రాత్రి పదకొండు గంటల సమయం.
క్లబ్బులో పేకాట ఆడుతూ ఉన్నారు నలుగురు మిత్రులు ఆకాష్ తేజ, చంద్ర,మురళిలు. మధ్య మధ్యలో కాస్త కాస్త డ్రింక్ చేస్తూ కార్డ్స్ ఆడుతున్నారు. టైమ్ చూసుకున్నాడు మురళి.
"బాప్ రే!పదకొండు దాటిందిరా!ఇంక నేను వెళ్ళాలి!లేకపోతే మా ఆవిడ తలుపు తీయదు!.."
అంటూ లేచాడు మురళి.
"కాసేపు కూర్చోరా!ఇంకొక్క ఆట..."
మురళిని ఆపటానికి ప్రయత్నించాడు చంద్ర.
"సారీ బ్రదర్!ఇంక వెళ్ళాలి!.."
అంటూ ఇంకో మాటకు ఆస్కారం ఇవ్వకుండా బయటికి వెళ్ళాడు మురళి.
"నేను కూడా వెళ్తానురా!"అంటూ మురళి వెనకాలే కదిలాడు తేజ.
"పెళ్ళాలకు భయపడే పిరికి పందలు...."
ఈసడింపుగా నవ్వాడు ఆకాశ్.
అతడితో పాటు జత కలిపాడు చంద్ర.
చంద్ర, ఆకాశ్ లు మళ్ళీ ఆటలో పడ్డారు. ఆకాష్, చంద్రలు బిజినెస్ చేస్తారు.
ఆకాశ్ ప్రతిరోజూ రాత్రి తొమ్మిదింటికి షాప్ కట్టేసాక క్లబ్బుకు రావటం అలవాటు.
శని,ఆదివారాలు అయితే ఇంక ఇంటికి వెళ్ళే పనిలేదు.క్లబ్బులోనే కాపురం.
ఇంట్లో భార్య సుమ. ఇద్దరు పిల్లలు. ఇంటికి కావాల్సిన డబ్బులు ఇస్తాడు. పిల్లల పెంపకం అంతా సుమదే. భర్త తాగుడు, పేకాట వ్యవహారం ఆమెలో వైరాగ్యాన్ని తెచ్చిపెట్టాయి. తాను ఉద్యోగం చేసుకుంటు పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది.
అర్థరాత్రో, అపరాత్రో వచ్చే మొగుడు అంటే సుమకు కంపరం, అసహ్యం కూడా. అయితే సొసైటీలో భర్త లేని ఆడదానికి రక్షణ లేదని భావించి ఆమె ఆకాశ్ తో విడిపోలేదు.
ఆ రోజు కాస్త మందు ఎక్కువయింది.
కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఆకాశ్.
అతడికి తెలియకుండానే కార్ పేమెంట్ మీదకు వెళ్ళటం, అతడి కార్ కింద ఇద్దరు బిక్షగాళ్ళు పడిపోవటం క్షణాల్లో జరిగిపోయింది.
ఇంకేముంది? కళ్ళుతెరిచి చూసేటప్పటికి పోలీసులు చుట్టూ ఉన్నారు.
పిల్లల్ని స్కూలుకు పంపించలేదు సుమ.
టి. వి. లో బ్రేకింగ్ న్యూస్.
పిల్లలు తండ్రిని టి. వి. లో చూసి బిక్కు బిక్కు మంటూ సోఫాలో ఒదిగి కూర్చున్నారు.
సెల్లు ఫోన్ మోగుతుంటే, ఎవరెవరో బంధుమిత్రులు అడుగుతుంటే వాళ్లకు జరిగిన ఘటన గురించి చెప్తూఉంది సుమ.
పదిహేనురోజులు గడిచాయి.జైల్లో రిమాండ్ ఖైదీల సెల్ లో ఉన్నాడు ఆకాశ్.
ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఎంత మార్పు. జీవితం అగమ్యగోచారంగా తయారయ్యింది. భవిష్యత్తు శూన్యంగా ఉంది.
తలపట్టుకున్నాడు. దీనికంతటికీ కారణం.... తన తప్పిదం మాత్రమే. ఒళ్లూపై తెలీకుండా రాత్రి, పగలు తేడా లేకుండా క్లబ్బులో పడి....
కాలం... ఆగదు. మూడునెలల తర్వాత ఇంటికి వచ్చాడు ఆకాష్. పిల్లలు దగ్గరికి రాలేదు. ఫ్రిండ్స్, బంధువులు పలకరించటానికి కూడా భయపడుతున్నారు. తల్లి తండ్రి కుంగిపోయి ఉన్నారు. కొడుకు చేసిన పనికి ఈ వయసులో వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. ఇక భార్య దూరదూరంగా...అందరికీ భారంగా ఆకాశ్.
జీవితంలోని అన్ని బంధాలు ఛిద్రమయ్యాయి .... ఆకాశమంటే శూన్యమే. శూన్యంలో శూన్యంగా మిగిలాడు ఆకాశ్.//