"ఏమండీ మీ ఉంగరంలో నీలం ఏది, ఏమైంది?"
తన వ్రేలికి ఉన్న ఉంగరం వీవు చూసుకొని "ఇప్పుడు నువ్వు చూసి అడుగుతే కానీ నా ఉంగరంలో నీలం లేదన్న సంగతే నాకు తెలియలేదు. ఉదయంనుంచి ఇంట్లోనే ఉన్నాను కదా, ఇంట్లోనే ఎక్కడో పడిపోయి ఉంటుంది. నీలం లేకుండా బోడిగా కనిపిస్తున్న ఉంగరం తీసేస్తాను" అంటూ తన వేలికి ఉన్న ఉంగరం తీసి భార్య జానకికి ఇచ్చి "నాకు ఆలస్యం అవుతోంది, నేను వస్తాను" అంటూ రాఘవరావు బ్యాంకుకి వెళ్ళిపోయేడు.
వెళుతున్న రాఘవరావును చూస్తున్న జానకికి గతం గుర్తుకు వచ్చింది.
బ్యాంకులో అధికారిగా పనిచేస్తున్న రాఘవరావు త్వరలో రాబోయే పదోన్నతి పరీక్షలకు పూర్తిగా తయారై ఆ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నాడు. రాఘవరావు పరీక్షకు వెళ్లడమే ఆలస్యం, పదోన్నతి ఆయనను వరించడం ఖాయం అని బ్యాంకులో అనుకుంటున్నారు. ఆ ఊరిలోనే కాక చుట్టుపక్కల ఉన్నవారందరూ కలిపి నలభై మంది వరకూ ఆ పరీక్షకు వెళ్ళేవారున్నారు. అయితే, రాఘవరావు అందరిలోకి సీనియర్ అవడంతో, ఆయనకు పదోన్నతి తప్పనిసరి అని అందరూ అనుకుంటున్నారు.
పదో తేదీ నాడు బ్యాంకు ముఖ్య కార్యాలయంలో మౌఖిక పరీక్షకు రావాలని రాఘవరావుకి బ్యాంకునుంచి ఉత్తరం వచ్చింది.
ఎనిమిదో తేదీ ఉదయం గుడికి వెళ్లిన రాఘవరావు అక్కడే కాలుజారి పడిపోవడంతో కుడికాలి మడమ దగ్గర కుడి అరచేయి దగ్గర గాయాలై ఆదివారం జరిగే పరీక్షకు వెళ్లలేకపోయేడు.
తరువాతి సంవత్సరం కూడా పదోన్నతి పరీక్షకు వెళ్ళవలసిన రాఘవరావు 103-104 డిగ్రీల ఉష్ణోగ్రతతో జ్వరం వచ్చి వెళ్లలేకపోయేడు.
మరో రెండేళ్లు కూడా అనుకోని ఏదో అవాంతరం వచ్చి రాఘవరం పదోన్నతి పరీక్షకు వెళ్లలేకపోవడం జరిగింది.
ఈ పరిణామాలతో తన కంటే జూనియర్ అయిన వారిలో మూడొంతులమందికి పదోన్నతి కలిగి, వారి కంటే చిన్న ఉద్యోగిగానే మిగిలిపోయేడు, రాఘవరావు.
ఈ పరిస్థితి ఆయనను మానసికంగా కృంగదీయడమే కాక భౌతికంగా కూడా ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టింది. దాంతో అతను తరచుగా సెలవలో ఉండవలసి వచ్చేది.
ఇవనీ గమనించిన రాఘవరావు భార్య జానకి ఆయన జాతకం తీసుకొని, ఆయనకు తెలియకుండా, ఒకరోజు సిద్ధాంతిగారిని కలిసింది. రాఘవరావు జాతకం క్షుణ్ణంగా పరిశీలించిన సిద్ధాంతిగారు –
-2-
"అమ్మా, మీ ఆయనకు ఇప్పుడు శని మహాదశ నడుస్తున్నది. ఇప్పటికే పదేళ్లు గడిచిన ఆ మహాదశ ఇంకా ముందు ముందు ఎన్నో రకాలైన సమస్యలు చికాకులు తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదు. కనుక, మంచి నీలం పొదిగిన ఒక బంగారు ఆభరణం ఆయన శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండడం అత్యవసరం శ్రేయస్కరం. అంతేకాక, శని మహాదశలో మిగిలిన తొమ్మిదేళ్ల కాలంలో ప్రతీ శనివారం నాడు నువ్వులనూనెతో ఇంట్లో దీపం పెట్టుకొని, కనీసం పదకొండు సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపించి, నువ్వులనూనెని దానంగా ఇవ్వడం చేయాలి. అలా చేస్తే, పదవిలో ఉన్నతి కలిగినా మానినా, కనీసం ఆయన ఆరోగ్యానికి ఎటువంటి హానీ లేకుండా కాలం గడుస్తుంది. ఏ కారణానికేనా నీలం ఆయన శరీరానికి దూరమైతే, అనుకోని అవాంతరం వచ్చి, పదోన్నతి బదులు ఉన్న పదవికే ప్రమాదం ఏర్పడవచ్చు, అనారోగ్య కుటుంబ సమస్యలు ఎదుర్కోవలసి రావొచ్చు. శని మహాదశ తరువాత వచ్చే బుధుడు ఈ జాతకునికి చాలా అనుకూలంగా వ్యవహరించి, పూర్వపు సమస్యలకు మంగళం పలికి, శుభాలు చేకూర్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి" –
అని చెప్పేరు.
పక్షంరోజుల తరువాత వచ్చిన రాఘవరావు పుట్టినరోజు నాడు --
జాతకాలమీద నమ్మకం అపనమ్మకం అంటూ ఏమీ పెద్దగా లేకపోయినా, తన కోసం భార్య పడుతున్న తపనకు స్పందించి, జాతకాలపట్ల ఆమెకున్న నమ్మకం మీద కన్నా ఆమె మీద తనకున్న ప్రేమతో ఏమీ మాట్లాడకుండా, పుట్టినరోజు కానుకగా భార్య ఇచ్చిన నీలం పొదిగిన ఉంగరం తన వ్రేలికి పెట్టుకొని, ఆమె పట్ల తనకు కల ప్రేమ తెలిసొచ్చేలా భార్య జానకిని ఒద్దికగా ఆలింగనం చేసుకున్నాడు రాఘవరావు. ఆయనతో సంప్రదించకుండా చేసిన పనికి తనను ఏమీ ప్రశ్నించకుండా, పైగా తాను ఇచ్చిన ఉంగరాన్ని మారు మాట్లాడకుండా వెంటనే ధరించిన భర్త అంటే జానకికి కూడా ఆయన పట్ల ప్రేమ అనురాగం ఆప్యాయత ఒక్కసారిగా ఉబికివచ్చి భర్త కౌగిట్లో గువ్వలా ఒదిగిపోయింది.
అప్పటినుంచీ, ప్రతీరోజూ రాఘవరావు బయటకు వెళ్ళేటప్పుడు, ఇంటికి రాగానే, నీలం పొదిగిన ఉంగరం ఆయన వ్రేలికి ఉందో లేదో గమనిస్తూనే ఉంది జానకి.
రాఘవరావు కాలక్రమాన మూడు శాఖలు మారేడు.
శని మహాదశ ముగింపుకు ఇంకొక నాలుగు రోజులు మాత్రమే గడువున్న సమయంలో -- రాఘవరావు శరీరం మీద నీలం లేకపోవడంతో జానకి మనసు కీడు శంకిస్తోంది.
ఎప్పటికంటే త్వరగా ఇంటికి వచ్చిన రాఘవరావుని చూసిన జానకి "ఈరోజు ఇంత త్వరగా ఎలా వచ్చేరు? అంతా బాగానే ఉందా? ఏమి సమస్య లేదు కదా" అని ఆతృతగా అడగసాగింది.
"నన్ను తాత్కాలికంగా ఉద్యోగంలోంచి తీసేసారు జానకీ" అంటూ జానకి భుజం మీద వాలిన చెట్టంత రాఘవరావు చిన్న పిల్లాడిలా కన్నీరు పెట్టుకోసాగేడు.
-3-
"అలా ఎందుకు జరిగిందండీ" అడిగింది ఆశ్చర్యం ఆవేదన కలగలిపిన స్వరంతో జానకి.
"పూర్వం పనిచేసిన శాఖలో నేను చేసిన పనులలో ఏవో అవకతవకలు ఉన్నాయని అభియోగం జానకీ. వాటిమీద విచారణ ముగిసే వరకూ నన్ను ఉద్యోగంలోంచి తాత్కాలికంగా తీసేస్తూ నా నెల జీతం కూడా సగం పైన తగ్గించేసేరు"
"మీరు చేసిన పనులే కాబట్టి వాటిలో అవకతవకలు ఉన్నాయో లేవో మీకు తెలియదా"
"నాకు తెలుసు, కానీ అవి నేను విచారణలో నిర్ధారణ చేసి చూపించాలి, నా నిర్ధారణను బ్యాంకువారు నమ్మిన వరకూ నాకు, నా ద్వారా మన కుటుంబానికి, ఈ అవమానం అపనింద ఆర్ధికంగా ఇబ్బందులు తప్పవు జానకీ"
"విచారణ ముగిసే సరికి ఎన్నాళ్ళు పడుతుందండీ"
"విచారణ ఇంకా ఆరంభమే అవలేదు. సవ్యంగా విచారణ జరిగి నా నిర్దోషిత్వం బ్యాంకువారు గ్రహించేసరికి ఎంత లేదన్న ఒక ఏడాది పడుతుంది"
"మన చేతిలో లేని పరిస్థితికి విచారపడి ఆరోగ్యం కూడా పాడు చేసుకోవడం ఎందుకు. భగవంతుడున్నాడు. దైవం మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మీరు కూడా నమ్మకంతో ఉండండి. సిద్ధాంతిగారు ఆరోజే చెప్పేరు - మీ శరీరం మీద నీలం లేకపోతే, ‘అనుకోని అవాంతరం వచ్చి ప్రమాదం ఏర్పడవచ్చు, అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు రావొచ్చు’ - అని”
"నీలం దొరికిందా"
"మన అదృష్టం బాగుండి దొరికిందండీ"
"ఎక్కడ దొరికింది"
"మీరు స్నానం చేసినప్పుడు వాడిన సబ్బుకి అంటుకొని ఉంది. తీసి శుభ్రపరచి ఉంచేను. మీరు కాఫీ త్రాగగానే ముందు ఇద్దరం కలిసి వెళ్లి ఈరోజే ఆ నీలం మీ ఉంగరంలో పెట్టించుకుని వద్దాం. అలా చేస్తే అన్ని సమస్యలు త్వరలోనే సర్దుకుంటాయి అన్న నమ్మకం నాకుంది"
ఇద్దరూ వెళ్లి ఒక గంటలోనే రాఘవరావు శరీరం పైన నీలం ఉండే ఏర్పాటుతో, మానసికమైన బలంతో, ఇంటికి చేరుకున్నారు.
-4-
పదిహేను రోజుల మరునాడు ఉదయం –
'తాత్కాలికంగా ఉద్యోగంలోంచి తీసేసిన తనకు బ్యాంకుకి వెళ్లేందుకు తొందరేముంది, సావకాశంగా వెళ్లి హాజరు వేస్తె సరి' అనుకుంటూ పన్నెండు గంటలు అవొస్తున్నా కూర్చొని ఉన్న రాఘవరావు ఇంటి గంట మ్రోగింది.
వెళ్లి చూసిన రాఘవరావు ఆశ్చర్య పడేటట్టుగా ఎదురుగా ఉన్నది బ్యాంకు మేనేజర్ మోహనరావుగారు.
"సర్, నమస్కారం. మీరేమిటి ఈ టైం లో నా దగ్గరకు వచ్చేరు? తాత్కాలికంగా ఉద్యోగంలోంచి తీసేసారు కదా తాపీగా వెళ్ళవచ్చు అని ఉండిపోయేను, నన్ను మీరు క్షమించాలి. ఇప్పుడే బ్యాంకుకి బయలుదేరతాను"
"నో నో రాఘవరావు, నేను ఆ ఉద్దేశంతో రాలేదు. బ్యాంకు తరఫున నీకు క్షమాపణ తెలియచేసేందుకు వచ్చేను"
ఈవేళప్పుడు ఎవరు వచ్చేరా అని ఈవలకు వచ్చిన జానకి కూడా మేనేజర్ గారిని చూసి నమస్కారం చేసింది.
ఆమెకు ప్రతి నమస్కారం చేసిన మేనేజర్ -- "మీ దంపతులు మన బ్యాంకుని నన్ను క్షమించాలి"
"మీరు మమ్మల్ని క్షమాపణలు అడగదేమిటి సర్" అని భార్యా భర్తలు ఇద్దరూ ముక్త కంఠంతో పలికేరు.
"మీ పూర్తి పేరు కొలిచిన రాఘవరావు కదా"
"అవును"
"అక్కడే పెద్ద పొరపాటు జరిగి పోయింది. మీరు ఇంతకు మునుపు పనిచేసిన బ్రాంచ్ లో మీరు పనిచేసిన సీట్ లో మీ ముందు ఎవరు పని చేసేవారో గుర్తుందా"
"గుర్తుంది సర్. కాల్చిన రాఘవరావు అని నా కంటే సీనియర్"
"ఆయన సమయంలో జరిగిన అవకతవకలకు, మీ ఇద్దరి పేర్లు సుమారుగా ఒకేలాగున ఉండడం వలన, ఆయనను బదులుగా మిమ్మల్ని తాత్కాలికంగా ఉద్యోగంలోంచి తొలగించినట్లుగా జారీ చేసిన తప్పుడు తాకీదును తెలుసుకున్న బ్యాంకువారు, వ్రాత పూర్వకంగా మీకు క్షమాపణలు చెప్తూ మిమ్మల్ని మీ ఉద్యోగంలో వెంటనే చేరమని తెలియచేసేరు" అంటూ –
మేనేజర్ గారు ఇచ్చిన ఉత్తరం చూసుకున్న రాఘవరావు ఆనందానికి, ఆయన ఆనందాన్ని చూస్తున్న జానకి ఆనందానికి, అవధులు లేవు.
" రాఘవరావు - మీరు బ్యాంకుకి రేపు వద్దురుగాని. ఈ ఆనందాన్ని ఈరోజు మీ దంపతులు పూర్తిగా ఆస్వాదించండి" అని వెళ్ళబోతున్న మేనేజర్ ని దంపతులు బలవంతాన కూర్చోబెట్టి, ఆయన నోటిని తీపి చేసి సాదరంగా పంపించేరు.
మేనేజర్ నిష్క్రమించగానే -- ఇంటి తలుపులు వేసిన దంపతులు ప్రేమతో కౌగలించుకొని, రాఘవరావు వ్రేలికి ఉన్న 'నీలం' ని భక్తితో చూస్తూ వారి ఆనందాన్ని జంటగా అనుభవించేరు.
*****