రేపు - బొబ్బు హేమావతి

Repu

ఆ సంఘటన జరిగి అప్పటికి వారం రోజులైంది. మాధవి ఒంటరిగా చీకటి గదిలో కుమిలిపోతూ ఉంది. మరో పక్క మాటలు లేకుండా మాధవి తల్లి తండ్రి మౌనంగా కూర్చుని ఉన్నారు. మాధవి రేపటి నుంచి యూనివర్సిటీ కి ఎలా వెళ్తుందో, అందరిని ఎలా ఎదుర్కొంటుందో అనుకున్నారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలకు లెక్క లేకుండా ఉంది ఈ సమాజంలో. కనీసం కుటుంబం మద్దతు కూడా ఆ మహిళలకు లభించడం లేదు. అప్పటికే సరిగ్గా భోజనం చేసి నోటినిండా మాట్లాడుకుని ఆ కుటుంబం రెండు రోజులు అయింది. కుటుంబం లో ఉన్నది ముగ్గురే. కానీ ఎవరి ఆలోచనలు వారివి. ఇలాగే ఉంటే ఎలాగా అనుకుని మాధవి తల్లి తండ్రి ఒకరినొకరు మౌనంగా చూసుకుని మాధవి తో మాట్లాడాలి అని నిర్ణయించుకుని మాధవి దగ్గరికి వెళ్ళారు. చీకటి గదిలో మౌనంగా కూర్చొని ఉంది మాధవి అంతులేని ఆలోచనలతో. అమ్మ ప్రేమగా మాధవి దగ్గరగా కూర్చుంది. "మాధవి...పెళ్ళికి ఒప్పుకో అమ్మా" అంటూ మాధవి వైపు చూసింది. "ఇంత జరిగాక ఇక వేరే వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావు. ఏదో జరిగి పోయింది అతనికి నీకు మధ్య. నువ్వు భారత స్త్రీ వి. ఇక అతనే నీ భర్త. అతను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. కాదనకు. పోలీస్ స్టేషన్ లో అతనిపై నీవు పెట్టిన కేసు వెనక్కు తీసుకో. ఇక వేరే వాడు ఎవరూ నిన్ను పెళ్లి చేసుకోడు. పెళ్లి కి ఒప్పుకో అమ్మా " అని మాధవి అమ్మ అంది. "వాడికి శిక్ష పడాలి. నేను అతడిని పెళ్లి చేసుకోను" అని కన్నీళ్లతో ప్రాధేయపడుతూ అమ్మ వైపు చూసింది మాధవి. ఇప్పటివరకు ఎంతో ప్రేమగా పెంచిన తన తల్లిదండ్రులు, ఇప్పుడు తనకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు అనుకుంటూ మాధవి లో లోపల కుమిలిపోతూ ఉంది. "అది నీకు ముందే తెలిసి ఉండాలి. ముందు జాగ్రత్త ఉండాలి. అక్కడ అలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందేమో అని ఊహించుకుని అక్కడికి వెళ్లి ఉండకుండా ఉండాల్సింది.ఇప్పుడు నువ్వు మాకు తలవంపులు తెచ్చావు. అతను తనకు తానుగా నాకు మాధవి అంటే ఇష్టం. ఏదో తెలియక తప్పు చేశాను. నేను మాధవిని పెళ్లి చేసుకుంటాను అని వస్తే నువ్వు ఎందుకు వద్దంటున్నావు" అన్నాడు నాన్న కోపంగా. "నువ్వు కూడా నన్ను అంటున్నావా నాన్న" మాధవి గొంతు కంగారుగా భయంగా. ఎప్పుడు అన్ని విషయాల్లో తనకు సపోర్టుగా నిలిచే నాన్న ఇప్పుడు ఎందుకు తనను బలవంతం చేస్తున్నాడు అనేది మాధవికి అర్థం కాలేదు. "నాకు ఇష్టం లేకుండా నా మీద బలవంతంగా రేప్ జరిగితే నేను అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి" అని ఆమె అంటున్నంతలో.... "రామకృష్ణ ఉన్నావా"....అంటూ ఇంటి బయట నుండి పిలుపు. తన స్నేహితుని గొంతు విని....వీడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు అనుకుంటూ మాధవి వాళ్ళ నాన్న వెళ్లి తలుపు తీసాడు. రారా మురళీ అంటూ బలవంతంగా మొహంలో నవ్వును పులుముకుని తన చిన్ననాటి స్నేహితుని పలకరించి కూర్చోబెట్టాడు. రామకృష్ణ వైపు చూసి.... "ఎలా ఉన్నావు. పేపర్లో చూసాను జరిగింది" అంటూ...." వాడి తండ్రి రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించాడు. నాకు అతను బాగా పరిచయం. మన స్నేహం గురించి తెలిసి నా దగ్గరకు వచ్చి నా సహాయం ఆర్థించాడు. ఇద్దరికీ పెళ్లి చేస్తాను అంటున్నాడు. ఆ అమ్మాయి నా కోడలు. నువ్వు వప్పించి నా కొడుకును రక్షించు అని అడిగాడు. ఈ కళంకము మీరు ఎలా భరించగలుగుతారు" అని అంటూ "నేను ఒకసారి మాధవి తో మాట్లాడాలి" అనగానే లోపలి నుండి వారి మాటలు విన్న మాధవి గది బయటకు వచ్చింది. మాధవి తన తండ్రి వైపు చూసి... "నాన్న ఇది నా నిర్ణయం.ఇది నా జీవితం. వాడు నా మీద కళాశాలలో ఎప్పటినుండో కన్ను వేసి నన్ను ఎలాగైనా పొందాలని నామీద అటాక్ చేశాడు. మీరు దాన్ని ప్రేమ అంటున్నారు. నేను అతనికి లోబడలేదని నన్ను బలవంతంగా చెరిచాడు. నేను కళాశాలలో అంతర్జాతీయ స్పోర్ట్స్ మీట్ పూర్తి చేసుకుని వస్తూ ఉంటే అతను తన స్నేహితులతో కలిసి వచ్చి చుట్టుపక్కల ఎవరూ లేనిది చూసి నన్ను బలవంతంగా ఎత్తుకెళ్ళాడు. వాడి స్నేహితులు నా చేతులు కాళ్లు గట్టిగా పట్టుకున్నారు. నన్ను ఎత్తుకుపోయి, నిర్మానుష్యమైన ప్రాంతంలో చుట్టూ స్నేహితులను కాపలాగా పెట్టుకుని నన్ను పువ్వును నలిపినట్టు నలిపాడు. నా వైపు చూసి వంకరగా నవ్వుతూ ఇక మనద్దరం ఒకటే. నువ్వు నేను ఇద్దరం ఎంజాయ్ చేశాం ఇప్పుడు. ఇక నువ్వు నన్ను వదిలి ఎక్కడికి పోలేవు అన్నాడు. నేను పోలీస్ రిపోర్ట్ ఇచ్చానని తనకు తానుగా లొంగిపోయి నన్ను పెళ్లి చేసుకుంటాను అని డ్రామా ఆడుతున్నాడు" అంది. "ఎప్పుడో ఏదో జరుగుతుంది అని, ఎవరో ఏదో అంటారని మీరు ఈ సమాజంను చూసి భయపడుతున్నారు.నా గురించి ఆలోచించట్లేదు.అతనికి శిక్ష పడాలి. కానీ మీరు నన్ను వానికి బహుమతిగా ఇస్తానంటున్నారు. నేను మనిషిని నాన్న. మారిపో అనగానే మారిపోవడానికి నేను వస్తువును కాదు" అనగానే మురళీ గట్టిగా చప్పట్లు కొడుతూ అమ్మాయి అంటే నీలా ఉండాలి. నేను ఇది చెప్పాలనే వచ్చాను. నేను మీ కుటుంబానికి మద్దత్తు గా నిలబడతాను. తప్పు చేసిన వానికి శిక్ష పడాలి. మాధవి తండ్రి వైపు చూసి.... రామకృష్ణ నువ్వు నెమ్మదస్తుడివి. ఒకరి చెడు నువ్వు ఎప్పుడు కోరలేదు. నేను నీకు తోడుగా నిలబడతాను ధైర్యంగా ఉండు. నేనే కాదు మన స్నేహితులందరూ కూడా ఇదే నీకు చెప్పమని నాతో చెప్పారు. ఇటువంటి ధైర్యవంతురాలైన కూతురును కన్నందుకు మీరు గర్వపడాలి. రేపు అన్నది నీలాంటి ధైర్యవంతురాలైన ఆడపిల్లలదే " అని అనగానే.... అప్పటికే ధైర్యం పెంచుకున్న మాధవి తల్లితండ్రులు ఆమె వైపు గర్వంగా చూశారు.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి