సారాయి వీర్రాజు వీరంగం - కందర్ప మూర్తి

Saaraayi veerraju veerangam
" నేను మందు తాగితే మీకేంటంట?
ఔను, నేను మందు తాగుతాను..డాక్టరు రాసిన ఇంగ్లీసు మందు కాదు.
సర్కారు తెరిచిన బెల్టు షాపుల మద్యం మందు. ఆమందు కిక్కే వేరు.
. క్వార్టర్ లోపలికెళ్లిందంటే స్వర్గం కనబడతాది. మందు బాబులం
మేము,, మాకు మేమే మహరాజులం. ఎవరొచ్చినా లెక్కసెయ్యం.
మందు బాబులం మేము, మందు లోపలికెళ్లినాక మేమే మహరాజులం.
దేవదాసు మందు తాగి చరిత్ర కెక్కినాడు.ఉమర్ ఖయ్యం మదిర తాగి
గాయకుడయ్యాడు.చుక్క చూస్తే చచ్చిన పామైనా బుస కొడతది.
కల్లు తాగిన కోతి గుడి మెట్ల మీద గెంతులేస్తది." ఇదీ వీర్రాజు వరస.
నిజానికి వీర్రాజు ముందు నాటుసారా, కల్లు తాగేవాడు. రానురాను
అవి ప్రియమై అందుబాటులో లేకపోవడం, కల్తీ మందుతో చావులు
సంభవించడం అదీగాక గవర్నమెంటే గల్లీ గల్లీలో బెల్టుషాపులతో
గుమ్మాల ముందుకే క్వార్టర్ తో కిక్కిచ్చే మందు పంపుతోంది.
ఐనా వీర్రాజు పేరు సారాయి వీర్రాజుగానే నిలిచిపోయింది.
" ఔను, నేను మందు తాగుతాను. నా డబ్బు నాఇష్టం. నిన్నేమైన
పైసలడిగానా! మందుకు డబ్బులు లేకపోతే నా ఆలి లచ్చి తన
తాలి తెచ్చి "మామా ఈ తాలిబొట్టు తాకట్టు పెట్టి మందు తెచ్చుకో "
అన్నది కలికాలం సాద్వి. దాని ముందు పురాణాలలోని ఏ పతి
వ్రతలు సరిపోతారు. మాట కోసం పెళ్లాం మెడలో తాళిబొట్టునే
అడిగాడు సత్తెహరిచంద్రుడు
నా ఆలి లక్కీ లక్ష్మి , దాని అయ్య నేను తాగుబోతునని నాకు
కూతుర్ని ఇవ్వకుండా ఇంకొరికి లగ్గం చెయ్యలనుకున్నా ఆడ్ని
కాదని నన్ను ఇష్టం పడి లగ్గం సేసుకుంది నా బంగారం.
కాయకష్టం చేసి చెమటోడ్చి కూడబెట్టిన పైసలు సర్కారు
లిక్కర్ షాపులకు ఖర్చు చేసి సర్కారు ఖజానా నింపి సర్కారును
నిలబెడుతున్న మాకు సమాజంలో ఏం ఇలువ ఇస్తన్నారు.
తాగుబోతులమంటారు .ఎగతాళి చేస్తారు. మేము తాగితే మాలోకం
మాది. నాయాళ్లు, క్వార్టర్ కి పైసలడిగితే లేదు పొమ్మంటారు.
అదే ఫుల్ బోటిల్ దగ్గరుంటే ఈగల్లా ముసురుకొస్తారు.
మా దోస్తుగాడు మందు డబ్బు ఎక్కువైనాదని రెండు కే. జి.ల
నాటు కోడిని అప్పు బదులుగా తెచ్చి ఇచ్చినాడు బెల్టు షాపు ఓనరుకి.
బేవార్సుగా తిరిగే సైదులు పొలం భూమి అమ్మి బెల్టు షాపెట్టి వేలు
సౌపాదిస్తున్నాడట.
లేబొరోళ్లమని మమ్మల్ని తాగుబోతులని చీప్ గా మాట్లాడతారు జనం.
అసలు సినిమా ఓళ్లు రాజకీయ నాయకులు బడాబాబులు విదేశాల
ఖరీదైన మందు బార్లు నక్షత్రాల హొటళ్లు అవేవో రిసార్టులట అలాగే
బంగలాళ్ల్లో నైటు క్లబ్బుల్లో ఆడామగా తాగి చిందులేస్తారు. ఆళ్లు
పైసలున్న బడాబాబులు కనక ఏం చేసినా చెల్లుతాది.
దేశంలో మందుబాబుల వల్లే సగం ఆదాయం సర్కారుకు
సమకూరుతోందని పేపరోళ్లు అంటున్నారు. కనక సర్కారే మాకు
సిటింగులకి సదుపాయాలు కల్పించాలి. సరుకు మీద టేక్సులు
తగ్గించాల. వైటు రేషను కార్డున్నోళ్లకి మందు మీద రాయితీ
ఇవ్వాలి. పెన్సన్ తీసుకుంటున్న ముసలోళ్లకి వాలంటీర్ల ద్వారా
మందు సప్లై సేస్తే బాగుంటాది.
అలక్ నిరంజన్, మందుబాబులం మేమే, దేశ ప్రగతి చక్రాలం మేమే.
చెమటోడ్చి సంపాదించిన పైసలతో పాటు అవుసరమైతే ఆలి పుస్తెలు
కోడీ మేకా ఆవూ ఏదైనా అమ్మి మందు కోసం సర్కారుకి సమర్పిస్తాం.
మాకంటే త్యాగధనులెవరు చెప్పు, గురువా!
నాయాల , నాను టెన్తు మూడుసార్లు పాసయినా. ఎందరి కాల్లు
పట్టుకున్నా కొలువు దొరక లేదు. ఆడు అప్పిగాడు ఎర్రినాయాళ్లు
ఎనిమిది పాసయి యం.యల్య.ఎ గారి సిఫారసుతో సర్కారి
ఆఫీసులో ఎటెండరు నౌకరీ కొట్టేసాడు. ఇదీ లోకం తీరు గురువా!"
సాయంకాలమైతే సారాయి వీర్రాజు మందు గుర్రమెక్కినప్పుడు
రోజూ పాడే వీరంగ మిది.ఆ దారంట పోయే పాతోళ్లకి ఇది అలవాటే
కాని కొత్తోళ్లకి వింతే మరి.
అలా మందు కొట్టి వీధిలో అందరికీ కాలక్షేపం చేసే సారాయి వీర్రాజు
ఊరి చెరువులో పడిపోయాడన్న వార్త గుప్పుమంది. చెరువు గట్టుకి చెంబు
పట్టుకెళ్లిన ఎవరో చూసి ఊళ్లో చెప్పాడట.
లబోదిబోమంటు వీర్రాజు పెళ్లాం లచ్చి చెరువు కాడికి పరుగులంకించుకుంది.
వెంట ఊరి జనం చెరువు గట్టుకి చేరినారు. చెరువు నీటిలో బోరుగిల వీర్రాజు
పడిఉన్నాడు. వేసవి అయినందున అప్పటికే ఎండ బాగా ముదిరింది.
ఊరి సర్పంచి పోలీసులకి ఫోన్ ద్వారా విషయం చెప్పాడు.
వెంటనే పోలీసులు అంబులెన్సును వెంటపెట్టుకుని ఊరి చెరువు
గట్టుకు వచ్చారు. ఒకరిద్దరి సాయంతో నీటిలో పడిన వీర్రాజును
స్ట్రెచ్చర్ మీద పడుకోబెడుతుంటే టక్కున లేచి కూర్చున్నాడు.
వచ్చిన పోలీసులు, ఊరి జనం అవాక్కయారు.
"ఏరా, చెరువులో పడినావని పోలీసులు నిలదీస్తే, "సారూ, ఏడికి
ఒల్లు ఏడెక్కిపోనాది. సల్లగుంటదని చెరువు నీటిలో తొంగున్నా.
ధరమ పెబువులు , గొంతెంది పోనాది. ఒక యాబై రూపాయలు
ఇప్పించండి. క్వార్టరు మందు తెచ్చకుంటాను" అన్నాడు వీర్రాజు.
వాడి తాగుడు అలవాటుకు నవ్వుకుంటూ పోయారు ఊరి జనం.
* * *

మరిన్ని కథలు

Nijamaina deepavali
నిజమైన దీపావళి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Tagina saasti
తగిన శాస్తి
- Naramsetti Umamaheswararao
Ganji kosam
గంజి కోసం
- B.Rajyalakshmi
Ante maremee samasyalu levu
అంతే, మరేమీ సమస్యలు లేవు
- మద్దూరి నరసింహమూర్తి
O anubhavam
ఓ అనుభవం
- జి.ఆర్.భాస్కర బాబు