కీలెరిగినవాత - జి.ఆర్.భాస్కర బాబు

Keelerigina vaatha

రాఘవరావు, వనజ దంపతుల ఏకైక సంతానం శేఖర్.

శేఖర్ కి కొత్తగా పెళ్లయింది.కోడలు సుమిత్ర కాపురానికి వచ్చి నాలుగు నెలలయింది.రాఘవరావు ఇంకా కొద్ది నెలల్లో రిటైర్మెంట్ అవుతాడు.అతను పొద్దున్నే ఆఫీస్ కి వెళుతాడు, రాత్రి పొద్దు పోయాక కాని రాడు.శేఖర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్.అతను కూడా సామాన్యంగా ఆలస్యంగానే వస్తాడు.ఇంట్లో కొత్త కోడలు సుమిత్ర,వనజ ఇద్దరే మిగిలి పోతారు.సుమిత్ర కూడా ఐటిఇంజనీరింగ్ చేసినా ప్రస్తుతం ఖాళీగానే ఉంది.సుమిత్ర తల్లి తండ్రులు రాఘవరావు ఇంటికి ఓ పాతిక కిలోమీటర్ల దూరంలోనే వుంటారు.పెళ్ళిఅయి కొద్దినెలలే కావటంతో పని పాటల్లో ఇంకా యాక్టివ్ గా లేదు.వనజ వనజమ్మ అయి చాలా కాలం అయింది.ఆమెకూ వయసుతోపాటు అన్ని రకాల రోగాలూ వచ్చాయి.

కొద్ది కాలంపాటు వనజ కోడలికి అన్నీ అమర్చి పెట్టింది.సుమిత్ర చాలా చదివిందేకాని లోకజ్ఞానం కాస్త తక్కువనే చెప్పాలి.స్వతహా గానే సిగ్గరి కావటంతో కలివిడిగా ఉండటం కూడా తక్కువనే చెప్పాలి. కాలం గడిచే కొద్దీ వనజకు ఓపిక తగ్గి పోతూంది.కోడలు కొద్దిగా అయినా పని అందుకుంటే బాగుండును అనుకో సాగింది.కాని సుమిత్ర రోజంతా అదో లోకంలో ఉండేది.సెల్ ఫోన్ పట్టుకుని ఛాటింగ్ చేస్తుంటుంది.గంటకోసారి వాళ్ళ అమ్మ వీడియో కాల్ చేస్తూంటుది.శేఖర్ ఆఫీసు కు వెళ్లిన తర్వాత ఇక అదేపని.మరి గంటకోసారి కాల్ చేయాల్సిన అవసరం ఏంటో అర్థం అయేది కాదు.అడిగితే ఏదో కారణం చెప్పి మళ్ళీ ఆ ఫోన్లో మునిగి పోయేది.కొద్దిగా పని ఏదయినా చెపితే “ఆ అత్తయ్య గారూ” అనేది కాని కదిలి వచ్చేది కాదు.ఆమెతత్వమేంటోఅర్ధమేంటో అయింది కాదు

వనజకి.ఒక రోజు వర్షం వచ్చేలాఉంది” బైట దండెంమద బట్టలు ఉన్నాయి కాస్త లోపలవెయ్యమ్మా”చెప్పింది వనజ. షరా మామూలు గా “ఆ అత్తయ్య గారూ “ అన్నదే కాని బైటకు వెళ్ళలేదు.వర్షం రానూ వచ్చింది బట్టలు తడిసీ పోయాయి.”ఏంటమ్మా ఇది? కాస్త బట్టలు తీయొచ్చు కదా!”అంది.ఆ మాత్రానికే కళ్ళ వెంట నీళ్ళు కుక్కుకుంటూ అక్కడ నుండి వెళ్లి పోయింది.భోజనం కూడా చేయలేదు. రాత్రికి శేఖర్ వచ్చేసరికి ఇంట్లో వాతావరణం అతనికి తేడాగా అనిపించింది. మెల్లగా తల్లినికదిలించాడు.”ఏమోరా నాకు ఏం తెలుసు? మధ్యాహ్నం నుండి అలాగే ఉంది.నేనయితే ఆ పిల్లను అన్నది ఏమీలేదు”అంది. శేఖర్ సుమిత్ర ఉన్న గదిలోకి వెళ్ళాడు.”ఏమయింది మిత్రా అలా ఉన్నావు? ఒంట్లో బాగానే ఉందా?”అడిగాడు. “ఒంట్లో బాగానే ఉంది మైండ్ లోనే బాగాలేదు “అంది సుమిత్ర.”ఏం ఏమయింది మిత్రా “అనునయంగా అడిగాడు శేఖర్.”ఈ ఇంట్లో నేను ఉండను.”బాంబు పేలింది.”మీ అమ్మగారికి నేనంటే ఇష్టం లేదు.ఎప్పుడూ నాతో సరిగా మాట్లాడరు “కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. “నేను మాట్లాడతాలే మిత్రా…మనం చిన్నవాళ్లం…సర్దుకుపోవాలి “అన్నాడు శేఖర్.

తోక తొక్కిన తాచులా లేచింది సుమిత్ర “నాకు అంత ఖర్మ పట్టలేదు..మా ఇంట్లో నేను మహారాణి లా ఉంటాను.. ఇక్కడికి వచ్చి నానా చాకిరీ చేసే అవసరం నాకేం లేదు.నేను మా ఇంటికి పోతాను “ కోపం నషాళానికి ఎక్కింది శేఖర్ కి”అట్లా మాట్లడతావేంటీ? నేను మాట్లాడతానంటుంనంటున్నాను కదా.. కాస్త ఓపిగ్గా ఉండటం నేర్చుకో “అన్నాడు,”ఇంతకీ ఏం జరిగింది?” “నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను, వర్షం వచ్చింది, బట్టలన్నీ తడిసి పొయాయి, అంతమాత్రానికే కసురుకోవాలా?”వెక్కిళ్ళమధ్య చెప్పింది సుమిత్ర. “ఓస్ ఇంతేనా “అంటూ శేఖర్ “పిచ్చి పిల్లా,మా అమ్మ కసురుకోవటం కాదు, నీకలా అనిపించింది అంతే.మళ్ళీ బట్టలు ఆరటానికి టైము పడుతుంది కదా అందుకే అలా అందేమోలే “లైట్ తీస్కో అన్నట్లుగా! “ఏమోనండీ నాకలా అనిపించలేదు.. ఆవిడ గారికి అడుగులకుమడుగులొత్తలేదనే కోపం కాబోలు “ దీర్ఘాలు తీసింది సుమిత్ర. “సర్లే సర్లే ఆ విషయం రేపు నేను కనుక్కుంటానులే…ఇప్పటికీ ఈ విషయం ముగించు.” అన్నాడు శేఖర్. మరుసటి రోజు శెలవు కావటంతో తండ్రీ కొడుకులు ఇంటి దగ్గరే ఉండి పోయారు. కాని శేఖర్ సుమిత్ర దినచర్య ఓకంట కనిపెడుతూన్నాడు. సుమిత్ర ఫోన్ లో వాళ్ళ అమ్మ తో ఎంతసేపు మాట్లాడుతున్నదో గమనించసాగాడు.

ఒక గంటలోనే ఆవిడ ఒక సారి, సుమిత్ర అక్క ఒకసారి దగ్గర దగ్గర ఓ అరగంట పాటు మాట్లాడారు. టిఫిన్ దగ్గర మధ్యాహ్నం భోజనాలదగ్గర సుమిత్ర ప్రవర్తన గమనించాడు శేఖర్. ఏదో అంటీముట్టనట్లుంది ఆమె ప్రవర్తన.ఏదో మొక్కుబడి గా ఆ ఊ అంటూందేకాని మనసంతా మొబైల్ మీదనే ఉంది. “ఏంటి మిత్రా ఏంటి ఆ తినటం? అంతా కోడి కెలికినట్లు” కాస్త కోపంగానే అన్నాడు శేఖర్. “ఆకలిగా లేదు”నసిగింది సుమిత్ర కాలచక్రం మరో వారం పరుగెత్తింది. “అమ్మా.. రేపు శనివారం మా అత్తగారింటికి వెళుతున్నాం” అన్నాడు శేఖర్”మీరూ వస్తారా” “లేదురా రాజా వస్తానని ఫోన్ చేసింది,మేం రాలేము, మీరు వెళ్లిరండి” అంది వనజమ్మ”ఉంటారా అక్కడే ఆదివారం కూడా?” “ఏమోనమ్మా అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను “శేఖర్ “సరే జాగ్రత్తగా వెళ్ళి రండి”అంది వనజమ్మ. సుమిత్ర ముఖం మతాబులా వెలిగి పోవటం శేఖర్ దృష్టి దాటిపోలేదు.

శనివారం ఉదయాన్నే తయారయి కూర్చుంది సుమిత్ర. కూతుర్ని అల్లుడ్ని చూసి అవాక్కయ్యారు సుమిత్ర ఇంట్లో. “ఫోన్ కూడా చేయకుండా వచ్చారేమిటి అమ్మాయ్” ఆహ్వానించాడు అతని మామ గారు. “ఏదోలెండి మీకో సర్ప్రైజ్ ఇవ్వాలని నేనే వద్దన్నాను” అన్నాడు శేఖర్. అంతలోనే అతని సెల్ ఫోన్ రింగ్ అయింది. “ఆ.. అమ్మా…ఇప్పుడే వచ్చాం..ఆ.. అంతా బాగానే ఉన్నారు “అన్నాడు శేఖర్. మామ గారితో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నాడు శేఖర్. ప్రతి గంటకోసారి ఫోన్ రింగ్ అవుతూనేఉంది. శేఖర్ ఓపిగ్గా సమాధానాలు చెబుతూనేఉన్నాడు.

భోజనాల సమయం లో కూడా ఫోన్ వస్తూనే ఉంది. అతని మామగారు “అల్లుడు గారు మరోలా అనుకోకండి అన్ని సార్లు ఫోన్ చేస్తున్నారేమిటి?మా ఇంటికే గా వచ్చారు మీరు”అన్నాడు. “మరే మామయ్య గారూ, అదేమిటో తెలియదు కానీ మా అమ్మ ఈరోజు ఎందుకో చాలా సార్లు ఫోన్ చేసింది.విషయం ఏమీ లేదు.అయినా ఆవిడకు తెలీదా మామగారి ఇంట్లో అల్లుడు చాలా సేఫ్ అని.నేను చెప్తా లెండి ఇంకా ఫోన్ చేయొద్దు అని.”అన్నాడు శేఖర్. “ఛ ఛీ నా ఉద్దేశం అది కాదు ..”ఇంకేదో మాట్లాడబోతున్న మామగారిని వారిస్తూ”అయినా గంటకోసారి ఫోన్ చేసి మాట్లాడడానికి ఏం కబుర్లు కాకరకాయలు ఉంటాయి? పని చేసుకోవడానికి అడ్డం తప్ప.ఈ సెల్ ఫోన్ వచ్చి మన సంసారాలను అస్తవ్యస్తం చేసింది,ఊ అంటే ఆ అంటే నెంబర్ నొక్కటం హలో అనటం, ఆరోజు టిఫిన్లు తినేముందు ఓ సారి భోజనాలు అయ్యాక ఓ సారి ఇలా గంటకోసారి చెప్పుకోటానికి ఏం విషయాలు ఉంటాయి? చూశారా రెండు మూడు సార్లు ఫోన్ వస్తేనే మనకు ఏదోలా ఉంది.అయినా ఇవేవీ పట్టించుకోని వాళ్ళూ ఉంటారు కొంతమంది “ అన్నాడు శేఖర్ అత్తగారిని క్రీగంట చూస్తూ.ఆమె మొగం మారిపోవడం అతని దృష్టి దాటిపోలేదు.సుమిత్ర కూడా తెల్లమొహం వేసుకుని అతని వంకే చూస్తూంది.

భోజనాలయాక అత్తా మామలు సుమిత్ర ఓ గదిలో కూర్చుని డిస్కషన్ మొదలు పెట్టారు. లీలగా మామగారు వాళ్ళని గట్టిగా మందలించటం వినిపిస్తోంది.ముసి ముసిముసిగా నవ్వుకుంటూ పడుకున్నాడు శేఖర్. ఆదివారం పొద్దున్నే ఇంటికి బయలుదేరదీసింది సుమిత్ర. ఆశ్చర్యంగా చూడటం శేఖర్ వంతయింది. బయలుదేరుతూంటే మామగారు శేఖర్ చేయి తన చేతిలోకి తీసుకుని సున్నితంగా నొక్కాడు “విషయం అర్ధం అయింది అల్లుడా”అన్నట్లు. చిరునవ్వుతో బయలుదేరారు శేఖర్ సుమిత్ర దంపతులు. ఇంటికి వెళ్ళగానే వనజమ్మ దగ్గరకు వెళ్ళి కాళ్ళకు దణ్ణం పెట్టబోయింది సుమిత్ర.వెంటనే ఆమెను లేవదీసి గుండెలకు హత్తుకుంది వనజమ్మ. అది చూసి హుషారుగా బైటకు వచ్చిన శేఖర్ సెల్ తీసి ఫోన్ చేశాడు “హలో సుమన్, చాలా థాంక్స్ రా,మన ప్లాన్ బాగానే వర్కవుట్ అయ్యింది. అత్తా కోడళ్ళు కలిసి పోయారు “అంటూ అతనితో కబుర్లలోకి దిగాడు. శేఖర్ వాళ్ళ అమ్మ లాగా సుమన్ ఫోన్ చేశాడనే విషయం వారి మధ్యే ఉండిపోయింది. (గంటకోసారి కూతుళ్ళ సంసారాల్లోకి తొంగి చూసే తల్లులకు,అక్కచెల్లెళ్లకు,అత్తలో అమ్మను చూడలేని కోడళ్ళకు ఈ కధ అంకితం)

మరిన్ని కథలు

Dhruvuni vamshamu
ధృవుని వంశము.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Aachari mastari vupayam
ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ )
- కొత్తపల్లి ఉదయబాబు
Aadaleka maddela odu
ఆడలేక మద్దెల ఓడు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Garam chai
గరం చాయ్
- వేముల శ్రీమాన్
Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao