స్పందన - Doctor Bokka Srinivasa Rao

Spandana

పరంధామయ్య తెలుగు ఉపాధ్యాయునిగా రిటైరయ్యి సొంత ఇంటిలో శేష జీవితం గడుపుతున్నాడు. భార్య జానకి భర్తకి తగ్గ ఇల్లాలు. అతని ఎదుగుదలలో చేదోడు వాదోడుగా ఉంటూ... ‘సహ’ ధర్మచారిణి అన్న పేరుని సార్థకం చేసుకుంది. వారికి ఒకే కొడుకు శ్రావణ్‌. ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి టెక్నికల్‌ మేనేజర్‌గా చేస్తున్నాడు. తన విధుల్లో భాగంగా టూర్లకి ఎక్కువగా వెళుతుంటాడు.టూర్‌నించి వచ్చాక ఒక రోజు రెస్ట్‌ తీసుకున్నాక... డ్యూటీకి వెళతాడు. ఆ విధంగా ఆ రోజు శ్రావణ్‌ ఇంట్లోనే వున్నాడు. ఇంక ఇదే సరిjైున సమయం అని... పరంధామయ్య, జానకిలిద్దరూ కొడుకుని కూర్చోబెట్టి... పెండ్లి గురించి ప్రస్తావన తీసుకొస్తారు. పరంధామయ్య ఇంకొంచెం ముందుకు ఆలోచించి.. ‘శ్రావణ్‌..! ఎవరైనా అమ్మాయి నీ దృష్టిలో వుంటే చెప్పు. మేము అడ్డు చెప్పం. కానీ ఏదీ దాచకు. మేం ఆనందంగా నీ ప్రేమ పెళ్ళికి ఒప్పుకుంటాం’ అని అంటాడు. దానికి తడబడి... ‘ప్రస్తుతానికి తనకా ఆలోచన లేదని... ఉన్నప్పుడు చెబుతాను. మళ్ళీ పెళ్ళి ప్రస్తావన ఎత్తవద్దని’ శ్రావణ్‌ చెబుతాడు. ‘సరేరా. నీకు నచ్చినప్పుడే... నీ మనసుకి కుదిరినప్పుడే చేస్తాంలే’ అని ఆ విషయాన్ని అంతటితో తల్లిదండ్రులిద్దరూ వదిలేస్తారు.

````````

ఒక రోజున పరంధామయ్య మిత్రుడు జగన్నాథం వస్తాడు. వస్తూ... వస్తూ... ‘పరంధామయ్యా...! ఒరేయ్‌ పరంధామయ్యా..! ఉన్నావ్‌రా..!’ అంటూ పిలుస్తాడు. పరంధామయ్య బయటికి వస్తాడు.

‘ఏంటో చెప్పరా..!’ అంటాడు.

‘నేను అర్జంటుగా మా వూరు వెళుతున్నాను.’

‘వెళ్ళు ఎవడొద్దన్నాడు..? ఇది చెప్పడానికే వచ్చావా..?’ అని పరంధామయ్య అంటూండగా జానకి లోపలినుంచి వచ్చి.. ‘అన్నయ్యగారు మీ పర్మిషన్‌ కోసం రాలేదు.’ అని చెప్పి... జగన్నాథంతో ‘అన్నయ్యగారూ..! మీరు వదిన్ని ఇంటిలో దిగబెట్టి వెళ్ళండి. మీరు తిరిగొచ్చేదాకా ఇంటిలోనే వుంటుంది.’ అని అంటుంది. దానికి జగన్నాథం... ‘చెల్లాయ్‌. సాటి ఆడదానిగా... మా ఆవిడ ఇబ్బందిని అర్థం చేసుకున్నావ్‌. తనని మీ ఇంటికి పంపించేవాడినే. కానీ మాది లంకంత కొంప. పిల్లలందరూ వేరే వేరే వూళ్ళల్లో సెటిలయిపోయారు. తనకి నేను. నాకు తను. మరి ఇంటిని ఎప్పుడూ కాపలా కాసుకుంటూ వుండాలి కదమ్మా. కాబట్టి....’ అని ఆగిపోతాడు.

పరంధామయ్య అందుకుని... ‘కాబట్టి.. చెప్పరా. ఆగిపోయావేం. వీడు వూళ్ళో వుండడం లేదు కాబట్టి... అప్పుడప్పుడు వీడి ఇంటికి వెళ్ళి... ఆమెకి కాస్త ధైర్యం వచ్చేలా కనపడుతూ వుండరా అని చెప్పడానికి వచ్చాడు. ఏరా..! అంతే కదరా.’ అని జగన్నాథంని అడుగుతాడు. దానికి జగన్నాథం... తను చెప్పాలనుకున్నది చెప్పేసాడని ఉబ్బితబ్బిబ్బయిపోతూ... ‘ఆ.. ఆ.. అంతే. భలే కనిపెట్టేస్తావురా. మిత్రుడంటే నీలా వుండాలిరా. ఏ కల్మషం లేని మనిషివి. లోపల ఏముందో అదే చెప్తావ్‌. ఏ విషయాన్నీ లోపల దాచుకోవు.’ అని పరంధామయ్యని కౌగిలించుకుంటాడు. జానకి కల్పించుకుని... ‘ఆయనే కాదు అన్నయ్యగారూ..! నేను కూడా వెళ్ళి.. మా వదినతో ముచ్చట్లేసి వస్తుంటాను. మీరు ధైర్యంగా వెళ్ళి రండి.’ అని భరోసా ఇస్తుంది. జగన్నాథం థాంక్స్‌ చెప్పేసి.. ఆనందంగా వెళ్ళిపోతాడు.త

````````

పరంధామయ్య తన భార్య చాలా రోజుల్నించి పుట్టింటికి వెళతానని అనడంతో ‘సరే’ అని చెప్పి.. ఆమెను తన వూరికి బస్సు ఎక్కించి పంపించి ఇంటికి వస్తాడు. అప్పటికి ఇంకా ఉదయం ఎనిమిది గంటలు కూడా కాలేదు. హాలులో కూర్చుని తీరుబడిగా పేపర్‌ చదువుకుంటూంటాడు. కొడుకు శ్రావణ్‌ టూర్‌కని వెళ్ళి నాలుగు రోజులయింది. ప్రస్తుతానికి పరంధామయ్య ఒక్కడే ఆ ఇంటిలో వున్నాడు. చాలా ప్రశాంతంగా వుందని అనుకుంటున్నాడు. కానీ తుఫానుకి ముందర వచ్చే ప్రశాంతత అని అర్థం కాలేదు. పేపర్‌ చదివేసి... టీపోయ్‌ మీద పెట్టేసి... లోపలికి వెళ్ళబోతూండగా... కొడుకు శ్రావణ్‌ అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వస్తున్నాడు. పరంధామయ్య, శ్రావణ్‌ని చూసి... ‘ఏరా శ్రావణ్‌..! ఇదేనా రావడం. టూర్‌ అయిపోయిందా..?’ అని అడుగుతాడు. శ్రావణ్‌ ఇబ్బందిగా మాట్లాడుతూ.. ‘అయిపోయింది నాన్నా..! అయితే నాన్నా..! మీతో ఓ విషయం మాట్లాడాలి. కాస్త అలా కూర్చోండి’ అంటాడు. ‘మన ఇంటిలో నాకు కొత్తగా మర్యాదలేంటిరా...? విషయం ఏంటో చెప్పు’ అని పరంధామయ్య కుర్చీలో కూర్చుంటూ అడుగుతాడు. శ్రావణ్‌ గుమ్మం వరకు వెళ్ళి... ‘లోపలికి రా విజయా..!’ అని అనగానే... పరంధామయ్య ఒక్కసారిగా షాక్‌ తగిలినట్లయి.. కుర్చీలోంచి అప్రయత్నంగా లేస్తాడు. విజయ లోపలికి వస్తూనే... పరంధామయ్య కాళ్ళ మీద పడిపోతుంది. శ్రావణ్‌ కూడా నాన్న కాళ్ళ మీద పడిపోతాడు. పరంధామయ్య అయిష్టంగా కాళ్ళని వెనక్కి లాగేసుకుని... నోట మాట రాక... అలానే కుర్చీలో కూర్చుండిపోతాడు. శ్రావణ్‌, నాన్నా కాళ్ళ దగ్గర కూర్చుని... ‘నన్ను క్షమించండి నాన్నా..! ఈ విషయం అమ్మకి వూరెళ్ళే ముందు చెప్పి వెళ్ళాను. మీతో కూడా చెబుదామనుకునేలోగానే... విజయ వాళ్ళ వూరిలో అనుకోని పరిణామాలు జరిగాయి. అందుకనీ...’ అని మాట పూర్తి చేయనివ్వకుండానే... పరంధామయ్య అందుకుని... ‘అమ్మా నాన్నా చచ్చారనుకున్నావ్‌. ఏకంగా పెళ్ళే చేసుకుని వచ్చేసావంటే... మేమంటే ఎంత గౌరవం ఇస్తున్నావో తెలుస్తోంది. ఇంక చాలు. నాతో మాట్లాడకండి. మీ ఏడుపేదో మీరు ఏడవండి. నేను మీతో మాట్లాడదల్చుకోలేదు. ఇంట్లో వుండాలనిపిస్తే వుండండి. ఇబ్బందిగా వుంటే మీ దారిన మీరు వెళ్ళిపోవచ్చు. ఈ ఇల్లు, వున్న ఆస్తి నా స్వార్జితం. మా తదనంతరమే మీకు వర్తిస్తుంది. దట్సాల్‌..!’ అని తెగేసి చెప్పేసి లోపలికి పోబోతూంటే... విజయ అడ్డంగా వెళ్ళిపోయి... ‘మావయ్యగారూ..! పెద్దవారు... పెద్దమనసు చేసుకుని క్షమించండి. మీతోనూ, అత్తయ్యగారితోనూ చెప్పాకనే పెళ్ళి చేసుకుందామని మీ అబ్బాయి నాతో చెప్పారు. కానీ ఈ లోగా మా వూరిలో నాకు బలవంతంగా పెళ్ళి జరిపిస్తూంటే... శ్రావణ్‌ వచ్చి అడ్డుకుని... అనుకోని పరిస్థితుల్లో నాకు తాళి కట్టాల్సి వచ్చింది. తన తప్పు ఏం లేదు మావయ్యగారూ..!’ అని కాళ్ళు పట్టేసుకుంటుంది. కానీ పరంధామయ్య మొండిగా... ‘నేను వాడిని ముందే అడిగాం. పెళ్ళి చేయాలని అనుకుంటున్నాం. నీ దృష్టిలో ఎవరైనా అమ్మాయి వుందా అని కూడా అడిగాం. అప్పుడెందుకు చెప్పలేదు. ఇప్పుడు సరాసరి పెళ్ళి చేసుకుని వచ్చాడంటే మేమేం అనుకోవాలి..? చెప్పమ్మా..!’ అని విజయని నిలదీస్తాడు. దానికి శ్రావణ్‌ అందుకుని... ‘మీరడిగేటప్పటికి మా మధ్య ఏమీ లేదు. ఆ తర్వాతనే తనతో పరిచయం కలిగింది. మనూళ్ళూనే కొత్త బ్రాంచ్‌ ప్రారంభించాం. దానికి ట్రైనీ మేనేజర్‌గా ఈమెని సెలెక్ట్‌ చేసుకున్నాం. తనకి ట్రైనింగ్‌ ఇస్తున్నపడు... పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ విషయమంతా అమ్మకి చెప్పాను. మీకు కూడా చెప్పేలోగానే ఇలా జరిగిపోయింది. కానీ విజయ వాళ్ళ మేనమామ... ఎప్పుడో చిన్నపుడు అక్క తనకి మాట ఇచ్చిందని... తనని పెళ్ళి చేసుకోమని ఇబ్బంది పెడుతున్నాడని తెలిసింది. విజయ వాళ్ళ అమ్మగార్ని చూడడానికి వెళ్ళినపుడు... విజయ మేనమామ.. వున్నట్టుండి దేవుడి గుడిలో బలవంతంగా పెళ్ళికి ఏర్పాట్లు చేస్తుండడంతో... నాకు చెప్పింది. నేను వెళ్ళి ఆ పెళ్ళి ఆపి... తప్పనిసరి పరిస్థితుల్లో అప్పటికి అప్పుడు పెళ్ళి చేసుకున్నాను. నిజమే. మేం చేసింది తప్పే. కానీ ఏ నేరమూ చేయలేదు.’ అని చేతులు పట్టుకుని ప్రాధేయపడుతూండగా... పరంధామయ్య చేతులు విదుల్చుకుని... ‘మీ అమ్మకి మాత్రం చెప్పావ్‌గా. మీరిద్దరూ ఆమెతోనే వుండండి. ఈ రోజునుంచి మీరిద్దరూ నాతో మాట్లాడకండి. ఇది నా ప్రార్థన కాదు. నా ఆదేశం.’ అని రెండు చేతులెత్తి నమస్కారం పెట్టి తన గదిలోకి వెళ్ళిపోతాడు. విజయ నిస్సహాయంగా చూస్తుంటే... శ్రావణ్‌ ఆమెను ఓదార్చి... ‘అమ్మ వచ్చాక... కొద్ది రోజుల్లో సర్దుకుంటుందిలే. నువ్వేం బెంగపడకు.’ అని తన గదిలోకి తీసుకు వెళతాడు.

````````

పరంధామయ్య హాలులో వున్న టీపోయ్‌ మీది పేపర్లని క్రింది అరల్లో సర్దుతూండగా... విజయ కాఫీగ్లాసుతో వచ్చి... ‘మావయ్యగారూ..! కాఫీ తీస్కోండి’ అని టీపోయ్‌ మీద పెడుతూండగా... దానిని విసురుగా గెంటేస్తాడు. విజయ బెదిరిపోయి... దూరంగా వెళుతుంది. పరంధామయ్య దాదాపుగా అరుస్తూ... ‘నా బాగోగులు ఎవరూ చూడనక్కర్లేదు. నా పనులు నేను చేసుకోగలను. ఈ ఇంట్లో నేను, మా ఆవిడ మాత్రమే ఉంటున్నామని నేననుకుంటున్నాను. మా ఆవిడ వచ్చాక... కాఫీ తను ఇస్తుందిలే. నువ్వు వెళ్ళి మీ ఆయనగార్ని చూసుకో.’ అని విసురుగా బయటికి వెళ్ళిపోతాడు. నాన్న అరుపులకి బయటికి వచ్చిన శ్రావణ్‌... నాన్న విసురుగా వెళ్ళిపోవడం చూసి... ‘ఏం జరిగింది’ అని అడుగుతాడు. విజయ జరిగిందంతా చెబుతుంది. శ్రావణ్‌కి ఏం చేయాలో తెలియక తల పట్టుకు కూర్చుంటాడు. వెంటనే అమ్మకి ఫోన్‌ చేస్తాడు. ‘అమ్మా..! నువ్వు తొందరగా రామ్మా..! నాన్న నన్ను, విజయనీ అంగీకరించడం లేదు. ఇందాక విజయ కాఫీ ఇస్తే... విసిరి కొట్టేసాడంట. నువ్వు తొందరగా వచ్చి కాస్త పరిస్థితిని చక్కదిద్దు. రామ్మా..! తొందరగా రా..!’ అని బ్రతిమాలుతాడు. దానికి అమ్మ... ‘సరే. సరే. వచ్చేస్తాలే. నాన్న సంగతి నాకు వదిలెయ్‌. ఆయన కోపం... పాల మీది పొంగులాంటిదేరా. మెల్లగా సర్దుకుంటుందిలే’ అని అనునయిస్తుంది. ‘సరేనమ్మా..!’ అని ఫోన్‌ కట్‌ చేస్తాడు. విజయని ఓదారుస్తూ... లోపలికి తీసుకుని వెళతాడు.

````````

జగన్నాథం హడావిడిగా వస్తాడు. వస్తూ... వస్తూ... ‘పరంధామయ్యా...! ఒరేయ్‌ పరంధామయ్యా..! ఉన్నావ్‌రా..!’ అంటూ పిలుస్తాడు. పరంధామయ్య బయటికి వస్తాడు. వస్తూనే... ‘ఒరేయ్‌ జగన్నాథం... నువ్వు ఎప్పుడు వచ్చినా... హడావిడిగానే వస్తావేరా. నిదానంగా ఎప్పటికి వస్తావో..!’ అని అంటాడు. అప్పటికి విజయ కూడా బయటికి వచ్చింది. జగన్నాథం మాట్లాడుతూ... ‘నా హడావిడి గురించి తర్వాత తీరుబడిగా మాట్లాడుదువు గానీ... ముందు నేను చెప్పేది వినరా. నీ ఫోన్‌ స్విచ్చుడాఫ్‌ వస్తోందిటా. శ్రావణ్‌కి కూడా ఫోన్‌ చేస్తే.. వాడిది సిగ్నలే దొరకడం లేదంట. నాకు చేసారు. నువ్వు అర్జంటుగా... చెల్లాయ్‌ జానకి వూరికి బయల్దేరు.’ అని తొందర పెడతాడు. పరంధామయ్య అందుకుని.. ‘ఫోన్‌ ఛార్జింగ్‌లో వుంది. ఇంతకీ జానకికి ఏమైంది..? తను ఈ పాటికి వచ్చేయాలే..?’ అని అడుగుతాడు. జగన్నాథం బాధపడుతూ... ‘వచ్చేసేదే. కానీ బయల్దేరిన కొద్ది సేపటికి వూరు దాటిన తర్వాత... పెద్ద ఏక్సిడెంట్‌ అయిందిట. జానకి పరిస్థితి సీరియస్‌గా వుందట.’ అని చెప్పగానే... పరంధామయ్య... ‘హా...’ అని స్పృహ తప్పి పడిపోతాడు. విజయ వెంటనే... ‘మావయ్యగారూ..!’ అని దగ్గరికి వెళ్ళి పట్టుకుని... దగ్గరున్న దివాను మీద పడుకోబెడుతుంది. జగన్నాథం దగ్గరికి వెళ్ళి... ‘బాబాయ్‌గారూ..! మావయ్యగారు లేవగానే ఆయన్ని తీసుకుని మేం వెంటనే బయల్దేరుతాం. ముందు మీరు బయల్దేరండి.’ అని నమస్కరించి చెబుతుంది. దానికి జగన్నాథం... ‘అలాగేనమ్మా..! వాడు జాగ్రత్త. నేను ముందు వెళ్ళిపోతాను. మీరు కూడా తొందరగా వచ్చేయండి.’ అని ఎలా వచ్చాడో అంతే హడావిడిగా వెళ్ళిపోతాడు. విజయ చేసిన సపర్యలకి పరంధామయ్య కొద్దిసేపటికి తేరుకుంటాడు. ఆ సమయానికి విజయ తడిగుడ్డతో తన నుదుటి మీద అద్దుతుంటుంది. కొంచెం సిగ్గుపడతాడు. లేవబోతాడు. విజయ ఆపి.. ‘మావయ్యగారూ..! అప్పుడే లేవకండి. కొంచెం రెస్ట్‌ తీసుకోండి. మీరు కుదుటపడ్డాక... మనం అత్తయ్యగారి దగ్గరికి వెళదాం’ అని అంటాడు. వెంటనే పరంధామయ్య అందుకుని... ‘లేదు. లేదు. నేను బాగానే వున్నాను. పదమ్మా.. ముందు జానకి దగ్గరికి వెళ్ళాలి.’ అని లేస్తాడు. ‘సరే మావయ్యగారూ..!’ అని లోపలికి వెళుతుంటుంది. అంతలో కళ్ళు తిరిగినట్లయ్యి... ‘మావయ్యగారూ...!’ అని నేల మీద పడిపోతుంది. పరంధామయ్య... ‘ఏమైందమ్మా విజయా..!’ అని లేచి వచ్చి... తనని సోఫాలో కూర్చోబెడతాడు. కళ్ళు తేలేసూంటుంది. వళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఏం చేయాలో అర్థం గాక వెంటనే 108 కి ఫోన్‌ చేస్తాడు.

````````

విజయ, శ్రావణ్‌లిద్దరూ గుడినుంచి వచ్చి... పరంధామయ్యకి ప్రసాదం ఇచ్చి... ఒక్కసారిగా కాళ్ళమీద పడిపోతారు. పరంధామయ్య వాళ్ళిద్దరినీ లేపుతాడు. వెంటనే శ్రావణ్‌ కళ్ళల్లో నీళ్ళు తుడుచుకుంటూ... ‘నాన్నా..! ఆ రోజు మీరు గనక పెద్ద మనసుకి చేసుకుని వుండకపోతే... నాకు విజయ దక్కేది కాదు. అటు అమ్మని పోగొట్టుకున్నాం. ఇటు విజయని కూడా పోగొట్టుకుని వుంటే... చాలా నరకం అనిపించేది నాన్నా..!’ అని ఏడ్చేస్తుంటాడు. పరంధామయ్య శ్రావణ్‌ని ఓదారుస్తూ.. ‘సరిలేరా. జరిగింది తల్చుకుని బాధపడకు. జానకిని ఎలాగూ దక్కించుకోలేకపోయాం. కనీసం విజయనైనా దక్కించుకోగలిగాం.’ అని విజయ వైపు తిరిగి... ‘ఏమ్మా..! నీకు ఈ సమస్య వుందని ముందు తెలియదా..?’ అని అడుగుతాడు. దానికి విజయ మావయ్య చేతులు పట్టుకుని ఏడ్చేస్తూ... ‘తెలియదు మావయ్యగారూ..! మీరు నాకు పునర్జన్మని ఇచ్చారు. మిమ్మల్ని నా తండ్రిలా చూసుకుంటాను.’ అని ఇంకా ఏడుస్తూనే వుంటుంది. పరంధామయ్య ఆమె కన్నీళ్ళని తుడుస్తూ... ‘ఇప్పుడు అంతా సర్దుకుందిగా. గతాన్ని మర్చిపో. వర్తమానాన్ని హాయిగా అనుభవించు. రేయ్‌ శ్రావణ్‌..! అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు’ అని అంటాడు. శ్రావణ్‌, విజయని లోపలికి తీసుకెళ్ళి... షోల్డర్‌ బ్యాగ్‌తో వచ్చి... ‘నాన్నా..! నేను ముంబయికి టూర్‌ మీద వెళ్తున్నాను. విజయని జాగ్రత్తగా చూస్తుండండి’ అని వెళ్ళబోతూండగా... పరంధామయ్య ఆపి.. ‘కొన్ని రోజులు సెలవు పెట్టొచ్చు కదరా. అసలే అమ్మాయి నీరసంగా వుంది.’ అంటాడు. ‘లేదు నాన్నా... ఇది ముఖ్యమైన పని. నేనే వెళ్ళాలి. జస్ట్‌ రెండు రోజుల్లో వచ్చేస్తాను.’ అని నచ్చజెప్పి వెళతాడు.

````````

హాలులో వున్న దివాను మీద విజయ పడుకుని వుంటుంది. పరంధామయ్య పడక కుర్చీలో నిద్రపోయాడు. కొది సేపటికి పరంధామయ్యకి మెలకువ వచ్చి... మంచినీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళుతుంటాడు. దివాను దాటాక విజయ వైపు చూస్తాడు. నిద్రలో ఆమె పైట చెదిరి వుంది. ఆమె స్తనద్వయాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దగ్గరికి వెళ్ళి... పైటని సరిజేస్తుండగా... చెయ్యి అప్రయత్నంగా గుండెని తాకుతుంది. తమాయించుకుని... లేచి వంటగది వైపు వెళ్ళబోతూంటాడు. కానీ మనసు వెనక్కి లాగింది. వెనక్కి వచ్చి... ఆమె గుండెల మీద తల మెల్లగా పెట్టబోతూండగా... విజయకి మెలకువ వచ్చి... జరుగుతున్నదేవిటో అర్థం గాక... ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. పరంధామయ్యని నిలదీస్తూ... ‘ఏంటి మావయ్యా..! మీరు చేస్తున్న పని..? ఇంత వయసొచ్చింది. ఇదేనా మీ సంస్కారం..?’ అని నిలదీసి అడిగేసరికి.... పరంధామయ్య తడబడుతూనే ‘అమ్మా..! ఒక్కసారి నీ గుండెల మీద తల ఆన్చాలని వుంది. ఏమీ అనుకోకుండా...’ అని దగ్గరికి వస్తూ... ఇంకేదో చెబుతూండగా... మాట పూర్తి అవనీయకుండానే... పరంధామయ్యని తోసేసి... ‘ఆడది ఒంటరిగా వుంటే... మీలాంటి పెద్దలు కూడా ఇలానే దిగజారుతారు అని నిరూపించుకున్నారు. రంభ రానంతవరకూ అందరూ విశ్వామిత్రులే అంటే ఇదే అనుకుంటా.’ అని కడిగి పారేస్తుంది. పరంధామయ్య సిగ్గుపడతాడు. నోట మాట రాక నిశ్చేష్టుడైపోతాడు. తను అలా ఎందుకు చేసాడో అర్థంగాక అయోమయంలో పడి ఆలోచిస్తూంటాడు. విజయ దివాను మీదున్న దుప్పటిని తీసుకుని.. తన గదిలోకి పోయి తలుపు దభాల్న వేసుకుంటుంది. పరంధామయ్య జరిగిందానికి ఇంకా అయోమయంలోనే వున్నాడు. అలా ఏదో ఆలోచిస్తూ... ఆలోచిస్తూ... నిద్రలోకి జారుకుంటాడు.

```````

విజయ, శ్రావణ్‌కి ఫోన్‌ చేస్తుంది. చేసి ఏడుస్తుంటుంది. ఏమీ అర్థం గాని శ్రావణ్‌... ‘ఏయ్‌ విజయా..! ఏమైంది..? ఎందుకలా ఏడుస్తున్నావ్‌..? నీకేమన్నా ఇబ్బంది కలిగితే... నాన్న వున్నాడు గదా..! నాన్నకి చెప్పు.’ అని అనగానే... విజయ దాదాపుగా అరుస్తూ... ‘మీ నాన్నే నాకు ఇబ్బంది. ఆయన వల్లే నాకు కష్టంగా వుంది.’ అని రాత్రి జరిగిందంతా పూస గుచ్చినట్టు చెప్పి... ‘ఇప్పటికి నాలుగైదు సార్లు జరిగింది. పైగా తెల్లారేసరికి ఏమీ జరగనట్టు ఉంటున్నాడు. తెల్లారేసరికి పెద్దమనిషిలా గుడికి వెళ్తున్నాడు. నాకేమీ అర్థం గావడం లేదు. మన గదిలో పడుకోవాలంటే భయమని... బయట దివాను మీద పడుకుంటుంటే... మీ నాన్నతో భయమేస్తోంది శ్రావణ్‌..!.’ అని చెబుతుంది. శ్రావణ్‌ ఆశ్చర్యపోయి... ‘మా నాన్న అలా చేయడం ఏంటి..? ఎక్కడో ఏదో పొరబాటు జరిగింది. ఈ రాత్రికి వచ్చేస్తున్నాగా. ధైర్యంగా వుండు’ అని అంటాడు. ‘సరే’ అని ఫోన్‌ పెట్టేస్తుంది. కొద్దిసేపటికి పరంధామయ్య వచ్చి.... ‘అమ్మా..! మీ ఇద్దరి పేర్న పూజ చేయించాను. నీ ఐదవతనం బాగుండాలని... పిల్లాపాపలతో హాయిగా వుండాలని దేవుడ్ని కోరుకున్నాను.’ అని పసుపు, కుంకుమలు విజయకిస్తూండగా... అవి తీసుకుని టీపోయ్‌ మీద పెట్టేసి... ‘నా ఐదవతనానికేం ఢోకా లేదు. వున్నదల్లా మీ వెధవతనంతోనే ఇబ్బంది.’ అని కోపంగా అనేసి విసురుగా లోపలికి పోతుంది.

భోజనాల సమయం అయిపోయాక దాదాపు తొమ్మిది గంటల సమయంలో... శ్రావణ్‌ హడావిడిగా టూర్‌ నుంచి వచ్చి... నేరుగా తన గదిలోకి వెళతాడు. శ్రావణ్‌ వచ్చినట్టు పరంధామయ్యకి తెలియదు. విజయ, శ్రావణ్‌కి చెవిలో చెబుతుంది. ‘ఇవాళ నేను బయట దివాను మీద పడుకుంటాను. మీ నాన్నగారు ఏం చేస్తున్నారో... మీ కళ్ళతోనే చూద్దురుగానీ’ అని మెల్లగా చెబుతుంది. తను చెప్పినట్టుగానే... బయటికొచ్చి దివాను మీద పడుకుంటుంది. పరంధామయ్య యథావిథిగా పడక కుర్చీలో పడుకున్నాడు. రాత్రి పూట మెలకువ వచ్చి... బాత్రూంకేసి వెళుతుంటాడు. వెళ్ళి తిరిగొచ్చాక... దివాను దాటుతూండగా... ఏదో తెలీని మైకం కమ్మి... విజయ వైపుకి వెళుతుంటాడు. నాన్న ఏం చేస్తాడా అని ఎదురు చూస్తున్న శ్రావణ్‌ బయటికి వస్తాడు. పరంధామయ్యకి ఇదేం తెలీదు. దివాను దగ్గరికి వెళ్లి చెవిని గుండెల మీద ఆన్చబోతుండగా... ఒక్కసారిగా శ్రావణ్‌ అరుస్తాడు. విజయ లేచి నిలబడుతుంది. శ్రావణ్‌, నాన్నని నిలదీస్తూ... ‘నాన్నా..! ఏంటి మీరు చేస్తున్న పని. తండ్రిలాంటివాడు చేయాల్సిన పనేనా ఇది..? ఇన్ని రోజులు నువ్వు ఇబ్బంది పెడుతున్నావని... విజయ చెప్పినా నేను నమ్మలేదు. ప్రత్యక్షంగా చూసి తట్టుకోలేకపోతున్నాను. విజయా..! ఐ యామ్‌ సారీ..! నువ్వు చెప్పినపుడు అంత పట్టించుకోలేదు. నువ్వెంత క్షోభని అనుభవించావో అర్థమౌతోంది. నాన్నా..! ఇంక నీ గురించి తెలిసాక... నీలో మానవ మృగం వుందని తెలిసాక... ఇంక ఈ ఇంటిలో వుండదల్చుకోలేదు. రేపు మేం వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి.’ అని విజయని తీసుకుని తన గదిలోకి వెళ్లిపోతాడు. పరంధామయ్య జరిగిందానికి హతాశుడై... అసలు ఏం జరుగుతుందో... తాను అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలియక సతమతమవుతూ... ఆ బాధలోనే నిద్రలోకి జారుకుంటాడు.

````````

జగన్నాథం నిదానంగా, నింపాదిగా వస్తాడు. ఈసారి పరంధామయ్యని పిలవలేదు. ‘శ్రావణ్‌..! రేయ్‌ శ్రావణ్‌..! నన్నెందుకు పిలిచావ్‌రా..!’ అని అంటూ వస్తాడు. పరంధామయ్య, శ్రావణ్‌, విజయలు అందరూ హాలులోకి... వారి, వారి గదుల్లోంచి వస్తారు. శ్రావణ్‌ వస్తూనే జగన్నాథంతో... ‘ఎందుకు పిలిచానో తెలియాలంటే... అసలు నీ మిత్రుడు... అదే మా నాన్న ఏం నిర్వాకం చేస్తున్నాడో నువ్వు అడుగు మావయ్యా..!’ అని అంటాడు. జగన్నాథం, పరంధామయ్యని అడుగుతాడు. సమాధానం చెప్పలేక నీళ్ళు నములుతాడు. ‘ఏం జరిగిందో నువ్వు చెప్పరా..!’ అని జగన్నాథం, శ్రావణ్‌ని అడుగుతాడు. ‘ఇంకేం చెప్పాలి. మా నాన్న కామంతో కళ్ళు మూసుకుపోయి... వావివరుసలు మర్చిపోయి... కోడలుని కౌగిలించుకోబోతున్నాడు.’ అని అసహ్యంగా చెబుతాడు. జగన్నాథం... పరంధామయ్య దగ్గరికి వెళ్ళి... ‘ఏంటిరా పరంధామయ్య..! ఏంటిది...? నీ మీద ఈ అభాండాల్ని నేను నమ్మలేకపోతున్నానురా. అసలు నీకేం కావాలి..?’ అని అడుగుతాడు. మళ్ళీ పరంధామయ్య ఏం తడుముకోకుండా... ‘ఒక్కసారి ఆమె గుండెల మీద వాలాలిరా. అంతే. అదే నాకు కావాలి.’ అని అనగానే... జగన్నాథం ఏ మాత్రం ఆశ్చర్యపడకుండా... ‘ఓస్‌ ఇంతేనా...! దీనికేనట్రా మీరు మీ నాన్నని కాముకుడిలా చూస్తున్నది.’ అని చాలా కూల్‌గా చెబుతాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం విజయ, శ్రావణ్‌ల వంతు అవుతుంది. విజయ తేరుకుని... ‘ఏంటి బాబాయ్‌గారూ..! మీరనేది. మీ మిత్రుడ్ని వెనకేసుకొస్తున్నారా..?’ అని నిలదీస్తుంది. జగన్నాథం బదులిస్తూ... ‘లేదమ్మా..! వాడి గురించి నాకు బాగా తెలుసు. నేను ఊళ్ళు వెళ్ళినపుడల్లా... నా భార్యని చూసుకోమని... ధైర్యంగా వెళ్ళేవాడిని. అవకాశం ఉన్నా ఏనాడూ నా భార్యతో అసభ్యంగా ప్రవర్తించలేదు. కానీ నీ దగ్గరే అలా వున్నాడంటే... అది కూడా గుండెల మీద వాలాలి అంటున్నాడే గానీ... నువ్వు కావాలి అనడం లేదుగా.’ అని అంటాడు. శ్రావణ్‌ కల్పించుకుని... ‘ఏంటి మావయ్యా..! మమ్మల్ని కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నారు. అసలు గుండెల మీద వాలడం ఏంటి...?’ అని అడుగుతాడు. ‘ఆ గుండె తనదే కాబట్టి. అలా అంటున్నాడు’ అని జగన్నాథం అరుస్తాడు. పరంధామయ్య వారిస్తూ... ‘ఒరేయ్‌ జగన్నాథం... నువ్వింకేమీ మాట్లాడకురా.’ అని వారిస్తాడు. ‘లేదు. నిజం తెలియాలి. నిన్ను కాముకుడిలా చూడడం నాకు నచ్చలేదు. రేయ్‌ శ్రావణ్‌..! మీ అమ్మకి ఏక్సిడెంట్‌ జరిగిన రోజు గుర్తుందా..? ఏమ్మా విజయా..! అదే రోజు నీ సమస్య కూడా బయటపడిన విషయం గుర్తుందా..? అప్పుడు శ్రావణ్‌ టూర్‌లో ఉన్నాడు. మర్నాడు వచ్చాడు. ఈ రెండు సంఘటనలు జరిగినప్పుడు.. వాటికి మౌనసాక్షని నేను. మీ అమ్మ బ్రెయిన్‌డెడ్‌ అయింది. విజయకి అర్జంటుగా హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అవసరం అయింది. అదృష్టమో... కాకతాళీయమో... మీ అమ్మ గుండె విజయకి పెర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌ అయింది. అంతా కలలా ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అయిపోయింది.’ అని జరిగిందంతా చెబుతాడు. విజయ, శ్రావణ్‌లిద్దరూ... ‘మరి ఇదంతా మాకెందుకు చెప్పలేదు..?’ అని అడుగుతారు. ‘మీకు తెలియనీయవద్దని నా మిత్రుడు... ఇదిగో వీడే... పరంధామయ్య నా నోరుని నొక్కేసాడు. ఇప్పుడు చెప్పక తప్పలేదు కాబట్టి చెబుతున్నా.’ అని అనగానే... పరంధామయ్య విజయ దగ్గరికెళ్ళి.... ఆమె చేతులు పట్టుకుని ‘అమ్మా విజయా..! ఇవి చేతులు కావు. కాళ్ళు అనుకోమ్మా. నన్ను క్షమించు. నిన్ను చూసినపుడల్లా... నీ దగ్గరున్న గుండె... జానకి గుండె అని గుర్తుకొచ్చి... తనని మర్చిపోలేక... ఆ హృదయ స్పందన వినడం కోసమే నీ గుండెల మీద వాలబోయానంతే. కానీ ఆ తర్వాత నేను చేస్తున్న పనికి... నాలో నేనే ఎంతగానో కుమిలిపోయేవాడిని. నిజంగా నన్ను క్షమించమ్మా..!’ కళ్ళనీళ్ళ పర్యంతమవుతూ చిన్నపిల్లాడిలా ఏడుస్తూంటాడు. అది చూసి కరిగిపోయిన విజయ మనసు...‘మావయ్యా..!’ అని పిలిచి.... ‘వినండి మావయ్యా..! మీ భార్య హృదయ స్పందనని వినండి.’ అని పరంధామయ్యని తన గుండెల మీదకి ఆన్చుకుంటుంది. పసిపిల్లాడిని ఓదారుస్తున్న తల్లిలా కనిపిస్తున్న విజయని చూసి... ఆమె గొప్ప మనసుకి ఏం చేయాలో తెలియక... రెండు చేతులెత్తి దణ్ణం పెడుతుంటాడు. పరంధామయ్య ఉబ్బితబ్బిబ్బయిపోయి... ఆ ఆనందాన్ని తట్టుకోలేక... తన గుండెకి స్పందన ఆగిపోయి... తన భార్య దగ్గరికే వెళ్ళిపోతాడు.

````````

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ