అడవివరం దగ్గరి వనంలో ఆయుర్వేద వైద్యుడు వానర
తిమ్మరాజు వైద్యాలయం వివిధ రోగాలతో అనేక జంతు,
పక్షి సముదాయం వరుసలు కట్టి డాక్టరు గారి పిలుపు
కోసం ఎదురుచూస్తున్నాయి.
అడవిలోని జంతువుల అబ్యర్దనను మన్నించి తిమ్మరాజు
అడవివరం వెళ్లి జంతువుల డాక్టరు వద్ద వైద్య విద్య అబ్యసించి
పర్ణ కుటీరశాలలో వైద్యాలయం మొదలెట్టాడు. వెనుక సాయంగా
మరొక పిల్ల కోతిని పెట్టుకున్నాడు.
అడవిలో దొరికే మూలికలు, వేర్లు , ఆకు పసర్లు ,తైలాలతో వైద్యం
చేస్తుంటాడు. ఎవరి వద్ద ఎటువంటి రుసుము ఆశించకుండా ఉచిత
వైద్యం చేస్తు మంచిపేరు సంపాదించాడు డాక్టరు తిమ్మరాజు.
ఈ మద్య వర్షాలు , వాతావరణ మార్పులతో అడవిలోని
ప్రాణులన్నీ అనేక ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్నాయి.
జ్వరం, జలుబు, దగ్గు , అజీర్తి ఇలా ఏదో ఒకటి పీడిస్తుండటంతో
జంతువుల డాక్టరు తిమ్మరాజుకు వత్తిడి ఎక్కువైంది. డాక్టరు
హస్తవాసి మంచిదని నమ్మి దూరం నుంచి జంతువులు, పక్షులు
ఓపికగా డాక్టరు పిలుపు కోసం ఎదురు చూస్తుంటాయి.
అలా ఓపికగా ఎదురు చూస్తున్న తల్లి కుందేలు, పిల్ల కుందేలు
వంతు వచ్చింది.
డాక్టరు తిమ్మరాజు తల్లీ , పిల్లను దగ్గరగా కూర్చోబెట్టి
" ఏమిటి బాధ?" అని తల్లి కుందేలును అడిగాడు.
"డాక్టరు గారూ, పిల్లది వారం రోజుల నుంచి తిండి తినడం
లేదు. రోజంతా నీర్సంగా కడుపు ఉబ్బరంతో బాధ పడుతోంది.
నేను అదే తగ్గిపోతుందని పసిరిక గడ్డి పరకలు నమిలించాను.
ఐనా అది తిండి ఎందుకు తినడం లేదో తెలవక మీ దగ్గరకు
తీసుకు వచ్చాను." అని పిల్ల కుందేలుకు వచ్చిన బాధ చెప్పింది.
డాక్టరు తిమ్మరాజు పిల్ల కుందేలును దగ్గరకు పిలిచి కళ్లూ,
పళ్లూ, చెవులు పరీక్ష చేసి చేత్తో దాని పొట్టను నొక్కింది.
కడుపు గట్టిగా అనిపించింది. ఏదో అనుమానం కలిగింది.
తల్లి కుందేలు ద్వారా వారం దినాల నుంచి సమస్య ఉందని
తెలుసుకున్న డాక్టరు తిమ్మరాజు పిల్ల కుందేలును వివరాలు
అడిగాడు.
వన విహారానికని కొందరు విద్యార్థులు అడవలోకి
వచ్చారని, వారు అనేక తినుబండారాలు తింటు ఎక్కడ
పడితే అక్కడ విసిరేసారని, అప్పుడు నేను ఆడుకుంటూ
కింద పడ్డ తియ్యటి పళ్లను తిన్నానని జరిగిన సంగతి
చెప్పింది.
డాక్టరు తిమ్మరాజుకు విషయం అర్థమైంది. పిల్ల కుందేలు
తిన్నవి చాకొలెట్లని, వాటిని పైన తొడుగులు తియ్యకుండా
తిన్నందున కడుపులోకి వెళ్లి జీర్ణం అవక కడుపు ఉబ్బరంతో
బాధపడుతు ఆకలి మందగించిందని , అసలు సంగతి తల్లి
కుందేలుకు చెబుతు "ఈమద్య మనుషులు 'ప్లాస్టిక్ ' అనే విష
పదార్థాలు తిను బండారాలతో పాటు పడవెయ్యడం వల్ల
వాటిని తిన్న జంతువులు, పక్షులు అనేక రోగాలతో మృత్యువాత
పడుతున్నాయని" వివరింంచి , ఒక చూర్ణం ఇచ్చి దాన్ని కేరెట్
తురుముతో తినిపించమని చెప్పాడు.
డాక్టరు తిమ్మరాజు ఇచ్చిన చూర్ణం కేరెట్ తురుముతో
తినిపించిన కొద్ది సమయం తర్వాత పిల్ల కుందేలుకు విరోచనాలు
జరిగి కడుపులో కల్మషం బయటకు వచ్చి సమస్య తీరి బాగా
ఆకలి వేసింది. తల్లి కుందేలు మనసు తేలిక పడింది.
సమాప్తం