చిరునవ్వు వెల ఎంత?(బాలల కథ) - kottapalli udayababu

Chirunavvu vela entha



ఐదవ తరగతి చదువుతున్న పదేళ్ల ఆనంద్ కి అన్ని అనుమానాలే.దానికి కారణం వాళ్ల నాన్న ప్రభాకరం.

ఆనంద్ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ప్రభాకరం ఆదివారాలప్పుడు వాడికి ప్రతి పాఠాన్ని సాధ్యమైనన్ని ఉదాహరణలతో వివరించి చెప్తూ ఉండేవాడు.

ప్రతి దాన్ని ఎందుకు? ఏమిటి? ఎలా? అని ప్రశ్నిస్తూ నేర్చుకున్నప్పుడే చదువు బాగా వస్తుంది అని కూడా నేర్పాడు. అది చదువులో అయినా సరే, మరి ఏ విషయంలో అయినా సరే.

పాఠశాలలో మాస్టార్లు ఏ పాఠం అని చెప్పినా
వెంటనే తన స్థానంలో లేచి నిలబడి తల సందేహాన్ని నిర్భయంగా,ప్రశ్నగా అడిగేవాడు ఆనంద్.
ఓర్పు, సహనంతో పిల్లవాడికి అర్థం అయ్యేలా పాఠాలు చెప్పాలి అనే మనస్తత్వం ఉన్న మాస్టర్లు అతని సందేహాలు తీరేలా సమాధానాలు ఇచ్చేవారు.

ఒకరిద్దరు మాస్టర్లు మాత్రం " చాల్లే వెధవ సందేహాలు నువ్వును. పాఠం అంతా పూర్తయ్యాక సందేహం అడుగు. ఒకవేళ గంట కొట్టేస్తే ఇంటర్వెల్లో వచ్చి అడుగు. అంతేగాని పాఠం చెప్తుంటే మధ్యలో అడ్డు రాకు." అనేవారు.

అలా అన్నారు కదా అని ఇంటర్వెల్లో ఉపాధ్యాయుల విశ్రాంతి గదికి వెళ్లి సందేహం అడగబోతుంటే.... " ఈ పది నిమిషాలు విశ్రాంతి సమయంలోను ఇక్కడ కూడా నీ గోలేమిటయ్యా? ఈ పది నిమిషాలు కూడా మమ్మల్ని విశ్రాంతిగా కూర్చునివ్వరా? పిల్లలకి ఏమైనా సందేహాలు ఉంటే తరగతి గదిలోనే వదిలించుకుని వచ్చేయాలి. అంతేగాని ఇలా ఇంటర్వెల్లో మాకు విశ్రాంతి లేకుండా చేయకండి " అని సహో ఉపాధ్యాయులు విసుక్కోవడంతో ఇంటర్వెల్లో చెప్తానన్న ఆ టీచర్లు. " రేపు క్లాస్ కి వచ్చినప్పుడు చెప్తాలే " అని చెప్పేవారు.

ఆ సాయంత్రం ఆ సందేహం తన తండ్రిని అడిగి తీర్చుకుంటేనే కానీ మర్నాటి పాఠం అర్థమయ్యేది కాదు ఆనంద్ కి.

రోజు పాఠశాలకు వెళ్లాక ఏ మిత్రుడు కనిపించినా "శుభోదయం రా" అని పలకరించేవాడు. అది కూడా ఈ మధ్యనే తండ్రి నేర్పాడు.

"రోజు చూసేవాళ్ళమే కదా నాన్న. శుభోదయం ఎందుకు చెప్పడం?" వెంటనే అడిగాడు తండ్రిని.

" ప్రతిరోజు పొద్దున లేచినప్పటినుంచి సాయంత్రం వరకు మన సంతోషంగా ఉంటే బాగుంటుందా... బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటే బాగుంటుందా? "

" సంతోషంగా ఉంటే బాగుంటుంది నాన్న!"

"కదా! అంటే మనం అందరం సంతోషంగా ఉండాలి. మనతోపాటు అందరూ సంతోషంగా ఉండాలి. దాన్నే సర్వేజనా సుఖినోభవంతు అంటారు. ఇప్పుడు అర్థమైందా శుభోదయం ఎందుకు చెబుతామో! ప్రతి ఉదయం మనకు తెలిసిన వాళ్ళందరికీ శుభోదయం చెప్పాము అంటేరోజంతా వాళ్ళకి అంతా శుభంగా జరగాలని.! అదేవిధంగా ఇంటికి వెళ్లేటప్పుడు
ఇంటికి వెళ్ళాక వాళ్ళందరూ తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి హాయిగా గడపాలని. 'ఏరా' అని పిలుచుకుంటే అది స్నేహం అయిపోదు. స్నేహితుల మధ్య పరస్పర గౌరవం పెంచుకోవాలంటే బడికి వెళ్ళగానే 'శుభోదయం'అని , సాయంత్రం ఇంటికి వచ్చేస్తుంటే, 'శుభసాయంత్రం' అని చెప్పుకోవడం మంచిది. అపుడు స్నేహితుల మధ్య పరస్పరం కోపతాపాలు రావడానికి అవకాశం ఉండదు. స్నేహంలో గౌరవంతో పాటు ఆత్మీయత కూడా పెరుగుతుంది. "అన్నాడు తండ్రి.

తండ్రి చెప్పినట్లుగా ఈ కొత్త అలవాటు ఆనంద్ అతని స్నేహితులకి మధ్య గౌరవంతో కూడిన మంచి స్నేహం పెరిగేలా చేసింది.

అయితే స్నేహితుల్లో కొంతమంది శుభోదయం అని తిరిగి బదులు ఇచ్చేవారు.
మరికొందరు చనువుగా " మనం స్నేహితులంరా. పరాయివాళ్ళలా శుభోదయం శుభసాయంత్రం చెప్పుకోవడం ఏమిటి? అలా చెప్పాలంటే ఏదో గిల్టీ ఉంది రా" అని మొహం మీదే చెప్పేశారు.

" నా ఫ్రెండ్స్ కొందరు అలా అన్నారేంటి నాన్న? " అని తండ్రిని వెంటనే సందేహం అడిగేసాడు ఆనంద్.

" అలవాటు మంచిది అయినప్పుడు దాన్ని మానుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఎవరిష్టం వాళ్ళది. నువ్వు మాత్రం నీ అలవాటు మానుకోకు. దాని ఫలితాలు ఎంత బాగుంటాయో పెద్దయ్యాక నీకే తెలుస్తుంది" అన్నాడు తండ్రి.

తండ్రి చెప్పిన సలహాను పాటించాడు ఆనంద్.
కేవలం తన మిత్రులనే కాదు. చాలామందిని మరిశీలించసాగాడు. ఇంటిదగ్గర బయలుదేరిన క్షణం నుంచి తిరిగి పాఠశాలనుంచి వచ్చేంతవరకు కొందరు పరిచయస్తులు కేవలం ఒకరినొకరు చిరునవ్వులతో పలకరించుకునేవారు. కొంతమంది చెప్పినవాడిని వెర్రివాడిలా చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. కొంతమంది పలకరించినా కనీసం చూడనైనా చూసేవారు కాదు. వీరందరి ప్రవర్తన గురించి తండ్రికి చెబితే .......

వారిలో మొదటిరకం వారిది స్నేహాపూర్వక మనస్తత్వమనీ, రెండవరకం వారిలో నవ్వుకుంటూ వెళ్ళిపోయినవారికి అహం ఎక్కువ అని, మూడో రకం వారికి డబ్బు గర్వం అని... వాళ్లు ఎటువంటి వాళ్ళు అయినా మన శుభోదయం అలవాటు మానుకోవద్దు అని చెప్పాడు తండ్రి.

అలాంటి ఆనంద్ కి మధ్య కొత్తగా సందేహం మొదలైంది. కొంతమంది స్నేహితులకు తను శుభోదయం చెప్పినా తిరిగి శుభోదయం చెప్పకుండా బదులుగా చిరునవ్వు నవ్వేసి భుజం తట్టి వెళ్లిపోవడం గమనించాడు.

ఆ సందేహమే తండ్రిని అడిగాడు.

" నాన్న. నేను స్కూల్లోనూ, పార్క్ కి వెళ్ళినప్పుడు, బజార్ కి వెళ్ళినప్పుడు చాలా మందిని గమనించాను. ఒకరికి ఒకరు తెలిసిన వాళ్ళు అయినా సరే చిరునవ్వు నవ్వుకుని ఏమి మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నారు. మాట్లాడాల్సిన పని లేనప్పుడు చూసి కూడా తల తిప్పుకుని వెళ్లిపోవచ్చు
కదా. "

" నీ ప్రశ్నకి నువ్వు స్కూల్ కి నుంచి వచ్చాక రేపు సమాధానం చెబుతాను. ఇవాల్టికి సందేహాలు చాలు.చదువుకో." అన్నాడు ప్రభాకరం.

మరుసటి రోజు సాయంత్రం ఆనంద్ ఇంటికి వచ్చేసరికి రోజూ ఎదురు వచ్చి నవ్వుతూ పలకరించే అమ్మ తనని చూసి కూడా సోఫాలో మౌనంగా తలతిప్పుకుని అటు తిరిగి కూర్చుంది. పక్కనే కూర్చున్న అక్క గాయత్రి కూడా అంతే.
పక్కన టేబుల్ ముందు కూర్చుని చదువుకుంటున్న అన్నయ్య తనకేసి సీరియస్ గా చూసి గదిలోకి వెళ్ళిపోయాడు.

ఆనంద్ కి భయం వేసింది. పుస్తకాల బాగ్ ని దాని స్థానంలో ఉంచి గబగబా తల్లి పక్కకు వచ్చి కూర్చుని " ఏమైందమ్మా " అని అడిగాడు కంగారుగా.

ఆవిడ మాట్లాడలేదు. లేచి అక్క పక్కకి వచ్చి కూర్చుని అదే ప్రశ్న అడిగాడు.
గాయత్రి కూడా మాట్లాడలేదు.

ఆనంద్ నిజంగా కంగారు పడిపోయాడు.
" అమ్మ నువ్వేనా మాట్లాడమ్మా ఏమైంది ఏం జరిగింది? " దాదాపు కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా అడిగాడు ఆనంద్.

అప్పుడే తన ఎదురు నుంచి బయటికి వచ్చిన ప్రభాకరం ఆనంద్ పక్కన వచ్చి కూర్చుంటూ అన్నాడు
" రోజు నువ్వు ఇంటికి వచ్చేసరికి చిరునవ్వుతో పలకరించే ఇంట్లో వాళ్ళందరూ
అలా ముభావంగా ఉంటేనే నువ్వు తట్టుకోలేకపోయావు కదా! అదేరా చిరునవ్వు ఖరీదు. చిరునవ్వు ఎప్పుడు 'నేను బాగున్నాను.. నువ్వు బాగున్నావా?' అని నోరు విప్పకుండానే అవతల వాళ్ళ క్షేమాన్ని మనకి మన క్షేమాన్ని వాళ్ళకి తెలియజేసే అత్యద్భుత సాధనం. దాని విలువ నీకు చెప్పాలనే అమ్మ, అక్కయ్య పావుగంట నుంచి బలవంతంగా వస్తున్న నవ్వుని ఆపుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఎవరికీ ఏమీ కాలేదు. నిన్న నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఈరోజు నీకు అర్థం అయ్యేలా చెప్పాలని
ఈ నాటకమాడాం!' అన్నాడు ప్రభాకరం.

పకపకా నవ్వుతూ తల్లి, అక్క గాయత్రి కూడా వచ్చే తన పక్కన కూర్చోడంతో చిరునవ్వు వెల ఎంతో అర్థమైనట్టుగా ముగ్గురు వైపు తేలికపడ్డ మనసుతో చిరునవ్వు నవ్వుతూ చూస్తుండిపోయాడు ఆనంద్.

సమాప్తం

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు