దూరదృష్టి! - - బోగా పురుషోత్తం

Dooradrushti

పూర్వ రామాపురాన్ని రామగుప్తుడు పరిపాలించేవాడు. పక్కనే వున్న కృష్ణాపురాన్ని కృష్ణగుప్తుడు పాలించేవాడు. కృష్ణాపురానికి, రామాపురానికి మధ్య పాతిక కిలోమీటర్ల దూరం వుంది. రెండు రాజ్యాలను వేరు చేస్తూ ఓ పెద్ద నది వుంది. ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే పెద్ద వరదల కారణంగా రామాపురంలోకి నీళ్లు వచ్చి ఊళ్లు కొట్టుకుపోయేవి. దీంతో రామాపురంలో పంటలు మునిగిపోయి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించేది. రాజు రామగుప్తుడు తాత్కాలికంగా రైతులకు పంట నష్టం, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి ఆదుకునేవాడు. కానీ ఇవేమీ వారిని శాశ్వతంగా ఆదుకోలేకపోయాయి. ప్రాణనష్టం సంభవించిన కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొనేది. ఇటు పంటలు కొట్టుకుపోయి తిండి గింజలు కరువై తీవ్ర కరువు ఏర్పడేది.
ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం ఎలా? అని రామగుప్తుడు తీవ్రంగా ఆలోచించసాగాడు.
మంత్రి వీరయ్యతో ముంపు గ్రామాల రక్షణకు, వరద నివారణకు పెద్ద డ్యాం ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాడు.
ముంపు గ్రామాల్లో వరద నీటిని అడ్డుకుని డ్యాంలో నిల్వ ఉంచితే కృష్ణాపురానికి నీరు వెళ్లే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో కష్ణాపురం రాజు కృష్ణగుప్తుడు డ్యాం నిర్మించ వద్దని తన రాజ్య ప్రజలు నీళ్లు లేక అల్లాడిపోతారని హెచ్చరించాడు.
రామగుప్తుడు సైతం వరద నీటితో తమ ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతారని డ్యాం నిర్మించడమే మార్గమని అనుమతిస్తే ఇరు రాజ్యాలకు ప్రయోజనకరమని ప్రాధేయపడ్డాడు.
కృష్ణగుప్తుడు ఈ నిర్ణయాన్ని తిరస్కరించాడు. ఇక చేసేదేమీ లేక రామగుప్తుడు డ్యాం నిర్మాణం మొదలు పెట్టాడు. వరద ప్రాంతాల ప్రజలకు మిట్ట ప్రాంతంలో స్థలాలు ఇచ్చాడు. ఓ ఏడాది రోజుల్లో డ్యాంను ముగించాడు.
ఇది చూస్తున్న కృష్ణగుప్తుడు మౌనంగా వుండిపోయాడు. ఆ ఏడాది తీవ్ర ఎండలు కాయడంతో వర్షం పడలేదు. కనుచూపుమేర నీటి చుక్కజాడ కనిపించలేదు. కృష్ణాపురం ప్రజలు తీవ్ర కరువు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో పూర్తయిన డ్యాంను ప్రారంభించడానికి కృష్ణగుప్తుడిని ఆహ్వానించాడు రామగుప్తుడు.
నిరాశ నిస్పృహతో వున్న కృష్ణగుప్తుడు అయిష్టంగానే డ్యాం ప్రారంభోత్సవానికి వచ్చాడు. ‘‘ అసలే నీళ్లు లేక కరువుతో అల్లాడుతున్న మా రాజ్యానికి మీ డ్యాం ఇంకా నీరు లేకుండా తల్లడిల్లేలా చేసేలా వుంది ..’’ అని అసహనం వ్యక్తం చేశాడు కృష్ణగుప్తుడు.
‘‘ అలాంటిదేమీ లేదు.. ఇరు రాజ్యాల కరువు కాటకాలను ఇది పరిష్కరిస్తుంది .. ఆందోళన వద్దు.. ఆనందంగా వుండండి..’’ అన్నాడు రామగుప్తుడు.
కాని అది వినని కృష్ణగుప్తుడు అసంతృప్తితోనే వెళ్లాడు .
ఇది తెలిసి కృష్ణాపురం ప్రజలు పక్క రాజ్యాలకు వలస వెళ్లారు.
మరుసటి ఏడాది వర్షాకాలం రానే వచ్చింది. కుండపోతగా కురిసిన వర్షంతో డ్యాం నిండిపోయింది. గేట్లు తీసి వేశారు. నీరు కాలువల ద్వారా వెళ్లి సముద్రంలో కలిసిపోయింది. ఆ ఏడాది పంటలు బాగా పండాయి. రామాపురం వాసులకు కరువు తీరింది. మళ్లీ ఎండా కాలం రావడంతో నీటి జాడ కరువైంది. మళ్లీ కృష్ణాపురంలో కరువు తాండవించింది. కృష్ణగుప్తుడు మళ్లీ దీర్ఘ ఆలోచనలో పడ్డాడు. ఈ విపత్కర పరిస్థితిలో రామగుప్తుడు డ్యాం ద్వారా కృష్ణాపురానికి నీళ్లు వదిలాడు. కరువు ఛాయలు కనిపించలేదు. పంటలు బాగానే పండాయి. పోయిన ఏడాది వలస వెళ్లిన వారు కూడా కృష్ణాపురానికి చేరుకున్నారు. దివాలా తీసిన రాజ్యం పన్నుల చెల్లింపుతో ఆర్థికంగా పుంజుకుంది. దీనంతటికి రామగుప్తుడి దూరదృష్టి.. అని కనుకున్నాడు రామగుప్తుడు.
ఇప్పుడు ఎంత వరద వచ్చినా డ్యాంలో నీళ్లు నిండి కళకళలాడుతోంది. రామాపురంలో పొలాలు మునగలేదు. పంటలు నష్టపోలేదు. నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం రాలేదు. దీంతో రామగుప్తుడు ఆనందంతో ఊపిరిపీల్చుకున్నాడు. ఇటు కృష్ణాపురానికి సైతం డ్యాం నుంచి నీళ్లు అందడంలో వేసవి కాలంలోనూ నీటి కొరత రాలేదు. ప్రజలు ఆనందించారు. దీనికి రామగుప్తుడి దూరదృష్టే కారణం కావడంతో కృష్ణగుప్తుడు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి