సైకిల్ నేర్చుకోవడం - మద్దూరి నరసింహమూర్తి

Cycle nerchukovadam

చిన్నూ 'నాకు సైకిల్ నేర్పురా' అని వాడి స్నేహితుడైన చక్రిని ఎన్నోసార్లు అడిగేడు.

'అలాగే' అని చక్రి తప్పించుకొని తిరుగుతున్నాడు.

అందుకు కారణం –

చక్రి సన్నగా బక్క పలచగా రివటగా ఉంటే, చిన్నూ గుమ్మటంగా గుమ్మడిపండులా ఉంటాడు. ఎవరికైనా సైకిల్ నేర్చుకొనేటప్పుడు కిందపడడం సాధారణం. అలా పడేటప్పుడు చిన్నూ తనమీద పడి తనని పచ్చడి చేస్తాడేమో అని చక్రి భయం.

చిన్నూ ఒక ఆదివారం ఉదయం చక్రి ఇంటికి వెళ్ళి, చక్రి అమ్మా నాన్నలకు పిర్యాదు చేసేడు.

దాంతో చక్రి అమ్మా నాన్నా చక్రికి చీవాట్లు పెట్టి, వాళ్లింట్లోనే ఇద్దరికీ టిఫినీలు పెట్టి, తాగడానికి బోర్నవిటా కూడా ఇచ్చి, వీధిలోకి పంపించేరు –

“చిన్నూకి ఈరోజు సైకిల్ తొక్కడం నేర్పించి వస్తేనే నీకు భోజనం పెట్టేది” అని చక్రికి గట్టిగా వార్ణింగ్ ఇచ్చి.

ఇక తప్పదన్నట్టు తన సైకిల్ తో సహా చిన్నూని తీసుకొని స్కూల్ ప్లేగ్రౌండ్ కి వెళ్ళేడు.

అక్కడ ఒక గంట గడిచినా, చిన్నూకి సైకిల్ బాలన్స్ చేయడం రాకుండా పదిసార్లు కింద పడ్డాడు. విచిత్రమేంటంటే, పడినప్పుడలా చిన్నూకి దెబ్బలేమీ తగలకుండా చక్రికే దెబ్బలు తగలడం. ఎందుకంటే, సైకిల్ హేండిల్ ఒక చేత్తో పట్టుకొని చిన్నూని వెనకనుంచి మరో చేత్తో పట్టుకొంటే -- చిన్నూ పడినప్పుడల్లా చక్రి మీద పడేవాడు. అసలే బక్కపలచగా ఉండే చక్రికి ఆ తాకిడితో కాళ్ళు చేతులు చెక్కిపోయి అక్కడా అక్కడా రక్తం కూడా వచ్చేది.

మరి లాభం లేదు అనుకున్న చక్రి, ఏమిటైతే అయింది, అని –

"చిన్నూ నీకు సైకిల్ నేర్పించడం నా వల్ల కాదు" అని చెప్పేసేడు.

"మరొక పది నిమిషాలు చూస్తానురా ప్లీజ్" అని చిన్నూ బతిమాలాడు.

"ఈ పది నిమిషాల్లో నువ్వు నేర్చుకోలేకపోతే, నేను నా సైకిల్ తీసుకొని మా ఇంటికి పోతాను, నువ్వు మీ ఇంటికి పో" అని చక్రి గట్టిగా చెప్పేసేడు. గంట తరువాత చిన్నూ తన ఇంటికి వెళ్ళిపోతే –

"విరిగిన కుడిచేతితో మీ అబ్బాయి మాదగ్గర ఉన్నాడు. త్వరగా రండి" అని చక్రి ఇంటికి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది.

చక్రి అమ్మానాన్నలు గాభరాగా హాస్పిటల్ కు వెళ్లి చక్రిని కలిసి "ఏమయిందిరా" అని అడిగేరు.

"అంతా మీవల్లే. నామీద సైకిల్ తో సహా గున్నఏనుగులాంటి చిన్నూ పడితే ఏమిటవుతుంది" –

అంటూ అప్పటివరకూ ఆపుకున్న దుఃఖంతో బావురుమన్నాడు చక్రి.

*****

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ