పనిమనిషి - మద్దూరి నరసింహమూర్తి

Panimanishi

"హలో, ఎనీ వన్ ఇన్ ది హౌస్, కోయి హాయ్ క్యా ఘర్ మే" అన్న కేక విని –

పూజ చేసుకునేందుకు వెళ్ళబోతూన్న కేశవ్ ఇవతలకు వచ్చి చూస్తే ఎదురుగా –

ఖరీదైన చీర మాచింగ్ బ్లౌజ్ ధరించి చక్కగా ముస్తాబై తలలో మల్లెలమాలతో ద్వారం దగ్గర నిలబడిన సుమారు ముఫై ఏళ్ల పడుచు కనబడే సరికి –

"ప్లీజ్ కం, ఐ షల్ కాల్ ప్రియా. జస్ట్ వన్ మినిట్, ప్లీజ్ సిట్ డౌన్ హియర్" అంటూ అక్కడ ఉన్న సోఫా ప్రక్కన ఉన్న కుర్చీ చూపిం చి "బి కంఫర్టబుల్" అని చెప్పి లోపలకు వెళ్ళేడు.

దాంతో, ఆమె ఆ కుర్చీలో కాలు మీద కాలు వే సుకొని కూర్చుంది.

కేశవ్ వంటింట్లోకి వెళ్లి "ప్రియా, ఎవరో హైక్లాస్ లేడీలా కనిపిస్తున్న ఒకామె కొత్తగా వచ్చిన మనల్ని పరిచయం చేసుకోవాలని వచ్చినట్టు ఉన్నారు. వెళ్లి మాట్లాడి రా, తరువాత ఈ పనులు చేసుకోవొచ్చులే" అని చెప్పేసరికి, గ్యాస్ స్టవ్ ఆపి వచ్చింది ప్రియా.

"ఎస్, ఐ యామ్ ప్రియా కేశవ్, యువర్ సెల్ఫ్"

"ఐ యామ్ కస్తూరి. అర్ యు తెలుగు పీపుల్"

"ఎస్. యువర్ సెల్ఫ్"

"నేనూ తెలుగే. మీకు పనిమనిషి అవసరం ఉంటుందేమో కనుక్కుందామని వచ్చేను"

"చాలా థాంక్స్ అండీ. పనిమనిషి గురించి నేనే ఎవరిని అడగాలా అని ఆలోచిస్తూ, సామాన్లు సర్దుకోవడమైన తరువాత కనుక్కోవచ్చులే అని అనుకున్నాను. ఇంతలో మీరే దేవుడిలా నాకు సహాయం చేయడానికి వచ్చేరు. కస్తూరిగారూ మీరు చాలా మంచివారులా ఉన్నారు"

“మీకు పనిమనిషి ఏ టైంలో కావాలి"

"ఉదయం ఏడో గంటకు వచ్చి చేసే పనిమనిషి దొరుకుతే చాలా బాగుంటుంది. లేకపోతే సరిపెట్టుకుంటాను"

"అబ్బే, మీరు అసలు సరిపెట్టుకోవాల్సిన అవసరం లేదు"

"ఏడో గంటకు వచ్చి చేసే పనిమనిషి దొరుకుతుందా, ఆ పనిమనిషిని నాకు ఎప్పుడు పరిచయం చేస్తారు"

"మీ ఎదురుగానే ఉంటే ఇంకా వేరుగా పరిచయం చేయడమేమిటి"

"అంటే మీరు...నువ్వు పనిమనిషివా" ఆశ్చర్యంగా అంది ప్రియా. "ఖరీదైన చీర కట్టుకొని ఇంత చక్కగా ముస్తాబై ఉన్న నువ్వు పనిమనిషివా, నమ్మలేకపోతున్నాను. అసలు నువ్వు పనిమిషిగా పని చేయవలసిన అవసరమేమిటి, ఇంకేదైనా గౌరవప్రదమైన పని చేసుకోవచ్చు కదా"

ఇంతలో ‘మహామంత్రి తిమ్మరుసు సినిమాలోని అజరామరమైన ' మోహన రాగమహా ' అన్న పాట రింగ్ టోన్ తో కస్తూరి మొబైల్ మ్రోగింది.

"ఎక్యూజ్ మీ. మా అమ్మాయి ఫోన్ చేస్తోంది" అని ప్రియాకి చెప్పిన కస్తూరి –

"వాట్ డియర్, ఎనీ ప్రాబ్లెమ్"

"..............................................."

"డోంట్ వర్రీ. సిట్ డౌన్ దేర్ ఓన్లీ అండ్ డోంట్ గో ఎనీ వేర్. ఐ షల్ సెండ్ యువర్ పాపా టు పిక్ యు. ఐ యామ్ టెల్లింగ్ యు అగైన్, సిట్ డౌన్ దేర్ ఓన్లీ అండ్ డోంట్ గో ఎనీ వేర్ టిల్ పాపా కమ్స్ అండ్ పిక్స్ యు. వన్స్ యు సిట్ డౌన్ ఇన్ కార్, డోంట్ ఫర్గెట్ టు ఇంఫార్మ్ మీ. ఐ నౌ డిస్కనెక్ట్ యువర్ కాల్ టు స్పీక్ టు పాపా" -- అన్న కస్తూరి, అమ్మాయి చేసిన ఫోన్ కాల్ కట్ చేసి -- భర్తకు ఫోన్ చేసింది.

అటు ఆమె భర్త ఫోన్ ఎత్తగానే -- "మావా ఏడున్నావు"

"......................................"

"ఛా, ఏళా లేదు పాళా లేదు, నీకెప్పుడూ అదే యావ. ఇస్కూల్ కాడకి ఆటో ఎదవ ఎల్లలేదు. పోరి ఏడుస్తూ నాకు ఫోన్ సేసింది. నువ్వు గమ్మున పోయి పోరిని తీసుకొని ఇంటికాడకి పో. ఓ అరగంట పోనాకా నాను ఒచ్చీస్తాను. నువ్వు కారులో బయలుదేరగానే పోరికి ఫోన్ చేయి. సమజయిందా" -- అన్న కస్తూరి –

తన భర్తకి చేసిన ఫోన్ కాల్ కట్ చేసి –

"క్షమించండి, మీరేదో అడిగేరు"

"ఖరీదైన చీర కట్టుకొని ఇంత చక్కగా ముస్తాబై ఉన్న నువ్వు పనిమిషిగా పని చేయవలసిన అవసరమేమిటి, ఇంకేదైనా గౌరవప్రదమైన పని చేసుకోవచ్చు కదా, అని అడిగేను"

“సర్కారువారి ధర్మమా అని తినడానికి తిరగడానికి ఉండడానికి మా పైసలు ఖర్చు చేయనక్కరలేదు. ఒకే ఒక నలుసు కదా అని మా అమ్మాయిని ఇంగ్లీష్ మీడియం బడిలో చదివిద్దామని, నా పెనిమిటి బ్యాంకులో అప్పుచేసి రెండు కార్లు తెచ్చేడు. ఒక కారు అద్దెకు తిప్పుతూ, మరో కారుకి డ్రైవరుని పెట్టి నడిపిస్తున్నాడు. రెండు కార్లు కలిపి రోజుకి ఎంతలేదన్నా పదివరకూ తెస్తాడు. రెండు బ్యాంకు అప్పుకి జమ చేసినా, బండి

ఖర్చులు పోనూ తక్కువలో ఐదు వరకూ మిగుల్తుంది. నా కింద ఇరవై ఆడంగులు ఉన్నారు. వాళ్ళను పనికి కుదిరిస్తే నెలనెలా నాకు కమిషన్ ఇస్తారు. నేను కూడా నాలుగిళ్ళలో పనిమనిషిగా పని చేస్తూ సంపాందించినది కలుపుకొని, నాకు నెలనెలా ముఫై పైనే వస్తుంది. అలాటప్పుడు వయసులో ఉన్న నేను, ముత్యాలముగ్గు సినిమాలో పాట – ‘మగడు మెచ్చిన జాణ కాపరంలోనా మల్లెపూల వాన’ – లా, నా పెనిమిటి ప్రేమ కోసం ఈ మాత్రం ముస్తాబు అవడం తప్పు కాదు కదా"

"అంటే నువ్వు పనిమనిషి మాత్రమే కాక బ్రోకర్ వి కూడా అన్నమాట"

"అందులో తప్పేమిటండీ. వాళ్ళకు పని కావాలి మీకు పనిమనిషి కావాలి. వాళ్ళకు, మీలాంటి వాళ్లకు శ్రమ లేకుండా నేను లింక్ పెడుతున్నానంతే"

“నీకు దొరికే కమీషన్ తో సరి పెట్టుకోక, నువ్వు కూడా పనిమనిషిగా చేయవలసిన అవసరమేముంది"

“ఆ పని మా అమ్మ, మా అత్తా, మా ఆడపడచు, మా వదిన అందరూ స్వంత ధర్మం లాగా చేస్తున్నారు. మరి నాకు మాత్రం ఎందుకు నామోషీ. అయినా, స్వంత ధర్మాన్ని విడిచిపెట్టిన వారికి పుట్టగతులు ఉండవు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పేడు కదా"

"నీకెలా తెలుసు, భగవద్గీత చదివేవా"

"లేదు. చాగంటిగారు టీవిలో చెపుతూంటే విన్నాను. ఆయనగారు ఇలాంటివి ఎన్నో చెపుతూంటారు. ఆయనకు రెండు చేతులెత్తి నమస్కారం చేయాలి" అంటూ -- కస్తూరి గాల్లోకి రెండు చేతులెత్తి నమస్కారం చేసింది.

"ఇప్పుడు నీ ఆర్జన నీ పెనిమిటి ఆర్జన ఖర్చులు మిగుళ్లు అన్ని చెప్తూ - రెండు, ఐదు, పది అంటావేమిటి"

"అంటే 'వేలు' అని వేరుగా చెప్పక్కరలేదు కదండీ ఈరోజుల్లో"

"ఇంకొక విషయం అడగాలి నిన్ను"

"అడగండి"

"అంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం ఎక్కడ నేర్చుకున్నావు"

"మా అమ్మాయితో మాట్లాడాలన్నా, దాని హోమ్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ చేయించాలన్నా ఇంగ్లీష్ రాకపోతే కష్టం కదా. అందుకే మా అమ్మాయిని బడిలో చేర్చకముందే ఆరునెలలు ఇంగ్లీష్ క్లాసులకు వెళ్లి నేర్చుకున్నాను. కారు నడుపుతాడు కాబట్టి ఇంగ్లీష్ వస్తే మంచిది అని నేనే నా పెనిమిటికి ఇంగ్లీష్ నేర్పేను. మీలాంటి వాళ్ళతో అవసరం ఉంటుంది కాబట్టి హిందీ భాష కూడా టీవీ చూసి ఇద్దరం నేర్చుకున్నాము"

"చక్కటి పదాలతో తెలుగులో మాట్లాడుతున్నావు, మరి మీ ఆయనతో అలా పల్లెటూరి యాసతో ఎందుకు మాట్లాడతావు"

"చాగంటిగారి మాటలు వినివిని చక్కటి పదాలతో తెలుగు మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. మరి నా పెనిమిటితో అలా మాట్లాడడం అంటారా -- మా పల్లెటూరిలో జనం అంతా ఆ యాస తోనే మాట్లాడతారు. ఆ యాస నాకు తల్లిలాంటిది. అదెలా మరచిపోతాను”

"అసలు విషయానికి వచ్చే ముందర ఇంకో సందేహం ఉంది అడగడానికి. అయితే అది నీ పర్సనల్ విషయం అడిగేదా"

"ఫరవాలేదు, అడగండి"

"నీ పెనిమిటితో మాట్లాడుతూ -- ' ఛా, ఏళా లేదు పాళా లేదు, నీకెప్పుడూ అదే యావ ' అన్నావు కదా, ఏమన్నాడేమిటి నీ పెనిమిటి"

"మగడు పెళ్ళాం మధ్యన సరసమైన మాటలు నేనెలా చెప్పేదండీ, సిగ్గేస్తోంది" అంటూ కొంచెం సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతున్న కస్తూరిని చూసిన ప్రియాకు నవ్వొచ్చింది.

"అర్ధమైందిలే. ఇక అసలు విషయంలోకి వద్దాం. మా ఇంట్లో నువ్వే పనిచేస్తావా లేక వేరే పనిమనిషిని పంపుతావా?”

"రేపు తెల్లారి పనిమనిషిని తీసికొనివచ్చి మీకు పరిచయం చేసి పనిలో పెట్టేస్తాను"

"జీతం ఎంత ఇవ్వాలి, మంచి మనిషేనా, పనిలో నాగా పెట్టదు కదా"

"నేను తెచ్చిన పనిమనిషి మీద ఒక్క చెడ్డ మాట పడినా నా మీద పడినట్టే. అందుకే మంచి మనిషి కాకపొతే ఎవరినీ ఎక్కడా నేను పనిలో పెట్టను. అందరిళ్ళలో లాగే, మీ ఇంట్లో కూడా గిన్నెలు కడగడం, ఇల్లు ఊడ్చడం, తడిగుడ్డతో తుడవడం, వాషింగ్ మెషిన్ లో బట్టలు ఆరవేయడం, ఇస్త్రీ చేయడం పనులే కదా"

"అవును"

"అన్నిటికీ కలిపి ఐదు ఇవ్వాలండీ"

"అందులో నీ కమిషన్ ఎంత"

"అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు"

"మరేమీ తగ్గేది లేదా"

"మీరు బేరం ఆడేవారు కారు అనిపించి, కరెక్ట్ రేట్ చెప్పేను. మీమీద నాకున్న అభిప్రాయానికి మచ్చ తేకండి”

"తెలివైనదానివే, ముందరి కాళ్లకు బంధం వేయడం ఎలాగో బాగా తెలుసు నీకు"

"అయితే నేను పోయి రేపు పనిమనిషిని తీసుకొని వస్తానండీ"

"సరే"

"వెళ్తూ ఒక్క మాట చెప్పాలి మీకు. అయితే అది మీ పర్సనల్ విషయం”

"ఏమీ ఫరవాలేదు, చెప్పు"

“బాబుగారిని ఉత్తరీయం కుడి భుజం కాదు ఎడమ భుజం మీద వేసుకోవాలని చెప్పండి"

"ఎందుకు"

"భార్య ఉన్నవారు ఎడమ భుజం మీదనే వేసుకోవాలని చాగంటిగారు చెప్పేరు"

-- అని చెప్పి, స్కూటర్ నడుపుకుంటూ వెళుతున్న కస్తూరిని చూస్తూ చేష్టలుడిగి సోఫాలో కూర్చుండి పోయింది ప్రియ.

*****

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ