రాత్రి ఏడుగంటలు కావడంతో ఊరికి దూరంగా ఉన్న తన కార్యాలయం నుండి ద్విచక్రవాహనంపై, ఇంటికి బయలుదేరాడు జివితేష్ . ఊరిలోనికి ప్రవేశించాక అక్కడ ఉన్న రహదారి పైన ఉన్న పెద్దవంతెన దిగువన నలుగురు పిల్లలు కూర్చోని చదవడం గమనించిన జివితేష్ తన వాహనాన్ని వీధి పక్కనే నిలుపుచేసి , చదువుతున్న ఆపిల్లల వద్దకు వెళ్ళి " అబ్బాయిలు మీరు ఎన్నో తరగతి చదువుతున్నారు ? "అన్నాడు. " పదవతరగతి " అన్నారు పిల్లలు. వారు పేదంటి పిల్లలు అనిగమనించి , ఒకరి చేతిలోని పుస్తకం తీసుకుని వారు చదువుతున్న పాఠ వారికి అర్ధమైయే విధంగా వివరించాడు .ఆనలుగురు పిల్లలు పలురకాల పాఠాలపైన ప్రశ్నల వర్షం కురిపించారు. ఓపికగా వారి సందేహలన్నింటికి వారికి అర్ధమైయే రీతిలో తెలియజేసాడు.సమయం తొమ్మిది గంటలు కావడంతో బయలు దేరిన పిల్లలు" అన్నా రేపుకూడా వస్తావా ?" అన్నారు.
" అలాగే మీపరిక్షలు ముగిసేవరకు రోజు వస్తాను మీకు ఇలాగే అర్ధమైయే రీతిలో పాఠాలు ఉచితంగా చెపుతాను "అన్నాడు జివితేష్ .
మరుదినం తన కార్యాలయంలో నిన్న తనకు జరిగిన అనుభవాన్ని సాటి మిత్రులకు వివరించాడు. " ఈరోజు మేము వస్తాం అక్కడకు నేను వారికి ఆంగ్లపాఠం చెపుతాను అని ఒకమిత్రుడు, నేను లెక్కలు చెపుతాను అని మరో మిత్రుడు తలా ఒకపాఠం చెప్పడానికి ముందుకు వచ్చారు. రాత్రికి మిత్రులు అందరు కలసి వంతెన కిందకు చేరారు. అక్కడ నిన్న నలుగురు ఉంటే ఈరోజు దాదాపు నలభైమంది విధ్యర్ధిని,విధ్యార్ధులు కూర్చోని ఉన్నారు. దూరప్రాంతం నుండి వచ్చే పిల్లలకోసం వాళ్ళ పెద్దవాళ్ళుకూడా వచ్చారు." పిల్లలు ఈ అన్నయ్యలుకూడా మీకు సహయం చేయడానికి వచ్చారు "అన్నాడు. ఆనందంతో పిల్లలంతా కేరింతలు పలికారు. వారు అడిగిన ప్రశ్నలకు మిత్రకూటమి లోని వారంతా సహనంగా సమాధానాలు తెలియజేసారు.
ఇలా రోజులు గడిచేకొద్ది పిల్లల సంఖ్య వందకుపైగా దాటింది. ఇదిచూసిన కొందరు చదువుకున్న యువతీ,యువకులు పాఠాలు చెప్పడానికి స్వచ్ఛాంధంగా ముందుకు వచ్చారు. శని,ఆది వారాలలో సాయంత్రం తరగతులు ప్రారంభం చేసాడు జివితేష్ .విద్యుత్ ఉన్నాతాధికారి పిల్లలు చదువుకోవడానికి వీలుగా విద్యుత్ దీపాలు అమర్చాడు. ప్రాధమికం,మాధ్యామికం,ఉన్నత పాఠశాల విధ్యార్ధి,విధ్యార్ధునులతో ఆప్రదేశం ఓపాఠశాలలా మారిపోయింది. వివిధ పాఠశాలల్లో చదువుతూ జివితేష్ బృందం వద్ద శిక్షణ పొందిన అరవైనాలుగు మంది పదవతరగతి ప్రధమశ్రేణిలో ఉత్తిర్ణత సాధించడంతో మీడియా అంతా జివితేష్ ముందు చేరాయి. ' అందరికి నమస్కారం నేను ఈపిల్లలకు శిక్షణ ప్రారంభించినప్పుడు నలుగురే ఉన్నారు నేడు మూడువందలకుపైగా పలుతరగతులకు చెందిన విద్యార్ధి,విద్యార్ధినీలు ఉన్నారు. ఈ విద్యా దాన పధకం ప్రారం భించినది నేనైనప్పటికి,నాసహచరులు, విద్యావంతులు, సేవాభావం,దానగుణం కలిగిన ఉత్సహపూరితులైన యువతి, యువకులదే ఈవిజయం. ఇలాగే దేశం అంతటా విద్యాదానం అందరు చేయగలిగితే బడుగు,బలహీనవర్గలవారు,అర్ధికంగా వెనుకబడిన వారి పిల్లలను మనం ఆదరించి వారి సందేహలనుతీర్చగలిగితే మన సమయం సద్వినియోగం అవుతుంది దేశవిద్యా వ్యవస్ధ బాగుపడుతుంది. ఎంత దానం చేసినా తరగనిది విద్య అని అందరు తెలుసుకుని మాబాటను అనుసరించవలసినదిగా వేడుకుంటున్నాను "అన్నాడు జివితేష్ .
కరతాళధ్వనులు మిన్నంటాయి.