ఆది దంపతుల విమానయానం - మద్దూరి నరసింహమూర్తి

Adi dampatula vimanayaanam

"నారాయణ" అంటూ నారద మహామునులవారు ప్రవేశించి -- నాలిక కరచుకొని - గట్టిగా

"నమో శంకరా, మహాదేవా" అని ఉన్నతాసనం మీద ఆసీనులై ఉన్న మహేశ్వరుడికి,

"నమస్తే భవానీమాతా” అని అమ్మవారికి

నమస్కారం చేసి ముకుళిత కరములతో నిలబడ్డాడు.

"నారదా, కైలాసంకి వస్తూ 'నారాయణ' అంటూ ప్రవేశించడం ఎంతవరకూ సమంజసం" అన్న అమ్మవారి ప్రశ్నతో ఉలిక్కిపడి --

"అలవాటులో పొరపాటు తల్లీ, క్షమించమని ప్రార్ధన"

"నీ అంతటి మహామునియే పొరపాటు చేస్తే, ఇక తక్కిన అల్పులని ఏమనాలి"

ఇక శంకరుడే శరణమనుకున్న నారదులవారు –

"శంకరా ప్రభో, మీరు క్షమిస్తే అమ్మవారు శాంతిస్తారు, కరుణించండి"

"నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నారదా. కానీ, కైలాసంలో నేను పేరుకే ప్రభువుని, పెత్తనం అంతా ఆవిడదే. కాబట్టి శిక్షించినా క్షమించినా ఆవిడదే తుది నిర్ణయం. నాకు కూడా శిరోధార్యం"

ఇక గత్యంతరం లేదనుకున్న నారదులవారు –

"అమ్మా ఈసారికి నా తప్పు కాయండి, ఇగో లెంపలు వేసుకొని గుంజీలు కూడా తీస్తున్నాను" –

అని చెంపలు రెండూ గట్టిగా వాయించుకొని 10 గుంజీలు తీసి అలసి సొలసి అయ్యగారివేపు అమ్మవారివేపు జాలిగా చూడసాగేరు.

"సరే, ఇదే నీ తొలి తప్పుగా గ్రహించి, నీవు నీకై వేసుకున్న శిక్షతో, ఇప్పటికి క్షమిస్తున్నాను. ఇక మీదట ఎప్పుడైనా పునరావృత్తం కాకుండా జాగరూకుడవై మెసులుకో"

"మహా ప్రసాదం తల్లీ"

చిరునవ్వులు చిందిస్తూన్న చిదంబరేశ్వరుని ఇషారాతో –

అమ్మవారికి సాష్టాంగ నమస్కారం కూడా చేసిన నారదులవారితో –

"అతి వినయం చూపకుండా, ఆ ఆసనం మీద కూర్చొని, నీ రాకకు కారణమేమిటో చెప్పు" అని అమ్మవారు ఆజ్ఞాపించేరు.

"ఎంతమాట తల్లీ, మీ ముందు వినయమే కానీ దానికి కొలబద్ద ఉండగలదా"

"అగో ఆ అతివినయమే వద్దన్నది"

"హైమవతీ, నేనూ నారాయణుడు ఒకటే అని తెలిసిన నీవు ఈరోజు ఇంతగా ఆగ్రహించడమేమిటి"

"తత్వసహా మీరిరువురు ఇద్దరు కారు ఒక్కరే అని నాకు తెలిసినా, ఇక్కడ కైలాసంలో మిమ్మల్ని శంకరులుగానూ అక్కడ వైకుంఠంలో నారాయణుడుగానూ గ్రహించవలసినదే"

"అంతేనా, లేక నీ ఆగ్రహానికి ఇంకా ఏమైనా కారణముందా"

"ఇక్కడ నేను ఉండగానే మిమ్మల్ని ఎవరైనా కించపరచితే నేను ఎలా సహించేది. మీకు లేని అభ్యంతరం నాకేల అని నేను మౌనం వహిస్తే, మీకు దక్కవలసిన గౌరవం తగ్గిపోయి చులకనైపోరూ. నారాయణుడు నా సోదరుడే అయినా, నాకు నా పెనిమిటి తదుపరే ఎవరైనా ఎంతవారైనా"

"బహు చక్కగా సెలవిచ్చేవు దేవీ"

" నారదా ఇంతకీ నువ్వు వచ్చిన కారణం” అని అడిగిన మహాదేవునితో --

"శంకరాచార్యులు సౌందర్యలహరిలో మిమ్ముల్ని అభివర్ణించేరన్న నెపంతో, మీరు సంధ్యా సమయం అయేసరికి శ్రీశైలం మీదుగా తిరిగి వచ్చేస్తున్నారు. తక్కిన భూగోళం అంతా ఎంత గందరగోళంగా ఉందో మీరు గ్రహించడం లేదన్న నా ఆవేదన మీకు చెప్పుకొని, మిమ్మల్ని తత్ కార్యోన్ముఖుడిగా చేద్దామని చిన్న ప్రయత్నంతో వచ్చేనిప్పుడు"

"అంటే మేము నిర్వహించవలసిన కార్యం మాకు తెలియదు నిర్వహించడంలేదు అన్నదే నీ అభియోగం"

"ఎంతమాట, మీ మీద అభియోగం మోపేటంతటి వాడినా నేను ప్రభూ”

"సంధ్యా సమయం అయేందుకు చాలా సమయం ఉండగానే మేము మా నందీశ్వరుని మీద బయలుదేరినా, శ్రీశైలం చేరుకునేసరికి చీకటి పడడం ఆరంభం అయిపోతోంది. అక్కడ నలుదిశలా తిరిగేసరికి పూర్తిగా చీకటి కమ్ముకొంటోంది. ఒకవేళ వెన్నెల కురిసే రాత్రులైతే, మా దేవేరికి అచటనే కొంతసేపు వెన్నెల నింపుకున్న ప్రకృతిని చూడ బుద్ధి అవుతోంది. అందువలన, మరి ఎచ్చటకూ వెళ్ళక వెనకకు తిరిగి వచ్చేస్తున్నాము”

"భూప్రపంచం మీద తక్కిన చోట్లకు కూడా అప్పుడప్పుడైనా మీరు వెళ్లకపోతే, అచట ఉండే జనానికి మీరంటే భయం భక్తి లేకుండా పోతుంది అని నేను వేరుగా చెప్పాలా మహేశా"

"ఇప్పుడు భూప్రపంచం తిరిగి వద్దామా గౌరీ"

"నాకు కొంత సమయం ఇచ్చేరంటే నేను చీర మార్చుకొని సింగారించుకుని వస్తాను ప్రభూ"

"ఎంత సమయం కావాలంటావు"

"ప్రభూ ఆడవారు అలంకరించుకొని వచ్చే లోపల యుగాలే మారిపోతాయి. అయినా అమ్మవారు ఇలాగే అందంగా ఆకర్షణీయంగా ఉన్నారు. ఇప్పుడు బయలుదేరితేనే తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి అవొచ్చు"

"అవును దేవీ, నారదుడు చెప్పింది నిజమే, నువ్వు ఇప్పుడే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నావు అనడంలో ఏమీ సందేహం లేదు. బయలుదేరదామా"

"అలాగే స్వామీ, నేను అలంకరించుకొనేది నూతన వస్త్రధారణ చేసేది మీ మెప్పుకోలుకే కదా. అలాంటిది నా మగడే మెచ్చిన నాకేల చింత, పదండి"

"నందీ" అన్న అయ్యవారి కేకకు –

"ప్రభూ నేను సదా మీ సేవకి సిద్ధంగానే ఉన్నాను” అంటూ నంది వచ్చి నిలబడ్డాడు.

"ప్రభూ మీరు నంది మీద బయలుదేరితే అలవాటు ప్రకారం మిమ్మల్ని శ్రీశైలం వరకే తీసుకొని వెళ్తాడు"

"మరి మాకుండే వాహనమే నంది కదా. నేను దారి మార్చమని చెప్తానులే. మరి నువ్వెలా వస్తావు మాతో"

"సర్వం మీకు తెలిసినా ఏమీ తెలియనట్లు వ్యవహరించే మీ సుగుణాలకు వందనం. మీరు ఈరోజుకి నందిని విడిచి పెట్టి…"

"అంటే, మమ్మల్ని కూడా నీతో నడవమందువా"

"స్వామీ, నా మాట పూర్తిగా వినుడు. వయోవృద్ధుడై మోకాలి నొప్పులతో అడుగు తీసి అడుగు వేసేందుకు కష్టపడుతూ మిమ్మల్ని తాపీగా ప్రయాణం చేయించే నందీశ్వరుడిని విడిచిపెట్టి, కుబేరుడి దగ్గర ఉన్న పుష్పకవిమానం తెప్పించండి. అదైతే వాయువేగ మనోవేగాలతో ప్రయాణం చేస్తుంది. మీతో పాటూ నేను కూడా అదెక్కి, మీకు దారి చూపూతూ, తొలిసారి విమానయానం చేసి తరిస్తాను"

"ఇంత డొంక తిరుగుడెందుకు, నువ్వు విమానయానం చేయాలని ఉబలాట పడుతున్నావని చెప్పక"

"మీకు సర్వం తెలుసును స్వామీ" అంటూ సిగ్గుపడుతున్న నారదుడిని చూసిన అమ్మవారు నవ్వుతూ –

"నాకు కూడా విమానయానాం మీద మనసు కలగచేసేడు అబ్బాయి. ఆలస్యం చేయక వెంటనే పుష్పకవిమానాన్ని తెప్పించండి ప్రభూ"

"నీ ముచ్చట నేను కాదనగలనా కామేశ్వరీ" అంటూ

"నారదా, కుబేరుడు వెలుపల ఉంటాడు, తోడు తీసికొని రమ్ము"

అయ్యవారి ఆజ్ఞతో నారదుడు పరుగున ఆవలకు పోయి, నిమేష మాత్రాన కుబేరుడితో ప్రవేశించేడు.

"ప్రభూ ఈ సేవకుడికి ఏమి మీ ఆజ్ఞ"

"కుబేరా, నీ దగ్గరున్న పుష్పకవిమానంలో నారదుడు దారి చూపగా ఈదినం నేను అమ్మవారు భూభ్రమణం చేయాలని మనసయ్యింది. త్వరగా తెప్పించు"

"ఈ సేవకుడు మీసేవకు పనికొస్తున్నందుకు మహా ప్రసాదం" –

అని లిప్తకాలంలో అక్కడ పుష్పక విమానాన్ని హాజరు పరిచి –

"ప్రభూ నారదుడు మీకు దిశా నిర్దేశం చేసే ఆవశ్యకత లేదు. మీ మనోభిలాషని గ్రహించి మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి ఈ పుష్పకం తీసుకొని పోగలదు. అంతేకాదు, పుష్పకంలో మీ ప్రయాణం ఇక్కడినుంచే నేను గమనిస్తూ, అవసరమైనచో దాని గమ్యావస్థలను నియంత్రిస్తూ, ఇక్కడనుంచి నేను మీతో సంభాషించగలను కూడా ప్రభూ. ఆ అవసరం పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను"

"నన్ను అయ్యవారు విమానంలో తీసుకొని వెళ్తారంటే, ఇవన్నీ ఇప్పుడు నువ్వు చెప్పవలసిన అవసరమేమిటి" అని కుబేరుని చెవి కొరికేడు నారదుడు.

‘నన్ను స్వామివారిసేవకి దూరంచేసిన నిన్ను కొమ్ములతో పొడిచెయ్యనా’ -- అన్నట్టు నందీశ్వరుడు నారదునివేపు గుర్రుగా చూసేసరికి నారదుడికి నరనరాన భయం ఆవరించింది.

"అలా అయితే, మన ఏకాంతానికి అడ్డుగా నారదుడు ఎందుకు, మనం ఇద్దరమే పోదామా పార్వతీ"

"ఈ వయసులో మనకి ఏకాంతమేమిటి స్వామీ. అయినా బిడ్డడికి ఆశపెట్టి, నీరు కార్చడం, ఆదిదంపతులమైన మనకు పాడి కాదు. నారదుడు కూడా మనతో రానీండి"

‘ మా భామామణి ఏమి పలికినా అవుననుటే మధురం ‘ అన్న ఈలపాటతో –

శంకరులు అమ్మవారి చేయి అందుకొని పుష్పకవిమానంలోనికి తీసుకొని వెళుతుంటే శాంకరీదేవి వదనంలో ఆనందం తాండవించింది.

అలా ఆరంభమైన ఆదిదంపతుల విమానయానం కొంత దూరం వెళ్లేసరికి ఓ మోస్తరు పరిమాణంలో పక్షి ఆకారంలో కనిపిస్తూన్న యంత్రాలాంటివి పుష్పకాన్ని చుట్టూ ముట్టి గిర్రున తిరగనారంభించేయి.

ఇంతలో – “ప్రభూ భూలోకంలో వాటిని ద్రోణాణ్వస్త్రాలు అనెదరు. వాటిని ఎదుర్కొని నాశనం చేయాలంటే ద్రోణవ్యతిరేక శక్తులకు మాత్రమే సాధ్యం. అటువంటి వ్యవస్థ పుష్పకంలో ఒక మండలం రోజులు దాటకుండా ఏర్పాటు చేసే ప్రక్రియలో నా దగ్గర ఉన్న వైజ్ఞానికులు తలమునకలై ఉన్నారు. అంతవరకూ మనం చేసేందుకు ఏమీ లేదు. కనుక, నన్ను క్షమించి ప్రస్తుతానికి మీరు అమ్మవారు వెనక్కు వచ్చేయండి" అన్న కుబేర వాణి వినిపించింది.

"ఏమంటావు రాజేశ్వరీ"

"ఎక్కడ తగ్గాలో తెలిసినవారే అత్యుత్తములని మీకు నేను వేరే చెప్పాలా. అయినా, భస్మాసురుడికి వరం ఇచ్చినప్పుడు మీరు పడిన దీనావస్థ కంటే, ప్రస్తుత పరిస్థితి పెద్దదేమీ కాదు. పదండి త్వరగా కైలాసం చేరుకుందాం"

"అవును దేవీ, అదే మన తక్షణ కర్తవ్యం" అన్న శివాజ్ఞతో కైలాసం చేరుకున్న పుష్పకం దిగుతున్న మాతాపితరులకు చిరునవ్వుతో స్వాగత సత్కారాలు చేసి నమస్కరించేడు గణపతి.

వినాయకుడిని వీక్షించిన పరమేశ్వరునికి –

పుష్పక విమానంలో తొలిసారిగా తాము విహరించాలనుకొనేటప్పుడు విజ్ఞాధిపతిగా తొలి పూజలందుకునే గణపతిని పూజించక, కనీసం స్మరించక, ప్రయాణం ప్రారంభించడం వలన జరిగిన అనర్ధం అని -- గోచరమైంది.

***

మరిన్ని కథలు

Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు