మోసం - వెంపరాల దుర్గా ప్రసాద్

Mosam

రోజూ లాగే స్కూటర్ మీద విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి చేరు కున్నాను. తుని ప్యాసింజెర్ కి రోజూ ఎలమంచిలి దాక వెళ్ళాలి నేను. ఉద్యోగస్తులు రోజూ పొద్దున్న ఆ ప్యాసింజెర్ కే వెళ్తారు. మంత్లీ టికెట్ తీసుకుని రైలు ఎక్కేస్తారు. దాదాపు 6 పెట్టెల నిండా ఉద్యోగులే వుంటారు.

ట్రైన్ ప్లాటుఫామ్ మీద కదల దానికి సిద్ధం గా వుంది. గభాలున ఎక్కేసేను.

ట్రైన్ అప్పటికే కిక్కిరిసి వుంది.

సుబ్బారావు అని, మా కొలీగ్ అప్పటికే సీట్లో కూర్చుని ఉండడం తో నన్ను చూసి పిలిచి సీటు ఇచ్చేడు. గుమ్మం దగ్గరే సీటు దొరికింది .

ఎదురుగా ఒక ఫామిలీ కూర్చుని వున్నారు. బహుశా పల్లెటూరు వాళ్ళు అనుకుంట..వాళ్ళ వాలకం, అన్నీ వింతగా చూస్తూండడం తో అలా అనిపించింది.

భర్త, భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. వాళ్ళ పక్కనే ఇంకో వ్యక్తి వున్నాడు బహుశా, వాళ్ళ బంధువులా వున్నాడు. ఆ స్త్రీ ని అక్కా అని పిలుస్తున్నాడు.

ట్రైన్ కదిలింది. దువ్వాడ స్టేషన్ దాటేసరికి ఎక్కడనుంచి వచ్చేరో తెలియదు..

మా కంపార్ట్మెంట్ లో నేల మీద పాత దుప్పటి పరిచి, బట్టల మూట విప్పేరు కొంతమంది.

ఆ మగ వాడు అంటున్నాడు..

“అయ్యా లారా.. అమ్మలారా దుప్పట్లు, చీరలు, ప్యాంటు లు తక్కువ ధరకే ..

ఇవి మీరు పాడుకుని కొనుక్కోవచ్చు. మేము గుజరాత్ నుంచి తెచ్చి అమ్ముతున్నాము..

పావలా లాభం వున్నా చాలు అమ్మేస్తాము. "

కంపార్ట్మెంట్ లో జనం ఆసక్తి గా చూస్తున్నారు. నెమ్మదిగా వాళ్ళు బట్టల మూట తెరిచి, ఒక్కొక్క ఐటెం తీసి పరిచి చూపిస్తున్నారు.

అందరూ గుమికూడడం మొదలయింది. జనం , కూర్చున్న చోట కొద్దిగా సర్దుకుని కూర్చుని, కాళ్ళు పైకి పెట్టుకున్నారు. కింద, వాళ్ళు పరిచిన బట్టలు పెట్టడానికి.

ఇంతలో పాట మొదలు పెట్టేడు..

ఒక చీర తీసి ఆ వ్యక్తి ఇలా చెప్తున్నాడు..

“ఇది 5౦౦ రూపాయల చీర.. ఆక్షన్ లో యెంత తక్కువ కయినా లేక ఎక్కువ కయినా పాడుకోవచ్చు. మీకు నచ్చిన దాన్ని బట్టి, ఆ చీర దక్కించుకోవాలన్న పట్టుదల బట్టి ఉంటుంది. ఆలస్యం చేస్తే ఆశా భంగం.”

“పాట 25 రూపాయల నుండి ఉంటుంది."

అందరూ ఆశ్చర్య పోతున్నారు.

ఇంతలో ఒకతను “నా పాట 25 రూపాయలు “ అన్నాడు.

వెంటనే మరొకడు..”౩౦ “అన్నాడు. మరొకడు “40” అన్నాడు..

అలా ఆ పాట 150 వరకూ వెళ్ళింది. ఇంకా ఎవరూ పాడట్లేదు. పాడుకొన్నఆసామికి 150 రూపాయలకి ఆ చీర ఇచ్చేసి 150 తీసుకున్నాడు బట్టలవాడు .

ఇప్పుడు దుప్పటి తీసేడు బట్టలవాడు .

“ఇది 500 రూపాయల దుప్పటి..పాట మీ ఇష్టం” అంటున్నాడు.

మళ్ళీ ఇంకొక వ్యక్తి “25 “రూపాయల తో మొదలు పెట్టి, “130” వరకూ పాడేడు.

130 రూపాయల కంటే ఎవరూ పాడలేదు. 130 రూపాయలకి ఆ దుప్పటి ఇచ్చేసేడు.

అందరూ ఆశ్చర్యం గా చూస్తున్నారు. ఆ చీర కొన్న వ్యక్తి, దుప్పటి కొన్న వ్యక్తి , యెంత తక్కువకి పాడుకున్నారో..అని డిస్కషన్ కూడా మొదలయింది. జనాల్లో ఆసక్తి, ఆశ మొదలవడం నేను గమనిస్తున్నాను.

సాధారణం గా నేను రైలు ఎక్కిన దగ్గర నుంచి ఎలమంచిలి వచ్చే దాకా, పేపర్ చూస్తూ గడిపేస్తాను..మిగిలిన విషయాలు పట్టించుకోను.

ఇవాళ కాలక్షేపం బాగానే వుంది.. అనిపించింది.

మళ్ళీ వాడు ఈ సారి “ బెనారస్ చీర..1000 ఖరీదు చేసే చీర..ఎవరయినా పాడుకోవచ్చు”

అన్నాడు.

ఈ సారి ఎదురుగా వుండే స్త్రీ ఆ చీర చేతిలోకి తీసుకుని చూసింది. మొగుడు తో అంటోంది..

“పాడు “ అని.

ఆ మొగవాడు పాట మొదలు పెట్టె లోపే.. ఒక కొత్త వ్యక్తి “500 “ అన్నాడు.

ఆ స్త్రీ మొగుడి కేసి చూసింది.

మొగవాడు “600 “ అన్నాడు.

ఇంతలో ఎవరో “700 “ అన్నారు.

స్త్రీ నిరాశగా చూస్తోంది. మొగవాడు “900 “ అన్నాడు, ఇంకెవరూ అంతకు మించి పాడలేదు.

కానీ మొదట పాటలు రెండు, 150 కంటే లోపల ముగిస్తే, ఇప్పుడు పాట ఎక్కువే అవుతోంది.. కానీ 1000 రూపాయల చీర 900 కే వచ్చింది అని ఆ స్త్రీ కి, వాళ్ళ ఆయనకీ ఆశ పెరిగింది. ఈసారి అమ్మేవాడు దుప్పటి తీసేడు.

ఇలా పాట అవుతూంది, ఎదురుగా వున్న దంపతులు మొత్తం 3 దుప్పట్లు, అతనికి 2ప్యాంట్లు,ఆవిడకి 4 చీరలు కొనేశారు..కాదు కాదు పాడేసేరు.

నేను ఒక విషయం గమనించేను.

ఈ సారివాళ్ళు పాడు తున్నప్పుడు ఎక్కువ పోటీ ఎవరూ రాలేదు. వాళ్ళే పోటీలో గెలిచేరు..నాకు అనుమానం వచ్చింది.

మొత్తమ్ కలిసి 4500 అయింది. అమ్మేవాడు 4 చీరలు, 3 దుప్పట్లు 2 ప్యాంట్లు మడిచి ఒక కవరు లో పెట్టి ఆ మొగవాడిని డబ్బు ఇమ్మన్నాడు.

ఇంతలో అనకాపల్లి దాటేక ఒక చిన్న స్టేషన్ లో రైలు ఆగింది.

ఆ మొగవాడు జేబులోపెట్టుకున్ననోట్ల కట్ట తీసేడు. లెక్కపెడుతున్నాడు.

ఇంతలో గుంపులోంచి ఎవడో ఆ కట్ట లాక్కోవడం, గబా గబా జనాలని తోసుకుంటూ

వాడు దిగిపోవడం జరిగింది. అందరం హతాశులయ్యేము.

కొంతమంది వాడిని వెంబడించారు కానీ వాడు దొరకలేదు.

బట్టలు అమ్మేవాడు, “బట్టలు తీసుకుని డబ్బు ఇవ్వండి “ అని పేచీ మొదలు పెట్టేడు.

ఆ మొగవాడు “నా డబ్బులు పోయి నేను ఏడుస్తూంటే..నీ బట్టలు నేనెట్లా తీసుకుంటా” అని

మొత్తుకుంటున్నాడు, ఆ స్త్రీ డబ్బులు పోయాయని ఏడుస్తోంది.

ఇంతలో ఎవరో అడుగుతున్నారు.. “కట్ట లో డబ్బు యెంత ఉంటుంది.” అని.

ఆ మొగవాడు అన్నాడు..ఏడుపు గొంతుతో "12 వేలు వున్నాయి " అని.

అప్పుడే అందరూ తలో సలహా ఇచ్చేస్తున్నారు. “అంత డబ్బు అలా అజాగ్రత్తగా పెట్టుకోకూడదని, రైల్లో బట్టలు కొనుక్కోవడం ఏమిటి “ అని..ఇలా ఎవరికి తోచిన మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతలో మళ్ళీ బండి కదిలింది. వేగం పుంజుకుంది.

బట్టల వాడు బట్టలు కవరు వెనక్కి తీసుకుని సర్దుకుంటున్నాడు. వాడు పైగా విసుక్కుంటున్నాడు.. ”పొద్దున్నే బలే బేరం దొరికింది.. ఇలా అయితే ఈ రోజు నాకు పస్తులే.” అంటూ.

నాకు అనుమానం వచ్చింది. లేచి బాత్రూం దగ్గరకి వచ్చేను.

నా ఫ్రెండ్ RPF ఇన్స్పెక్టర్ రమణ కి ఫోన్ చేసేను.

"హలో రమణా!

హలో చెప్పరా"

“నేను తుని ప్యాసింజెర్ లో వున్నాను.. నువ్వు ఎక్కడ వున్నావ్?”

“ఈరోజు డ్యూటీ లోనే వున్నాను, ఇదే బండి లో వున్నాను” అన్నాడు.

విషయం మొత్తం వివరించేను. బాత్రూం దగ్గర గోడ మీద రాసి వున్న కోచ్ నెంబర్ చెప్పేను వాడికి .

వెంటనే రమణ చెప్పేసాడు ” అదొక గాంగ్ రా.. మొత్తం ముగ్గురు వుంటారు, ఒకడు బట్టలవాడు మరో ఇద్దరిలో ఒకడు కొన్న బట్టలయినా కొట్టేస్తాడు , డబ్బులయినా కొట్టేస్తాడు. ఇక రెండో వాడు దొంగ ని వెంబడించినట్లు నటించి దిగిపోతాడు. వాళ్ళు ఎలమంచిలి కంటే ముందు స్టేషన్ నర్సింగపల్లి లో దిగిపోతారు. అక్కడ కలిసి డబ్బు పంచుకుంటారు.

“ నువ్వు వాడితో వాదిస్తూ వుండు..ఈ లోగా నేను వచ్చేస్తాను, వాళ్ళ సంగతి నేను చూస్తాను” అన్నాడు రమణ.

వెనక్కి వచ్చి బట్టల వాడితో వాదించడం మొదలు పెట్టేను.

”ఆ బట్టలు.. వాళ్ళు పాడుకున్నారు కదా., అతని డబ్బు పోయింది, బట్టలు అతనికి ఇచ్చెయ్యి, అతని బదులు డబ్బులు నేను ఇస్తాను “ అన్నాను.

“అయితే ఇవ్వండి” అన్నాడు.. వాడికి మరీ మంచిది.

ఆ దంపతుల కేసి తిరిగి, “ మీరు వెళ్ళేది ఎలమంచిలి కేనా? “అన్నాను.

“అవును” అన్నారు వాళ్ళు. “మా ఇల్లు అక్కడే అంది “ ఆ స్త్రీ అమాయకంగా.

“ అయితే ఇంకేం ..నేను కూడా ఎలమంచిలి దాకా నే, నేను స్టేషన్ లో దిగేక మీకు సహాయం చేస్తాను, రేపు మీ ఇంటికి వచ్చి డబ్బు తీసుకుంటాను”. అన్నాను.

ఈ లోగా బట్టలవాడు కలిపించుకున్నాడు.

“నేను, నర్సింగపల్లి లో దిగిపోవాలి కదా.. నేను ఎలమంచిలి రాను ” అన్నాడు.

“ ఈ రోజుకి రా అన్న! యెంత.. ఒక స్టేషన్ మాత్రమే కదా ఎక్కువ… పైగా

తిరిగి, వెనక్కి వచ్చే ఖర్చు నేను ఇస్తానులే ” బుజ్జగింపుగా అన్నాను.

వాడు ససేమిరా అంటున్నాడు.

ఇంతలో కొంతమంది నాకు సపోర్ట్ వచ్చారు.

“ఆ బాబు అంత సాయం చేస్తానంటుంటే..నువ్వు ఆ మాత్రం చెయ్యలేవా..అసలే ఆ మొగుడు, పెళ్ళాం డబ్బు పోయి బాధల్లో వున్నారు ” అన్నారు.

నా అనుమానం నిజమైతే..వాడిప్పుడు ఒక్కడే వున్నాడు..తోడు దొంగలు ఇద్దరూ జంప్ అయిపోయారు.

జనం లో వాడు జాగ్రత్తగా బయటపడాలి. అందుకే వాడు మాటలు వెతుక్కుంటూ జాగ్రత్తగా బట్టల మూట సర్దుకుంటున్నాడు.

ఇంతలో నర్సింగపల్లి స్టేషన్ వచ్చింది. వాడు వెనుక వైపు దిగిపోయే ప్రయత్నం చేస్తున్నాడు.

నేను మూట గట్టిగా పట్టుకున్నాను.

ఇంతలో ఇద్దరు RPF కానిస్టేబుల్స్ రైలు ఎక్కడం జరిగింది. అవతలి గేట్ దగ్గర రమణ కనపడ్డాడు.

వాడు పోలీసు వాళ్ళని చూస్తూనే కంగారు పడి పోయాడు.

మూట విడిచి రైలు నుండి గెంతేసేడు.

కానీ, కానిస్టేబుల్స్ వదల లేదు.

రమణ వాడిని పట్టుకుని అరెస్ట్ చేసేడు. ఆ దంపతులని కూడా స్టేషన్ కి తీసుకెళ్ళేడు.

ఒక అమాయక జంట ని మోసం నుండి కాపాడేనని తృప్తి గా అనిపించింది.

రమణ కి థాంక్స్ చెప్పి ప్రయాణం కొనసాగించేను.

-- సమాప్తం--

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు