మేము సైతం - నాగమంజరి గుమ్మా

Memu saitam

* “స్వామీ” “చెప్పండి దేవీ” “ఒక చిన్న కోరిక” చెప్పింది అంబ. “మీకు కోరికైతే నాకది ఆజ్ఞ” అన్నాడు సాంబడు. “ఒక పర్యాయం భూలోక విహారం చేసి రావాలని…” “శరన్నవరాత్రులలో మీకు, కార్తీకమాసంలో నాకు భూలోక విహారం తప్పనిసరి కదా… ఇప్పుడు ఈ ఆషాఢంలో ఈ తలంపేమి?” “ఇప్పుడు భరతఖండం వారికి వర్షాకాలం స్వామి. రైతులందరూ భూదేవికి పచ్చని పట్టుచీర పెట్టే సమయం. ఆ సంబరం వీక్షించి, ఆడపడుచుగా పసుపు కుంకం అందుకోను రమ్మని భూదేవి ఆహ్వానమంపేరు” చెప్పింది ఆదిదేవి “ఆహ్వానించాక వెళ్లక తప్పదు కదా! నందీ! అమ్మ కోరిక విన్నారు కదా! పదండి భూలోక విహారానికి…” అన్నాడు ఆది పురుషుడు. “స్వామీ నాదో చిన్న విన్నపం.” గొణిగాడు నంది. “అబ్బో తమకు కూడానా… చెప్పండి చెప్పండి నందీశ్వరా…” అన్నాడు పరమశివుడు. “భూలోకంలో… అందునా భారతదేశం లో… మరీ ముఖ్యంగా దక్షిణాపథాన, తెలుగంటే ప్రాణం పెట్టే, సాహితీ సమరాంగణ చక్రవర్తి గా పేరుగాంచిన శ్రీకృష్ణ దేవరాయలు అనే చక్రవర్తి తన ‘ఆముక్తమాల్యద’ కావ్యంలో వర్ష ఋతువును, కర్షకుల జీవనాన్ని వర్ణిస్తూ, లోకంలోని ఎడ్లు, దున్నలు అన్నీ భూమిని దున్నడంలోనే నిమగ్నమై ఉన్నాయి, ఒక్క శివుని నంది, కాలుని మహిషము తప్ప… అన్నాడట… అప్పటి నుండి నాకు అవకాశం ఎప్పుడు వస్తుందా? ఆ అపప్రథ ఎప్పుడు పోగొట్టుకోనా అని ఎదురుచూస్తున్నాను. అందుచేత దేవరవారు అనుగ్రహిస్తే, ఈ భూలోక విహారంలో నావంతుగా ఓసారి భూమిని దున్ని వస్తాను.” సుదీర్ఘంగా చెప్పి నమస్కరించాడు నంది. మందస్మిత వదనారవిందుడైనాడు స్వామి. సపరివారంగా భూలోక విహారానికి బయలుదేరారు ఆదిదంపతులు. ******* భూలోకంలో, ఆంధ్రదేశంలో ఒక గ్రామం. శివ పరివారమంతా అదృశ్య రూపంగా పొలంగట్టుపై కొలువుతీరారు. నారుమడి నుంచి నారు తీసి కట్టలు కట్టి విసురుతున్నాడు రైతు. స్త్రీలంతా దమ్ములు పట్టిన మడిలో సిద్ధంగా ఉన్నారు. రైతు భార్య కొన్ని వరి మొలకలు తీసి ఒడ్డున పెట్టి పూజించింది. “ఆకలి తీర్చే అన్నపూర్ణవు, సంపదలిచ్చే లక్ష్మీ దేవివి. పంట నిండుగా పండించు భూమి తల్లీ. ఇప్పుడు నాటిన ఈ పచ్చనాకులు దుబ్బులు వేసి పెరగాల. బంగారు వన్నెలో కంకులు దిగాల. అందరికి ఐదు వేళ్ళు నోటిలోకి పోవాల. గైరమ్మ తల్లీ దీవించు. నందెమ్మ తల్లీ దీవించు” అని మొక్కి పసుపు కుంకుమ పూసింది. పార్వతీదేవి అదృశ్యరూపంలో ఒడిని సాచి పసుపు కుంకుమ మూటకట్టుకుంది. నంది శివుని వైపు చూసాడు. శివుడు అంగీకారంగా తలవూచగానే నాగలికి కట్టి ఉన్న దాపటెద్దు లో ప్రవేశించాడు నంది. నారు తీస్తున్న రైతు దగ్గరకు పచ్చని స్ఫురద్రూపి వచ్చి, “అన్నా! నేను కూడా సాయం చేస్తా!” అన్నాడు. అంత పచ్చని మనిషికి కంఠంపై రూపాయి కాసంత నల్లని మచ్చ ఏమిటో అనుకుంటూ ‘సరే’నన్నాడు రైతు. మిగతా పరివారమంతా ఒక్కొక్క మడిలో సర్దుకున్నారు. అన్నపూర్ణమ్మ అచ్చమైన పల్లెపడుచులా అన్నపు గిన్నెతో ఒయ్యారంగా నడిచి వస్తోంది. “పాశుపతాస్త్రం కోరి అర్జునుడు తపస్సు చేసినపుడు, శివుడు కిరాతుడు కాగా, పార్వతీదేవి కిరాత స్త్రీ అయినట్లు నేడు మళ్ళీ పశుపతి, అన్నపూర్ణల దర్శనంతో సమస్త ప్రకృతి పులకించింది. సర్వమంగళా, భవాని, చిద్రూపిణీ, కాత్యాయనీ, ఆర్తజనఅభయంకరీ, శ్యామలా, అపర్ణా” అంటూ కీర్తించింది. *సర్వేజనాః సుఖినోభవంతు* *

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి