ఐసు - డా. కె. తేజస్వని

Isu

ఫీల్డ్ ఆఫీసర్ గారూ, నేనూ హోంలోన్ అప్రూవ్ చేయటానికి సైట్ విసిట్ కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం మూడు అయ్యింది. రాంగానే విజయ్ ఓ వెడ్డింగ్ కార్డు చేతిలో పెట్టాడు. "ఎవరో ఐశ్వర్య అంట మేడం, మీకోసం వచ్చి వెళ్ళారు. ఈవినింగ్ మీకు ఫోన్ చేస్తానన్నారు" అన్నాడు. ఐశ్వర్య ఎందుకు వచ్చిందబ్బా అనుకుంటూ, కార్డు ఓపెన్ చేశా. ఏదో పరధ్యానంగా చూసి బ్యాగ్లో పెట్టేసా. అప్పుడే పెళ్ళి చేసుకునేంత ఎదిగిపోయిందా? దాన్ని ఎత్తుకుని ఆడించింది నిన్నో మొన్నో అన్నట్లే ఉంది.

కాలం అంతేనేమో! ఐస్క్రీములా కరిగిపోతుంది! ఈ ఇరవై ఏళ్ళలో ఐసు వాళ్ళ నాన్న పోయారు. ఐసు బీటెక్ చేసింది, మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేస్తుంది. త్వరలో బోస్టన్ వెళ్తుందని విన్నా.

ఐసు గురించి మీకు చెప్పాలంటే నేను ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళాల్సిందే.

ఐసు, ఐశ్వర్య, హౌస్ ఓనర్ గారి మనవరాలు. మూడేళ్ళు కూడా ఉండవు. సోషల్ మీడియాలో షేర్ చేసే ఫారిన్ బేబీస్ లా ఎంతో ముద్దుగా ఉంటుంది. కానీ, దాని ఏడుపు కర్ణకఠోరానికి నిర్వచనం. ఐసు ఏడుపు మొదలు పెడితే నా గుండెల్లో రైళ్ళు పరిగెత్తేవి. అది ఏమడిగినా ఎలాగైనా సరే సాధించి ఇచ్చేయాలన్న తపన వాళ్ళ ఇంట్లోవాళ్ళ కంటే నాకే ఎక్కువగా ఉండేది. ఓ రోజు బ్యాంకుకి సెలవు కావటంతో ఇంట్లోనే ఉన్నా. ఎంచక్కా టమాటో రైస్, ఆలు కుర్మా చేసుకుని, తిని పడుకున్నా. రెండు రోజులకి సరిపడా చేసుకున్నానండోయ్! రేపు పొద్దున్న వంట ఎగ్గొట్టచ్చని! ఇలా ఆనందంగా పడుకుని, "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" అని హమ్ చేసుకుంటున్నానా, ఐసు కచేరి మొదలెట్టింది. కిటికీలు, తలుపులు అన్నీ మూసేసి, చెవులు గట్టిగా మూసుకుని, "ఐసూ లేదు, ఏడుపూ లేదు" అని సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుని పడుకుందామని ట్రై చేసా. ప్చ్! లాభం లేదు.

తలుపు తీసి, వరండాలో కొచ్చా. కాళ్ళు బారచాపి, మెడ పైకి లేపి, ఆకాశంలో చూస్తూ, ఏడుస్తున్న ఐసూ, విరిచేసిన గోకరకాయల బుట్ట పక్కన పెట్టుకుని నాన్శలాన్సకి ప్రతీకగా వాళ్ళ అమ్మా కనిపించారు. వుడవర్డ్స్ గ్రైప్ వాటర్ యాడ్ గుర్తుంది కదూ! అలాగే, "ఏం పద్మా, పాప ఏడుస్తుంది, ఎందుకు?" అని ప్రశ్నించా. నా పిచ్చి కానీ మా ఐసు ఏడుపు గ్రైప్ వాటర్కి గుడ్ వర్డ్స్ కి ఆగదని అపుడపుడూ మర్చిపోతుంటా. ఆప్టిమిస్టుని కదా! " ఇప్పటి దాకా సాయంత్రం కూరకి గోకరకాయలు వలిచాను. నా పని అయిపోయింది. కూర్చున్నా. ఫ్రిజ్ లో నుంచి పొట్లకాయ తెచ్చి తరగమంటుంది. నేను ససేమిరా అన్నా. అందుకే రాగాలాపన మొదలెట్టింది. నేను ఖాళీగా ఉంటె నా కూతురుకి తోచదు. ఎపుడూ ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అయితేనే దానికి నేను వర్కింగ్ కండీషన్లో ఉన్నట్లు లేకపోతే అవుట్ ఆఫ్ ఆర్డర్ అని దాని ఫీలింగ్," చాలా నిశ్చింతగా చెప్పింది పద్మ.

ఇంతేనా అనుకున్నా! ఐసూకి నేను ఉప్మా చేస్తుంటే చూడటం చాలా ఇష్టం. ఎక్కువ తినదు కానీ నేను పని చేసే ప్రాసెస్ బాగా ఎంజాయ్ చేస్తుంది. నేనే కాదు, ఎవరు పని చేసినా కళ్ళప్పగించి చూడటం, మధ్య మధ్యలో దానికి నవ్వు వచ్చినపుడు పకపకా నవ్వటం దాని హాబీ. అప్పుడే కిచెన్లోకి పోయి జీడిపప్పు ఉప్మా చేసి, ఐసునెత్తుకుని, ఓ మధురమైన పాట పాడుతూ, గోరుముద్దలు తినిపించాలనిపించింది. అసాధ్యం అనుకున్న సమస్యకి సొల్యూషన్ దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో కదా!

వెంటనే నన్ను నేను సంబాళించుకున్నా! నేను ఒకటే రోజు రెండో సారి కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తే నా రెప్యుటేషన్ ఏంగాను? పద్మని చూసి ఓ వేదాంతిలా నవ్వి నా బెడ్‌రూంలోకి వచ్చి, చెవుల్లో కాటన్ కుక్కుకుని, రెండు తలగడలని నెత్తి మీద పెట్టుకుని, "కామ్ డౌన్, తేజూ, కామ్ డౌన్" అని పాడుకుంటూ పడుకున్నా.

ఆ రోజు సాయంత్రం టీవీ చూస్తున్నా. ఐసు వచ్చి నా ఒళ్ళోకి ఎక్కింది. నాకో ఐడియా వచ్చింది. దాన్ని పక్కన పెట్టి లోపలికి వెళ్ళి చిన్న అద్దం పట్టుకొచ్చా. "ఓ సారి ఏడువు, ఐసూ," అన్నా. నన్నో పిచ్చిదాన్ని చూసినట్లు చూసి రిమోట్ తో చానెల్స్ మార్చటంలో మునిగిపోయింది. కాసేపు బతిమాలి, ఏడుపు ముఖం పెట్టించి, అద్దంలో ఎలా ఉందో చూపించా. "ఐసూ, ఏడుస్తే ముఖం బాగోదు. గ్లామర్ దెబ్బ తింటుంది. ఏడుపు వచ్చినపుడు కంట్రోల్ చేసుకుని రాగం తీయి" అని చెప్పా. దాని ఏడుపుని నేను భరించలేనన్న నిజం దానికి తెలిస్తే నన్ను గంటకో సారి బ్లాక్మెయిల్ చేసి ఏది అనుకుంటే అది సాధిస్తుంది. ఏ మూడ్లో ఉన్నదో కానీ కొంచెం ప్రాక్టీస్ కూడా చేయించగలిగా. నాభి నుంచి ఏడుపు తియ్యకుండా, పెదవుల పైనుంచి ఆ, ఈ, ఊ అని సన్నాయి నొక్కులు పలికించా. కొంచెం బెటర్.

మరునాడు సాయంత్రం వాళ్ళ అమ్మ గేట్ దగ్గర నా కోసం వెయిటింగ్. నన్ను చూసి నవ్వింది. "నువ్వు చెప్పావంటగా, ఐసు మధ్యాహ్నం ఏడవబోయి, ఆపి, కుర్చీ ఎక్కి, అద్దం ముందు నిలుచుని, సరిగమలు పాడింది " అన్నది. మిషన్ ఎకంప్లిష్డ్!

కొన్ని రోజులకి ఐసుని స్కూల్లో వేశారు. నా ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఆ రోజు బ్యాంకులో "ఇంత ఆనందంగా ఉన్నావు, పెళ్ళి కుదిరిందా ఏమిటి?" అని క్యాషియర్ అరుణ అడిగింది. నేను గబ్బర్ సింగ్ లా నవ్వి, "పెళ్ళి కుదిరింది నాకు కాదు, ఐసుకి " అన్నా. కనుబొమ్మలెగరేసింది అరుణ. "ఐసుని స్కూల్లో వేశారు" అన్నా ముసి ముసి నవ్వులు నవ్వుతూ. "సండే ఇంట్లోనే ఉంటుంది కదా," అన్నది అరుణ. నా పరిస్థితి చూడాలీ! అరుణని చితక్కొటేయాలన్నంత కోపాన్ని అతికష్టం మీద అణుచుకున్నా. కొంతమంది అంతే! పక్కనవాళ్ళు హ్యాపీగా ఉంటె తట్టుకోలేరు! కానీ, నిజం చేదుగానే ఉంటుంది అని కూడా అప్పుడే అర్థం అయ్యింది నాకు.

సండే రానూ వచ్చింది. వరండాలో కూర్చుని కాఫీ తాగుతూ న్యూస్పేపర్ తిరగేస్తున్నా. రోజూ స్కూల్ కెళ్ళటానికి ఇంట్లో అందరూ ఐసూకి సుప్రభాతం పాడాలా, సండే మాత్రం మాకందరికీ సుప్రభాతం పాడటానికి 5 గంటలకే లెగుస్తుంది. మెల్లగా దాని బొమ్మ హ్యాపీ జుత్తట్టుకొని ఈడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చింది. ఈ హ్యాపీ సంగతి మీకు చెప్పాలండోయ్! దీన్ని ఇంతకుముందు ఎక్సార్సిస్ట్, అనాబెల్ సినిమాలలో వాడుకోబోయి, అంత హారర్ సినిమాలు తీస్తే, సెన్సార్ వారు ఒప్పుకోరని మానేశారు. ఆ బొమ్మ జుట్టు పీకేసి, మిగిలిన నాల్గు ఈకలకి హారర్ స్టైల్ చేసి, ముఖమంతా క్రేయాన్స్ తో గీసి, ఓ చెయ్యి పీకేసి, దాని ముఖానికి బొట్టు కాటుక పులిమి . . .ఓ మై గాడ్! దాన్ని చూసిన వాళ్ళని రాత్రి నిశ్చింతగా పడుకోమనండి, చూస్తా! అదే మన ఐసు ప్రియమైన బొమ్మ, హ్యాపీ!

నా ఒళ్ళోకి ఎక్కుతూ, నా కాఫీ కప్పుని దాని బుజ్జి కాలితో ఓ తన్ను తన్ని, నేను చదువుతున్న పేపర్ని చిట్టి చేతితో చింపి, హ్యాపీని నా తలపై పెట్టి, ముద్దుగా నవ్వుతూ, "గుమాణింగ్ ఆంటీ" అంది. సరే, కానీ, ఓనరుగారి మనవరాలు, క్యూటీపై, గుమాణింగ్ అంటే గుమాణింగే మరి!

"స్కూల్ ఎలా ఉంది ఐసూ" అని అడిగా.

"స్కూల్ ఆపోయింది ఆంటీ" అంది.

"అయిపోవటం ఏమిటే," అన్నా.

"నాకు అన్నీ వత్తేతాయి. స్కూలుకి వెళ్ళ ను," అని డిక్లేర్ చేసింది.

"ఏం వత్తేతాయి ఐసూ, నాకు చెప్పు," అన్నా.

"సి, ఏ, టూ, బి, వన్, టెన్" అని బిగ్గరగా వల్లించింది.

చెవుల దగ్గరగా దాని నోరు ఉంది కదా, గుండె దడదడా కొట్టుకోవటం మొదలెట్టింది!

కొంచెం దైర్యం చేసి, ఇల్లు కొనేసుకుంటే బెటర్ ఏమో! మా బ్యాంకు ఎంప్లాయిస్ కి లోన్ కూడా తక్కువే.

నా జుట్టంతా చెరిపేసి, ఓ ముద్దు పెట్టి కిందకి దిగింది అమ్మడు.

"నువ్వు నా ఫెండు పేరెందుకు పెత్తుకున్నావ్?" అని అడిగింది

"నేను నీ ఫెండు పేరు పెట్టుకోలేదు. మా డాడీ పెట్టారు నాకీ పేరు" అన్నా.

ఓ క్షణం ఆలోచిస్తూ నిలుచుంది.

"నువ్వు హ్యాపీ అని పేరు పెత్తుక్కో" అని ఉచిత సలహా పారేసి ఇంట్లో రంగం ఎక్కటానికి అనుకుంటా వెళ్లిపోయింది.

నన్ను, నన్ను! ఇండైరెక్ట్ గా హ్యాపీలా ఉన్ననంటుందా! రేపు అరుణతో చెప్పాలి. ఎంత బాధపడుతుందో! ఏడు మల్లెలెత్తు రాకుమారిని! నన్నెంత మాట అనేసింది? రేపు బ్యాంకు కి వెళ్ళగానే హోంలోన్స్ గురించి వివరాలు సేకరించాలి. రియల్ ఎస్టేట్ మాధవ్ కి ఫోన్ చెయ్యాలి. చాలా పనులు ఉన్నాయి రేపు అనుకుంటూ కింద పడ్డ పేపర్ ముక్కలు, కాఫీ కప్పు తీసుకుని లోపలి వెళ్తుంటే, పద్మ పిలిచింది. చేతిలో రెండు టీ గ్లాసులు.

దేవత!

ఇద్దరం మెట్ల మీద కూర్చుని మాటలు లేకుండా టీ సేవించాం.

మర్నాడు బ్యాంకులో అరుణ దగ్గరికి సుడిగాలిలా దూసుకుపోయి ఐసు అన్న మాట చెప్పా! ఎంతో బాధపడి నా కన్నీళ్ళు తుడుస్తుందనుకున్న ఆ అరుణ ఏం చేసిందనుకున్నారూ! కిసుక్కున నవ్వింది! నవ్వటమే కాకుండా కాకి ఆంటీ కాకికి ముద్దు అంది. ఇంకా నేను నిజంగానే హ్యాపీలా ఉన్నానని, అందుకే నాకు ఇంకా పెళ్ళి కాలేదని నానా మాటలు అన్నది. హు! సినిమా ప్రపంచానికి దొరకని ఓ అరుదైన ఆణిముత్యాన్ని! నన్నా! "కళ్ళద్దాలు మార్చుకో అరుణా" అన్నా నిదానంగా. "కొత్త అద్దం కొనుక్కో తేజూ," అని పళ్ళికిలించింది. దీని సంగతి తరువాత చూద్దాం అనుకున్నా. కవి ఏమన్నాడూ? "రివెంజ్ ఈజ్ ఎ డిష్ బెస్ట్ సర్వడ్ కోల్డ్." వి విల్ ఫాలో ద కవి!

మా డాడీ ఊరు నుంచి వచ్చేటప్పుడు తెచ్చే బందరు హల్వా మొత్తం నేనే తింటా! ఒక్క స్పూన్ కూడా ఇద్దరికీ ఇవ్వను!

కస్టమర్స్ రావటం మొదలయ్యింది. ఇద్దరం బ్యాంకు పనిలో పడిపోయాం!

కాఫీ కప్పుతో విజయ్ ప్రత్యక్షమయ్యేసరికి గతం నుంచి వర్తమానం లోకి వచ్చా.

ఆరయింది. క్యాషియర్ గారు వచ్చి వెళ్తున్నా అని చెప్పారు. నేను కూడా బాగ్ సర్దుకుని బయల్దేరా. స్టేట్ మొత్తం ట్రాన్సఫర్ల మీద తిరిగి ఈ మధ్యనే హైదరాబాద్ చేరుకున్నా. పాత పరిచయాలను పలకరిస్తూ పులకరిస్తున్నా. ఐసు పెళ్ళి అనేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించింది. సరే కారు వాళ్ళ ఇంటి వైపు పోనిచ్చాను.

వెళ్ళగానే పద్మ వచ్చి "తేజూ" అంటూ కౌగలించుకుని లోపలికి తీసుకెళ్ళింది. చాయ్ బిస్కెట్లు అయ్యాయి. ఐసు కార్డులు పంచటానికి వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదు. ఆ ముచ్చట ఈ ముచ్చట అయిన తరువాత, ఉండబట్టలేక, "ఐసు ఎంత ఎదిగిపోయింది, పెళ్ళివయసు వచ్చేసింది, పెళ్ళి పనులు చేసుకుంటుంది" అన్నా.

పద్మ నవ్వింది. "ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలుసు తేజూ? ఇలా అవుతుందని అనుకోలేదు. సంతోషించాలో ఎలా ఫీల్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు" అన్నది. "అదేమిటి పద్మా, పిల్ల పెళ్ళి అవుతుంటే సంతోషించాలి కదా, కంగారు పడతావెందుకు," అన్నా. పద్మ నన్ను విస్మయంగా చూసింది! "కార్డు సరిగా చూసావా తేజూ " అంది. ఈ సారి విస్మయం నా వంతు అయ్యింది. "అదేం?" అని అడిగా. కార్డు చూడు అన్నది. సరే బ్యాగ్ లోనుంచి కార్డు తీసి చదివా. "ఐశ్వర్య ఇన్వైట్సే," కానీ, " ఆన్ ది ఆస్పిషస్ అకేషన్ ఆఫ్ ద మ్యారేజ్ ఆఫ్ మై లవింగ్ మదర్." నాకేం అర్థం కాలేదు. పద్మ వైపు చూసాను. "ఐసు నా పెళ్లి చేస్తుంది తేజూ! వాళ్ళ కొలీగ్ వాళ్ళ నాన్నగారంట. ఆయన భార్య పోయి పది సంవత్సరాలు అయింది. పిల్లల కోసం మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయారంట. తను బోస్టన్ వెళ్ళిపోతే నేను ఒంటరిగా ఉంటానని నా పెళ్ళి చేస్తుంది" పద్మ కళ్ళ వెంట ఆగని నీళ్ళ ధార. నాకు నోట మాట రాలేదు. పద్మని దగ్గరికి తీసుకున్నా. ఐసు ఎంత ఎదిగింది! ఎంత గొప్ప మనసు దానిది! పద్మ కళ్ళు తుడుచుకుంటూ, "నీకు దాని సంగతి తెలుసు కదా తేజూ, నేను ఖాళీగా ఉంటె అవుట్ ఆఫ్ ఆర్డర్ అని అనుకుంటుంది" అంది. ఇద్దరం నవ్వుకున్నాం. లేటైనా సరే ఐసుని కలిసి అభినందించే వెళదామని నిర్ణయించుకున్నా.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు