వంశీకి నచ్చిన కథ - మరణలేఖలు - పూడూరి రాజిరెడ్డి

maranalekhalu telugu story

వెంకట్రావుతో మాట్లాడటం సరదాగా ఉంటుంది. వ్యంగ్యమెక్కువ. తరచి చూస్తే అందులో నిజమే కనబడుతుంది. అప్పుడప్పుడు శ్రీనివాసులు వాడిమీద నా అభిప్రాయం మార్చుకోలేదు. మనకు నచ్చిన వాళ్ళని గురించిన చెడుని మనసు అంత త్వరగా ఒప్పుకోదు.

ఒక మనిషిని గురించిన అన్ని కోణాలను మనం పరిశీలించం. చూసిన కోణాల్ని అప్పుడు ఎదుర్కొన్న అనుభవాన్నిబట్టి, అవతలి వారిమీద ఓ అభిప్రాయం ఏర్పరచుకుంటాం. అంతేగాని, వారిని క్షుణ్ణంగా విశ్లేషించి, 'వీడు మంచి', వీడు చెడు' అని నిర్ధారించలేం. అంత అవసరంగానీ, అవకాశంగానీ మనకుండవు. మళ్ళీ ఏది మంచి, ఏది చెడు? అనే దానికి ప్రతి ఒక్కరికీ తమదైన అభిప్రాయాలుంటాయి. ఇలాంటి విషయాలన్నీ నాకు వెంకట్రావే చెబుతుండేవాడు. కొత్త విషయాలేమైనా ఉంటే, నేను శ్రీనివాసుల్ని అడిగేవాణ్ని కాదు. నాకు వీడికంటే వెంకట్రావుతోనే చనువెక్కువ. పైగా వాడైతే నేను కన్వెన్స్ అయ్యేట్లుగా చెప్పేవాడు. కాని వెంకట్రావు గురించి చెడ్డగా మాట్లాడుతున్నారంటే, శత్రువులు పెరుగుతున్నారన్నమాట.

చిన్నప్పటినుంచీ వాడు 'నేను పెద్దవాన్నవ్వాల'ని తెగ కలలు కనేవాడు. "ఏరా, మరి అయ్యావా?" అంటే, "ఆరడుగులయ్యాను. ఇంత కంటే పెద్దగా ఎవరుంటారు?" అని నవ్వేవాడు.

నిజమేనేమో! రూపురేఖలను బట్టి కూడా గౌరవాలు దక్కుతుంటాయి కొన్నిసార్లు. అందులోనూ ఎత్తు వల్ల మరో ఎత్తు పెరుగుతాయి. నేనూ, వెంకట్రావు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏ చిన్న అవసరానికైనా అక్కడున్న చిన్నపిల్లాడ్ని పిలిస్తే వాడైతే చక్కా వచ్చేస్తాడు. నేను పిలిస్తే మాత్రం, ఎందుకు రావాలన్నట్టు ముఖం పెడతారు. అందుకే అంత త్వరగా నేను ఎవరినీ పిలవను. పైగా చిన్నపిల్లలైనా మనం శాసించి పని చెప్పకూడదు అనే థియరీ ఒకటి ప్రతిపాదించుకున్నా.

ఎలాగూ రూపురేఖల ప్రసక్తి వచ్చింది. కాబట్టి ఓ విషయం గుర్తుచేస్తాను. "ఫలానా భావకవిత రాసింది ఓ అనాకారి అని తెలిస్తే మనసు విలవిల్లాడుతుంది. మనకు నచ్చిన సినిమాను అందంగా చూపించిన దర్శకుడు, నల్లగా కాకిముక్కులా ఉన్నాడంటే ఓ అందమైన ఊహ చెల్లాచెదురవుతుంది. అలాగే గాయనీమణులు కూడా. వీళ్ళంతా అలా చేయలేరని కాదు... ఎందుకో అలా అనిపిస్తుంటుంది" అనేవాడు వెంకట్రావు.

శ్రీనివాసులు, వెంకట్రావ్, నేను ఓ స్టేజిలో తారసపడ్డ క్లాస్ మేట్స్ మి. తర్వాత్తర్వాత కొలీగ్స్ మి కూడా. శ్రీను కొంచెం ముభావి. వెంకట్ చలాకీ, నేను మధ్యస్తం. మా ముగ్గురికీ ప్రతిసారీ వెంకటే నాయకుడు. అది సినిమా, మందుపార్టీ, ఏదైనా ఊరికి టూర్... ఇంకే విషయమైనా సరే.

మాది ఎంత మంచి స్నేహమైనా, వెంకట్రావ్ కి ట్రాన్స్ ఫర్ వచ్చి, వేరే ఊరెళ్ళాక మా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. పెళ్లి, సంసారాలు కూడా కొంత వరకు కారణాలు కావొచ్చు. లేదూ ఎవరి సర్కిల్స్ లో వాళ్లు కొత్త స్నేహాలను ఏర్పరచుకోవడం కావొచ్చు. అలాగని నేను వాడిని మరిచిపోయానని కాదు. ఏ చల్లని సాయంత్రమో గుర్తొచ్చేవాడు. ఎప్పుడైనా అన్నం తింటున్నప్పుడు సరం పడితే, "నన్ను వెంకట్రావే తలుచుకుంటున్నాడేమో" అనుకున్న రోజులూ లేకపోలేదు.

ఆరోజు ఆఫీసుకని బయల్దేరుతున్నాను. శ్రీను ఫోన్ చేశాడు. "మన వెంకట్రావు ఆత్మహత్య చేసుకున్నాడటరా" అని. నా నోటమాట ఆగిపోయింది. గుండె కొట్టుకోవడం కూడా ఆగిందో, వేగం పెరిగిందో చెప్పడం కష్టం. ఈ వార్తని నమ్మకూడదనుకున్నా, వాడి ఊరెళ్ళి, శవాన్ని చూశాక తప్పేదేముంది?

ఆజానుబాహుడైన వెంకట్రావు, ఆనందం పంచి పెట్టడానికే పుట్టిన వెంకట్రావు చనిపోవడమా? అదీ ఆత్మహత్యా?

కారణం ఏమై ఉంటుంది? వాడికి చనిపోయేంత సమస్యలు ఏమున్నాయని?

నా మూర్ఖత్వానికి నన్ను నేనే తిట్టుకున్నా. ఏ సమస్యకైనా చావు పర్మిట్ ఉందా? అంటే ఏ కోణంలో చూసినా వాడు చావాల్సింది కాదు. కాని బతికిలేడు. వాడి మీద కోపమొచ్చింది.

శ్రీను బైక్ మీదే వెంకట్ ఊరెల్లాం. నాకు పెళ్లిళ్లకు హాజరవడమే ఇష్టముండదు. అలాంటిది చావు అయితే ఇంకా కష్టం. ఓదార్చడం నాకు చేతకాని పని అసలు ఆ వాతావరణంలో ఎలా రియాక్టవ్వాలో అర్ధం కాదు. తెలిసినవారు కనబడితే చిన్నగా నవ్వాలా? కూడదా?

పంచనామా అయ్యాక ఏ సాయంత్రమో శవం వచ్చింది. ప్రతీ పనిని అందంగా చేయాలనుకునేవాడు ఉరివేసుకుని వికృతంగా ఎందుకు చనిపోయినట్టు? తనని తాను ద్వేషించుకున్నాడా? తనని ద్వేషించేవాళ్ల మీద కసి తీర్చుకున్నాడా?

మనిషి స్వేచ్ఛ గురించి మాట్లాడిన వాడు దేన్నుంచి విముక్తం అయినట్టు?

ఓ భావ ప్రవాహం ఆగిపోయినట్టేనా?

పాడె ఓ వైపును శ్రీను ఎత్తుకున్నాడు. నేను పక్కనే నడిచాను వెనక ఏడుపులు వినబడుతూనే ఉన్నాయి.

శవ దహనం జరుగుతున్నప్పుడు కూడా నాకు దుఃఖం రాలేదు. కానీ భూమ్మీద ఉండే ఏకైక వెంకట్రావు ఇకనుంచీ ఉండడు అన్న వాస్తవం కలవరపెట్టింది. వాడితో ఏర్పడిన శూన్యానికి ఏమైనా ప్రాధాన్యం ఉంటుందా?

చావుకెళ్ళి నిద్ర చేయకూడదంటారు కాబట్టి, ఆ రాత్రికే తిరిగి వచ్చేశాం.

***

మూడ్రోజుల తర్వాత - "ఏదో ఉత్తరం వచ్చింది చూడ"మని మా ఆవిడ నా చేతిలో ఓ కవరు పెట్టింది.

పసుపురంగు కవరు. పైన అక్షరాలు వెంకట్రావువే. 'మ' - 'య' లకు వాడికి తేడా తెలీదు.

ఆతృతగా చించాను. నాలుగు కాగితాలు విడివిడిగా మడిచి ఉన్నాయి. 1, 2, 3, 4 అని అంకెలు వేసి వున్నాయి. సంభోధనలు, క్షేమ సమాచారాలు ఏమీ లేవు. దేనికదే ప్రత్యేక ఉత్తరం. అవి డైరీగా రాసుకున్న పేజీలో, కథల తాలూకు ప్రారంభాలో అర్ధం కాలేదు. వాడికి డైరీ రాసుకునే అలవాటుంది. కథలు రాస్తాడని తెలీదు. కాకపోతే కాలేజీ మ్యాగజెన్ కి కవితలు రాసేవాడని మాత్రం గుర్తుంది.

మొదటి లేఖ:
నా శరీరంలోని అవయవాలన్నింటిలోకి నా ముక్కంటే నాకు భలే ఇష్టం. అది ఎందుకో మరి అంతగా నచ్చుతుంది. మిగతా దేనినీ ప్రశంసించకుండా ముక్కునే పొగిడానంటే, చెప్పిందానిలో కొంతయినా నిజాయితీ ఉందని నమ్మొచ్చు. నాకు నందితిమ్మన ముక్కు పురాణం తెలియదు. ఆయన వర్ణించిన ముక్కు ఎంత అందంగా ఉందో తెలియడానికి. అయితే ఎవరికి ఏది, ఎందుకు నచ్చుతుందో చెప్పడం కొంచెం కష్టమే. ఒకరికి అద్భుతంగా తోచింది, మరొకరి దగ్గర తేలిపోవచ్చు. అందుకే అందాన్ని కొలవడానికి స్టాండర్డ్స్ ఏమైనా ఉన్నాయా? అని అప్పుడప్పుడు ఆలోచించేవాడిని. ఈ ప్రశ్న ఉదయించడానికి కారణం లేకపోలేదు. నాకు నచ్చిన హీరోయిన్ మా మిత్రబృందంలో ఎవరికీ నచ్చేది కాదు. ఆఖరికి మురళికి కూడా. అందుకే నా కళ్ళని సరిచేసుకోవాలా? అనే అనుమానం తలెత్తింది. అది క్షణకాలమే. ఎవరికీ నచ్చనిదైతే ఆమె తాలూకు ఊహలని పంచుకోలేరనే సంతృప్తి మిగిలింది.

కాని ఎవరు అందగత్తెలనే విషయం మాత్రం తేలలేదు. అందుకే ప్రమాణాల గురించి ఆలోచించాల్సి వచ్చింది.

అయితే, నేననుకునే స్టాండర్డ్స్, అందాలపోటీల్లో శరీరాల కొలతలలాంటివి కావు. "బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యం గొప్పది" అని వాళ్ళందరూ స్విమ్ సూట్స్ ధరించి చెప్పినప్పుడు, 'ఆహా', 'అలాగా' అనిపించడం మనకు అనుభవమే. కాబట్టి శరీరాన్ని ఎలా అంచనావేయాలో నాకు ఓపట్టాన అర్ధం కాలేదు. అప్పుడప్పుడు కొందరు ఆడవాళ్ళని చూస్తే, నాకు ఓ అనుమానం కలుగుతుంది. వీళ్లకు అసలు పిల్లలు ఎలా పుట్టారా అని. ముఖానికి, పిల్లలకు ఏమిటి సంబంధం అంటావా? ఇక నేను మాట్లాడను.

నాకు తెలిసిన, నేను చూసిన అమ్మాయిల్లో చాలా మంది బాగున్నారనే అనిపిస్తుంది. తరచి చూస్తే వీరిలో ఏముంది? అనిపిస్తుంది. మరి ఇంకా ఏముండాలి అనేదానికి నాకే స్పష్టంగా తెలియదు. చెబితే గొప్పనుకుంటారు. నన్ను చాలామంది అమ్మాయిలు ఆలోచింపజేశారు గానీ చలింపజేసిన వాళ్లు లేరు. అంటే ఎవరిమీదా ఆశపడలేదని కాదు. పడ్డవాళ్ళు అలా ఎప్పుడో అకస్మాత్తుగా తళుక్కున మెరిసి మాయమైపోయారు. మళ్లీ కనబడే అవకాశం లేదు. అలా ఒక్కసారి కనబడ్డమే నాకు నచ్చటానికి కారణమైందో నాకు తెలియదు.

చూస్తే కళ్ళనిబట్టి అందమంటారు. కొందరు. అవతలివారు అందంగా లేకపోయినా, మన కళ్ళు మనకు అందంగా కనిపింపజేయాలని వారి ఉద్దేశం? ఏమో! నేను అందం గురించి, నాక్కాబోయే భార్య తాలూకు ప్రమాణాల గురించి ఓ అవగాహనకు రాకముందే నాకు పెళ్లయిపోయింది.

***

ఉత్తరం పూర్తయ్యాక వాడి ముక్కు గురించి ఆలోచించాను. నిజమే! వాడు రాశాక అలాగే అనిపిస్తోంది. ఒక ముక్కేంటి? మనిషే అందం. అయినా వాడు ఇందులో ఏం చెప్పదల్చుకున్నాడు? తన భార్య అందగత్తె కాదనా? ఆ మాటకొస్తే అంతః సౌందర్యానికే వాడు మొగ్గు చూపినట్లు అస్పష్టంగానైనా అర్ధమవుతోంది కదా!

అసలు వాడి భార్య ఎలావుందో నేను చూడలేదు. ఎంత స్నేహితులమైనా ఒకరి పెళ్ళికి ఒకరం వెళ్లలేదు. అప్పటికారణాలు వేరు. నేను పిలవలేదని వాడు పిలవలేదో! లేకపోతే ఇంకా ఏమిటో? వాడి అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు కూడా ఆమెను సరిగా చూడలేకపోయాను. ఒకవేళ నాకు అందగత్తె అనిపించినా, వాడు అలా భావించాలని ఏమీ లేదు.

రెండో లేఖ :
"తెలియక చేసే తప్పు ఈ భూమ్మీద పుట్టడం తెలిసిచేసే తప్పు పెళ్లి చేసుకోవడం"

ఇలా అని ఏ మహానుభావుడైనా ఇంతకు ముందు అన్నాడో లేదో నాకు తెలియదు గానీ ఇప్పుడు నేనంటున్నా. మొదటి వాక్యాన్ని వదిలేస్తే, రెండవదాన్ని నా భార్య వారం పదిరోజులకోసారి రుజువు చేస్తూంటుంది. అయితే ఈ రెండోదానిమీదే మొదటిదీ ఆధారపడుందని చాలాసార్లు చెప్పకతప్పదు.

ఇంతకీ నా భార్య నన్నెలా రాచి రంపాన పెడుతుందంటావా చెప్పను. చెబితే, ఈ మాత్రం దానికేనా? నేనైతే ఎలా వెళ్లదీసుకొస్తున్నానో అని మీ స్వగతం మొదలుపెడతారు. లేదంటే ఏవో సలహాలిస్తామంటారు.

***

నిజమే, వాడేగనక సమస్య ఇదనీ, నాకు ఉత్తరం రాస్తే, నేను కూడా నా మ్యాజిక్ బాక్స్ లోంచి ఓ సలహా పారేసేవాడ్నేమో. అయినా సంసారమన్నాక అభిప్రాయబేధాలు లేకుండా ఎలా ఉంటాయి? అయితే మొన్న తిరిగి వస్తున్నప్పుడు శ్రీనివాసులు కొన్ని విషయాలు చెప్పాడు. అసలు వాళ్ళ సంసారం నిలబడటమే కష్టం అనుకున్నారట. భార్యని వాడు ఆరునెలలపాటు కాపురానికే తెచ్చుకోలేదట వీళ్ల ఇంట్లో వాళ్లు, వాళ్ల తరపు పెద్దలు... చిన్న పంచాయితీలాగా జరిగాక... 'ఆరడుగుల ఆకారం ఉంటే ఏం లాభం? ఏలుకోవడం తెలియదు' అని విమర్శలు ఎదుర్కొన్నాక... ఆమెను కాపురానికి తెచ్చుకున్నాడట.

"పాప పుట్టకపోయినా బాగుండేదేమో" అన్నాడు శ్రీను.

"ఏం?"

"ఎంతైనా ఆమెకు కష్టమేగదా"

నిజమే. కాని వాడికి ఏం కష్టం వచ్చిందో!

మూడోలేఖ:
ఆడడానికి ఆర్ధికస్వేచ్ఛ ఎప్పుడైతే మొదలవుతుందో, అప్పుడు క్రమంగా వివాహాలు బలహీనమవుతాయి. అంతకుముందు సర్దుకుపోవాలి అనే ధోరణి కాస్తా, 'నేనే ఎందుకు?'గా మారుతుంది.

వివాహాలు బలహీనమయ్యాయంటే, విడాకులు పెరిగిపోతాయి. అప్పుడు సింగిల్ మదర్, సింగిల్ ఫాదర్ కుటుంబాలు వచ్చేసి, పిల్లలు ప్రేమరాహిత్యపు బారిన పడతారు.

'అప్పుడు' మళ్లీ ఆడవాళ్లు సంపాదించడంలో కంటే, కుటుంబమే శ్రేష్టమని నమ్ముతారు. మగవాడికి కూడా అలాగే అనిపిస్తుంది. కాని అతడికి పనిచేయడం తప్ప మార్గం లేదు. ఇదంతా ఓ చక్రభ్రమణం.

బాధాకరమైన అంశం ఏమిటంటే, ఈ సైకిల్ పూర్తయ్యేసరికి కొన్ని విలవిల్లాడిపోతాయి. ఈ చక్రం పూర్తయ్యాకైనా ఆనందపడదామా అంటే, ఊహూ అలా లేదు. అది తాత్కాలికం. ఎందుకంటే, అప్పటి ప్రతినిధులు మరో భ్రమణానికి ఉవ్విళ్ళూరుతుంటారు కాబట్టి. మరి దేన్ని ఆపగలను? దేన్నీ ఆపలేను.

***

'ఆడది' అనడంలోనే పురుషాహం ధ్వనిస్తోంది. ఒకప్పుడు ఆడ - మగ సమానమని వాదించింది వీడేనా!

వాడి భార్య ఉద్యోగం చేస్తోందని శ్రీనివాసులు చెప్పాడు. అంటే ఆమె ఉద్యోగం చేయడం వీడికి ఇష్టం లేదా? దానివల్ల వీడు ఏం నష్టపోయాడు? వాడి పాప గురించే దిగులు పడినవాడైతే, బతికి ప్రేమను పంచివ్వాల్సింది కదా!

భార్య ఉద్యోగం చేయడంలో ఉండే కష్ట, నష్టాలేమిటో, నా భార్య ఉద్యోగం చేయట్లేదు కాబట్టి నాకేమీ తెలీదు. అయితే సిద్ధాంతపరంగా వాడు విడాకులను వ్యతిరేకించాడు. అలాగని కలిసి కాపురం చేయగలిగే మానసిక సర్దుబాటునూ చేసుకోలేనట్టున్నాడు.

నాలుగో లేఖ:
పొద్దున్నే చూశానామెను. పెద్ద కళ్ళు. ఆ చూపుల తీక్షణతకి నా కనుగుడ్లు చితికిపోతాయనుకున్నాను. పొడవైన జడ... ఉరి వేసుకోవాలన్న కోరికను రగిలించేట్టు. బరువైన వక్షం... రెండు భూగోళాలు వేలాడుతున్నట్టు. ఇన్నాళ్ల కలం స్నేహం తర్వాత, నా కోసమే వెతుక్కుంటూ నా ఇంటికి వచ్చింది. బయట నన్ను గురించే వాకబు చేస్తున్నట్టుంది. ఆడగొంతు వినగానే ఆటోమేటిగ్గా కాళ్ళు బయటికి నడిపించుకుని వెళ్లాయి.

నా పేరు బాగోదని మొదటినుంచీ మా నాన్నంటే నాకు కోపం. నా పేరుని కూడా అందంగా, ఆప్యాయంగా పిలవడం ఆమెకే చెల్లింది. నాకు తెలిసీ నన్నెవరూ ఇలా పిలవలేదు.

నీలం రంగు చీర కట్టుకుంది. చిన్న బొట్టు పెట్టుకుంది. బ్లౌజు ఒక్కటే వేసుకున్నట్టుంది. వీపు సమంగా కనబడింది, ఆమె ఎందుకో అటు తిరిగినప్పుడు.

ఆమె నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది.

"మీ 'సౌందర్యం విధ్వంసం' కవిత చదివాను".

"..........."

'అనుభూతికి ఇంత ప్రాధాన్యమా?"

ఆమెతో మాట్లాడటం కంటే, చూడటమే బాగుంది. కాని ఇలా ముఖాముఖి చూడ్డానికి ఒప్పుకుంటుందా?

చూపుల్ని ఎక్కడ నిలపాలో అర్ధం కాక ఆమె కాలికున్న మట్టెలను చూస్తూ నిలబడ్డాను.

***

ఎవరీ కొత్త వ్యక్తి? వాడు ప్రేమించిన అమ్మాయా? వివాహేతర సంబంధంగా పరిగణించాలా, వద్దా? అసలు ఈ ప్రేమ ఎంతదూరం వచ్చిందో తెలియదు. ఈ వ్యవహారమే వాణ్ణి చిక్కుల్లో పడేసిందనుకోవాలా? ప్రాధాన్యాల ఎంపికలో, ఎటు మొగ్గాలో తేల్చుకోలేక విఫలమయ్యాడా? కేవలం నేను ఇన్ని వ్యాఖ్యానాలు చేయడం సమంజసమేనా?

నాలుగు ఉత్తరాలు చదివాక కూడా వాడేమిటో, వాడి సమస్యేమిటో పూర్తిగా అర్ధంకాలేదు. నిజంగా అర్ధంకాలేదా? నేను చేసుకోలేకపోయానా?

అంతా అస్పష్టత.

అసలు వాడు ఈ లేఖలు నాకు పంపడం వల్ల, వాడి ప్రయోజనం నెరవేరిందని నమ్మకం కుదరలేదు. వాడికిలాగే డేటాను విశ్లేషించుకునే సామర్ధ్యం నాకు లేదు.

మ - య కు తేడా తెలియినివాడిని ఏ మాయ కమ్మేసిందో!

కవరు పక్కనపెట్టి, గాడంగా గాలి పీల్చి కళ్ళు మూసుకున్నాను. వాడి రూపమే కనబడ్డట్టయ్యింది. ఎక్కడున్నాడో!

ఏ మబ్బుల మీదో కూర్చుని (ఇలా అనుకుంటే తృప్తిగనక) నవ్వుతున్నాడేమో!

'ఒక్కసారి మట్టిలో కలిసిపోయాక, కథ ముగిసినట్టే. ఇంకా ఏమీ మిగలం... స్వర్గం, పునర్జన్మ లాంటి వన్నీనిరాశావాదం తాలూకు భావనలు. ఇక్కడ బతకలేనోడు ఇంకెక్కడో సుఖపడతాడని నమ్మడం నాన్సెన్స్'... ఇదంతా వాడి ఫిలాసఫీయే. అయినా చావును కౌగిలించుకున్నాడు.

నా కర్తవ్యమేంటి?

సమయం పన్నెండయ్యుంటుంది. నా భార్య గాడ నిద్రలో ఉండిండొచ్చు. ఎందుకో ఆమెను చూడాలన్న కోరిక బలంగా కలగడంతో కుర్చీలోంచి లేచాను.

***

తెల్లారి ఆఫీసు క్యాంటీను లో నేను, శ్రీను కూర్చున్నాం. ఛేదించలేని మౌనమేదో ఉంది మా మధ్య.

"వాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలుసా?" టీ కప్పు ఇస్తూ అన్నాడు శ్రీను.

అర్ధమయినట్టూ ఇంకా ఏదో పొర అడ్డుగా ఉన్నట్టూ అనిపించింది.

"ఊహూ" అన్నాను, అందుకుంటూ.

చెప్పాలా వద్దా అని సందేహిస్తున్నట్టుగా అనిపించింది.

"ఫర్లేదు చెప్పు"

వాడి తాలూకు ఎలాంటి సత్యాన్నైనా తెలుసుకోవడానికి నేను మానసికంగా సిద్ధపడి ఉన్నాను కాబట్టి స్థిమితంగానే ఉన్నాను.

"వాడి భార్య వాడిని మగాడిగా గుర్తించనందువల్ల"

***

వెంకట్రావు చావు వార్త కన్నా ఈ విషయం నన్ను ఎక్కువ చిత్రవధ చేసింది. ఎన్ని పదుల గంటలు నాలో నేను తర్జన భర్జన పడ్డానో నీకే తెలియదు. 'ఒక మనిషిని గురించిన అన్ని కోణాలను మనం పరిశీలించం. చూసిన కోణాల్ని అప్పుడు ఎదుర్కొన్న అనుభవాన్నిబట్టి, అవతలివారి మీద ఓ అభిప్రాయం ఏర్పరచుకుంటాం' అని చెప్పిన వెంకట్ మాటలే గుర్తొచ్చాయి. ఈ ఆత్మహత్యను ఇంకో కోణంలో చూడలేనా? ఎలాగో సంపాదించి చదివిన 'సౌందర్యం విధ్వంసం' కవితలోని పంక్తులు వాడికి సంబంధించినవే కావొచ్చు.

"...సంసారం తప్పనిసరైన వ్యభిచారమైనప్పుడు
ఎగబాకడం కోసం దిగజారాల్సి వచ్చినప్పుడు..."

***

దశదినకర్మకు మళ్లీ వెంకట్ ఊరు వెళ్లి, తిరిగి వస్తున్నప్పుడు చదవమని ఓ కాగితం శ్రీను చేతిలో పెట్టాను.

వాంఛ - పవిత్ర
స్వేచ్ఛ - అణచివేత
శాంతి - హింస
వ్యక్తివాదం - సమిష్టితత్వం
పరస్పరవిరుద్ధమైన భావాలన్నీ
మనసులోనే ఉన్నప్పుడు
ఆదర్శాలు - వాస్తవాల మధ్య అగాధం పెరిగినప్పుడు
మనతో మనమే విభేదించినప్పుడు
స్థిమితంగా ఉన్నవాడు మనిషిలా బతుకుతాడు!
లేనివాడు దేవుడై పోతాడు!!


- - - - -

(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు