చెప్పుడు మాటలు చేటే! - సృజన.

Cheppudu maatalu chete

తను ఉన్న చెట్టు ముందునుండి అలావెళుతున్న ఏనుగును చూసిన కోతికి మెరుపులాంటి ఆలోచనరావడంతో " తాతో ఏనుగు తాత ఆగు నీకో ముఖ్య రహస్యం చెప్పాలి ఉదయం నుండి చూస్తున్నా నీకొసం " అన్నాడు.

" ఏమిటి అంత రహస్యం మనమడా " అని తన తొండంతో కోతిని తన చెవివద్దకు తీసుకున్నాడు.

ఏనుగు చెవివద్ద గుస గుసలాడాడు కోతి.

" ఏమిటి ఆవెధవ అలా అన్నాడా నన్ను,ఈరోజే వాడి సంగతి తేలుస్తాను " అని కోపంతో రుస రుస లాడుతూ వెళ్ళాడు ఏనుగు.

వేగంగా వెళ్ళిన కోతి " బాబాయ్ నీకో రహస్యం చెప్పాలి నీచెవి ఇలా పెట్టు " అన్నాడు.ఆసక్తిగా అంతా విన్న గుర్రంతన చెవితో కోతిమూతిపైన ఒక్కటి ఇచ్చింది. " అబ్బ మూతి పగిలింది " అన్నాడు కోతి." అరే దోమ కుడుతుంటే చెవి విదిల్చాను , అయినా నన్నుగుడ్డి వెధవా అంటాడా ఈరోజే అటో ఇటో తేలిపోవాలి " అని గుర్రం వెళ్ళిపోయాడు.

వేగంగా పరుగులు తీస్తూ వెళ్ళిన కోతి '' నక్కమామ నీ చెవి ఇలా ఉంచు నీకో రహస్యం చెప్పాలి '' అని చెవి వద్ద గుసగుసలాడాడు.'' అల్లుడు నీ సహాయానికి ధన్యవాదాలు, కాలు బెణికింది నెమ్మదిగా వెళతాను '' అన్నాడు నక్క. పరుగు పరుగునవెళ్ళి కోతి , నక్కభార్య చెవి వద్ద "అత్తా ఎంత ప్రమాదమో! " అని గుసగుసలాడాడు."వామ్మో ఓరి దేవుడో నేనేంచేతురో అంటూ శోకాలు పెడుతూ ముక్కుచీది కోతిబావ మెహాన వేసింది. "ఛీ ఛీ "అంటూ సెలఏటివద్ద ముఖం కడుక్కుని, ఈదెబ్బతో అడవిలోని పలుజంతువులు గొడవపడి కొట్లాటకు దిగుతాయి అనుకుని త్రుప్తిగా నవ్వుకుంటూ చెట్టుపైకి చేరాడు కోతి.

తనకు ఎదురైన గుర్రాన్నిచూసిన ఏనుగు " ఏమయ్య నేను ఏంతింటే నీకెందుకు , నేను రోజుకు ఆరుమూటల గడ్డి తింటానా? " అన్నాడు.

" ఏవయ్యో వయసులో పెద్దవాడివి మాటలు తూలక నువ్వు ఆరుమూటలు తింటేనాకెందుకు ముడుసార్లు లద్దె వేస్తె నాకెందుకు , నీగడ్డినీదే, నాగడ్డి నాదే ఐనా ఈవయసులో నీకిదేంబుద్ది నేను ఉలవ కోసం కావాలని అందరిని అడుగుతున్నానా? " అన్నాడు గుర్రం.

"ఎవరు చెప్పింది నీగురించి నేను ఎప్పుడు ఎవరిదగ్గరా అలా అనలేదే!" అన్నాడు ఆశ్యర్యంగా ఏనుగు."మరేంటి కోతి నీమీదనాకు అలాచెప్పిడే" అన్నాడు ఏనుగు." సరిపోయింది నువ్వు నన్ను అన్నావని వాడే నాకు చెప్పాడు " అన్నాడు గుర్రం. " పదవాడి సంగతి తేలుద్దాం! " అని ఇరువురు సింహా రాజువద్దకు బయలు దేరారు.

"ఈతరాని దానివి వాగుదగ్గరకు ఎందుకు వెళ్ళావే ,నీకు అంతగా పీతలు తినాలి అనిపిస్తే నన్నడిగితే నేను తెచ్చి పెట్టేవాడినిగా! నీకేదైనా జరిగితే ఏమయ్యేను,సమయానికి కోతివచ్చి నిన్నుకాపాడడుకాబట్టి సరిపోయింది లేకుంటే ఎంతప్రమాదం జరిగేదో " అన్నాడు నక్క తన భార్యతో

" ఏమిటి నేను వాగుదగ్గరకు వెళ్ళలేదే నువ్వు బావిలో దూకావంట చావడానికి అంతకష్టం ఏంవచ్చింది " అంది నక్కమ్మ."నేను చావడమేమిటే నువ్వు వాగులో పడ్డావని నిన్ను కాపాడనని కోతిగాడు నాకు చెపితే! " అన్నాడు.కోతి పెట్టిన తగవు అని విషయం అర్ధమైన నక్కలజంట సింహరాజు దగ్గరకు బయలుదేరారు.

అలా నక్కలజంట,ఏనుగు,గుర్రం, కోతి ద్వారా తగవు పడిన మరికొన్ని జంతువులు,అంతా కలసి సింహారాజు వద్ద సమావేశమైనారు.కుందేలు వెళ్ళి కోతిబావను తీసుకువచ్చింది.

" నీకు ఇదేంబుద్ది కోతి,అందరి చెవులవద్ద గుసగుసలాడి అందరికి ఉన్నవి లేనివి కల్పించి తగవులుపెడు తున్నావు, చెప్పుడు మాటలు చేటు కలిగిస్తాయని తెలియదా '' అన్నాడు సింహరాజు.

'' ప్రభూ చెప్పుడు మాటలు వినడం ఎంత ప్రమాదమో తెలియజేయడానికే నేను ఇలా చేసాను. మనకు ఎవరైనా ఇతరులపై తప్పుగా చెపితే విని విచారించి నిర్ధారించుకోవాలి అప్పుడు నిజానిజాలు తెలుస్తాయి,అంతేకాని చెప్పుడు మాటలువిని ఎదటి వారిని అపార్ధంచేసుకోవడం ఎంత తప్పో అనుభవపూర్వకంగా తెలియజేయడానికే నేను ఇలాచేసాను"అన్నాడు వినయంగా కోతి.

'' నిజమే చెప్పుడు మాటలు చేటే , ఏమో అనుకున్నా నీకు తెలివి తేటలు ఉన్నాయే! మంచి సందేశమే ఇచ్చావు "అన్నాడు సింహరాజు.

సింహరాజు మాటలు విన్న జంతువులన్ని సంతోషంగా కేరింతలు కొడుతూ కోతి భుజంతట్టి వెళ్ళాయి.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ