దొంగలు దొరికారు..! - - బోగా పురుషోత్తం

Dongalu dorikaru

వింజమూరు రాజు వీరేంద్రవర్మ ప్రజా రంజకంగా పాలించేవాడు. ప్రజలకు ఆర్థికంగా ఏ లోటూ రాకుండా చూసుకున్నాడు. ప్రజల వద్ద మంచి పాలకుడు అని పేరు పొందాడు.
అయితే కొన్నాళ్ల తర్వాత ఊహించని పరిణామం ఎదురైంది. రాజును పొగిడిన వారే ‘అసమర్థ రాజు’అని దూషించసాగారు.
ఇది వీరేంద్రవర్మ వినలేక విన్నాడు. రోజురోజుకు రాజ్యంలో వున్న చిన్నారులు మాయం కాసాగారు. కొద్ది రోజులు అర్థం కాక తల పట్టుకు కూర్చున్నాడు వీరేంద్ర వర్మ. మంత్రి వీరసూరిడితో పాటూ సైనికాధికారి చంద్రయ్య, ఇతర భధ్రతాధికారులతో నిఘా కమిటీ ఏర్పాటు చేశాడు. అయినా ఒక్కరూ పిల్లల అపహరణకు కారకులెవరనే సంగతిని కనుక్కోలేకపోయారు. దీంతో ఎంతో పరాక్రమవంతుడు అని పేరున్న వీరేంద్ర వర్మ సైతం విస్మయంతో చూస్తుండి పోయాడు. చిన్నారుల మాయం సమస్య కొరకరాని కొయ్యగా మారింది. ఇక లాభం లేదనుకుని స్వయంగా రాజే ఓ వ్యూహ రచన చేశాడు.
మారు వేషంలో మంత్రితో పాటూ రాజు రాత్రి వేళలో నిఘా వేశాడు. అయినా అంతు చిక్కలేదు. ఇక లాభం లేదనుకుని వీధిలో తిరుగుతున్న ఓ పది మంది అనాథ పిల్లలను తన వెంటబెట్టుకుని ఓ సామాన్యుడిలా గ్రామాల వెంట తిరగసాగాడు రాజు, అలా వెళుతుండగా ఓ ఇంట్లో వాళ్లంతా కూర్చొని ' మా ఇంట్లో వున్న నల్గురు పిల్లలు మాయం అయ్యారు.. ఈ మాయదారి రాజుకు ఏ రోగం వచ్చిందో ఏమో కనుక్కోలేకపోతున్నాడు. ఎందుకూ పనికి రాడు.. రాజు వున్నా ఒకటే.. లేకున్నా ఒకటే..’’ అంటూ శాపనార్థాలు పెట్టడం విన్నాడు రాజు.
ఇక నిద్ర పట్టలేదు. ఆ పరిసర ప్రాంతంలోనే ఆ రోజు రాత్రి తిష్టవేశాడు. తను ఓ ఇంటి అరుగుపై కూర్చున్నాడు. పక్కనే కూర్చున్న పిల్లలు అకలికి అలమటిస్తున్నారు. వారిని ఓదార్చ సాగాడు రాజు. అయినా గుక్కపెట్టి ఏడుస్తున్నారు. అది విన్న చుట్టుపక్కల వాళ్లు ఒక్కడిని కూడా పోషించలేనివాడివి.. ఇంత మందికి ఎందుకు కనుక్కున్నావయ్యా?’’ అని చీవాట్లు పెట్టసాగారు. ' ఏం చేస్తాం.. ఎంతో కష్టపడి డజను మందిని కన్వానుక్కున్నాను.. వారిని ఊరూరు తిప్పుతూ పనికోసం తిరుగుతుంటే ఇద్దరు మాయం అయ్యారు. ఇక ఈ పది మంది మిగిలారు..ఈ తెలివిలేని మూర్ఖరాజు పిల్లలకు కూడా రక్షణ కల్పించలేకపోతున్నాడు. ఇక పెద్దలకు ఏం రక్షణ కల్పిస్తాడో ఏమో..?..ఈ పిల్లలను ఒంటరిగా విడిచి నేను ఇక పని ఎక్కడ వెతుక్కునేది..?’’ నిట్టూర్పు విడిచాడు.
అది విన్న ఆ ఇంటి యజమాని అశ్చర్యంతో విన్నాడు. ‘‘ ఆ అవునవును మా పిల్లలు కూడా నల్గురు పోయారు..రాజుకు అసలు బుద్ధి, జ్ఞానం లేదు..కళ్లు మూసుకు కూర్చున్నాడు.! నువ్వు ఎలాగు కూడు పెట్టి పెంచలేవు.. ఆ పిల్లలను నాకు వదిలిపెట్టు.. బాగా పెంచి పిల్లలు లేని లోటు తీర్చుకుంటాను..’’ అని ఏకరువు పెట్టసాగాడు..
‘‘అమ్మో నా కన్న పిల్లలు..నీ వద్ద వదిలిపెడితే ఎలా వుండగలను..వీలు కాదు !’’ అన్నాడు మారు వేషంలో వున్న రాజు.
ఆ మాటకు ఆ ఇంటి యజమాని కోపంతో చూడడం గుర్తించాడు. అతని మీద అనుమానం వచ్చింది. ఆ రోజు రాత్రి ఆ ఇంటి అరుగుమీద పడుకున్నట్లు నటించి అర్ధరాత్రి వేళ ఆ పిల్లలను అక్కడే వదిలి ఆ ఊరి చివరన నాల్గు రోడ్ల కూడలి వద్ద చాటుగా కూర్చొని అమాయకంగా దిక్కులు చూడసాగాడు. తెల్లవారుతున్న సమయంలో ఆ ఇంటి యజమాని ఆ పిల్లలను తీసుకుని వెళుతుండడం కనిపించింది. రాజు తన పరివారంతో వెనుకే వెళ్లి పరీక్షించాడు. పిల్లల్ని తీసుకు వెళ్లిన వ్యక్తి వారిని విక్రయించడానికి మరో వ్యక్తితో బేరమాడుతున్నాడు. వెనుకే దాక్కుని చాకచక్యంగా వారిని పట్టుకున్నాడు. వారు పారిపోవడానికి యత్నించిన పిల్లల అపహరణ ముఠాను పట్టి బందించి చెరసాలలో వేశాడు.
ఇప్పుడు పిల్లలు అపహరణకు గురి కాలేదు. రాజ్యంలో మాయమైన పిల్లల్ని గుర్తించి వారివారి తల్లిదండ్రులకు అప్పగించారు.
రాజు ఎంతో చాకచక్యంతో పిల్లల అపహరణముఠాను పట్టుకోవడంతో ప్రజలు ఆనందించారు. ఆ తర్వాత గట్టి నిఘాతో పిల్లలకు రక్షణ కల్పించడంతో రాజ్యంలో ప్రజల్లో అనందం నెలకొంది. ప్రజలు మళ్లీ రాజును పొగడడంతో వీరేంద్ర వర్మ సంతోషించాడు.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి