మధ్య తరగతి మనోగతం - షామీరు జానకీ దేవి

Madhya taragathi manogatam

“యాకమ్మా! మీకు రేషన్ బియ్యం ఇస్తున్నారా?” కొత్తగా పెట్టుకున్న పనిమనిషిని ఆరా తీస్తున్నట్లుగా, అడిగింది లక్ష్మి…

“ఇస్తున్నారమ్మా!.. ఈ నెల ఇంకా ఇవ్వలేదు…” గిన్నెలు తోముతూ తల తిప్పి చూస్తూ, లక్ష్మికి సమాధానం ఇచ్చింది…

మళ్ళీ వెంటనే తనే అడిగింది… “ఎందుకమ్మా! మీకు కావాలా?” ఇంతకు ముందు తాను పని చేసిన ఇంటి వాళ్ళు ఇలాగే కొనుక్కుని పావురాళ్ళకు వేసేవారు…

“అవును యాకమ్మా! ఈ బియ్యముతో దోశలు బాగా వస్తాయి… ఇంతకు ముందు మాకు పని చేసిన అమ్మాయి ప్రతి నెల ఐదు కిలోలు తెచ్చి ఇచ్చేది… అలాగే నీ దగ్గర తీసుకుందామని అడుగుతున్నా…” ప్లేట్లో దోశలు వేసి యాకమ్మకు ఇస్తూ అన్నది… లోపలికి వెళ్ళి గ్లాసులో మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది…

“అట్లానే అమ్మా!.. రాగానే ఇస్తా…” అన్నది యాకమ్మ…

“ఇంతకీ కిలో ఎంత?” అని అడిగింది లక్ష్మి…

“కిలో పది రూపాయలు అమ్మా… నేను ఇంతకు ముందు అట్లానే ఇచ్చిన…” మొహమాటం లేకుండా చెప్పింది…

అంతకు ముందు తను కిలో ఐదు రూపాయలకు కొన్నది… ఇదేంటి! ఇలా రేటు పెంచేసింది… ఏమోలే ఏదన్నా అంటే మళ్ళీ తనకే సమస్య అని మనసులోనే అనుకుని, మౌనంగా వుంది లక్ష్మి…

లోపలికి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి, ఆమెకు గ్లాసులో పోసింది…

“అలాగే… తీసుకురా…” అని చెప్పి లోపలికి వెళ్ళింది…

“ఏమోయ్ ఇది విన్నావా? ఇప్పుడే మన వూరిలోని మన ఇంటి ఎదురుగా వున్నవాళ్ళు ఫోన్ చేశారు…” అంటూ లక్ష్మిని పిలిచాడు శ్రీనివాస్…

“మీతో మాట్లాడితే నేనెలా వింటాను… ఏమిటో చెప్పండి” అంటూ నవ్వుతూ వచ్చి పక్కన కూర్చుంది లక్ష్మి…

“మన ఊర్లో కూడా మనకు ఓటు హక్కు ఉందట… ఈ మధ్య అక్కడ అభ్యర్థి తరపు వాళ్ళు మన ఇంటికి వచ్చి మన పేరు మీద డబ్బులు ఇచ్చారట… మన ఇంట్లో అద్దెకున్న వాళ్ళు తీసుకున్నారట… ఇప్పుడే మన ఎదురింటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు…” అదేదో వింతలా చెప్పాడు…

“ఈ ఓట్ల సర్దుబాటు, నోట్ల పంపిణీ వీటిని అరికట్టాలంటే ఆధార్ కార్డు తో లింక్ చెయ్యాలి…” తనకున్న నాలెడ్జి పంచుకుంది భర్తతో…

మళ్ళీ వెంటనే తనే సందేహం చెప్పింది…“బాగుంది!.. మన మధ్య తరగతి వాళ్ళకి ఏ ప్రయోజనం ఉండదు… మన పేరు చెప్పుకొని వేరే వాళ్ళు లబ్ధి పొందుతారు… ఇక్కడ ఓటు వేశాం కదా, మరి అక్కడ ఎలా ఉంది?” ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది…

“అంతటా అవినీతి రాజ్యమేలుతున్నప్పుడు, ఓట్ల దందా కొరకు ఏమైనా జరుగుతుంది…” నిస్పృహగా పలికింది అతని గొంతు…

పిల్లల చదువుల కోసం, తామిద్దరూ ట్రాన్స్ఫర్లు పెట్టుకొని పల్లెటూరు నుంచి సిటీకి వచ్చారు… వారికి కోరిన చదువులు చెప్పించి, పెళ్ళి చేసారు… వారికి బ్రతుకు తెరువు ఇక్కడ లేదని అమెరికా వెళ్ళిపోయారు… అక్కడే సెటిల్ అయ్యారు…

తాము పిల్లల చదువుల కోసం సిటీకి వచ్చారు… పల్లెటూరులో ఉన్న ఇల్లు అద్దెకి ఇచ్చి, ప్రస్తుతం సిటీలో ఒక ఫ్లాట్ కొనుక్కుని, అందులో ఉంటున్నారు… నాటి తరానికి, ఇలా నేటి తరానికి కూడా వలస తప్పదా? నాడేమో పల్లెలు, చిన్న పట్నాల నుంచి పెద్ద నగరాలకు… నేడేమో దేశాంతరాలకు, ఖండాంతరాలకు… అంతే… తేడా ఏమీ లేదు…

పాత పనిమనిషి, తన కూతురు పురుటి కొచ్చిందని మానేసింది… వెళ్ళే ముందే బస్ చార్జీలే బోలెడు అవుతున్నాయని, చాలా దూరం నుంచి వస్తున్నాని, జీతం పెంచమని, వెంట పడి మరీ పెంచించింది... మళ్ళీ తాను పోతూ పోతూ, ఈమెని, పెంచిన అదే జీతానికి కుదిర్చి మరీ వెళ్ళింది…

ఇప్పుడు బస్ చార్జీలు లేవు… అంతా ఉచితమే… కానీ జీతం మటుకు తగ్గిస్తే వూరుకోరు… పాత ఆమెకి ఎంతిస్తే అంతే… అదేదో రూల్ పాస్ చేసినట్లు… తమ అవసరం… ఏమీ చేయలేని పరిస్థితి… సందర్భోచితంగా మనుగడ సాగించడమే…

“మన ప్రభుత్వాలు పేదలకు బస్ ఫ్రీ, తెల్ల రేషన్ కార్డు వున్నవాళ్ళకి ఆరోగ్యశ్రీ, తక్కువ ఖరీదులో (రు.1 కి కిలో) రేషన్ బియ్యం, పెళ్ళి కాని యువతులకు కళ్యాణ లక్ష్మి, వృద్ధాప్య పింఛన్లు, విడో పింఛన్లు, నిరుద్యోగ భృతి… ఇలా ఎన్నో ఉచిత పథకాలు అమలు చేస్తూ, పని చేసుకుని బ్రతికే శక్తి వున్న వారిని సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు… న్యాయపరమయిన ఉచితాలు ఇవ్వడం కొంత వరకు సముచితమే… కానీ శక్తిమంతమయిన యువత కూడా ఈ ఉచితాల పట్ల ఆకర్షితులవుతున్నారు… ఒక వర్గం ప్రజలు నుంచి వసూలు చేసి, వేరొక వర్గం వారికిస్తూ, అవన్నీ తామే స్వంతంగా ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు మన నాయకులు… ” ఆవేశంలో తనకు గుర్తున్న పథకాల చిట్టా చదివింది….

“శ్రీమతి గారూ!.. ఆగండాగండి!.. మనదంతా అరణ్య రోదనే… ఈ ఉచితాల వలనే ప్రభుత్వానికి ఎప్పుడూ లోటు బడ్జెటే… అది భరించేది మనమే… పన్ను రూపేణా మన వద్ద నుంచే వసూలు చేస్తారు…” ఎన్నికల తరువాత పెరిగిన ఉల్లిపాయ రేటు తలుచుకుంటూ అన్నాడు…

“మనం ఉద్యోగంలో ఉన్నంత కాలం అన్నిరకాల టాక్స్ లు కట్టాము… ఇప్పుడు అరకొర పెన్షన్లు… దీని మీద కూడా టాక్స్ కడుతున్నాము… పిల్లలు దగ్గర లేరు… విదేశాల్లో వాళ్ళూ బొటాబొటి గా బ్రతుకుతున్నారు… మనకు ఇంకా సహాయం చేసేది ఎవరు?” మనసులో బాధ అంతా చెప్పి, గాఢంగా నిట్టూర్చింది లక్ష్మి…

*******

మరిన్ని కథలు

Nijamaina deepavali
నిజమైన దీపావళి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Tagina saasti
తగిన శాస్తి
- Naramsetti Umamaheswararao
Ganji kosam
గంజి కోసం
- B.Rajyalakshmi
Ante maremee samasyalu levu
అంతే, మరేమీ సమస్యలు లేవు
- మద్దూరి నరసింహమూర్తి
O anubhavam
ఓ అనుభవం
- జి.ఆర్.భాస్కర బాబు