చావు పగ - వేముల శ్రీమాన్

Chavu paga

ప్రేమ ,పగ ,కులం ,వంశం ,కక్షలు ,కార్పణ్యాలు కాన్సెప్టులుగా సినిమాలు ,సీరియల్స్ చూస్తూనే వున్నా ,ఎందుకో నాకు ఒక ఏహ్య భావం ,పెద్దగా వాటిపై ఆసక్తి లేదు ,ఎక్కువగా ఆలోచించనూ లేదు.కానీ ఒక్క సంఘటన -నా మిత్రుడు ప్రేమ్ సాగర్ మరణం ,నన్ను ఆ కాన్సెప్ట్ మూలాల్లోకి తీసుకెళ్లేలా చేసింది.మరపురాని అనుభవాలని మిగిల్చింది.

మా ఊరి కారణం గారి అబ్బాయి ప్రేమ్ సాగర్ రావు .వాడు పుట్టింది మా వూర్లో అయినా ,పెరిగింది పట్నంలోనే .వూర్లో వారికీ తెగిపడిన నక్షత్రంలా ఏ దసరా సెలవులలో కనిపించేవాడు.ఎవరితోనో అంతగా చనువుగా ఉండేవాడు కాదు .కానీ నాకు మాత్రం మంచి మిత్రుడు.అభిప్రాయాలూ,అభిరుచులు ,కులం ,హోదా అన్ని వేరైనా ,స్నేహం పునాదిగా మా బంధం దృఢపడింది .

వాళ్ళ నాన్న గారు కరణం,దానికి తగిన అధికార దర్పం ,హోదా .వాళ్ళింటికి వెళ్లాలంటే చాలా భయం వేసేది.వాడు మాత్రం ఇలాంటి వాటికీ దూరంగానే ఉండటానికి ఇష్టపడేవాడు.మాట ,మంతిలో కులాల ప్రస్తావన వస్తే వాడికి అంతగా నచ్చేది కాదు.చదువుల్లో ముందున్న చివరికి వ్యాపార రంగంలోనే నిలదొక్కుకుని పట్నంలో స్థిరపడ్డాడు.

నేను ఊర్లో ,వాడు పట్నంలో వున్నా మామధ్య ఉన్న సాన్నిహిత్యం మూలాన ,అడపా దడపా నాకు ఫోన్ చేస్తుండేవాడు.వాడికి ఉన్న"వూర్లో పనులు నేను ,నాకున్న పట్నం పనులు వాడు " చేసిపెట్టుకొనేవాళ్ళం.వాడితో స్నేహం మా అమ్మకి ససేమిరా ఇష్టం లేదు.అయినా మా స్నేహబంధం అలాగే కొనసాగించాము.

అనుకోకుండా నేను ఊహించని ఒక దుర్వార్త నా చెవిలో పడింది.పెద్ద ఆక్సిడెంట్ జరిగి ప్రేమ్ సాగర్ రావు పట్నంలోని హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని దాని సారాంశం.ఉన్న ఫలంగా నేను ప్రయాణానికి సిద్ధపడుతుండగా అమ్మ అడిగింది ఎక్కడికని.జరిగిన విషయాలు వివరించి ప్రేమ్ సాగర్ రావుని చూడడానికి పట్నం వెళ్తున్నానని చేప్పాను.ఎన్నడూ చూడని విధంగా ,వింతగా ,విచిత్రంగా అమ్మ ప్రవర్తన .అమ్మ నన్ను పట్నం వెళ్లకుండా అడ్డు పడడం చిరాకుగ అనిపించింది .జీవితంలో మొదటిసారిగా అమ్మపై గట్టిగ అరిచాను.,గొడవపడ్డాను.అమ్మ కళ్ళలో నీళ్లు ,ఒక్క సరిగా నా చేయి పట్టుకొని లోపలి గదిలోకి తీసుకెళ్లింది.

ఒక నిట్టూర్పు ,అమ్మ చెప్పడం ప్రారంభించింది ...

కరణాలగురించి నీకు తెలియదురా.నమ్మించి తలకోయడం ,తిమ్మిని బమ్మి చేయడం వారికి వెన్నెతో పెట్టిన విద్య.పోలీసులాగ వాళ్ళు లాఠీ దెబ్బలు కొట్టరు, తరతరాలకు నష్టం కలిగించేలా కడుపు మీద కొడతారు.వీరి గురించి నీకు అంతగా తెలియదురా .వీళ్ళు చచ్చి కూడా సాధిస్తారు.మీ ప్రేమ్ సాగర్ రావు తాతగారు ఊరి కరణం .ఆయనకు ,ఊర్లోని మాలి పటేలుకు బద్ద వైరం ఉండేది .ముఖం చూపులు కూడా ఉండేవి కావు.కరణం చావు బ్రతుకుల్లో వుండి, మాలి పటేలు వద్దకు సుంకరిని పంపించి చివరి ఘడియల్లో నన్ను ఒక్కసారి పలకరించడానికి రమ్మని కబురు పెట్టాడు.చచ్చేటప్పుడు పగ ఎందుకని మాలి పటేల్ వచ్చి కారణాన్ని పరమార్శించాడు. కన్నీళ్లతో కరణం "పాత పగలు మరిచిపోయి ,నా చివరి కోరిక తీరచమని" పటేలును కోరాడు.పటేలు కూడా కళ్ళలో నీళ్లు నింపుకొని"అదేంతమాట చెప్పు" అన్నాడు.నాకు నిద్దర్లో రెండు రోజులుగా అల్లా దర్శనమిస్తున్నాడు.నా మరణాంతరం నన్ను తురకల ఘోరీలలో కాల బెట్టమని అప్పుడే నా ఆత్మ శాంతిస్తుందని చెప్పి మాలి పటేల్ నుండి మాట తీసుకొని మరణించాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి పటేల్ కరణం కోరిక తీర్చాడు. తురకల ఘోరీలలో హిందూ శవ దహనం జరిగినందుకు మాలి పటేల్ను తురకలు చావతన్నారు. ఇది మీ స్నేహితుడి తాతగారి చావుపగ. నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, ఇది మీ స్నేహితుడి నాన్నగారి గురించి, ఆయన తండ్రిని మించిన తనయుడు," మంచి తనంలో కాదు చెడ్డతనంలో " అమ్మ కసితో చెపుతూ పోతుంది. ప్రేమ్ సాగర్ గారి నాన్నగారు రెండు ఊర్లకి కరణంగా పని చేసారు. నలుగురు కాపులతో ఆయనకి బద్ధ వైరం ఉండేది, చావు బతుకుల్లో వున్నా కరణం ఆ నలుగురిని ఇంటికి పిలిపించాడు. " నాకు మరణం ఆసన్నమైంది, మీ భూముల లెక్కలు అన్ని సరిగ్గానే వ్రాసాను. నాపై ఎలాంటి కోపం పెట్టుకోకండి." దాంతో వారికీ అతని పై ఉన్నవైరం పటాపంచలైంది, నాదొక చిన్న కోరిక "నా అంత్యక్రియలు నేను ఎక్కువ కలం కరణీకం చేసిన లింగాపూర్ గ్రామంలో జరిపించండి నా మనసంతా ఆ వూరి పైనే " అని విన్నవించుకున్నాడు కరణం .ఇదెంత పని అని కాపులు ఒప్పుకున్నారు. కరణం మరణించాడు, ఇచ్చిన మాట ప్రకారం కరణాన్ని లింగాపూర్ గ్రామంలో దహనం చేసారు. "కరణాన్ని స్వగ్రామంలో కాకుండా నలుగురు కాపులు మా వూర్లో ,ఎందుకు దహనం కావించినట్లు" అని లింగాపూర్ గ్రామస్తులు అనుమానంలో పడిపోయారు, పోలీసులకు సైతం ఫిర్యాదు చేసారు, పోలీసులు కాపులపై హత్యా కేసు నమోదు చేసారు." ఇది వాళ్ళ నాన్నగారి కథ. "కరణం పగ కాట్ల పోయిన తప్పదు ". నేను చెప్పిన ఈ విషయాలు కాకమ్మ కథలు కాదు స్వయంగా నేనెరిగిన విషయాలు , అందుకే ప్రేమ్ సాగరతో నీ స్నేహం నాకెప్పుడూ ఇష్టం లేదు. వాళ్ళు పుట్టుకతోనే పగతో పుట్టి చనిపోయే వరకు పగ సాధిస్తూనే వుంటారు. అందుకే నువ్వు ఇప్పుడు ఉన్న ఫలంగా ఆగమేఘాలపైన పట్నం వెళ్లి ఒరగపెట్టాల్సింది ఏమిలేదు." జోరువాన కురిసి ఆగినట్లు అమ్మ తన ప్రసంగం ముగించింది.

అమ్మను ఒప్పించలేక,నొప్పించలేక, మాట కాదనలేక,మనసు చంపుకొని నా పట్నం ప్రయాణాన్ని వాయిదా వేసాను. మరునాడు "ప్రేమ్ సాగర్ రావు మరణ వార్త నా మనసుని కలిచి వేసింది". నేను చేసింది చాలా తప్పు, నిన్ననే పట్నం వెళ్ళాల్సింది, కనీసం వాడి చివరి చూపైనా దక్కేది. అపరాధ భావంతో కొద్ది రోజులు తీవ్రమైన మానసిక క్షోభని అనుభవించాను, అమ్మపై కోపం మరింత పెరిగింది. కులం,అధికారం,తరాల అంతరాలు మనుషులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలిసివచ్చింది.

కానీ మరణిస్తూ ప్రేమ్ సాగర్ తీసుకున్న నిర్ణయం మాత్రం నా జీవితాంతం నేను మర్చిపోలేని, మరపురాని అనుభవాలను నాలో నింపింది.

మరణానికి ముందు ప్రేమ్ సాగర్ వాడి యావదాస్తిని మా వూరు, అంటే వాడు పుట్టిన వూరి సంక్షేమం కొరకు వెచ్చించాల్సిందిగా వీలునామా వ్రాసి చనిపోయాడని వేరొక మిత్రుని ద్వారా తెలిసింది. "మాకు ఊర్లో ఎలాంటి ఆస్తులు ఉండకూడదు, మా కులం, హోదా, అధికారం కించిత్ కూడా కనిపించకూడదు, ఈ పని నా కీర్తి కాంక్ష కోసం చేయడం లేదు, నా మనసులోని నాకు నచ్చని భావాలని తుడిచివేసేందుకు చేస్తున్నాను, బ్రతికినంత కాలం మీలో ఒకడిగా ఉండలేక పోయాను, కనీసం నా మరణానంతరమైన మీలో ఒకడిగా నన్ను గుర్తించండి, నాకు ఇక ఏ కులము, హోదా, అధికారం వద్దు". ఇది ప్రేమ్ సాగర్ వీలునామా సారాంశం. ప్రేమ్ సాగర్ తాత, తండ్రులు పగకి, ప్రతీకారాన్ని ప్రతినిధులు ఏమో కానీ నా మిత్రుడు మాత్రం ప్రేమకి, మమకారానికి నిలువెత్తు నిదర్శనం. కన్నఊరిపై ఎంత మమకారం ఉంటే తప్ప తన కుటుంబ సంక్షేమాన్ని ఆలోచించకుండా తన యావదాస్తిని తన ఊరికి ధారపోయగలడు, నిజంగా పేరుకు తగ్గట్టు నా మిత్రుడు "ప్రేమ సాగరుడే .

మంచి, చెడు మనిషిని బట్టే, కులం,వంశం,అధికారం,హోదా ప్రభావం చూపగలవేమో కానీ ఆలోచించగల మంచి మనుషులని, మనసులని మార్చలేవు. నా మనసులో ఉన్న చెడు భావనలను పూర్తిగా చెరిపేసుకున్నాను. "ప్రేమే ధ్యేయం, ప్రేమే లక్ష్యం ".

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ