రంగులరాట్నం (వెంకాయమ్మ హోటల్) - జి.ఆర్.భాస్కర బాబు

Rangularaatnam(venkayamma hotel)

చిన్నప్పుడు మా ఊళ్ళో వెంకాయమ్మ హోటల్ ఉండేది.

హోటల్ అన్నమాటేగాని నిజానికి అది ఒక ఇల్లు.పెద్ద హాలు లాగా ఒక రూము,దానికి ఎడమ వైపు ఒక రూము ,వెనుక వైపు ఒక వాలు వసార, ముందు వైపు వాకిలికి అటుఇటు అరుగులు.ఇదీ స్థూలంగా ఆ హోటల్ స్వరూపం.ఎడమ వైపు గదిని వంటిల్లుగా మార్చారు.అక్కడే వెంకాయమ్మ భర్త రాఘవులు తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చూపే వాడు.అక్కడ పొద్దున దొరికే ఇడ్లీ, దోశ, చట్నీల గురించి , సాయంత్రం దొరికే పునుగులు, ఉల్లిపాయ గారెల గురించి మా వూళ్ళో అందరూ కధలు కధలుగా చెప్పుకునేవారు.

అక్కడ ఒక్క సారి అయినా తినక పోతే ఈ జీవితం వృధా అన్న రేంజ్ లో చెప్పే వాళ్ళు.ఒక్క ప్లేటు ఇడ్లీ సంపాదించాలంటే కనీసం ఒక పావు గంట పట్టేది.అక్కడ కాఫీ టీ లు దొరికేవి కావు.అవి తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పేది వెంకాయమ్మ.మాది కాస్త శిష్టాచార కుటుంబమేమో అక్కడ దొరికే ఇడ్లీ, దోశ,చట్నీ,పునుగులు, ఉల్లి గారెలు తినాలని మహా కోరికగా ఉన్నా కుదిరేది కాదు.మా నాయినమ్మ నిప్పులు కడిగే కుటుంబం నుండి వచ్చింది. మా తాతగారు మాత్రం వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన వారు.ఆయనకు పెద్దగా పట్టింపులు లేవు.అదులోనూ ఆయన తిరుపతి, గుంటూరు వగైరాల్లో ఉండి వచ్చారేమో మరీ అంతగా పట్టింపులు లేవు.ఈ కారణంతో మా కోసం అప్పుడప్పుడు టిఫిన్లు ఇంటికి వచ్చేవి (దొంగ చాటుగా).

ఒక సారి నేనే ఇడ్లి తేవటానికి వెళ్ళాను.నన్ను చూడగానే నాలుగు ప్లేటు ఇడ్లీ పార్సిల్ అనిచెప్పి చాలా తొందరగానే పొట్లం చేతిలో పెట్టింది.”డబ్బులు తాతగారి దగ్గర తీసుకుంటాలే, నువ్వు పోయిరా “ అంది. కాలం చెక చెకా గడిచిపోయింది.శంకరాభరణం సినిమా లో “బ్రొచేవారెవరా” కీర్తన లా ఊరికి తార్రోడ్డు పోయి సిమెంట్ రోడ్డు వచ్చింది.పెంకుటిళ్ళు, పూరిపాకలు , డాబా ఇళ్లయిపోయాయి.

మా కుటుంబం లో మాత్రం అందరం వేరే వేరే ఊళ్ళలో స్థిరపడ్డాం.మా ఇంటికి మేమే చుట్టాలు అయిపోయాం. కొంత కాలం తరువాత ఊరికి వెళ్ళినప్పుడు వెంకాయమ్మ హోటల్ కనపడలేదు. ఆ ఇంట్లో “బార్ & రెస్టారెంట్”వెలిసింది.మనసు ఒక్క సారిగా చివుక్కుమంది. ముందరున్న అరుగులు తీసేసి ఇనుప కటకటాల కౌంటర్ చేశారు.వెనకాల ఉన్న వాలు వసార లో టేబుల్స్ ఏర్పాటు చేశారట.బేరాలు బహు భేషుగ్గా ఉన్నాయట. వెంకాయమ్మ తన పిల్లల దగ్గరకు వెళ్ళిపోయిందని, రాఘవులు కాలం చేశాడని తెలిసింది. రంగులరాట్నం సినిమా లో “ఇంతేరా ఈ జీవితం..తిరిగే రంగులరాట్నం”గుర్తు వచ్చింది.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు