కపటి - Viswanath coushik

Kapati

ఉదయం '10' గంటలయింది . గణగణమంటూ స్కూల్ బెల్ వినపడుతోంది . అది విశాఖపట్నం లో 'BHPV' దగ్గరలో ఒక హై స్కూల్ . ఒక ఆటో స్కూల్ గేట్ దాటి లోపల ఆఫీస్ రూమ్ వరకు వెళ్లి ఆగింది . సాధారణంగా బయటి బళ్ళు స్కూల్ గేట్ దాటి లోపలికి అనుమతించరు . కానీ ఆ ఆటోలోంచి దిగినది ఆ స్కూల్ హిందీ టీచర్ వింధ్యవాసిని గారు . ఆవిడ వాకర్ పట్టుకుని దిగింది . తీవ్రమైన ముడుకుల నొప్పి వలన వాకర్ సాయం తో నడుస్తారు ఆవిడ . అందుకనే హెడ్ మాస్టర్ నాయుడు గారు ఆటో ఆఫీస్ వరకు రావడానికి ఆవిడకి అనుమతి ఇచ్చారు .

ఆఫీస్ రూమ్ లో ముందుగది లో అటెండర్ సోమేశ్వర్ రావు ఉంటాడు . అతని దగ్గరే అన్ని క్లాసుల అటెండన్స్ రెజిస్టర్లతో పాటు , టీచర్లందరూ సంతకాలు చేసే రిజిస్టర్ ఉంటుంది అదికాక వేరే బుక్ లో ఆరోజు అందరి టీచర్ల క్లాసులు ఎప్పుడు ఉన్నాయో రాసిపెట్టి ఉంచుతారు .

అయితే ఈ క్లాసులు ఏ ఏ పీరియడ్స్ అన్నది ముందుగానే నిర్ణయించినా , ఒకో సారి ఆ సబ్జెక్టు టీచర్లు సెలవు పెట్టినా , ఇంకేమైనా ఇతర కారణాలవల్ల పీరియడ్స్ ముందు వెనక అవ్వడం లేదా మెయిన్ సబ్జెక్టు టీచర్లు రానప్పుడు ఏ క్రాఫ్ట్ టీచర్ నో డ్రాయింగ్ టీచర్ నో ఆ క్లాసుకు పంపడం కానీ వెరే సబ్జెక్టు టీచర్ ఆ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది . టీచర్లు సంతకాలు చేసిన తరువాత ఆ రూమ్ కి ఆనుకునివున్న హెడ్ మాస్టర్ రూమ్ లోకి వెళ్లి ఆయన్ను విష్ చేసి తరవాత టీచర్స్ రూంకో , క్లాస్ కో వెళ్లి పోతారు .

వింధ్యవాసిని గారు ఆరు నుంచి పది తరగతులకు హిందీ టీచర్ . ఆవిడ ఉద్యోగంలో చేరిన దగ్గరనుంచి ఇదే స్కూల్ లో పని చేస్తున్నారు . చాలా చక్కగా ఆవిడ బోధించే తీరువల్ల ఆ స్కూల్ లో ఎప్పడూ ఏ విద్యార్ధి హిందీ లో ఫెయిల్ కాలేదు . ఆవిడను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చెయ్యకుండా ఈ స్కూల్ లోనే ఉంచేశారు . ఆవిడ భర్త మునిసిపల్ ఆఫీస్ లో పని చేస్తుంటారు .

చాలా చిన్న ఉద్యగం . నలుగురు పిల్లలు వాళ్లకి . ఇంకా ఎవరూ సెటిల్ అవ్వ లేదు .

పంక్చవాలిటీ కి , డిసిప్లిన్ కి ఆవిడ పెట్టింది పేరు . చాలా సంవత్సరాల నుండి బెస్ట్ టీచర్ అవార్డు కూడా ఆవిడకె వస్తుంటే ఇక వద్దని మిగతా వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసింది . ఇప్పుడు ఆవిడ వయసు ఏభైఒకటి . మిగతా టీచెర్లందరికీ ఆవిడంటే గౌరవం .

ఆర్ధికంగా ఆవిడ చాలా మంది టీచర్లలాగే మధ్య తరగతి లోనే వున్నా , అడిగితె ఎవరికైనా కాదనకుండా మనస్ఫూర్తిగా సాయం చేస్తుంది . తెలుగు టీచర్ మృణాళిని , సోషల్ స్టడీస్ టీచర్ సోమలింగం గార్లు ఎక్కువగా ఆవిడ చుట్టూ తిరుగుతూ వుంటారు . ముఖ్యంగా సోమలింగమైతే మరీను . చెల్లెమ్మా అంటూ ఆప్యాయం గా పలకరించడమే కాకుండా చుట్టం లాగ వాళ్ళ ఇంటికి ఫ్యామిలీతో రాకపోకలు కూడా చేస్తుంటారు .

రెండు సంవత్సరాల క్రితం వరకు ఆమె బాగానే నడిచే వారు . ఆర్తరైటిస్ ఎక్కువ అవ్వడం వలన ఎక్కువసేపు నిలబడడం గాని నడవడం గాని కష్టమైపోతుంటే హెడ్ మాస్టర్ నాయుడు గారు ఒక ఏర్పాటు చేశారు . హై స్కూల్ లో రెండు ఎక్స్ట్రా క్లాస్ రూమ్ లు వున్నాయి . అవి సాధారణంగా ఏ సంవత్సరమైనా ఏ క్లాస్ పిల్లలైనా నలభై గాని ఏభై గాని దాటివుంటే రెండు సెక్షన్లు గా చేసి ఆ ఎక్స్ట్రా క్లాస్ రూమ్ లో కూచోబెడతారు . అందులో ఒక రూమ్ నాలుగు సంవత్సరాలనుంచి ఖాళీ గా ఉంటోంది . అటెండెన్స్ రెజిస్టర్లో సంతకమైపోగానే ఆవిడను ఖాళీ క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి , ఒక్కొక్క క్లాస్ పిల్లలనీ ఆవిడ రూమ్ కి పంపేవారు . ప్రతి క్లాస్ లీడర్ క్లాస్ అటెండెన్స్ రిజిస్టర్ తనతో తెచ్చి ఆవిడ క్లాస్ అయిపోగానే పట్టుకెళ్లి పోయేవారు .

ఆ విధంగా రెండు సంవత్సరాలనుంచి ఆవిడ స్కూల్ నుంచి తిరిగి వచ్చే వరకు ఒకే రూమ్ లో కూర్చుంటున్నారు .

రెండురోజుల తరువాత తెలిసింది నాయుడుగారు వచ్చే నెలే రిటైర్ అవుతున్నారనే విషయం .దాంతోపాటు వచ్చే హెడ్ మాస్టర్ ఎవరనే కుతూహలం బయలుదేరింది . అయితే స్కూల్ లోనే సైన్స్ మాస్టర్ రామా రావు గారు , సోమ లింగం గారు ఇద్దరు సీనియర్లే అవ్వడం వలన ఇద్దరిలో ఎవరికి హెడ్ మాస్టర్ గా ప్రమోషన్ అన్నది అందరు ఎదురు చూస్తున్న విషయం . చివరకి సోమలింగం గారే నెల తర్వాత హెడ్ మాస్టర్ అయ్యారు .

స్కూల్ లో స్వీట్స్ పంచడమే కాకుండా అయన స్వయంగా వింధ్యవాసిని గారింటికి వెళ్లి స్వీట్స్ , ఫ్రూప్ట్స్ ఇచ్చి వచ్చారు . సోమలింగం గారు హెడ్ మాస్టర్ అయిన రెండు రోజుల తర్వాత వింధ్య గారు ఒక రోజు సెలవు తీసుకుని మర్నాడు స్కూల్ కి వెళ్లి రిజిస్టర్ లో సంతకం చేసి తాను ఎప్పుడు కూర్చునే క్లాస్ రూమ్ కి వెళ్ళింది . ఆశ్చర్యం , రూమ్ తాళం వేసి వుంది . ప్యూను నారాయణ మరిచి పోయాడా ? దూరంగా మరో క్లాస్ రూమ్ దగ్గర కనిపిస్తున్న నారాయణను కేకేసి పిలిచింది . నారాయణ పరుగున వచ్చి దండ కట్టుకుని చెప్పాడు . అమ్మగారూ సోమలింగం మాష్టారు తాళం తియ్యొద్దని చెప్పారండి . ఎందుకని , ఏమైంది అనుకుంటూ హెడ్ మాస్టర్ రూమ్ కి వెళ్ళిందావిడ .

అతను రూమ్ లో లేడు . పావుగంట తర్వాత వస్తూనే సీరియస్ గా వెళ్లి సీట్లో కూచుని , అప్పుడు వింధ్య గారిని చూసి , ఆ మీకే కబురు పెడదామనుకుంటున్నానండి టీచర్స్ రూంలో ఉన్నారేమో అని వింధ్యవాసిని గారు అన్నాడు . ఎప్పుడూ చెల్లెమ్మా అంటూ పలకరించే సోమలింగం ఈ రోజు పేరు పెట్టి పిలవడం ఆశ్చర్యంగా అనిపించింది .

అతను చెప్పడం ప్రారంభించేడు ఆవిడ మాట్లాడే లోపే : చూడండీ , నేను ఈ స్కూల్ కి కొత్త హెడ్ మాస్టర్ ని . దీనిని సక్రమంగా నడపడం నా బాధ్యత . ఇక్కడ రూల్ అందరికి ఒకటే . అందరు క్లాసులకి వెళ్లే పాఠాలు చెప్పాలి . ప్రత్యేక ఏర్పాట్లు , మినహాయింపులు ఇచ్చుకుంటూ పొతే సక్రమంగా పని చేసే వాళ్ళు సగం కూడా మిగలరు . అది కాకుండా ప్రతి క్లాస్ పిల్లలని అటు ఇటు తిప్పడం అటెండెన్స్ రిజిస్టర్ వాళ్ళ చేతికివ్వడం ఎంత న్యూసెన్స్ . కాబట్టి మీరు ప్రతి క్లాస్ కి వెళ్లే తీరాలి . మీ సెవెంత్ క్లాస్ పిల్లలు వెయిట్ చేస్తున్నారు క్లాస్ కి వెళ్ళండి . అని అర్జెంటు పని వున్నవాడిలా మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు . హతాశురాలయ్యింది వింధ్య వాసిని .

ఒక వారం కష్టపడి అన్ని క్లాసులకి వెళ్లేసరికి ఆవిడకి కాళ్లనొప్పులు ఎక్కువై మళ్ళీ మూడు రోజులు స్కూల్ కి వేళ్ళ లేక పోయింది . నాలుగో రోజు ఆటో లో స్కూల్ కెళ్లే సరికి మెయిన్ గేట్ దగ్గర వున్న వాచ్ మెన్ వికెట్ గేట్ తెరుచుకుని బయటకు వచ్చి మేడం పది గంటలకి స్టూడెంట్స్ వచ్చే సమయంలో వికెట్ గేట్ తప్ప మెయిన్ గేట్ తెరవద్దని సర్ చెప్పారు అన్నాడు .

ఆవిడ వుసూరని అక్కడినించే నడుచుకుని వెళ్లి సంతకం పెట్టి ఇక హెడ్ మాస్టర్ రూమ్ కెళ్ళి ఏమి అడగకుండా తిన్నగా క్లాస్ కి వెళ్ళిపోయింది . నెల రోజులు గడిచిన తర్వాత రోజు ఎక్కువ నడవలేని పరిస్థితిలో ఉద్యోగానికి రాజీనామా చేసేసింది వింధ్యవాసిని.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు