మన దేవుడు - టి. వి. యెల్. గాయత్రి.

Mana devudu

"ఓం నమశ్శివాయ!నమశ్శివాయ!శంభో శంకర నమశ్శివాయ!"

అంటూ శివనాథ శాస్త్రి కోనేటిలో నీళ్ళు బిందెతో మోసుకొని శివాలయంలోకి వచ్చాడు.

శివపురం గ్రామంలో ఉన్న పురాతనమైన దేవాలయానికి అర్చకుడాయన. శివరాత్రి రాబోతుంది. ఎప్పుడూ శివరాత్రికి ఉత్సవాలు ఎలా చెయ్యాలో ధర్మకర్త సూర్యనారాయణ మూర్తి, , సర్పంచి శంకరయ్య, ఊర్లో పెద్దలు కూర్చుని ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చర్చించి నిర్ణయం తీసికొంటారు.

శివనాథశాస్త్రి స్వామికి పూజాదికాలు ముగించి వచ్చే సరికి అందరూ వచ్చి మంటపంలో కూర్చుని ఉన్నారు.

శాస్త్రి గారిని చూడంగానే అందరూ లేచి వినయంగా నమస్కారం చేసారు.

వారిని కూర్చోమని చెప్పారు శాస్త్రి.

"స్వామి ఉత్సవాలకు పనులన్నీ మొదలు పెట్టడానికి మంచి ముహూర్తం ఒక పదిరోజుల్లో వుంది. ఆరోజు పనులు ప్రారంభిద్దాము."అన్నారు శాస్త్రిగారు.

"ఈ సారి శివరాత్రికి గ్రామస్తుల నుండి విరాళాలు ఎక్కువ రాలేదు స్వామీ!ఖర్చు మాత్రం దాదాపు ఆరు లక్షలు అయ్యేట్లుగా మా అంచనా. ఇప్పటి వరకూ పోగయింది లక్షమాత్రమే. మేము అందరం వేసుకుంటే ఒక లక్ష అవుతుంది. మిగిలిన డబ్బు ఎలా వస్తుందో తెలియటం లేదు. రెండేళ్లుగా మనఊరి పరిస్థితులు అంతగా బాగలేవు. పంటలు అంతంతమాత్రంగా పండాయి. ఈ ఏడాది పంట కళ్ళ చూస్తున్నారు. ఉన్న అప్పు తీర్చుకోవటానికి రైతులు సతమతమవుతున్నారు. ఉత్సవానికి డబ్బులు ఎక్కువ సమకూరలేదు. పోయిన రెండేళ్లు అంతకుముందు రైతులు ఇచ్చిన డబ్బులతో సరిపెట్టాము. ఇప్పుడు నిలువ కూడా ఏమీ లేదు. ఏం చెయ్యాలో తోచటం లేదు."

సమస్యని వివరించాడు ధర్మకర్త మూర్తి.

"మనం ఒక్కో యాభైవేలు పెట్టుకున్నా కూడా మూడు లక్షలు ఉన్నట్లు. ఊరందరికీ ప్రసాదవితరణ, ప్రభలు, అలంకారం, గుడికి రంగులు, జాగరణ కాబట్టి బుర్రకథ, హరికథ, నాటకం, మేళతాళాలు, వాహనం ఊరేగింపు, స్వామి, అమ్మవార్ల కళ్యాణం, వీటిల్లో ఏవి తగ్గిద్దాము?అన్నీ వుండాల్సిందే కదా "

అని సర్పంచి శంకరయ్య అన్నాడు.

"మీరేమీ దిగులు పడొద్దు. శంకరునికి తెలీదా!మనకు స్వామికి ఎప్పటిలాగా ఘనంగా ఉత్సవాలు జరపాలని వుంది. ఆ దేవదేవుడే అంతా సవ్యంగా జరిపించుకుంటాడు. ఆ స్వామి లీలలు అద్భుతమైనవి. మనం మనసారా ప్రార్థిస్తే స్వామి తన కళ్యాణానికి ఏర్పాట్లు తానే చూసుకుంటాడు. మీరు నిశ్చింతగా ఉండండి "

శివనాధశాస్త్రి గారి కంఠంలో స్థిరత్వం అందరికీ ధైర్యాన్ని ఇచ్చింది.

స్వామి మీద భారం వేసి అందరూ సెలవు తీసికొని ఇళ్లకు మళ్ళారు.

** ** ** ** ** ** ** ** ** **

ఆ రాత్రి భోజనానికి కూర్చున్నాడు మూర్తి. అన్నం చేత్తో కెలుకుతూ ఆలోచిస్తున్నాడు. భార్య పార్వతికి భర్త సమస్య తెలుసు.

రాత్రి భర్త దగ్గరికి వచ్చింది. ఆమె చేతిలో వడ్డాణం, కాసుల పేరు వున్నాయి.

"ఇవి అస్సలు పెట్టుకోవటం లేదు ఊరికే బీరువాలో మూలుగుతున్నాయి. వీటిని అమ్మి స్వామికి ఉత్సవాలు జరిపించండి."

పార్వతినిచూస్తూ "చూద్దాం!ఎన్నో తరాలుగా మన వంశంలో వాళ్ళు ధర్మకర్తలుగా శివయ్య సేవ చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ తండ్రి సేవే మన జీవనం. అవసరమయితే ఏదన్నా తాకట్టు పెడతాలే!నీ నగలు అలా వుంచు!"

అంటూ సర్దిచెప్పాడు.

మూర్తికి ఇద్దరు పిల్లలు, నగేష్, పరమేష్ లు. తండ్రి దేవుని ఉత్సవాల కోసం మథనపడుతున్నాడని అర్థం అయ్యింది పిల్లలిద్దరికీ. సిటీలో కాలేజీ చదువుల్లో ఉన్నారు పిల్లలు. పరమేష్ మంచి గాయకుడు.పిల్లలకు కూడా తండ్రికి సాయం చేయాలనిపించింది.

రెండో రోజు నగేష్ తన స్నేహితులకు సమస్య వివరించాడు. విషయం తెలుసుకున్న స్టూడెంట్ లీడర్ నరేష్ వచ్చాడు.నగేష్ కు బాసటగా నిలిచాడు.

"శివపురం శివాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. అది మీ ఊరిది మాత్రమేనా!మన అందరి ఆస్థి. అంత మహిమాన్వితమైన ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు మనందరం ఘనంగా జరిపిద్దాము. మనలో కొంతమంది అద్భుతమైన టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా!కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడితే డబ్బు వస్తుంది. ఇంకొక బాచ్ విరాళాలు సేకరిద్దాము."

నరేష్ మాటను చాలా మంది బలపరచారు.

స్టూడెంట్లు కదిలితే కానిది ఏదీ ఉండదు.

పిల్లలు ఉత్సాహంగా శివరాత్రి కోసం డబ్బు సేకరణలో పడ్డారు. కొంతమంది విరాళాలు సేకరిస్తే కొంతమంది స్టేజ్ పోగ్రామ్స్ పెట్టుకొన్నారు.

శివరాత్రికి చెయ్యాల్సిన ఏర్పాట్లకు మూర్తి, శంకరయ్య అడ్వాన్సులు ఇచ్చారు. అంతగా అయితే పొలం తాకట్టు పెడదామని మూర్తి ఆలోచన.

ఈ లోపల పిల్లల కృషి వలన అనుకున్నదానికంటే ఎక్కువ ధనం వచ్చింది.

శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.

స్తూడెంట్ లీడర్ నరేష్, ఇంకొంత మంది శివపురం వచ్చి అంతా నిర్వహించారు.

పిల్లలు చేసిన ఘనకార్యానికి అందరూ ఎంతో సంతోషించారు.

మూర్తికయితే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.

"మీ హృదయాలలో ఆ శివుడే నిలిచి ఇంతా చేయించాడు. మీ భక్తికి మేమేమీయగలము?"

మూర్తి మాటలకు

"అదేమీ లేదంకుల్!భగవంతుడు అందరివాడు. ఉత్సవం అందరిదీ. మన జిల్లాలో మహిమాన్వితమైన దేవాలయం. ఇది మనఅందరి ఆలయం. కేవలం గ్రామస్తులకు మాత్రమే ఈ ఆలయాన్ని పోషించే బాధ్యత ఎందుకు? ఈ ఉత్సవాలలో మేముకూడా భాగస్వాములమవటం మా అదృష్టం. ఇక ప్రతి సంవత్సరం శివరాత్రిని మన అందరం ఘనంగా జరిపిద్దాము. ఊరూరా తిరిగి భక్తులందరినీ సమావేశపరిచి దేవునికి ఏ లోటూ లేకుండా మేము చూసుకుంటాము!మీరు దిగులుపడకండి!"

అని చెప్పాడు నరేష్.

శుభసూచకంగా గుడిలో గంటలు గణగణ మ్రోగాయి.

సమాప్తం.

******************************

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు