చరవాణి తెచ్చిన తంటా - టి. వి. యెల్. గాయత్రి.

Charavani techhina tantaa

శ్రీనివాస్ రిటైర్ అయ్యాడు. ఇంట్లోనే ఉండాలి. అయితే తోచదు అన్న బాధలేదు.

చేతిలో సెల్ ఫోన్ ఉంది.

వెధవ ఆఫీసు!.. గవర్నమెంటాఫీసులో ఎదుగు బొదుగులేని ఉద్యోగం చేసి చేసి విసిగిపోయాడు. పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు.

భార్య పద్మజకు ఎప్పుడు పూజలూ,పారాయణాల గొడవ!...

తెల్లవారి లేచి వంట చేసి దేవుడికి నైవేద్యాలు,పెట్టి మేడ మీద మొక్కలు దగ్గరికి వెళుతుంది.

మిద్దె తోట పెంపకం!...అన్ని కూరగాయలూ ఆకుకూరలూ పెంచి,ఇంట్లోకి కొన్ని వాడి,కొన్ని చుట్టుపక్కల వాళ్లకు పంచుతుంది.

ఈ మధ్య బంగాళాదుంపలు కూడా ఇంట్లోనే పండించాలని ఆమె ఆశయం..

ఆమెకు ఆ తోటంటే ప్రాణం!...

ఆ తర్వాత పెరట్లో గోడ దగ్గర చేరి రోజూ గంట సేపు పక్కింటి నీరజతో కబుర్లు చెబుతుంది. ఒంటి గంటకు ఎలాగో కబుర్లు ఆపి భోజనానికి వస్తుంది. భోజనం అయ్యాక కాసేపు నడుంవాల్చటం!... ఆ తర్వాత లేచి కాఫీ తాగి,సాయంత్రానికి ఇద్దరికీ కాస్త టిఫిన్ కలియబెడుతుంది.మేడమీద పూసిన పూలు భక్తిగా మాల కడుతుంది. వాటిని తీసికొని ఠంచనుగా ఐదింటికి వీధి చివర ఉన్న గుడికి వెళుతుంది.

అక్కడ పారాయణాలూ, భజనలూ చేసి వచ్చేసరికి ఎనిమిది అవుతుంది.

శ్రీనివాసుకు భార్య ఒక పల్లెటూరిమొద్దులాగా కనిపిస్తూ ఉంటుంది.పనికిమాలిన భజనలూ,పారాయణాలూను..

అతడికి అరవై ఏళ్లు దాటాయి. అయినా యంగుగా ఆలోచించాలంటాడు.

"అంటే ఏమిటి?" అంది పద్మజ.

"సెల్లుఫోన్ చూడు! ఫేస్ బుక్కు లోకి వెళ్లి జ్ఞానాన్ని సంపాదించుకో! అందరితోపాటు చాట్ చెయ్!జ్ఞానానికి జ్ఞానం కాలక్షేపానికి కాలక్షేపం!మీ అమ్మలక్కల ముచ్చట్లలో ఏముంటుంది? ఎదురింటి వాళ్ళు ఇట్లా!పక్కింటి వాళ్ళుఅట్లా!..అంతే కదా!... ఎప్పుడూ ఆ పాతకాలం వాళ్ళలాగా చాదస్తంగా ఉండకు!కొంత మోడ్రన్ గా ఆలోచించి,కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకో! కొత్త వంటలు నేర్చుకొని ఫేసుబుక్కులో పెట్టు! బోలెడు గుర్తింపు!...నువ్వే చూడు!కొద్ది రోజుల్లో నువ్వొక సెలబ్రిటీవి అయిపోతావ్!"

బోధించాడు శ్రీనివాస్.

"అవన్నీ చేసి మీరు గొప్ప వాళ్ళు అవ్వండి!.. నన్నుమాత్రం వదిలేయండి బాబూ!"అంటూ చేతులు జోడించింది పాతకాలపు భార్యామణి పద్మజ.

శ్రీనివాసుకు పొద్దున లేచింది మొదలు సెల్ ఫోను...గట్టిగా కేక వేస్తే గాని భోజనానికి రాడు..

ఆదరా బాదరా ఇంత తినేసి మళ్ళీ చరవాణి సేవ!..

రోజులు గడుస్తున్నాయి.. మొన్నొక రోజు గార్డెనులో సెల్ ఫోను చేతితో పట్టుకొని చూసుకుంటూ వాకింగ్ చేస్తూ అక్కడున్న చిన్న గుంతని చూడకుండా దానిలో కాలువేసి పడ్డాడు..

వెంట్రుక వాసి ఫ్రాక్చరట!...మూడు వారాలు బెడ్ రెస్ట్...

అయినా మానవుడికి బుద్ధి రాలేదు... బెడ్ మీద ఉండి కూడా సెల్ ఫోన్ తోనే తరిస్తున్నాడు.

ఇంకో ఆరు నెలలు గడిచాయి. ఈ మధ్య శ్రీనివాసుకు కళ్ళ మంటలు మొదలయ్యాయి. 'ఏదోలే!' అనుకొని తెలిసిన మందుల షాపు వాడిని అడిగి ఐ డ్రాప్స్ తెచ్చుకొని వేసుకున్నాడు.

తగ్గలేదు సరికదా కళ్ళు రెండూ నీళ్లు కారటం మొదలుపెట్టాయి.

వస్తువులన్నీ రెండుగా కనిపిస్తున్నాయి..

ఇంక లాభం లేదని కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.

అన్ని పరీక్షలు చేశాడా డాక్టర్.

కుర్రవాడు..తన కొడుకంత వయసువాడు.

"అంకుల్ మీ కంటిలో పొర కాస్త మందమైంది..కాటరాక్ట్ ఆపరేషన్ చేయాలి!"అన్నాడు డాక్టర్.

"మా నాన్నకు అసలు కాటరాక్ట్ రాలేదు. ఎనభై ఏళ్లు బ్రతికారు.

మా అమ్మకు కూడా రాలేదు.ఆవిడ ఎనభై మూడేళ్లకు పోయింది. మా ఇంటా వంటా ఎవరికీ కంటి ఆపరేషన్లు లేవు!"అన్నాడు శ్రీనివాస్.

"నిజమే అంకుల్! వాళ్లు సెల్ ఫోను వాడలేదు కదా! సెల్ ఫోను రోజు మొత్తంలో ఇరవై నిమిషాలు మాత్రమే చూడాలి! లేకపోతే మీలాంటి పెద్ద వాళ్ళకి మెడ నొప్పులు, కళ్ల జబ్బులు వస్తాయి! శరీరానికి కదలిక లేకపోవడం వలన షుగరు, దాని వలన కిడ్నీ జబ్బులు,గుండె రోగాలు వస్తాయి!...." ఇంకా చెప్పుకుబోతున్నాడు కుర్ర డాక్టర్.

"ఆపు! ఆపు!"అంటూ గట్టిగా అరిచాడు శ్రీనివాస్.

వెఱ్ఱి భయం వేస్తోంది. ఒళ్ళు జలదరిస్తోంది..

పిల్లలు వచ్చారు. తండ్రి దగ్గర రోజూ కాసేపు కూర్చుని ఉపదేశాలు చేయడం మొదలుపెట్టారు. సెల్ ఫోను చేతికి ఇవ్వటమే లేదు.

కొద్ది రోజుల తర్వాత శ్రీనివాసుకు కంటి ఆపరేషన్ అయింది.

మూడు నెలలు కంటికి రెస్ట్.

అది అయ్యాక శ్రీనివాస్ దినచర్యలో మార్పు వచ్చింది.

పొద్దునే యోగా చేయటం అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత మిద్దె తోట పెంపకం!.. సాయంత్రం పూట పదిమంది టెన్త్ క్లాస్ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ట్యూషనులు చెబుతున్నాడు. ఇంకా టైం మిగిలితే పుస్తకాలు చదువుతున్నాడు. ఇలా సాగుతోంది జీవితం.

భర్తలో వచ్చిన మార్పుకు సంతోషించింది పద్మజ.

సమాప్తం.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ