విద్యాధర పురాన్ని విద్యాధరుడు పాలించేవాడు. అతని రాజమందిరంలో ఓ సుందరమైన కొలను ఉండేది. పచ్చని చెట్లతో, పక్షుల కిలకిలా రావాలతో చూడముచ్చటగా వుండేది.
ఓరోజు అందమైన రాజహంస ఆకాశంలో వెళుతూ రాజ కొలను చూసి ముగ్ధమై కొలను చెంత వాలింది. పచ్చని ప్రకృతి వాతావరణాన్ని తిలకిస్తూ అక్కడే వుండిపోయింది రాజహంస.
అదే సమయానికి దాన్ని చూసిన విద్యాధరుడు అందమైన రాజహంసను పంజరంలో పట్టి బందించాడు. మంచి పుష్టికరమైన ఆహారం పెట్టేవాడు.
పంజరంలో బందీగా వున్న రాజ హంస రోజూ విలపించేది. రాజు తన వద్దకు వచ్చినప్పుడు అది ‘‘ రాజా బుడిబుడి నడకలు వేస్తున్న నాల్లు పిల్లలు వున్న దాన్ని ఆహారం లేక అవి ఎలా నీరసించిపోయాయో ఏమో నా మనసు తల్లడిల్లుతోంది.. వాటిని తల్లిగా రక్షించాల్సిన నేను వాటిని క్షభకు గరిచేస్తే అవి భరించలేవు.. పసి మనసులు ఎలా వున్నాయో ఏమో ఓ సారి చూసి వస్తాను.. దయచేసి నన్ను వదిలిపెట్టండి..’’ అని వేడుకుంది రాజహంస.
అది విన్న విద్యాధరుడు ‘‘ అందమైన నిన్ను వదిలితే మళ్లీ దొరకవు.. నీ మాయమాటలు నేను నమ్మను..నిన్ను విడిచిపెట్టడం కల్ల.. మంచి ఆహారం తిని ఇక్కడే బతుకు..’’ అని కఠోరంగా పలికాడు.
అది విని రాజహంస మరింత కన్నీరు కార్చింది. తన పిల్లలు ఏకాకిగా ఎలా వున్నాయో ’ ఆలోచిస్తూ నీరసించి పోయింది. దిగులుతో ఆహారం తినడం మానేసింది.
అది చూసిన రాజు ‘‘ ఓ హంసా జజ! ఎక్కడో అడవిలో వుంటే నీ బతుకు అడవి కాచిన వెన్నెల అయిపోతుంది..సకల సౌకర్యాలు వున్న ఈ రాజభవనంలోనే బతుకు..నీ అందం చూసి అందరూ మెచ్చుకుంటారు..’’ అని పొగిడాడు.
రాజు పొగడ్తలకు రాజహంస ఉప్పొంగిపోలేదు. ‘‘ రాజా ప్రజలను కన్నబిడ్డలవలే పరిపాలించాల్సిన నీవు ఇలా కంటతడి పెట్టించకూడదు..’’ అని హితవు పలికి ‘‘ నన్ను ఓసారి వదిలితే నా పిల్లల్ని చూసి వచ్చేస్తాను..!’’ అని చేతులు జోడిరచింది హంస.
విద్యాధరుడి మనసు కరిగింది. వెంటనే పంజరంలో వున్న రాజహంసను విడిచి పెట్టాడు. అది తన పిల్లలను చూసేందుకు ఆనందంతో స్వేచ్ఛగా గాల్లోకి ఎగిరింది.
అడవిలో ఆకలితో అటమటిస్తున్న తన పిల్లల్ని చూసి ఏడ్చింది. వాటిని అక్కున చేర్చుకుని ఓదార్చింది. ఆహారం పెట్టి కంటికి రెప్పలా చూసుకుంది.
ఓ రోజు విద్యాధరుడు అందమైన హంసకోసం తన రెండేళ్ల మూడేళ్ల కొడుకుని వెంటబెట్టుకుని అడవిలోకి బయలుదేరాడు. దట్టమైన అడవిలో దాహం వేయడంతో కుమారుడిని రథంలో కూర్చోబెట్టి సమీపంలోని నీటి గుంట వద్దకు వెళ్లాడు. అదే సమయానికి ఓ దొంగల ముఠా వచ్చి పిల్లవాడ్ని అపహరించింది.
కొద్ది సేపటికి నీళ్లతో వచ్చిన రాజుకు ఖాళీ రథం కనిపించడంతో పిల్లవాడికోసం అడవి అంతా వెతికాడు. కనిపించకపోవడంతో దిగులుతో మంచం పట్టాడు. నీరసించి చిక్కిపోయాడు.
ఓ రోజు అడవిలోకి దూరంగా వెళ్లిన రాజహంసకు దొంగల ముఠా చేతిలో బందీగా వున్న రాజు కొడుకు కంట పడ్డాడు. వెంటనే రాజహంస పక్కనే వున్న ఓ సాధువు కుటీరం వద్దకు వెళ్లి విషయం చెప్పింది. ఖణాలోల రాజకుమారుడిని విడిపించాడు. తర్వాత పిల్లవాడిని రాజు వద్దకు తీసుకెళ్లారు. నిరాశతో చిక్కిపోయి తండ్రిని చూసి కొడుకు వెళ్లి ‘‘ నాన్నా’’ అని హత్తుకుని ఏడ్చేశాడు. కుమారుడి గొంతు విని ప్రాణం లేసొచ్చి కూర్చున్నాడు రాజు. కొడుకునే ఆప్యాయంతో అక్కున చేర్చుకుని ముద్దాడాడు. తండ్రి లేక పసి హృదయం ఎలా తల్లడిల్లిందో గ్రహించాడు. తన కొడుకును రక్షించిన రాజ హంసకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.
తన లాగే పసి పిల్లలకు దూరమై తన రాజ మందిరంలో పంజరాల్లో వున్న రామ చిలుక, పావురాలు, పక్షి మనసులు ఎలా తల్లిడిల్లుతున్నాయో గ్రహించాడు రాజు. వెంటనే పంజరాల నుంచి వాటిని విడిచిపెట్టాడు.
అప్పటి నుంచి ప్రజల మనసులను గాయపరచకుండా మంచి పేరు తెచ్చుకున్నాడు రాజు విద్యాధరుడు.