భార్యా అనుకూలవతీ శత్రుః - జి.ఆర్.భాస్కర బాబు

Bharya anukoolavathi shatru

నేను శర్మిష్ఠ ను వివాహం చేసుకున్నప్పటికి ఇదివరకటి నా జీవితంలో చాలా మార్పులు జరిగాయి. పొద్దున్నే లేచి ఆఫీసు కు వెళ్లటం దగ్గర్నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత పడక మీద చేరేవరకు నాకు ఎంతో అనుకూలంగా ఉండే శర్మిష్ఠ అంటే ఇష్టం తోపాటు ప్రేమా పెరిగి పోయాయి. సొంత ఊరికి దూరంగా వచ్చేసి చాలా కాలం అయింది.అమ్మానాన్నలతో కలిసి ఉండే అవకాశం లేకపోయింది. నేను గొప్ప ఉద్యోగం చేయక పోయినా చాలా బాధ్యతగల ఉద్యోగం చేస్తున్నాను.ఉద్యోగ బాధ్యతల దృష్ట్యా నేను చాలాసేపు ఆఫీసు లోనే ఉండాల్సి వస్తుంది. ఒక రోజు శెలవు తీసుకుని ఇంట్లోనే ఉన్నాను. “హమ్మయ్య ఈరోజు ఇంట్లోనే ఉన్నారు కదా,మనం అలా సరదాగా కాసేపు బైట తిరిగి వద్దాం” అంది శ్రీమతి. సరే అనక తప్పింది కాదు నాకు.తయారయి బయలుదేరే సమయానికి ఆఫీసు నుండి ఫోన్ వచ్చింది. ఫాక్టరీ లో ఏదో యాక్సిడెంట్ జరింగింది, నేను వెంటనే రావాలి అని.నేను హడావిడి గా బయలుదేరి వెళ్ళబోతుంటే,‌శర్మిష్ఠ “వెళ్ళాక తప్పదంటారా?” “తప్పేటట్టు లేదు”అని నేను బయలుదేరిపోయాను. అక్కడ హడావిడి ముగించి ఇంటికి వచ్చేసరికి రాత్రి చాలా పొద్దు పోయింది. ఇంటి దగ్గర జరగబోయే సీన్ ఊహించుకుంటూ ఇంట్లోకి అడుగు పెట్టాను. శర్మిష్ఠ చాలా మామూలుగా “హమ్మయ్య వచ్చారా, స్నానం చేసి రండి వడ్డించేస్తాను” అంటూ భోజనాలబల్ల దగ్గరకు నడిచింది. ఏదేదో ఊహించుకుంటూ వచ్చిన నాకు చాలా రిలీఫ్ గా అనిపించింది. భోజనం చేసిన తరువాత వక్క పలుకులు అందిస్తూ అడిగింది “రేపయినా కుదురుతుందా మీకు” “అదేమిటి , రేపు ఆఫీస్ కి వెళ్ళాలి కదా”అన్నాను “అదేం కుదరదు ఇవాళ ఇంట్లో ఉంటానని ఆఫీసుకు వెళ్లారు కదా, రేపు మనం బైటకు వెళ్దాం “అంది శర్మిష్ఠ “సర్లే చూద్దాం “అని అప్పటికి ఆ గండం గట్టెక్కాను. పడుకునుందన్న మాటే కాని రేపు ఎక్కడెక్కడ తిరగాలో ఎక్కడ తినాలో చెపుతూనే ఉంది శర్మిష్ఠ.ఉదయంనుండి తిరిగి తిరిగి అలిసిపోయి ఉండటంతో ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలియదు. తెల్లారింది నేను తయారవుతున్నానన్న మాటేగాని రాబోయే తుఫానుఎలాఉంటుందో ఊహించలేక పోతున్నాను. “శర్మిష్ఠా టిఫిన్ పెడతావా”అంటూ పిలిచే సరికి “మీదే ఆలస్యం”అన్నట్లు భోజనాలబల్ల మీద అన్నీ సిద్ధం చేసి ఉంచింది. “మరేం లేదు నిన్న జరిగిన యాక్సిడెంట్ సంబంధించి ఇవాళ విచారణ ఉంటుంది,ఆ గొడవ కాస్త వదిలించుకోవాలి.అప్పటివరకు కాస్త తలనొప్పి తప్పదు” అన్నాను. “సర్లేండీ , ఇప్పుడు మిమ్మల్ని నేనేమీ అనలేదు కదా,తయారయి బయల్దేరండి”అంది శర్మిష్ఠ నాకు ఎక్కడలేని ఆనందం కలిగింది. నిజానికి ఎంతమంది పొందగలరు ఇంత అనుకూలమైన భార్యను. లంచ్ టైం కల్లా విచారణ పూర్తి అయ్యింది. నేను బాస్ కి చెప్పి ఇంటికి బయలుదేరాను.”వెళ్ళగానే శర్మిష్ఠ ఆనందం చూడాలి ,తను ఎప్పటినుండో అడుగుతోంది బయటకు తీసికెళ్ళమని, భోజనం అవగానే బయలు దేరాలి” ఇంటికి వెళ్ళి తలుపు తట్టేలోగా లోపల్నించి శర్మిష్ఠ గొంతు విని ఆగిపోయాను. “అవునే కాంతం మావారికి పెద్ద టెండరే పెట్టబోతున్నాను, మొన్న నీవు పంపిన ఫోటోలు చూశాను. ఆ వంకీల నెక్లెస్ భలేగా ఉంది.ఈ రోజు ఎలాగైనా కొనిపిస్తాను.”శర్మిష్ఠ ధారాపాతంగా మాట్లాడుతూనే ఉంది. నేను తెల్లబోయి తలుపు తట్టటం కూడా మర్చిపోయాను.

మరిన్ని కథలు

Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్