మా నవ బంధాలు - బామా శ్రీ (బాలాజీ మామిడిశెట్టి)

Maa nava bandhalu

“ఏమోయ్! శారదా! నా చివరి కోరిక తీర్చు” అంటున్న భర్త ఆనందరావు మాటలు వింటుంటే శారదకు తట్టుకోలేనంత బాధ వస్తుంది. ఆసుపత్రి నందు, తన సహాయం లేనిదే మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న భర్తను “ఇప్పుడు అవసరమంటారా?” అని మందలింపుగా అంది. తెల్లవారితే తన పసుపు కుంకుమలు ఏమవుతాయోనన్న భయంతో శతమానం కళ్ళకద్దుకుంటూ, మనసులోనే ఇష్టదైవాన్ని తలుచుకుంటున్న ఆమె భావాలు వర్ణనాతీతం . . . . .

ఆపరేషన్ చేసినా ఎలావుంటాడో చెప్పలేమన్నారు డాక్టరు. కొడుకు, కూతురు మంచి చదువులు, చదివి వాళ్ళ కుటుంబాలతో విదేశాల్లో స్థిరపడ్డారు. కావలసినవారు అందుబాటులో లేకపోవడంతో ఒంటరిననే భావన కలుగుతుంది, అయితే పనిమనిషి భీమయ్య ఆస్పత్రిలో తనకు సహాయంగా వున్నాడు. ఆనందరావు పక్కనే కుర్చీలో తలవాల్చుకుని గతంలోకి వెళ్ళింది శారద. “పెళ్లయిన కొత్తలో జరిగిన సంఘటనలు, స్నేహితురాళ్ళ అల్లరి, పిల్లలు, వాళ్ళ పెంపకం, చదువులు, పెళ్ళిళ్ళు ఇలా అన్నీ తనకు కళ్ళ ముందర కనిపించసాగాయి. ఇద్దరు మొదటి షో సినిమా చూసి, పున్నమివెన్నెల్లో, సైకిల్ మీద తనను ముందర కూర్చోపెట్టుకుని చేలగట్టు పుంతరోడ్డులో తొక్కుతుంటే తనువు తనువు తాకిడికి పరవశించిన ఆ మరుపురాని రేయి, చెప్పలేని హాయి, నేడు కారులో షికారుకెళ్ళిన రాదు.

అలా ఆమె గత స్మృతులలోనున్న సమయంలో తలుపు కొట్టిన చప్పుడుకు, తలుపు తెరిచి “రండి! డాక్టరు గారు!” అంది. ఆనందరావును పరిక్షించిన డాక్టర్ “జాగ్రత్తగా చూడు గిరిజా” అని డ్యూటి నరుసుకు చెప్పి బయటకు వెళ్ళారు. నర్స్ పేరు వినగానే శారదకు స్నేహితురాలు గిరిజ, ఆనందరావుతో తప్పుగా ప్రవర్తించడానికి చేసిన ప్రయత్నం, ఆ సంఘటన తర్వాత “పాతివ్రత్యం అనేది ఆడవారికి మాత్రమే కాదు, మగవారు కూడా ఏకపత్నీవ్రతులై వుండాలి” అన్న భర్త గొప్పదనం మదిలో మెదిలి, తనలో తాను ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది.

ఆనందరావు చదువుకున్నప్పటికీ తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఊరిలోనే ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేసి, ధాన్యం వ్యాపారం పెట్టి, నిజాయితిగా ఆస్థిని రెట్టింపు చేశాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే పెద్దలు నిశ్చయించిన శారదను దొంగపెళ్ళిచూపులు చూసి, ఇష్టపడి పెళ్ళిచేసుకున్నాడు. అలా తన ఆలోచనలలో తానుంటే “అమ్మగారూ!” అన్న భీమయ్య మాటకు వులిక్కిపడి “ఏమిటీ భీమయ్యా!” అంది. “అయ్యగారు, తమరిని తొలిచూపు చూసిన రోజంట అమ్మగారు. అందుకని మల్లెలు తెమ్మన్నారు” అన్నాడు భీమయ్య. “ఇప్పుడు అవసరమంటారా?” అంటూ మందలింపుగా భర్త వైపు చూస్తూ అంది.

“నేడు మనది. రేపు మనది కాదు శారదా! ఇలారా” అని మరణశయ్యపైవున్న ఆనందరావు ఎంతో ప్రేమగా పిలిచి పాయతీసి మల్లెలుపెడుతున్న భర్తను చూసి కళ్ళుబయర్లుగమ్మి, చూపుమందగించి మనస్సులోనే “చావు ఎప్పటికైనా తప్పదు ఎవరో ఒకరి చేతిలో ప్రతివారు పోవలసిందే, పిల్లలు, మనవలు వస్తారో రారో తెలియదు. ఎలా వుంటాడో” అని ఆలోచిస్తుంది. “శారద పెన్ను, కాగితం తీసుకుని నేను చెప్పింది చెప్పినట్లు మరణశాసనం వ్రాయమంటూ” ఒత్తిడి చేశాడు ఆనందరావు. చూడలేని, వినలేని స్థితిలో దూరంగావున్న పిల్లలు కాగితం మీద అక్షరాలను చూసైనా సంపాదనే శరీర ధర్మమనే ఆలోచన నుండి మారతారేమోనని ఆనందరావు ఆశ.

పసుపు, కుంకుమలతో ముత్తయిదువుగా, తన భర్తకన్న ముందు పోవాలని బలమైన కోరికతో వుంది శారద. భర్త చెబుతున్న ప్రతి అక్షరం పొల్లుపోకుండా యథాతథంగా వ్రాసి, సంతకం చేయించడానికి కొంచెం ముందుకు జరిగింది. మానసిక సంఘర్షణ ఎక్కువ కావడంతో ఛాతిలో తీవ్రంగా నొప్పివచ్చి, మగడు పెట్టిన మల్లెలతో భర్త మీదకు వాలింది శారద. ఆసుపత్రి కేంటిన్ సౌండ్ బాక్స్ నుండి “నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి – జన్మజన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ” పాట నెమ్మదిగా వినబడుతున్న సమయాన్న శారద కోరిక తీరిపోయింది.

అంతటి అనారోగ్యంలోను భార్య తల్లోని మల్లెల సువాసన ఆస్వాదిస్తూ, “శారదా! శారదా!” అని గట్టిగా పిలుస్తుంటే నర్స్ గిరిజ వచ్చి, ఆమెను ఐసియు వార్డుకు తీసుకెళ్ళి, అక్కడి నుండి మార్చురీకి తరలించిన విషయం భీమయ్య, కుటుంబ సభ్యులకు తెలియజేసాడు.

ఆపరేషనయ్యి ఆసుపత్రి నుండి తీసుకువచ్చిన ఆనందరావుకు కుటుంబసభ్యులందరూ కనబడగానే కలిగిన ఆనందం, శారద ఫొటోకి దండేసి వుండడంతో, ప్రక్కనున్న మడతకుర్చిలో కూలబడిపోయాడు. “ఆడవారికి కన్నీరు బయటకుపోతే మనస్సు బరువు తీరుతుంది, గాని మగవారు తమ భావోద్వేగాలను, దుఃఖాన్ని వ్యక్తీకరించకపోవడం వల్ల మానసిక అనారోగ్యం పాలవుతారు. పోయిన వారితో అందరూ పోలేరు, ఒకవేళ అలాపోతూ వుంటే ప్రపంచ జనాభా ఇంత వుండేది కాదేమో!” అని మనస్సులో అనుకుంటూ…..

“జీవితసర్వస్వాన్ని కోల్పోయాను. ఇంటికి వచ్చేటప్పటికి అప్యాయంగా పలుకరించే మిత్రురాలు లేదు. శ్మశాన వాటికలో కాటికాపరి కుండను, నేలకు విడిచి ముక్కలు చేసినట్టుంది నా జీవితం. భాగస్వామి జ్ఞాపకాలు మనస్సులో ఉన్నంతకాలం దంపతులులలో ఏ ఒక్కరు, మరణించినా రెండోవారు మరణించినట్టు కాదు. మనుషులు దూరమవ్వడం మరణం కాదు, మనస్సులు దూరమవ్వడమే నిజమైన మరణం. మనుషులు దూరమయ్యిన, మనస్సులు మనతో వుండడమే ఆదర్శదాంపత్యానికి పునాది. ఒకరికి ఒకరు తోడు వున్నట్టే భావించాలి” అని కుటుంబసభ్యులతో మధనపడుతూ వాపోయాడు.

ఆనందరావుకు, శారద చివరిచూపు దక్కకపోవడంతో, ఆమె ఉన్నదనే భ్రమతో మధురస్మృతులను నెమరువేసుకుంటూ, గతాన్ని స్మరించుకుంటూ కాలం వెళ్ళబోస్తున్నాడు. బావమరదళ్ళు అయిన నందు, వాణిలు వేళాకోళం ఆడుకోవడం చూసేటప్పటికి ఆనందరావుకు “కొడుకు రాజారాం తన పేరు నుండి కొంత తీసి కొడుకుకు “నందు” అని పేరు పెట్టడం. కూతురు పరిమళకు అమ్మ శారద అంటే ఇష్టం కావడంతో, శారద అర్థం వచ్చేటట్టు “వాణి” పేరు పెట్టిన రోజులు” కళ్ళముందర కనిపించాయి.

నందు, వాణి ఇద్దరిని చూస్తుంటే పెళ్ళీడుకొచ్చిన సమయంలో శారద, ఆనందరావు ఎలా వున్నారో అలాగే వున్నారు. దానితో తన పెళ్లిచూపులు గుర్తుకు రాగానే “తనకు కాబోయే భార్యను సహజంగా చూడాలని పెళ్లి చూపులకు ముందే ఫ్రెండ్ చెల్లెలు రాజామణి ద్వారా శారద ఎక్కే బస్సు ముందే ఎక్కి, పలకరింపుగా చిరునవ్వు నవ్వడం, మాట్లాడలని ప్రయత్నించి, భంగపడడం, కోరచూపులైనా ఓరచూపులా భ్రమించడం. మూడు రోజుల తర్వాత పెళ్లిచూపులు కొచ్చిన పెళ్లికొడుకును, కిటికిలోంచి ఎవరూ చూడకుండా ఎలా వుంటాడని ఆతృతతో శారద చూస్తుంటే, మేనత్త వెనుక నుంచి “ఎలా వున్నాడు మా అబ్బాయి?” అన్నమాటకు వులిక్కిపడి “లేదు అత్తా! బస్సులో వెంట పడింది ఇతడే” అంది. వెంటనే “వలచిన వాడే వరుడు అవుతున్నాడు” అన్న మేనత్త మాటలు కిటికి ప్రక్కనే కూర్చున్న ఆనందరావు చెవిలో పడడం, పెళ్ళైన తర్వాత ఆమె ఎన్నోసార్లు తనను దొంగచూపులు గురించి ఆట పట్టించిన విషయాలు తలచుకుంటూ, ఆనందరావు తనలో తాను నవ్వుకుంటుంటే, అది గమనించిన వాణి “ఏమిటి తాతయ్యా!” అనగానే ఈలోకంలోకి వచ్చి, పరధ్యానంగా “దొంగపెళ్లిచూపులు” అన్నాడు. అదేమిటో తెలుసుకోవాలని ఆత్రంగా వాణి “దొంగపెళ్లిచూపులు ఏమిటి తాతయ్య?” అనగానే అప్రయత్నంగా తమ రొమాంటిక్ స్టోరి మనవరాలకి చెప్పాడు.

శారద కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత కొడుకులు ఆనందరావును తమతో పాటు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. “జననీ, జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియీయసీ. ఇక్కడే పుట్టాను, ఇక్కడే వుండి, ఇక్కడే కాలగర్భంలో కలిసిపోతాను. ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చేవారు, ఇకపైనందరూ ఒకేసారి రావడానికి ప్రయత్నిస్తూ, వచ్చి వున్న నాలుగు రోజులు సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను” అని తెల్పడంతో “అలాగే” నని చెప్పి ఎవరిదారిన వారు వెళ్ళారు.

. వీలైనప్పుడల్లా కుటుంబ సభ్యులు వీడియో కాల్స్ చేసి మాట్లాడుతున్నాడు. ఖాళీ సమయంలో పిల్లలు, మనవలు వీడియోలు చూస్తూ నాటి మధురస్మృతులను నెమరువేసుకుంటూ కాలం గడుపుతూ, గ్రామంలో జరిగే దైవ, సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటూ అందరివాడిగా జీవిస్తున్నాడు. గాని భార్య వియోగంతో ఒంటరిగా వుండడం, నిద్రలేమి, నిరూత్సాహాలతో మానసిక అనారోగ్యానికి గురవుతున్నాడు. దానితో ఆమె లేని జీవితం మరణంతో సమానం అనుకున్నాడు. అయినా సమాజానికి ఏదైనా మంచి చేయాలన్న ఆలోచన రాగానే, ఆసుపత్రిలో శారద చేత వ్రాయించిన వీలునామా గుర్తుచేసుకుని, దానిని అమలుచేయడం ప్రారంభించాడు.

సరిగ్గా సంవత్సరం తర్వాత కుటుంబ సభ్యులందరూ శారద సంవత్సరీకానికి వచ్చారు. “నాన్నగారు ఎలా వుంటున్నారు భీమయ్య?” అని అడిగాడు రాజారాం. “కట్టుకున్న కాంత కట్టెయ్యి, కట్టెల్లో కాలుతుంటే, సపర్యలు చేయడానికి మరో సతి కోసం వెదికే పతులున్న ఈ రోజుల్లో, తన కాంతనే తలచుకుంటూ జీవితాంతం పరవశించే బాబుగారు అందరికీ ఆదర్శవంతులు” అన్నాడు. “నాన్నగారిని జాగ్రత్తగా చూడు, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి” అనగానే “అలాగే, చినబాబు” అన్నాడు భీమయ్య.

ఆ సమయంలోనే “శారదానంద నందనవనం” ప్రారంభోత్సవ ఏర్పాట్లను వాణి, నందు తాతయ్యతో వెళ్ళి పరిశీలించారు. సుమారు ఎకరం స్థలంలో శారదానంద నందనవనంలో మదర్ థెరిస్సా విగ్రహం, శారద విగ్రహాలున్నాయి. వృద్ధఅనాధలకు ఆధునిక సౌకర్యవంతమైన అరవై పడకల బిల్డింగ్, వాటర్ ప్లాంట్, కిచెన్, పెద్ద టీవి వున్న హాలు, పాల కోసం గోశాల, కిచెన్ గార్డెన్ వంటి సకల సౌకర్యాలతో పాటు పార్కు కూడా ఏర్పారచడమైనది. వృద్ధులందరూ ఆనందంగా జీవించడానికి తగిన ఏర్పాట్లతో నందనవనంగా తీర్చిదిద్దబడిన నందనవన నిర్మాణం చూసి పరవసించిన వాణి మాట్లాడుతూ

“ఎవరి ప్రభావంతో ఈ ట్రస్ట్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నావు తాతయ్య” అని అడిగింది. “నా మిత్రుడు సప్తగిరి ప్రభావం వుంది. అతన్ని చూసి, సమాజ సేవ చేయాలనీ, పోతూ పట్టుకుపోయేది ఏమి లేదని తెలుసుకున్నాను. అలాగే పిల్లికి కూడా బిచ్చం పెట్టకుండా వితంతువైన తోబుట్టువుతో ఆస్తులు కోసం కోర్టుకెళ్ళి, బంధువులందరితో విరోధాలు తెచ్చుకుని, ప్రశాంతజీవనంలేని మీసాల మూర్తి తాతయ్య. ఒకరిని చూసి మంచి చేయాలని, మరొకరిని చూసి, అలా బ్రతకకూడదని అనుకున్నాను. జీవితం గాలితిత్తు లాంటిది, ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదు. మనమున్నా లేకపోయిన మనం చేసిన మంచీచెడులు రెండూ కీర్తి లేదా అపకీర్తిగా ఇక్కడే వుంటాయి. మనం మంచిని విడిచి వెళ్లితే సమాజంలో కొంతమంది మంచివారు తయారు అవుతారు” అని మనస్సులోని భావాలు తెల్పాడు ఆనందరావు. “ఓహో! అలాగ అని తలూపారు ఇద్దరూ.

ఇంతలో నందు “శారదానంద నందనవనం చిహ్నంలో ‘WE’ (వి) అని వ్రాసి కొట్టేసి, ‘ME’ (మి) అని వ్రాసి, మళ్ళీ దానిమీద అడ్డుగీత గీసి, మరల ‘WE’ (వి) అని చేయించావు ఏమిటి ఏమిటి తాతయ్యా!” అని అడిగాడు.

“WE: వెడ్-లైఫ్ ఎంజాయ్’మెంట్ అనగా వివాహ జీవితానందంతో వుండి;

ME: మ్యారీడ్-లైఫ్ ఎండెడ్ అనగా వైవాహిక జీవితం ముగిసింది;

WE: వూండెడ్-లైఫ్ ఎన్’లైటిన్ అనగా గాయపడిన జీవితం మళ్ళీ చిగురిస్తుంది. జీవితానందం కోల్పోయి, జీవితం ముగిసిపోయి, గాయపడిందనే భావనతో వున్నవారి జీవితం ఆనందమయంచేసి, మనస్సులోని బాధలను మైమరపించి, ఒకరికి ఒకరు తోడువున్నామనే భావన శారదానంద ప్యారడైజ్ కలిగిస్తుంది. అందుకే ఎంబ్లం ఇలా చేయించాను” అని వివరించాడు ఆనందరావు.

“ఇది కాకుండా మీ మనస్సులో ఇంకా ఏదో వున్నట్టు అనిపిస్తుంది తాతయ్యా!” అంది వాణి. “భార్యభర్తలు ఇద్దరూ కలిస్తే ‘మనం’. ఇంగ్లీషులో ‘WE’. ఒకరు పోతే ‘WE’ లో ‘W’ తిరగబడి ‘M’ గా మారుతుంది. అంటే ‘WE’ కాస్తా ‘ME’ గా మారుతుంది. ‘ME’ అనేది ఒంటరిని చేస్తుంది. ‘WE’ లో ‘W’ తిరగబడి ‘M’ గాఎప్పుడైతే మారిందో మన జీవితం పూర్తిగా తిరగబడి తలక్రిందులు అవుతుంది” అని చెబుతున్న సమయాన్న శారద జ్ఞాపకం రావడంతో తనకు తెలియకుండా వస్తున్న కన్నీరు తుడుచుకుంటుంటే “బాధ పడకు తాతయ్య” అంటూ ఆనందరావుపై భుజాలపై చేతులు వేసి నందు, వాణి ఓదార్చారు.

ఉదయమే ఆనందరావు పంచె, కుర్తా, శాలువ కప్పుకుని, చేతికర్రతో, నిలువు బొట్టు, కిర్రు చెప్పులేసుకుని, స్వచ్చమైన తెలుగువాడిలా తయారయ్యాడు. శారద విగ్రహానికి పూలమాలలు వేసి కుటుంబసభ్యులందరూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఆ సమయంలో ఆనందరావు నోటివెంట జారుతున్న ముత్యాల సరాలు . . . .

“మానవ బంధాలే మా నవ బంధాలు” కావాలనే ఆకాంక్షతో అందరూ వుండి, వృద్ధాప్యంలో పిల్లలకు దూరంగా వుంటున్న ఎవరూలేరని భ్రమలో బ్రతుకుతున్న వారి కోసం, భార్య లేక భర్త చనిపోయి ఒంటరిగా వున్న నిర్భాగ్యుల కొరకే “శారదానంద నందనవనాన్ని” నిర్మించుట జరిగింది. కొడుకు, కూతురుకు ఇవ్వగా మిగిలిన ఇరవై ఎకరాల భూమితో, ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయవలసినదిగా ఆసుపత్రిలో శారదతో వీలునామా వ్రాయించాను. గాని నాకంటే ముందే పుణ్యస్ర్తీగా వెళ్లాలన్న తన బలమైన కోరిక, నన్ను ఒంటరిని చేసింది.” అని చెబుతూ “నా అనురాగ ఆలయదేవతైన శారద పేరుతో నందనవనాన్ని రిజిష్టరు చేసి, ఆమెకు అంకితం చేస్తున్నానని” చెబుతూ “నా ఆత్మీయానంద, మనసు మందిర మహారాణికి అంకితం చేస్తున్నానని” తన మనస్సులోని భావాలు, శారద మీద వున్న ప్రేమను ఆనందరావు తెలియజేశాడు.

“తల్లిదండ్రులు అయిదారేళ్ళ పిల్లలను బాగా చదివించాలనే కోరికతో హాస్టలులో చేర్పించడం బాధ్యత అనుకుంటుంటే, తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తేచాలని పిల్లలు అనుకుంటున్నారు. తల్లిదండ్రులే కనిపించే దేవతలు కావున వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అనాధలగా కాకుండా నాధులుగా చేసుకుని, కుటుంబాన్ని ఆనంద హరివిల్లు చేసుకోవాలి” అని ఆనందరావు అన్నాడు. దానితో సభలోని వారందరూ “తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటామ”ని అన్నారు.

“ఇలా ఎవరికి వారు బంధుత్వాలు, భాందవ్యాలను నిర్లక్ష్యం చేయకుండా వుంటే వృద్ధ ఆశ్రమాలు ప్రారంభించవలసిన అవసరం వుండదు. కావున ఎవ్వరూ కూడా బాల్యాన్ని హరించకండి-వృద్ధులను వదలివేయకండి” ఆనందరావు అంటున్న సమయంలో మనవడు నందు వేదిక మీదకొచ్చి “తాతయ్య, నాన్నమ్మల పేరు మీద స్థాపించిన శారదానంద ట్రస్టుకు నా జీతంలో సగమిచ్చి, ట్రస్ట్ అభివృద్ధికి సహాయసహకారాలు అందిస్తానని, నాన్నగారు రిటైరయిన తర్వాత అమ్మనాన్నలను నా దగ్గరే వుంచుకుంటానని” తెలియజేయడంతో సభంతా చప్పట్లతో మార్మోగింది.

మనవరాలు వాణి, “ట్రస్టుకు నా జీతంలో సగభాగమిచ్చి, ట్రస్ట్ అభివృద్ధిలో బావకు సహకారం అందించడమే కాకుండా నాకు పుట్టేపిల్లలను హాస్టల్లో చదివించకుండా ఇంట్లోనే చదివించుకుంటాన” ని ప్రకటించింది. “జీతంలో సగభాగంతో పాటు, జీవితంలో కూడా సగభాగమిస్తే శారదమ్మగారి కోరిక తీరుతుంది” అని భీమయ్య అనగానే సభంతా చప్పట్లతో మార్మోగుతుంటే “నందుబాబు, వాణమ్మ గార్ల ఈడు-జోడు చూస్తుంటే ఆనాటి తమ జంటను చూసినట్లే వుందండి బాబుగారు” అన్నాడు.

తన మనస్సులోని కోరికను భీమయ్య బయటపెట్టడంతో నందు ఆనందానికి అవధులు లేవు, వాణినే తదేకంగా తనివితీరా చూస్తున్నాడు. భీమయ్య మాటలు వినగానే వాణి తలదించుకుని, కాలివేలితో నేలను రాస్తూ, పైట సర్దుకుంటున్న ఆమె ముఖారవిందం సిగ్గు మొగ్గలై, అందరూ వున్నారనే విషయాన్ని మైమరచి బావ వైపు ఓరచూపులు చూసింది. చిన్నప్పటి నుండి రెండుమూడేళ్ళకోసారి కలిసిమెలసి ఆడుకున్న బావామరదళ్ళు, అందరూ వున్న విషయాన్ని మరచి, పెళ్లిచూపుల్లో కొత్తగా ఒకరినొకరు చూస్తున్నట్టు చూస్తుంటే, అక్కడవున్న అందరికి వారి మనస్సులోని భావాలు బహిర్గతం అయ్యాయి. ఆ సమయాన ఆనందరావు

“స్త్రీ యశ్చ పురుషస్యాపి యత్రోభయోర్భవేద్వృతిః,

తత్ర ధర్మార్థకామా స్స్యుస్తదధీనా యతస్త్వమి.”

అని వేదాలు చెబుతున్నాయనగానే “అసలే ఇంగ్లీషు చదువులు మీరేమో సంస్కృతంలో చెబుతున్నారు మాకు కూడా అర్థమయ్యేలా చెప్పండి మావయ్య గారు!” అన్నాడు అల్లుడు.“అలాగే బాబు!” అని నందు, వాణీల వైపు చూస్తూ “ఒకరియందు ఒకరికి ఇష్టం కలిగి ఉభయులును వరించుకున్నప్పుడే ధర్మ, అర్థ, కామములు సిద్ధించును. గావున వివాహం చేసుకోదలచిన ఇరువురికి ఇష్టమైతే వివాహం జరిపిద్దాం” అని ఆనందరావు అనగానే ఇద్దరూ చిరునవ్వుతో తలాడిస్తూ అంగీకారం తెలిపారు.

నందు, వాణిల పెళ్లి విషయమై కొడుకు, కోడలు, అల్లుడు, కూతురు అభిప్రాయాలు తెలుసుకుని వారంతా “మీ ఇష్టమే మా ఇష్టం” అనడంతో “పిల్లలు ఇష్టపడుతున్నారు, అందరూ అంగీకరించారు. మనస్సులు కలిసిన వేళే మంచి ముహర్తం. కావున ఈ శుభసమయాన్నే నిశ్చితార్ధం జరిపిద్దాము” అని, “బీరువాలోనున్న తమ షష్ఠి పూర్తి ఉంగరాలు తీసుకురమ్మని” కోడలుతో అన్నాడు. ఉంగరాలు రాగానే బావమరదళ్ళిద్దరి చేత ఉంగరాలు మార్పించి, నిశ్చయతాంబులాలు జరిపించి, వారిని ఆశీర్వదించి, “మానవ బంధాలే – మా నవ బంధాలు కావాలి” అంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్న ఆనందరావుని

“దొంగపెళ్ళిచూపులు రోజు కూడా ఈ రోజే కదా తాతయ్య!” అంది వాణి. ఆనందరావు “ఊ”అని తలపూపగానే అందరూ ఒక్కసారిగా ఆనందహేళతో చప్పట్లు కొడుతూ “మరో శారద ఆనంద్” అంటూ కేరింతలు కొట్టారు.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు