ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ ) - కొత్తపల్లి ఉదయబాబు

Aachari mastari vupayam


రాఘవపురంలో నివసిస్తున్న శివరావు పార్వతమ్మ దంపతులకు లేకలేక ఒకే ఒక కొడుకు పుట్టాడు. వాడికి రంగడు అని పేరు పెట్టుకుని ఎంతో గారంగా పెంచసాగారు ఆ తల్లితండ్రులు.

దాంతో వాడు చాలా పెంకిగా తయారయ్యాడు. ఏదో ఒక చెడ్డ పనిచేసి తన తోటిపిల్లల్ని బాధపెట్టి వాళ్లే తనను బాధ పెట్టినట్లు తల్లితండ్రులకు చెప్పేవాడు. దాంతో తల్లి తన కొడుకుని వెనకేసుకుని వచ్చి తన మీదకు దెబ్బలాడిన వాళ్లమీద మరింతగా నోరు పెట్టి అరిచేది పార్వతమ్మ. దాంతో వాడితో ఆటలు ఆడటానికి ఏ ఒక్కరు వచ్చేవారు కాదు.

ఒకరోజు షావుకారు సుబ్బయ్య మూడు రోజుల క్రితం తిరుపతి వెళ్లి గుండు చేయించుకుని ఊళ్లోకి వచ్చాడు.
బడిలో మాస్టారికి దేవుని ప్రసాదం ఇవ్వాలని పార్వతమ్మ ఇంటి ముందు నుంచి వెళుతూ ఉండగా, బొమ్మల్లో ఆడుకుంటున్న రంగడు ఒక గులకరాయి తీసి సూటిగా సుబ్బయ్య గుండును కొట్టాడు. సుబ్బయ్యకు రాయి గట్టిగా తగిలి చిన్నగా రక్తం చిమ్మింది.రంగడి విషయం ముందే తెలిసిన సుబ్బయ్య, " గురి చూసి బాగా కొట్టావు. ఈ రూపాయి తీసుకుని ఏదైనా కొనుక్కో."అని రూపాయి ఇచ్చి వెళ్లిపోయాడు.

" నున్నగా ఉన్న గుండెను కొడితే రూపాయి ఇస్తారు అన్నమాట" అనుకున్న రంగడు ఆ ఊరిలో ఎవరు గుండుతో కనిపించినా రాయి పెట్టి కొట్టేవాడు. ఈసారి దెబ్బతిన్నవాళ్ళు వాళ్లు ఊరుకోలేదు. రంగడ్ని చితక్కొట్టి తీసుకొచ్చి పార్వతమ్మని హెచ్చరించి వెళ్లారు.

ఎప్పుడు ఎవరి చేత దెబ్బలు తినని రంగడికి తీవ్రమైన జ్వరం వచ్చేసింది. వాడిని తీసుకుని ఆచారి మాస్టర్ దగ్గరికి పరిగెత్తింది పార్వతమ్మ.

" చూడు పార్వతమ్మ నిజానికి మీ వాడికి వైద్యం చేయకూడదు. ఈ ఊరిలో వాడు చేత దెబ్బతినని చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా చెప్పు? వాడు చేసిన తప్పును విడమర్చి చెప్పకుండా నువ్వు కూడా వాడిని సమర్దించావు. ఇకనైనా నీ కొడుకుని మంచి దారిలో పెట్టుకో. "అని మంచి మందు ఇచ్చాడు.

" బాబుగారు. వాడిని దారిలో పెట్టాలంటే ఏం చేయాలో మీరే సలహా ఇవ్వండి బాబు" అని ఆచారిగారి కాళ్ళ మీద పడింది పార్వతమ్మ కన్నీళ్ళతో.

" బడిలో చేరే వయసు వచ్చిన వాడిని బడికి పంపకపోవడం వల్ల, నీ అతిగారాబంవల్ల వాడిలా తయారయ్యాడు. వాడిని రేపటి నుంచి బడికి పంపించు. నేను ప్రతీరోజు వాడికి ఒక కథ చెప్పి పంపిస్తాను. బడిలో మాస్టారు ఏం కథ చెప్పారో అది నాకు చెప్పరా... అని నువ్వు వాడిని అడుగు. అందులో నీతిని వాడికి విడమర్చి చెప్పు. ఈ ప్రపంచంలో కథలు ఇష్టపడని పిల్లలు ఉండరు. ఆ విధంగా వాడిలో మనం మార్పు తీసుకురావచ్చు. నీ పిల్లవాడు బాగుపడటం నీకు ఇష్టమైతే నేను చెప్పినట్టు చెయ్." అన్నారు ఆచారి మాస్టారు.

తూచా తప్పకుండా ఆయన సలహా పాటించింది పార్వతమ్మ.
మరి కొద్దిరోజుల్లోనే రంగడు ఆచారి మాస్టారి ఉపాయం ఫలించి మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు.

సమాప్తం

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ