గరం చాయ్ - వేముల శ్రీమాన్

Garam chai

ఆదివారం ఉదయం ,ప్రశాంతమైన సముద్రపు చిరుగాలులు కిటికీగుండా ప్రసరిస్తూ నా శరీరాన్ని స్పృశిస్తున్నాయి .ఈ అనుభవాన్న్ని ఆస్వాదిస్తూ పేపర్ చదవడంలో మునిగిపోయాను .సాధారణంగా ఆదివారం మాత్రమే అరుదుగా దొరికే అవకాశం ఇది.మిగితా పని దినాల్లో ఉరుకులు పరుగులు ,ఉదయం పూట సంతృప్తిగా పేపర్ చదివే అవకాశం దొరకదు. నాకు వచ్చే HRA లో ఇంతకన్నా మంచి సౌకర్యం ఉన్న ఇల్లు అద్దెకు దొరకవచ్చు కాని సముద్ర తీరం కోసమే ప్రస్తుతం ఉంటున్న కంపెనీ క్వార్టర్స్ ఎంచుకున్న్నాను. ఉద్యోగంలో చేరేవరకు ఎన్నడూ సముద్రం చూసి ఎరుగను.ప్రక్కనే నా శ్రీమతి ఉంచిన టీ తాలూకు వేడి పొగలు నన్ను పేపర్ నుండి బయటకు లాగాయి. టీవీ లో వస్తున్న "ఏస్కోన గుమగుమ చాయ్ " పాటను పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు."గత అరగంటనుండి ఇక్కడే తిరుగుతున్నాను.మిమ్మల్ని బయటకు లాగింది నేనిచ్చిన ఈ చాయా లేక ఆ హీరోయిన్ ఛార్మి నాట్యం చేసిన ఆ గరం చాయ్ నా, శ్రీమతి ప్రశ్నార్థం,ప్రక్కనే ఉన్న కుర్చీలాగి శ్రీమతిని కూర్చోబెట్టాను.అసలు టీ అంటే నాకు ఎందుకంత పిచ్చో ఈరోజు నీకు చెప్పాల్సిందే.వేడి వేడి టీ తాలూకు మాధుర్యం నన్ను నా యూనివర్సిటీ జాపకాల్లోకి తీసుకెళ్లాయి.

ఆరోజు డిసెంబర్ 23 ,1995 .నాకు ఇంకా జ్ఞాపకం.ఉదయాన్నే తలుపుల మోత.ప్రతి ఉదయం వినిపించే బాగా పరిచయం ఉన్న చప్పుడు.లచ్చవ్వ ,దాదాపు 75 సంవత్సరాల వయసు ఉంటుంది.రోజు ప్రొద్దున్నే మాకు నింద్రాభంగం కలిగిస్తుంటుంది.నిద్రమత్తులోనే వెళ్లి తలుపులు తీసాను."లచ్చవ్వ , చక చక ఊడ్చేసి వెళ్ళు" అంటూ మళ్ళి ముసుగులోకి దూరిపోయాను.."కాని ఎవరో మూలుగుతున్న శబ్దం.ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకొని "ఏమంయింది లచ్చవ్వ,ఎందుకలా వణికి పోతున్నావ్."అని అడిగాను.జలుబు తో పాటు జ్వరం.,చలిగాలులు ఆమె పరిస్థితిని మరింత దిగజార్చాయి.డాక్టర్ దగ్గరకు వెళ్తే బాగుంటుందికదా లచ్చవ్వ అంటే "ఎందుకు సార్,ఈమాత్రం చలి జ్వరానికి డాక్టర్ అక్కరలేదు,మంచి ఒక గరం చాయ్ నోట్లో పడితే అన్ని తగ్గిపోతాయి సార్ ,ఒక్క రెండు రూపాయలు ఇవ్వండి,చాయ్ తాగొస్తాను,అని ప్రాధేయపడింది. లచ్చవ్వ గురించి నాకు బాగా తెలుసు.గత రెండు సంవత్సరాలుగా చూస్తున్నాను.తన పని తానూ చేసుకుపోతుంది,కష్టపడే స్వభావం,ఏ పనికి వెనకాడదు,ఇతరుల సహాయం తీసుకోవడానికి కూడా అంతగా ఇష్టపడదు. వెంటనే రెండు రూపాయలు తీసి ఇచ్చాను, ఆనందంగా వెళ్ళిపోయింది లచ్చవ్వ. లచ్చవ్వ, భర్తతో పాటు కుటుంబీకులంతా ఆక్సిడెంట్లో చనిపోయారు,మిగిలింది మనమడు శీను ఒక్కడే. మరునాడు యధావిధిగా లచ్చవ్వ గది ఊడ్చేందుకు వచ్చింది. "సార్ చూడండి, నేను చెప్పాను కదా, ఒక్క గరం చాయ్ తోని దెబ్బకు మొత్తం జ్వరం దిగి పోయింది", ఆనందంగా నవ్వుతూ చెబుతున్న లచ్చవ్వను చూస్తే మా నానమ్మ గుర్తొచ్చింది. నాకు చాల ఆశ్చర్యం వేసింది,నిజంగా ఒక్క చాయ్ లో ఇంత మహిమ ఉంటుందా? నాకు ఊహకు అందని విషయం. ఆరోజు నుండి నాకు చాయ్ పై వున్నా మమకారం మరింత పెరిగింది అప్పటి నుండి నాకు ఒంట్లో బాగా లేకపోతే మొదటి మందు"చాయ్" అయ్యింది.

మేముండే హాస్టల్ గది నుచి దగ్గరలో ఉన్న టీ స్టాల్ కు వెళ్లాలంటే రెండు కి.మీ. నడవాల్సిందే ,చాయ్ అంటే ఎంతో ఇషం ఉన్న అంత దూరం వెళ్లాలంటే కష్టంగా అనిపించేది. ఆలోచిస్తుంటే నాకు ఓ ఉపాయం తట్టింది, లచ్చవ్వను అడిగాను "నీకు 500 రూపాయలు ఇస్తాను ఇక్కడే ఓ చిన్న టీ కొట్టు పెట్టగలవా" అంటూ ఆమెనే గమనిస్తున్నాను, లచ్చవ్వ ముఖంలో ఏవో కొత్త కొత్త భావాలూ, అదృష్టం తలుపు తట్టినట్టు ఏదో తెలియని ఆనందం ఆమెలో. అయ్యా, "మీరు చల్లగుండాలి " ఆమె కళ్ళలో నీళ్లు. వెంటనే జేబులో నుంచి 500 తీసి ఆమె చేతిలో వుంచాను. "నాకు మాత్రం రోజు ఉదయాన్నే ఒక మంచి వేడి వేడి టీ ఇవ్వాలి" అని ఒక చిన్న ఆర్డర్ ఆమె ముందు వుంచాను. టీ తయారీకి కావలసిన రెండు బొగ్గుల పొయ్యిలు ,కొన్ని కప్పులు,గ్లాసులు ఇతరాత్ర అవసరమైన మిగతా సామాగ్రిని కొనుక్కొని మరునాడు ఉదయాన్నే టీకొట్టు ప్రారంభించింది.

శీను ఆమెకు చేదోడువాదోడుగా ఉండేవాడు.రోజురోజుకి కొట్టు దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. మాకు కావలిసినప్పుడల్లా టీ మాముందు ఉంచేది లచ్చవ్వ.

రోజులు గడుస్తున్నాయి,నాకు ఉద్యోగం రావడం ,హాస్టల్ వదిలి వెళ్లిపోవడం ,చకచకా జరిగిపోయింది.ఐదు సంవత్సరాల తరవాత ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళవలసివచ్చింది.మీటింగ్, యూనివర్సిటీకి దగ్గరలోనే.మీటింగ్లో వున్నాను కానీ ఎందుకో నా మనసు మాత్రం లచ్చవ్వ టీ కొట్టుపైనే వుంది. మీటింగ్ అయిపోవడమే తడవుగా లచ్చ్వవ టీ కొట్టు దిశగా అడుగులు ప్రారంభించాను. పాత యూనివర్సిటీ రోజులు గుర్తుకువస్తున్నాయి.ఎన్నోమార్పులు,కొత్తగా అనిపించింది.అయినా మరపురాని పాత జ్ఞాపకాలు మనసును గిలిగింతలు పెడుతున్నాయి.నా కళ్ళు లచ్చవ్వ టీ కొట్టు కోసం వెతుకుతున్నాయి.కానీ అక్కడ టీ కొట్టు కనిపించలేదు.మదిలో ఏదో ఆందోళన .ఏమైవుంటుంది. వ్యాపారం బాగానే వుండింది కదా ,టీ కొట్టును మూసివేయ వలసిన సంఘటనలు ఏమి జరిగివుంటుంది”,మనసులో ఏదో తెలియని ఆందోళన .ఆలోచనలతో పాటు అడుగులు ,తెలియకుండానే కొంత దూరం తీసుకెళ్లాయి. తలపైకెత్తి చూసేసరికి లిప్తపాటు సమయం కనురెప్పలు ఆగిపోయాయి.పెద్ద హోటల్,పైన పెద్ద పెద్ద అక్షరాలతో నా పేరు.నిజంగా నా పేరే హోటల్ పైన .కలా,నిజమా, నమ్మలేకుండావున్నాను.మెల్లిగా తేరుకొని అతృతతో అడుగు పెట్టాను.కౌంటర్లో శీను కూర్చొనివున్నాడు. మనిషి పెరిగిన ,ముఖకవళికల వల్ల,సులభంగానే గుర్తించాను.ఒక్క క్షణం తేరుకుని శీను కూడా నన్ను గుర్తుపట్టాడు.ఒకప్పుడు వేసుకోడానికి సరైన బట్టలు కూడా లేని చిన్న పిల్లడు ఇప్పుడు ఒక పెద్ద హోటలుకి యజమాని.కళ్ళు చెమ్మగిల్లాయి,తెలియని ఆనందం ,శీను కుశలప్రశ్నలు వేస్తూ మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ నా కళ్ళు మాత్రం లచ్చవ్వ కోసం వెతుకుతున్నాయి.శీను,ఇంతకీ లచ్చవ్వ ఎక్కడా,ఆత్రుతతో అడిగాను.శీను గొంతు మూగబోయింది.ఒక్కసారి శీను కళ్లనుంచి నీళ్లు,సార్,నానమ్మ చనిపోయి నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి.బహుషా,మీరు వెళ్ళిపోయినా తర్వాత సంవత్సరకాలానికి అనుకుంటాను.అప్పటికి టీ కొట్టు బాగా పుంజుకుంది,చనిపోయేముందు నా నుండి ఒక మాట తీసుకుంది.మీ పేరుమీదే హోటల్ మొదలు పెట్టాలని. ఎప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకం చేసేది,మీ గురించే చెపుతుండేది.ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే ,మీ సహాయం,దయాదాక్షిణ్యాలవల్లే.

“సారు పేరు మీద హోటల్ పెడితే బాగుపడతాం బిడ్డా “,అని పదే,పదే చెపుతుండేది. అవ్వ మాటమీద ,మీపై అభిమానంతో మీ పేరుమీదే హోటల్ ప్రారంభించాను సార్,మీ దయ వల్ల చాలా బాగా నడుస్తున్నది ,శీను చెప్పుకుంటూ పోతున్నాడు. లచ్చవ్వపై నాకున్న అభిమానం రెట్టింపయింది.స్వార్థపరులు,కృతజ్ఞత లేని మనుషులు ఎక్కువైనా ప్రస్తుత సమాజంలో లచ్చవ్వ లాంటి వ్యక్తులు చాలా అరుదు.

ఇంతలో హోటల్ లోని కుర్రాళ్ళు మా చుట్టూ చేరారు.శీను వాళ్ళందరిని పరిచయం చేసాడు.సార్,వీళ్లంతా తమవారు ఎవరు లేని నా స్నేహితులే. ఇప్పుడు మన హోటల్లో అందరం కలిసి పనిచేస్తున్నాం,వీరి వల్లే మన హోటల్ ఈరోజు ఈ స్థాయిలో ఉంది.ఇప్పుడు మాదంతా ఒకటే కుటుంబం సార్. అంతా కలిసే ఉంటాం ,ఈ హోటలే మా ప్రపంచం. శీను మాటలు గుండెను తాకుతున్నాయి.చిన్నవాడైనా ,శీను మాటలతో నాలో ఎదో తెలియని గిల్టీనెస్.-నిజంగా శీను చేస్తున్న సహాయం ముందు,నేను చేసిన సహాయం చాలా చిన్నది.అదీ కొంత నా స్వార్థము కోసమే.

సార్,ఏం తీసుకుంటాం చెప్పండి,శీను అడుగుతున్నాడు.ఏం వద్దు శీను,కానీ ఓ చిన్న సహాయం చేసిపెట్టు,యూనివర్సిటీ దగ్గరలో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గర నన్ను కాస్తా దింపేయి" అన్నాను.ఆ రోజు నుండి మళ్ళి ఎంతో కొంత నాకు తోచిన సహాయం ఓల్డ్ ఏజ్ హోంకి చేయడం ప్రారంభించాను. “ఇదీ నాకు గరం చాయతో ఉన్న అనుభందం" అర్థమైందా అంటూ నా శ్రీమతి కళ్ళలోకి చూసాను.

నా కోసం మరో టీ అంటూ వంటింట్లోకి వెళ్ళింది నా శ్రీమతి.

అనుభవాలకు ,అనుబంధాలకు అంతస్తులు అడ్డుకావు .గుండెనిండా గూడుకట్టుకునే జ్ఞాపకాలు ,ఏ బంధంలేని లచ్చవ్వలతో ముడిపడినవి కావచ్చు.రోజు తాగే గరం చాయలు అవ్వచ్చు.

మరిన్ని కథలు

Atchi vachhina moorkhulul
అచ్చి వచ్చిన మూర్ఖులు
- డి.కె.చదువుల బాబు
Avakaram
అవకరం
- డి.కె.చదువుల బాబు
Nalugu prasnalu
నాలుగు ప్రశ్నలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Satpravarthana
సత్ప్రవర్తన
- చెన్నూరి సుదర్శన్
Chalicheemalu kaadu
చలిచీమలు కాదు
- జి.ఆర్.భాస్కర బాబు
Enta chettuki anta gaali
ఎంతచెట్టుకు అంత గాలి
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Mandakini
మందాకిని
- సడ్డా సుబ్బారెడ్డి
Vunnadi okate jeevitam
ఉన్నది ఒక్కటే జీవితం
- తాత మోహనకృష్ణ