కుడి ఎడమైతే - మద్దూరి నరసింహమూర్తి

Kudi Edamaithe

బెల్ వినిపించి తెలివొచ్చిన కైలాష్ సమయం ఎంతైంది అని చూసుకుంటే, గడియారం ఉదయం 5 గంటల 20 నిమిషాలు సూచిస్తున్నది.

ఇంత ఉదయమే ఎవరొచ్చారా అని కొంచెం అసహనంగా లేచి వెళ్లి తలుపు తీస్తే, ఎదురుగుండా నిలబడిన మోహన్ ని చూసి కొంచెం ఆశ్చర్యంగా --

"ఏమిటి మోహన్ ఈ సమయంలో వచ్చేవు"

"సర్, ఈ సమయంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి. అసలు ఏమిటయ్యిందంటే"

"లోపలికి వచ్చి కూర్చొని చెప్పు"

"నిన్న మీరు నన్ను తీసుకొని వెళ్లి లాడ్జిలో దింపేరు కదా"

"అవును"

"రాత్రి భోజనం అయినతరువాత అక్కడకి దగ్గరలోనే ఉన్న హాలులో రెండో ఆట సినిమా చూద్దామని లాడ్జిలో మేనేజరుకి చెప్పి వెళ్ళేను సర్"

"మంచిదే"

"సినిమా చూసి వచ్చిన తరువాత ఆ లాడ్జి వాడు నన్ను లోపలికి రానివ్వలేదు సర్"

"ఏమి"

"అదేమో. నేను ఎంత చెప్పినా, నన్ను గేట్ బయటే నిలబెట్టి రిజిస్టర్ చూసి నా పేరే అందులో లేదు అని నన్ను లోపలికి రానివ్వలేదు సర్"

"అప్పుడు లాడ్జిలో మేనేజరు ఉన్నాడా"

"నేను సినిమాకు అని బయలుదేరినప్పుడున్నతను కాక వేరే మనిషి ఉన్నాడు సర్. పైగా అతనే అక్కడ మేనేజరుని అని, నిన్న సాయంత్రం ఆరు గంటలనుంచి అతనే అక్కడ ఉన్నాడని దబాయిస్తున్నాడు సర్"

"మరప్పడు ఏమి చేసేవు, రాత్రంతా ఎక్కడ ఉన్నావు"

"అంత రాత్రి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం బాగుండదని, ఆటోలో బస్సు స్టాండ్ కి వెళ్లి రాత్రంతా అక్కడే ఉండి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేను సర్. రాత్రంతా బస్సు స్టాండ్ లో దోమలు కుట్టి కుట్టి చంపేయి సర్. ఏమీ అనుకోకుండా మీరొకసారి నాతో వచ్చి నన్ను లాడ్జిలోకి పంపే సహాయం చేస్తే, కొంతసేపు పడుకొని మధ్యాహ్నం ట్రైన్ కి వెళ్ళిపోతాను సర్"

"సరే. నేను బట్టలు మార్చుకొని వస్తాను" అని కైలాష్ లోపలికి వెళ్ళేడు.

కైలాష్ నెలరోజుల కోసం ఒక పల్లెటూరిలో ఉన్న బ్రాంచ్ కి తాత్కాలిక బ్రాంచ్ మేనేజరుగా వెళ్ళినప్పుడు ఆ బ్రాంచ్ లో పని చేస్తున్న మోహన్ బాగా దగ్గరయ్యేడు.

నిన్న ఇక్కడ హెడ్ ఆఫీస్ కి పని మీద వచ్చిన మోహన్ అప్పటి పరిచయంతో కైలాష్ ని కలిసి తనకు కొంచెం తక్కువ ధరలో గది దొరికే ఒక లాడ్జి చూసి పెట్టమంటే - కైలాష్ ముందుగా మోహన్ ని తీసుకొని తన ఇంటికి వెళ్లి కాఫీ ఇప్పించి, వెంట పెట్టుకొని వెళ్లి దగ్గరలోనే ఉన్న రెండు లాడ్జీలలో ఒక దాంట్లో గదులు ఖాళీ లేవంటే, మరొక లాడ్జిలో గది కుదిర్చి పెట్టేడు.

మోహన్ ని స్కూటర్ మీద వెనక్కి కూర్చోపెట్టుకొని బయలుదేరిన కైలాష్ ఒక చోట కుడివేపుకి స్కూటర్ తిప్పగానే మోహన్ -- "సర్, ఆగండాగండి" అని కేక పెట్టేడు.

స్కూటర్ ఆపిన కైలాష్ -- "ఏమిటయ్యింది మోహన్, ఎందుకలా కేక వేసేవు"

"మీరు నన్ను దింపిన లాడ్జి ఈవైపున ఉందా"

"అవును. నీకు నిన్న చెప్పేను కూడా మా ఇంటినుంచి బయలుదేరి ఈ కుడివేపుకి తిరిగితే వచ్చే లాడ్జి, గుర్తుంచుకో అని"

"నేను ఒక వెధవని సర్"

"ఏమిటయ్యింది"

"మీరు నిన్న చెప్పినదాంట్లో 'కుడివేపుకి తిరిగితే' అన్న మాటలు మాత్రమే గుర్తుంచుకొని, ఎదురుగుండా రోడ్డుకి ఆ వైపున్న సినిమా హాలు నుంచి వస్తూ "కుడివేపుకి తిరిగితే" వచ్చే లాడ్జికి వెళ్ళేను సర్"

"ఆ లాడ్జిలో గదుల్లేవంటేనే ఇటువేపున్న లాడ్జిలో దింపేను కదా”

"నేను ఘోరమైన తప్పు చేసి, ఈరోజు ఉదయానే మీకు శ్రమ ఇచ్చేను సర్. మళ్ళా నన్ను మీరు క్షమించాలి"

"ఫరవాలేదులే. ఈ లాడ్జిలోకి నువ్వు వెళ్ళినతరువాతే నేను ఇంటికి వెళ్తాను" అంటూ కైలాష్ లాడ్జి దగ్గర స్కూటర్ ఆపి మోహన్ తో సహా లోపలికి వెళ్ళగానే –

అక్కడ కూర్చొని ఉన్న మేనేజర్ మోహన్ ని చూడగానే –

"నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళేరు సర్. రెండో ఆట సినిమా టైం అయిపోయి చాలా సేపు అయినా మీరు రాలేదని కంగారు పడ్డాను నేను" అన్నాడు.

కైలాష్ కలగచేసుకొని "సినిమా నుంచి నేను మా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాను" అని సర్ది చెప్తూ –

మోహన్ తో -- “కుడి ఎడమైతే పొరపాటు లేదోయి అన్నది సినీమా పాట వరకే. నిజానికి కుడి ఎడమైతే పొరపాటే”

“అవును సర్. కామెడీ సినీమా చూసొచ్చి నా బ్రతుకు ట్రాజెడీ చేసుకున్నాను సర్" అన్నాడు మోహన్ ఏడుపు నవ్వు కలగలిపిన వదనంతో.

*****

మరిన్ని కథలు

Aachari mastari vupayam
ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ )
- కొత్తపల్లి ఉదయబాబు
Aadaleka maddela odu
ఆడలేక మద్దెల ఓడు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Garam chai
గరం చాయ్
- వేముల శ్రీమాన్
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao
Aakali
ఆకలి
- అరవ విస్సు
Alludigari alaka panpu
అల్లుడుగారి అలక పాన్పు
- మోహనరావు మంత్రిప్రగడ