“త్వరగా రెడీ అవ్వు లేట్ అవుతుంది” అంటూ వచ్చిన అనితతో చకచకా కాలేజికి బయలుదేరింది రాజ్యం. ఇద్దరూ ఒకే కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు. కాలేజీకి వెళ్ళే దారిలో అబ్బాయిలు గుంపులుగా ఉండేవారు. అనిత ఊరికి వెళ్లడంతో కొన్ని రోజులు రాజ్యం ఒక్కతిగా కాలేజీకి వెళ్లాల్సి వచ్చింది. దారిలో ఒక అబ్బాయి తననే చూస్తూ ఉండడం, ఒక్కతిగా ఉన్నప్పుడు తనతో మాట్లాడడానికి ప్రయత్నించడం గమనించింది. ఆరోజు “హలో..” అన్నాడు. ఇంకో రోజు “ఎలా ఉన్నావు”..“ఏంటి నీ పేరు” అంటూ ఇలా ప్రతిరోజూ మాట్లాడించసాగాడు. ఫ్రెండ్షిప్ కేమో అనుకుంది. తర్వాత చెప్పాడు. వాళ్ళు డబ్బున్నవారని, తనంటే ఇష్టమని, పెళ్లి చేసుకుంటానని. ఇంట్లో చెప్దామన్నాడు. రాజ్యం నమ్మింది. కొన్ని రోజుల తరువాత “ మా ఇంట్లో చెప్పాను. ఒప్పుకోలేదు. అయినా సరే. పెళ్లి చేసుకుందాం. నువ్వు మీ ఇంట్లో వాళ్లకి చెప్పి ఒప్పించు” అన్నాడు. రాజ్యానికి అడగాలంటే భయంవేసింది. ఇంట్లో చెప్పలేక పోయింది. “ఏం పర్వాలేదు, ఏది జరిగినా మన ప్రేమకు ఎవరూ ఎదురు చెప్పలేరు” అన్నాడు మోహన్. ధైర్యం చేసి ఆ సాయంత్రం గుళ్లో పెళ్లి చేసుకున్నారు. రాజ్యం ఎవరితోనూ ఈ విషయం చెప్పలేదు. ఎప్పటిలాగే కాలేజీ తర్వాత ఇంటికి వచ్చేసేది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అతనిని కలుసుకోవాలని కాలేజీ దగ్గర ఎదురుచూడసాగింది. ఎంతటికీ అతను రాలేదు. అంతకు ముందే తన దగ్గర డబ్బు బంగారం తీసుకున్నాడు. ఇలా ఎదురుచూస్తూ చాలా రోజులు గడిచిపోయాయి. అతను రాలేదు. ఒకరోజు పేపర్లో చూసింది. ఏదో వేరే బిజినెస్ పెట్టుకున్నాడని అతని అడ్వటైజ్మెంట్. దాన్ని బట్టి తెలుసుకుంది. తన డబ్బుని వాడుకొని తనను వదేలేసాడని, మోసగించాడని. ఏమి చెయ్యాలి..ఎవరికి చెప్పాలి..ఏమని చెప్పాలి..ఎటు పోవాలి..అతని విషయాలు సరిగ్గా ఏమీ తనకు తెలియదు. అంతా గందరగోళంగా ఉంది. జీవితమంతా అల్లకల్లోలమై పోయింది. ఇలా ఎంతో మంది సమాజంలో ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే వాళ్ళు. అమాయక యువతులు అది నిజమైన ప్రేమో లేక కేవలం ఆకర్షణో తెలియక, తల్లితండ్రులు , బాధ్యత తెలిసినవారు ఇచ్చే సలహాలను పాటించక, సరైన నిర్ణయాలు తీసుకొనక తమ జీవితాలను అధోగతిపాలు చేసుకుంటున్నారు, ప్రాణాలను బలి తీసుకొంటున్నారు. రాజ్యం ధైర్యస్థురాలు, చదువుకున్నది కాబట్టి సతీష్ ను మరొక వివాహం చేసుకొని ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. రాజ్యం గతం తెలిసినా సతీష్ సంస్కారం కలవాడు కనుక ఆదరించాడు. రాజ్యానికి ఇప్పుడు ఒక బాబు. వారిద్దరూ బాబు భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తున్నారు.