేరు. చిన్నా చదువుకుంటున్నాడు. బుజ్జి ఏమో ఆఫీసు పని చేస్తుంది. సాయంత్రం నీవు ట్యూషన్ చెబుతున్నప్పుడు, చదువుకోవటం కుదరదని, అందుకే రాత్రిళ్ళు ఎక్కువ సేపు చదువుతానని నా ముందు అన్నాడు. చిన్నా: అన్ని విషయాలను నీ ముక్కు సూటిగా చూడకుండా వేరే వాళ్ళ గురించి ఆలోచించడం నేర్చుకో. ఇక సమస్యలంటావా, అందరికీ వున్నవే నీకూ వున్నాయి. కూతురి పెళ్ళి చేయాలి.. కొడుక్కు వుద్యోగం రావాలి. నిజమే. అయితే ఇవన్నీ ఒక్క రోజులో ఆ తీరేవి కావు. ముందెప్పుడో జరగాల్సిన దాన్ని గురించి ఆలోచిస్తూ, ఈ రోజు సంతోషాన్ని పాడు చేసు కుంటున్నావు. నీవు పొద్దున నుండి సాయంత్రం వరకూ కష్ట పడతావు. భర్త, పిల్లల అవసరాలను తీర్చాలని తాపత్రయ పడతావు. కానీ నీ నోటి దురును. చిటపటలాడే నీ స్వభావం వల్ల అందరితో నిష్టుర మౌతావు. నాశ్రమను ఎవరూ గుర్తించడం లేదని బాధ పడతావు."

"అయితే తప్పంతా నాదేనంటావా పిన్నీ" బేలగా అడిగింది పావని.

" ఊహూ! నీవు చేస్తున్న పని తప్పుకాదు. చేసే విధానం మార్చుకోవాలి. సంవత్సరం తరువాత వచ్చే కరువుకోసం కాస్త తీసి పెడితే తప్పుకాదు. ఈ రోజు వుపవాసం చేస్తాననడం తప్పు. ఏదో నేనొక్కదాన్నే భారమంతా మోసేస్తున్నానని అనుకోవడం తప్పు. అందరూ కలిసి తలో చెయ్యి వేస్తే ఎంతటి పని అయినా సులువుగా అయిపోతుంది. అస్తమానం సమస్యల గురించే ఆలోచిస్తూ, అనుదినం పొందే ఆనందాన్ని పాడు చేసుకుంటున్నావు. నీ నొక్కదానివే కాకుండా అందరి సంతోషాన్ని పాడు చేస్తున్నావు. నువ్వెంత కోల్పోతున్నావో నీకు అర్ధం. కావాలి అంటే నా గురించి చెప్పాలి నీకు." ఆపింది వర్ధనమ్మ.

"నీ గురించి నాకు తెలియనిదే ముంది పిన్నీ "ఆశ్చర్యంగా అడిగింది పావని.

" నువ్వు చూస్తున్న ఈ వర్ధనమ్మనూ, చిన్నప్పటి వర్థనికీ చాలా తేడా వుంది. ఆ వర్ధని పెంకిఘటం, తిక్క, మొండి తనం, కోపం, విసుగు, చిరాకులకు మారుపేరు వర్థని" 'నమ్మలేక పోతున్నా పిన్నీ." కళ్ళు విప్పార్చింది పావని. " "అవును ఎవరూ నమ్మరు",. తనకు తనే చెప్పుకుంటున్నట్టు అంది వర్ధనమ్మ. " నేను చిన్నప్పుడు కాస్త మొండిదాన్ని. ఒక్కతే కూతురు కావడంతో చాలా గారాబం చేసేవాళ్ళు. నాకు పదేళ్ళు నిండగానే పెద్దదాన్ని అయ్యాను. ఆరవ తరగతి చదివే దాన్ని అప్పుడు. తెలిసీ తెలియని వయసు. ఏమయిందో అర్ధంకాక గాబరాపడి ఏడవ సాగాను. అమ్మా, బామ్మా మొదట కంగారు పడినా వెంటనే తేరుకొని ఏమేం చేయాంలో చర్చించుకోసాగారు. నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. మూడు రోజులు గిలగిలలాడి పోయాను. మొదటిసారి కదా! అందుకే అలా అయ్యింది అన్నారు అమ్మా వాళ్ళు. నేనెంత నీరస పడి పోయానంటే, తరువాత ఇంట్లో జరిగిన ఏ కార్యక్రమాలను నేను ఆనందంగా ఆస్వాదించలేదు. నాకోసం తెచ్చిన బట్టలు, నగలు, అందరూ తెచ్చిన కానుకలు ఏవీ నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. నేను కొద్దిగా మూమూలుగా అవడానికి పదిరోజులు పైనే పట్టింది. ఆ మూడు రోజులు తల్చు కుంటే నాకు చీదరగా అనిపించేది. చూస్తూండగానే నెల తిరిగి మళ్ళీ మూడు రోజుల నరకం ప్రారంభమైంది. అంతే నేను పూర్తిగా మారి పోయాను. అందరి మీదా కోసం చూపిం చేదాన్ని. బయటికి వెళ్ళడం తగ్గించేసాను. ఆడుకోవటం మానేసాను. బడికి కూడా ఇష్టమైతే వెళ్ళేదాన్ని లేకపోతే లేదు.

ఎక్కువగా వైద్య సదుపాయం లేని రోజులు. ఏవో మందులు ఇప్పించారు. ఎక్కువ ప్రయోజనం లేక పోయింది. నెలనెలా నొప్పి అనుభవించడం మామూలయింది. నా తోటిపిల్లలు ఒక్కొక్కరే పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళలో చాలా మంది హాయిగా వుండేవారు. అది చూసి నాకు ఇంకా చిరాకు ఎక్కువైంది. నాకు మాత్రమే ఈ బాధ అనే భావంతో ఎవరితోను కలవలేక పోయేదాన్ని. హైస్కూలు పక్క వూల్లో వుండేది. చాలామంది మావూరి నుంచి నడిచి వెళ్ళేవాళ్ళు. బడికి వెళ్లేటప్పుడో, బడిలోనో కడుపునొప్పి వస్తే అనే భయంతో ఏడవ తరగతితోనే నా చదువు ఆగి పోయింది. స్నేహితులు లేక పోవడంతో ఇంటి పని బాగా చేసేదాన్ని. నాన్న తెచ్చి ఇచ్చే పుస్తకాలు చదివేదాన్ని. ఆంధ్ర ప్రభ పత్రికను చూసి కుట్లు అల్లికలు నేర్చుకున్నాను. ఏం చేసినా చిటపటలాడటం, మోహం మాడ్చుకోవటం తగ్గలేదు. నాకు 18 ఏళ్ళు వచ్చాయి. మీబాబాయ్ వాళ్ళది మాపూరికి దగ్గరే. ఇరువైపుల వాళ్ళకి నచ్చడంతో నా పెళ్ళి కుదిరింది. నా అభి ప్రాయం అడిగినప్పుడు వెంటనే ఒప్పేసుకున్నాను. ఎందుకో తెలుసా? పెళ్ళయితే నెలసరి వచ్చే కడుపు నొప్పి తగ్గుతుందని మా బామ్మ ఎప్పుడో అంటుంటే విన్నాను. అందుకే ఒప్పు కున్నాను. పెళ్ళయి అత్తారింటికి వచ్చేసాను. నా సంతోషం పదిరోజులు కూడా మిగలలేదు. ఆ నెలసరికి మళ్ళీ అదే బాధ. నా అవస్థ చూసి అందరూ భయపడి పోయారు. మా ఆయన దగ్గర్లో వున్న పట్నం తీసుకెళ్ళి డాక్టరుకు చూపించారు. ఆవిడేవో మందులు ఇచ్చి, నాలుగైదు నెలలు చూసి తగ్గక పోతే చూద్దాం అంది. కొద్దిగా తగ్గినట్టే తగ్గి మళ్ళా మొదలయ్యేది. ఇలా మరో నాలుగు నెలలు గడిచాయి . నాకు పెళ్ళయితే నొప్పి తగ్గుతుందని చెప్పిన బామ్మతో పాటు, అందరి మీద కోపం వచ్చింది. అత్తగారింట్లో కూడ ఎవరితోను ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. ఎప్పుడూ చిరాకుగా వుంటూ పెడసరంగా జవాబిచ్చేదాన్ని. మా అత్త, మాను చాలా మంచివాళ్ళు. చిన్నపిల్ల, కొన్నాళ్లు, పోతే సర్దుకుంటుంది. అనేవారు. మా అత్తయ్య వాళ్ళచెల్లెలి కూతురి పెళ్ళికి అత్తయ్య మామయ్య ఇద్దరూ పదిహేను రోజులు ముందుగానే ఊరెళ్ళారు. మమ్మల్ని రెండు రోజులు ముందు రమ్మన్నారు.

నాలుగు రోజుల తరువాత పెళ్ళికి ఎప్పుడు వెళ్ళాం వర్ధని అని మీ బాబాయ్ అడిగితే, నేను రాను అని తిక్కగా సమాధానం చెప్పి లేచి వెళ్ళిపోయాను. కాస్సేపు అయిన తరువాత మీ బాబాయ్ వచ్చి నా పక్కన కూర్చొని తల విమురుతూ "వర్ధనీ ఎందుకలా నిన్ను నువ్వే శిక్షించుకొంటావు." అన్నారు. నాకెందుకో ఏడుపు వచ్చేసింది. బాగా ఏడ్చేశాను. నాఏడుపు తగ్గిన తర్వాత ఇలారా అని పక్కన కూర్చోబెట్టుకొని మెల్లిగా చెప్పసాగారు. చూడు వర్ధనీ, ఈ నాలుగు నెలల్లో నీ సమస్వేమిటో నాకు అర్థమైంది. చాలా మంది ఆడవాళ్ళకు వుండే సమస్యే నీకు వుంది. కానీ నువ్వు దాన్ని భూతద్దంలో చూస్తున్నావు. నిజమే నీకు వచ్చే నొప్పి భయంకరంగా వుంటుంది. అది వుండేది మాత్రం మూడు రోజులే. మిగతా 27 రోజులు నీకు నువ్వే దాని భారం మోస్తున్నావు. నీ నెత్తి మీద ఆ భారం వుండబట్టి నీ చుట్టు పక్కల ప్రపంచాన్ని చూడలేక పోతున్నావు. అన్ని సుఖాలను పోగొట్టుకుంటున్నావు. ఆలోచించి చూడు వర్ధనీ, బాల్యం నుంచి నువ్వేం పోగొట్టుకున్నావో నీకే అర్ధం అవుతుంది. ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు. నీకు ట్రీట్ మెంట్ ఇప్పిస్తాను. నీ బాధ తగ్గుతుంది. కానీ కొంచం టైం పట్టొచ్చు. అంతదాకా ఎలా వుండాలి అన్నది నువ్వే నిర్ణయించుకో. మూడు రోజుల బాధనే ముప్పై రోజులు మోస్తూ అందరినీ, అన్నింటినీ దూరం చేసు కుంటావో, లేదా నాలుగో రోజు నుంచి నొప్పి లేదనీ ఆనందంతో జీవితాన్ని అనుభవిస్తావో నీ ఇష్టం. నేను నిన్ను దేనికీ బలవంత పెట్టను. పొద్దుపోయింది పడుకో' అని ఆయన నిద్ర పోయారు. నాకు నిద్ర పట్టలేదు. ఆలోచించినట్టల్లా నేను ఎంత కోల్పోయానో అర్థమవుతుంది. బంగారం లాంటి బాల్యం, చదువు, అమ్మా నాన్నల ప్రేమ, స్నేహితులు, మరెన్నో ముచ్చట్లు, పండుగలు, సంబరాలు, అన్నీ, అన్ని పోగొట్టు కున్నాను. ఏదీ మనస్ఫూర్తిగా అనుభవించ లేదు. ఆయన చెప్పినట్లు ప్రకృతి నాకు మూడు రోజులు శిక్షనిచ్చింది. దాన్ని నేనే యావజ్జీవ శిక్షగా మార్చుకొన్నాను. ఈ దృష్టిలో ఎప్పుడూ ఆలోచించని నాకు కనువిప్పు కలిగింది. తెల్లవారు తూనే మీ బాబాయిని నవ్వుతూ నిద్రలేపి పెళ్ళికి ఏ చీర కట్టుకోను? అని అడిగాను." వర్ధనమ్మ చెప్పటం ఆపింది. వర్ధనమ్మ కథ వింటూ పావని తనకు తెలియకుండానే ఆమె ఒళ్ళో పడుకుంది. వర్ధనమ్మ చేయి పావని తల నిమురుతోంది. "పిల్లలు ఎంత పెద్ద వాళ్లయిన తల్లి దగ్గర పిల్లలే. ముద్దు పేర్లు పెట్టడం మాత్రమే కాదు, ముద్దుగా పిలావాలి. అర్థమైంది అనుకుంటాను పావనీ. రేపటి సమస్యలకు పరిష్కారం ఆలోచిస్తూ, ఈ రోజు సుఖం పాడు చేసుకోకూడదు." అంది వర్ధనమ్మ. తనకు తెలియ కుండానే కారుతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ లేచి కూర్చొంది పావని. "అర్ధమైంది పిన్నీ! నా కళ్ళు తెరిపించావు. నీమేలు ఎన్నటికీ మరువను" అంది.

ఇప్పటికి పోగొట్టుకున్నదే చాలు. ఇక మీదట అందరూ కొత్త పావనిని చూస్తారు అని ధృడంగా నిశ్చయించుకొంది.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి