కొండ గొడుగు - టి. వి. యెల్. గాయత్రి.

Konda godugu

బీభత్సంగా వర్షం పడుతోంది.మొదట ఏదోలే ఒకరోజో రెండు రోజులో కురిసి తెరిపిస్తుందనుకుంటే భీకరరూపం దాల్చింది. ఇప్పటికి వారం గడిచింది. ఎండుకట్టెల నిల్వలు తగ్గిపోతున్నాయి.

వ్రజభూమి అది..బృందావనం..

కలవరంతో నందుని ఇంటికి చేరారందరూ.

ఆ బృందావనానికి నాయకుడు నందుడు.

ఆ ఊరికి ఉన్న సంపద గోవులు. పచ్చగడ్డిలేదు. ఎండుగడ్డి కూడా లేదు.. జీవులకు ఎంత కష్టం!

"ఏమిటది నందన్నా!మన మీద దేవతలు పగబూనినట్టున్నారు!... దారీ తెన్నూ తోచటం లేదు!.."నందుడి స్నేహితుడు భోజదేవుడు దిగులుగా అడిగాడు.

ఆ పక్కన వచ్చాడు వృష్టిసేనుడు.

చాలామంది ఎండుకట్టెలు తెచ్చి సావిట్లో పడేస్తున్నారు.

" ఇంకా రెండు రోజులు అయితే ఇవి కూడా మిగలవు బాబాయ్!ఆవుల సంగతి తర్వాత.. పిల్లలకు అన్నం పెట్టేదెట్లా? ఊరిని ముంచేస్తుందేమో ఈ వాన!.. "

యదుసింహుని భయం.

ఏమీ తోచనట్లుగా నిలబడి ఉన్నాడు నందుడు.

ఏమి చేయాలి?..

"నాన్నా! మనమీసారి మన పర్వతానికి పూజ చేసుకుందాం! మనకు అన్నీ ఇచ్చేది గోవర్ధనమే కదా!మన జీవనాలు ఈ పర్వతం మీదే ఆధారపడి ఉన్నాయి!..చెట్టూ, పుట్టకు పూజ చేస్తే పుణ్యం నాన్నా!"

చిన్నవాడు చెప్పిన మాట తను విన్నాడు.

బుజ్జి పిల్లవాడు!.. ఆడుతూ పాడుతూ ఉండే పసివాడు. అదేమిటో వాడు ఏమన్నా చెబితే తన తండ్రి చెప్పినట్టు...తన తాత చెప్పినట్టు..తన ముత్తాత చెప్పినట్టుగా ఉంటుంది!.అప్పుడు మాత్రం వాడిని చూస్తే పసివాడని అనిపించదు!

' నాన్న ఇలా చేద్దామా!' అని అంటే ఈ ప్రపంచంలో ఉన్న తండ్రిలందరికీ తండ్రి చెప్పినట్టుగా ఉంటుంది...చెప్పింది చిన్నపిల్లవాడే కదా తను ఎందుకు వినాలి? ఏమిటో ఈ మాయ!నిజంగా దేవతలు పగబూనారా?....వాన తగ్గకపోతే ఏది దారి?...గోకులానికి రక్షణ ఏది?.....

నందుడికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.

'నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచేశాడా తను!...భగవంతుడా!కాపాడవయ్యా!'

ప్రార్తిస్తున్నాడు నందుడు.

అదిగో అప్పుడే లోపలి నుంచి వచ్చాడు..

చిన్నవాడే!.. నల్లగా నిగనిగలాడుతున్నాడు.

ఏమంత వయసని?.. ఏడేళ్లు!..

ముంగురులు పైకి తోసుకుంటూ వచ్చాడు.

పైన కండువా తీసి నడుముకు చుట్టాడు.

కురులు వెనక్కి ముడిచి గట్టిగా సిగ బిగించాడు.

బయటికి నడిచాడు.

"ఈ వానలో ఎక్కడికి రా కన్నయ్యా! "తల్లి యశోద కేక పెట్టింది.

పెద్దమ్మ కంగారు పడింది.

జవాబు ఇవ్వలేదు..

అతడి వెనకాలే ఉద్ధవుడు కదిలాడు. ముల్లుగర్ర పట్టుకొని అన్న బలరాముడు కూడా ఆ వెనకాలే నడిచాడు.

"వీళ్ళు ఎక్కడికి పోతున్నారు ? మీరేనా చెప్పండి మామా!"అంటూ ఆడపిల్లలు పెద్ద వాళ్ళని అడుగుతున్నారు.

గోవర్ధన పర్వతం దగ్గరగా వెళ్ళాడా చిన్నవాడు.కాసేపయింది. హోరువాన,గాలితో ఏమీ కనిపించటంలేదు.

మొదట ఫెళఫెళ చప్పుడు.... భూమి అదురుతున్నట్టుగా పెద్ద శబ్దం... కదులుతోంది వజ్రభూమి... గోవులన్నీ గిర్రున తిరుగుతున్నాయి..

పర్వతం మీద నుండి జంతువులు అటూ ఇటూ పరిగెత్తుతున్నాయి.

గుహల్లో పులులు, సింహాలు, ఎలుగుబంట్లు దిక్కుతోచక చెట్లను కావలించుకున్నాయి.

పెద్ద పెట్టున పక్షులు పైకి ఎగిరరాయి.

బడబడా చప్పుడు...అందరూ చూస్తున్నారు పర్వతం పైకి లేస్తోంది.....మెల్లగా లేస్తోంది....

చిన్నవాడు కనిపించడం లేదు!... హమ్మో!..పిల్లలు ఏమయ్యారు?.. కళ్ళకు మసక కమ్ముతున్నట్టుగా ఉంది..

" కన్నా! కన్నా! అంటూ అరుస్తోంది యశోద.

రోహిణి తెలివితప్పి పడిపోయింది.

ఉద్దవుడి తల్లి గొల్లుమంటూ ఏడుస్తోంది.

ఉపచారాలు చేస్తున్నారు ఆడవాళ్లు. ఉపద్రవం ఏదో ముంచుకొస్తోంది..

బయటికి పరిగెత్తబోతున్న యశోదను గట్టిగా పట్టుకొని వెనక్కి లాగాడు నందుడు.

"మన బిడ్డ కనిపించడం లేదు!.."అంటూ భోరుమంది యశోద.

"వాడికేమీ కాదు! వాడికేమీ కాదు!అంటున్నాడు తప్ప ఏమవుతుందో తెలియటం లేదు నందుడికి.

"దేవతలు కొండని ఎత్తుతున్నార్రా దేవుడా! మన నెత్తిమీద పడేస్తారేమో!"ఎవరో పెద్దగా అరిచారు.

గోకులంలో గగ్గోలు మొదలైంది.

పిల్లలు జడుసుకున్నారు.తల్లులను కరుచుకున్నారు.

ఇంకొంచెం పైకి లేచింది పర్వతం!... ఫెళఫెళారావాలు ఎక్కువవుతున్నాయి..

పూర్తిగా లేచింది పెద్ద పర్వతం!..ఆశ్చర్యం!..చిన్నవాడు కొండ కింద ఉన్నాడు.

చెయ్యి పైకి చాచి ఉన్నాడు. రాళ్లు, మట్టిపెళ్ళలు అతని మీద పడుతున్నాయి.అతడి చేతిమీద అంత పెద్ద పర్వతం వేలాడుతోంది.

ఉద్దవుడు,బలరాముడు కిందపడిన బండరాళ్లను తొలగిస్తున్నారు.

గోకులంలో కదలిక వచ్చింది.

తలకు తుండుగుడ్డ చుట్టుకొని, కర్ర పట్టుకొని నందుడు శరవేగంగా పర్వతం దగ్గరికి పరిగెత్తాడు.

అతని వెంట పెద్దవాళ్లు అందరూ గుంపుగా కదిలారు.

"రండి!అందరూ రండి!చుక్కనీళ్ళు పడవిక్కడ!ఆవులన్నిటి తోలుకు రండి!"బలరాముడి గొంతు ఖంగుమంటూ మోగింది.

'పొలో!'మంటూ పరిగెత్తారందరూ..

రాళ్ళని ఏరి పారేస్తున్నారు కొందరు.

ఆవుల్ని తోలుకుంటూ పోతున్నారు కొందరు. వంట సామాన్లు సద్దేస్తున్నారు ఆడవాళ్లు.

మూటాముల్లె నెత్తి మీద పెట్టుకొని కొండ కిందకు చేరవేస్తున్నారు యువకులు.

ధాన్యం బస్తాలు మోస్తున్నారు కొందరు. కొందరు తట్టలతో పర్వతం కింద మట్టి తీసి పోసి గోడల్లాగా కడుతున్నారు.

చిన్నపిల్లలు సైతం చేతికి అందిన సామాన్లు పట్టుకొని కొండకిందికి పరిగెడుతున్నారు.

అదొక ప్రవాహం! ఆవులు, ఎద్దులు, దూడలు, మేకలు,గొర్రెలు, కోళ్లు ఒకటేమిటి సమస్తమూ కదిలి, కొండకిందకు చేరిపోతున్నాయి.

ఆడపిల్లలు కిలకిలలాడుతున్నారు.

ఆకాశం వంక చూశారు.

మూతి తిప్పి వెక్కిరించారు.

"ఇక నువ్వేం చేస్తావ్?" అంటూ మెటికలు విరిచారు.

వాన ఇంకా పెరిగింది!...ఇంకా పెరిగింది!.. ఎడాపెడా కొడుతోంది!..

అయినా భయం లేదు!...

అందరూ మంచాలు వేసుకున్నారు.. పిల్లలు తిరుగుతూ రకరకాల ఆటలు ఆడుతున్నారు.పసిబిడ్డలు ఉయ్యాలల్లో నిద్రపోతున్నారు.తల్లులు వంటలు చేస్తూ కబుర్లాడు కొంటున్నారు. కన్నెపిల్లలు అచ్చనగిల్లాలు, వామనగుంటలు ఆడేస్తున్నారు. ఇంకా కొందరు ముగ్గులేసుకుంటున్నారు.

ఆకలి అనకుండా, అలసిపోకుండా, ఆవులు అడక్కుండానే పాలిస్తున్నాయి.

చిటికినవేలుతో అంతపెద్ద గోవర్తన పర్వతాన్ని ఎత్తిన చిన్నవాడు నవ్వుతూ నిశ్చలంగా నిలుచున్నాడు. అతడికి అలసటలేదు..ఆకలిదప్పులు లేవు. ముఖం కళతప్పలేదు...ఇంకా కురుస్తోంది వర్షం...ఏడురాత్రిళ్ళు!..ఏడుపగళ్ళు!.. భీకరమైన వర్షం!..

'ఏడేళ్ళయినా మాకేం ఫర్వాలేదు!మా చిన్నవాడు చూసుకుంటాడు!' కొండ గొడుగు కింద గోకులం నిశ్చింతగా బ్రతుకుతోంది.

"గోవిందా!గోవిందా!కొండవేల నెత్తినట్టి గోవిందా!"

తన్మయత్వంతో ఆనాటి గోవిందుని లీలను పాడుకొంటున్నాడు తిరుమలలో అన్నమయ్య అనే వాగ్గేయకారుడు.

విని నవ్వుకుంటున్నాడు ఆ గోవిందుడు.

***************************************

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ