అద్దె తల్లి - chitti venkata subba Rao

Adde talli

నెలలు నిండుతున్న కొద్ది లచ్చమ్మకిమనసు ఆందోళనగా ఉంది. ఇది తొలి కానుపు కాకపోయినా ఈసారి బాధగా భయంగా ఉంది లచ్చమ్మ కి. క్రితం సారి కన్నా ఈ సారి ఆరోగ్యం చాలా బాగుంది. నీరసం అనేది లేదు. మంచి ఆహారం మంచి మందులు పళ్ళు పాలు అన్ని వేళకు తింటున్న మనసు ఇదివరకు అంత ఉత్సాహంగా లేదు. ఈ కడుపులో ఉన్న బిడ్డ భూమ్మీదకి వచ్చిన వెంటనే ఎవరికో ఇచ్చేయాలి అనే బాధ లచ్చమ్మ గుండెను మండిస్తోంది. సహజంగా కాకపోతేనే కృత్రిమంగా అయినా గర్భంలో తిరుగుతున్న బిడ్డ వాడు చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు. రాత్రి పడుకుంటే కాళ్లతో తన్నుతాడు. ఏదో కడుపులోంచి మాటలు వినపడుతున్నట్టుగా ఉంటాయి. అది తన భ్రమ లేక నిజంగానే మాట్లాడుతున్నాడా. ఎప్పుడు బయటకు వస్తాడా వాడిని గుండెల మీద వేసుకుని ముద్దాడాలని కడుపునిండా పాలు తాగించాలని భుజం మీద వేసుకుని జో కట్టాలని కలలు కంటోంది లచ్చమ్మ. ఇవన్నీ క్రితం సారి కానుపు వచ్చిన తర్వాత అనుభవించిన అనుభూతులు. తల్లిగా మధుర అనుభూతులు. మరి ఈసారి ఆ అనుభూతులను అనుభవించడానికి అవకాశం ఉంటుందా లేదో. ఎన్ని రోజులు పిల్లవాడిని మన దగ్గర ఉంచుతారో. కొద్దిరోజులు కూడా మాతృత్వపు ఆనందాన్ని అనుభవించకుండా తన దగ్గర్నుంచి లాక్కుని వెళ్ళిపోతే ఎలా భరించగలను. ఆ ఊహ తలుచుకుంటేనే చాలా దారుణంగా ఉంది. ఎక్కడలేని దుఃఖం వస్తోంది లచ్చమ్మ కి.ఆ పుట్టిన బిడ్డని గుండెలకు దగ్గరగా హత్తుకుని వాడి చిన్ని పొట్ట ఆకలి తీర్చే భాగ్యం నాకు ఎన్ని రోజులు ఉంటుందో. వాడు లొట్టలు వేస్తూ పాలు తాగుతుంటే వచ్చే శబ్దం చెవులకి ఎంత ఇంపుగా ఉంటుందో. మాటిమాటికి బట్టతడుపుతున్న అది విసుగు అనిపించదు ఏ తల్లికి. బాధ్యత అనిపిస్తుంది. బిడ్డని సౌకర్యంగా ఉంచాలని ఏ తల్లి అయినా తాపత్రయపడుతుంది. ఆకాశంలో మెరుపు మెరిస్తే బిడ్డ భయపడతాడని తల్లి దగ్గరగా తీసుకుని కోడిపెట్ట తన పిల్లల్ని సంరక్షించడానికి దగ్గరగా తీసుకున్నట్టు తీసుకుని పడుకుంటుంది. అది తల్లి ప్రేమంటే. అది కన్నతల్లి అయినా అద్దె తల్లి అయిన పెంపుడు తల్లి అయిన బిడ్డ మీద తల్లి ప్రేమ ఒక్కటే. అవును మగపిల్లాడిని ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాను. పూర్వకాలంలో ఆ సౌకర్యాలు ఉండేవి కాదు. ఇప్పుడు కచ్చితంగా రుజువు చేసే వైద్య పరికరాలతో పరీక్ష చేయించుకుని కాబోయే తల్లిదండ్రులు మరింత శ్రద్ధగా లచ్చమ్మని చూసుకుంటున్నారు. అసలు శిశువు ఇంట్లో పుడితేనే ఎక్కడలేని ఉత్సాహం అందరికీ వస్తుంది. వాడి ఆటపాటలతో ఏడుపుతో ఇల్లంత సందడిగా ఉంది. పుట్టిన వెంటనే అందరికి నోరు తీపి చేస్తారు. కానీ కాబోయే తల్లిదండ్రులు వాళ్ళ ఇంటిదగ్గర పార్టీలు చేసుకుంటారు. మనం ఇక్కడ నోరు చప్పరిస్తూ కనీసం ఆ పార్టీలకు కూడా మనని పిలవరు.అలాగే ఉయ్యాల్లో వేయడం లాంటి సంబరాలు చూసే అదృష్టం కూడా లేదు. చక్కగా ఉయ్యాల అలంకరించి పిల్లాడికి పట్టు బట్టలు కట్టి పట్టుచీర ముక్క ఉయ్యాల్లో వేసి ఉయ్యాల చుట్టూ బుడగలు కట్టి పెద్దవాళ్ల చేత పిల్లవాడిని ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపడం ఎంత కన్నుల పండుగ ఉంటుంది. అలా పిల్లవాడు ఎదుగుతూ బోర్లా పడితే బొబ్బట్లు వండుకొని తింటారు. ఆ ఆనందాలేవీ మనం అనుభవించలేం. వాడికసలు నేను గుర్తుంటానా! కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎవరు కనబడితే వాళ్లే అమ్మ వాడికి. నడక వచ్చిన నాలుగు మూలలా తిరిగి చేతి కందిన సామాన్లన్నీ పాడు చేస్తుంటే తల్లికి కోపం వచ్చి రెండు దెబ్బలు వేద్దామని వెంటపడితే వాడు పారిపోతుంటే ఆ దృశ్యం ఎంత బాగుంటుంది. అలా పెరిగి పెద్ద అయ్యి విద్యాబుద్ధులు నేర్చుకుని ఒక పెద్ద ఉద్యోగంలో స్థిరపడిన ఏమీ తెలియదు. ఒక కన్నతల్లిగా ఆ ఆనందం అనుభవించడానికి ఆస్కారం లేదు. ఈ భూమ్మీద పడిన తర్వాత వీడికి నాకు ఏం సంబంధం. నేనెవరో వాడెవరో. కనీసం అద్దె తల్లి అని కూడా ఎవరూ ఎప్పుడూ చూపించరు. అలా చూపిస్తే పిల్లవాడి మానసిక స్థితి ఏ రకంగా ఉంటుందో అని ఆ కాబోయే తల్లిదండ్రుల అభిప్రాయం. అవును ఆ బిడ్డ మీద నాకు ఏమి అధికారం ఉంది కేవలం ఆ ప్రాణనీ భూమి మీద తీసుకురావడానికి కేవలం నేను ఆధారం మాత్రమే. అయినా మరణ యాతన అనుభవించి ఒంట్లో ఉన్న శక్తినంతటిని కూడ తీసుకుని రక్తం పోగొట్టుకుని భూమ్మీదకి ఆ ప్రాణిని తీసుకొస్తే అద్దె తల్లి అని ముద్ర వేసి నా ప్రాణాన్ని లాక్కుకు పోతుంటే చూస్తూ ఊరుకోవడం తప్పితే చట్టం నా చేతులు కట్టేస్తే ఏమి చేయగలను. అయినా అద్దె ఇంట్లో మటుకు ఎవరు మటుకు ఎన్ని రోజులు ఉంటారు. ఎప్పటికైనా అద్దె ఇల్లు ఖాళీ చేయవలసిందే. ఇలాంటివన్నీ తెలిసి ఈ పనికి ఒప్పుకోవడం చేసిన మొదటి తప్పు. కడుపు కాలుతూ ఉంటే తప్పొప్పులు గుర్తుకు రావు. అయినా వీడు కడుపులో పడగానే నాకు కలిసి వచ్చింది. ఎప్పుడో పెరిగి పెద్దవాడైన తర్వాత చూస్తాడని కలలు కనే రోజులు కాదు ఇవి. అద్దె తల్లిగా అవతారం మార్చుకున్న మరునాటి నుంచి ఎప్పుడు మా ఇంటిలో పొయ్యిలో పడుకునే పిల్లి మళ్లీ కనపడలేదు. రోజు తిట్లు తిట్టి మా కొంప చుట్టూ తిరిగే అప్పుల వాళ్ళు మళ్లీ అప్పు ఇస్తానని మా చుట్టూ తిరుగుతున్నారు. పచ్చడి ముద్దతో కొద్దిరోజులు కాలే కడుపుతో కొద్దిరోజులు గ్లాసుడు మంచినీళ్లు తాగి కొద్ది రోజులు కాలక్షేపం చేసే రోజులు పోయి నాలుకకి కొత్త రుచులు అన్నీ తెలుస్తున్నాయి. వీడు గడప దాటితే పరిస్థితులన్నీ మామూలే.. అద్దె తల్లిని కూడా పుట్టకుండానే సంతోష పెడుతున్నాడు వీడు. ఏమో నేను ఒకరు ఆనందానికి కారణం అవుతున్నాను. నేను అమ్మగా సంతాన దానం చేస్తున్నాను. ఇది నా తలరాతఅనుకుంటూ బాధపడుతుండగానే నొప్పులు ప్రారంభమయ్యాయి లచ్చమ్మ కి. కాంట్రాక్ట్ ప్రకారం కార్పొరేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యి బిడ్డని ప్రసవించింది. ఆ విషయం లచ్చమ్మ భర్త ఆ తల్లిదండ్రులకు చెబుదామని వెళితే అక్కడ పిడుగు లాంటి నిజం తెలిసింది. ఆ భార్యాభర్తలిద్దరూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారని. లచ్చమ్మ కి ఏడవలో నవ్వాలో అర్థం కాలేదు. ఇన్నాళ్లు బిడ్డ కోసం పరితపించి పోయిన వాళ్లు పరలోకానికి వెళ్లిపోయారు. లచ్చమ్మ తో కుదుర్చుకున్న ఒప్పందం ఆ తల్లిదండ్రులకి లచ్చమ్మకి భర్తకి తప్ప ఎవరికీ తెలియదు. ఒప్పందం ప్రకారం అని ముందుగానే సమకూర్చిన ఆ తల్లిదండ్రులు దురదృష్టానికి లచ్చమ్మ దంపతులు ఎంతగానో బాధపడ్డారు. అలా అద్దె తల్లిగా బిడ్డను కన్నా కన్నతల్లిగా మారి లచ్చమ్మ ఆ పిల్లాడికి కృష్ణుడని పేరు పెట్టుకుని ఆనందంగా పిల్లాడి ఆటపాటలు చూసి మురిసిపోతూ కాలక్షేపం చేస్తూ కాలం గడుపుతూ ఉండేది. కన్నతల్లిగా ఆమె పడిన బాధ చూసి భగవంతుడు ఇలా మార్చాడా! ఏమో ఎవరికి తెలుసు.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు