సోషల్ మీడియా తీసిన ప్రాణం..!! - Lakshmi Priyanka

Social media teesina pranam


శ్రీధర్ శకుంతల దంపతులకు అరుణ ప్రేరణ కవల పిల్లలు..!! ఆ ఇద్దరు వారి హృదయాలు. పంచ ప్రాణాలు. అన్నిటిలో చురుకుగా ఉండేవారు. చదువులే కాదు సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ముందుండేవారు..!!

లిల్లీ సుమన వారి స్నేహితులు కాలేజీ లో కలిసి చదువుకుంటున్నారు.

లిల్లీ, సుమన: ఏంటే అరుణ మీకు పుస్తకాలు ఆటపాటలు ఇల్లు కుటుంబం తప్ప వేరే లోకం లేదా??

అరుణ, ప్రేరణ: ఇవి కాక మరేం వుంటాయ్?? భవిష్యత్తుకు తోడ్పడే చదువు, మనసుకు సాంత్వనను వ్యక్తిత్వానికి వికాసాన్ని కలిగించే సాంస్కృతిక కార్యక్రమాలు, మనకోసం బ్రతికే మన కుటుంబం, మనది అనే ఒక ఇల్లు.. ఇవి తప్ప ఏమి కావాలి..?? ఇవి చాలు మా సంతోషానికి..!!

లిల్లీ ; సుమన: చాలవే..!! ప్రపంచం ఎంత ముందుకు పోతోంది.. సాంకేతికత ఎన్ని కొత్త పుంతలు తొక్కుతోంది?? సోషల్ మీడియా అనేది ఒకటుంది.. మనం ప్రపంచంతో ఎన్నో విషయాలు పంచుకోవచ్చు. ప్రపంచం పంచుకునే విషయాలను తెలుసుకోవచ్చు..!!

అరుణ ప్రేరణ: వాటితో ఏమొస్తుంది?? ఏం లాభం ఉంది??

లిల్లీ ; సుమన : అలా అడుగుతారేంటే?? ప్రపంచం అంతా మీ పేరు మారుమ్రోగిపోతుంది. ప్రపంచమే చేతిలో ఉన్నట్లుంటుంది.. ఫేమస్ ఇపోవచ్చే.. మనం మహా అంటే ఎంతమందికి తెలుసు?? బావిలో కప్పలా బ్రతుకుతామంటే మీ ఖర్మ..!! అన్నారు.

వాళ్లిద్దరూ చెప్పిన మాటలు క్రమంగా అరుణ, ప్రేరణల మీద ప్రభావం చూపసాగాయి. ఒకరి వెనక ఒకరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అంటూ పలు రకాల సోషల్ మీడియా ప్లాట్ఫోర్మ్స్లో అకౌంట్ ఓపెన్ చేసారు. క్రమేపి ఆ సోషల్ మీడియా అనే చట్రంలో ఇమిడిపోసాగారు. ఫాలోవర్స్ ఎంత మంది ఎన్ని పోస్టులు పెట్టావంటూ సంభాషణలు సాగేవి.

ఇదివరకు రోజు భగవద్గీత రామాయణం వంటి గ్రంథాల సారాన్ని ఆకళింపు చేసుకునే అరుణ ప్రేరణలు మెల్లగా సోషల్ మీడియా లోకంలోకి వెళ్లిపోసాగారు. ఎంత మేరకు అంటే తిండి తినడం కూడా మరచిపోయేంత. ఇది గమనించింది శకుంతల.

శకుంతల: అమ్మా ఆరుణ ప్రేరణ ఇలా రండమ్మా.. మాట్లాడాలి!!

అరుణ ప్రేరణ: ఎంటమ్మా??

శకుంతల: ఈమధ్య మీరు ఈ లోకం లోనే ఉండడం లేదు. ఎపుడు చూసినా మొబైల్ పట్టుకుని కూర్చుంటున్నారు? మీ దినచర్య కూడా మారిపోయింది. చక్కటి దినచర్యతో ఉండే మీరు ఎందుకు ఇలా మారిపోయారు??

అరుణ ప్రేరణ: అమ్మా.. ఇది ఇవాళటి ట్రెండ్ అమ్మ. చూడు సోషల్ మీడియా లో ఎంత మంది ఉన్నారో.. ఎన్నెన్ని విషయాలు తెలుసుకోవచ్చో..!! ప్రపంచం చేతుల్లో ఉన్నట్లు ఉంటుంది అమ్మ..!! ఇది మాకు బాగా నచ్చింది. మా స్నేహితులందరూ మమ్మల్ని ఫాలో ఔతున్నారు.. మేము చాలా సంతోషంగా ఉన్నాం
అని అన్నారు..!!

శకుంతల: అలా కాదమ్మా .. అతి సర్వత్ర వర్జయేత్..!! మరీ అతిగా ఏమున్నా అది అంత మంచిది కాదమ్మా. సోషల్ మీడియా అనేది ఒక సాలెగూడు తల్లి. అందులో ఒకసారి చిక్కుకుంటే బయట పడడం తేలిక కాదు. ఏదైనా ఒకటి మరీ అధికంగా మన జీవితాన్ని ఆవరించకూడదు తల్లి”. ఇలా పలు రకాలుగా చెప్పి చూసింది శకుంతల.

కానీ శకుంతల చల్లని మాటలు కూడా వాళ్ళ మీద ప్రభావం చూపలేకపోయాయి. తన ప్రయత్నాలు ఫలించకపోవడంతో భర్త శ్రీధర్ కు విషయం చెప్పింది. శ్రీధర్ ప్రేమగా చెప్పి చూశాడు. వినకపోయేసరికి కాస్త మందలించాడు..!!

శ్రీధర్: ఏం మీ క్రమశిక్షణ అంత ఏమైంది?? మీ చదువు మీద మీ పురోగతి మీద మీ వ్యక్తిత్వం మీద ఇది ప్రభావం చూపిస్తోంది. ఎందుకు అర్థం చేసుకోవడం లేదు మీరు? మీ మంచి కోరే మేము చెబుతాము. మీ శత్రువులం కాము”.

అరుణ ప్రేరణ: నాన్న మేము ఇపుడు పెద్దవాళ్లం ఔతున్నాం. మాకు మంచేదో చెడేదో తెలుసు. అధికంగా ఉపదేశాలివ్వద్దు అని తల్లి తండ్రుల మాటలను కొట్టి పారేశారు.

శకుంతల శ్రీధర్లు నిర్ఘాంతపోయారు. ఎంతో మర్యాదతో మన్ననతో మెలిగే తమ అమ్మాయిలు అలా తల్లి తండ్రులను తీసి పారేస్తే ఈ తల్లి తండ్రి బాధపడరు?? చోద్యం చూడడం వారి వంతు అయింది.

ఇక ఇద్దరు కొత్త వ్యక్తులు అరుణ ప్రేరణ జీవితాల్లోకి ప్రవేశించారు. వాళ్లే ప్రవీణ్ రాజీవ్. తల్లి తండ్రులు సంపాదించిన డబ్బుల కోట వెనక ఉండే రాకుమారులు వీళ్లు. కార్లు షికార్లు, ఖరీదైన దుస్తులు, వాచీలు, మరెన్నో..!! ఇక వారి వైభోగాన్ని సోషల్ మీడియా పోస్టుల్లో కుప్పలు తెప్పలుగా కుమ్మరిస్తారు.. వారిని చూసి వారిలా బతికితేనే అదొక అర్థవంతమైన బతుకు అని జనాల్లో ఒక అభిప్రాయం. చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉండే వాళ్లని చూస్తే అమ్మాయిల గుండెలు జారేవి..!! లిల్లీ మరియు సుమన వీరి స్నేహితులు. వీళ్లకి ఒక ఆటవిడుపు ఉంది. సోషల్ మీడియా లో కోతగా వచ్చిన అమాయకపు అమ్మాయిలని ట్రాప్ చేయడం. వారితో నచ్చింది చేయడం. లిల్లీ సుమన వీరికి సహకరించేవారు..!!

ఒకసారీ బయటికి వెళ్ళే నెపంతో అరుణ ప్రేరణలను ప్రవీణ్ అలాగే రాజీవ్ ల వద్దకు తీసుకెళ్లారు లిల్లీ సుమన.

ప్రవీణ్ రాజీవ్ : హాయ్ నా పేరు ప్రవీణ్.. నా పేరు రాజీవ్ అని తమను తాము పరిచయం చేసుకున్నారు

అరుణ ప్రేరణ: హాయ్. మా పేర్లు అరుణ ప్రేరణ. మీరు ఇద్దరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. చాక్లెట్ బాయ్స్ లా అన్నారు.

ప్రవీణ్ రాజీవ్: మీరు ఏమైనా తక్కువ.. ఎన్నెన్నో అందాలు మీలో దాగున్నాయి. చెప్తూ పోతే టైం సరిపోదు. అందం అనే మాట చాలా చిన్నది. చాలా ముద్దొస్తున్నారు.
ఇలాంటి మాటలతో బుట్టలో పడేయసాగారు వాళ్ళని. తీయని మాటలు వారి హృదయాలను కరిగించసాగాయి. అలాంటి మాటలు వారెప్పుడు విన్నది లేదు. ఎవరు వాళ్ళతో ఆలా ముద్దు ముద్దు సంభాషణలు సాగించలేదు. ఆలా మాటల్లో తేనే కురుస్తుంటే ఎవరు మాత్రం లొంగిపోరు? అలంటి తీయని పలుకులు చెవిన పడుతూ ఉంటె స్వర్గం అంచున తేలినట్లు ఉండేది ప్రేరణ మరియు అరుణ కు. ఇక క్రమేణా వారి స్నేహం బలపడింది. చిన్నగా మాటలు పెరిగాయి.

అరుణ ప్రవీణ్ తో , అలాగే ప్రేరణ రాజీవ్ తో చనువుగా ఉండడం మొదలెట్టారు. ప్రవీణ్ రాజీవ్ లు రకరకాల గిఫ్ట్ ల తో అరుణ ప్రేరణలను ముగ్గులోకి దించసాగారు. కార్లలో తిప్పుతూ షాపింగ్ లకు తీసుకెళ్తు ఇలా ఎన్నో విధాలుగా తమ వైపుకి తిప్పుకున్నారు అరుణ ప్రేరణలను. సోషల్ మీడియా లో కలిసి దిగిన ఫోటోలు పెట్టేవారు. గంటలు గంటలు మెసెంజర్లలో మాట్లాడుకునేవారు. ఒకరి స్టేటస్ లలో మరొకరు నిండేవారు. చుసిన ప్రతీ వారికి ఆ ఫోటోలు చూపించుకునేవారు అరుణ ప్రేరణ. ఆ ఫోటోలకు వచ్చే లైక్స్ కామెంట్స్ ను లెక్కపెట్టుకోవడమే దినచర్యగా మారింది అరుణ ప్రేరణకు.

తల్లి తండ్రులు అరుణ ప్రేరణ లను ప్రశించారు. వాళ్ళు మా స్నేహితులంటూ కొట్టిపడేశారు. మేము ఏమి తప్పు చేయడం లేదమ్మా.. అయినా వాళ్ళతో ఉంటె తప్పేంటి అంటూ అగౌవరంగా మాట్లాడారు. కన్నీరు కార్చడం తప్ప ఏమి చేయలేకపోయారు శ్రీధర్ అలాగే శకుంతల. ఎంత నచ్చచెప్పినా కూతుర్లు వినకపోయేసరికి ఏమి చేయాలో అర్ధం కాలేదు వాళ్లకి.

ఒక రోజు సాయంత్రం ప్రవీణ్ తో అరుణ, రాజీవ్ తో ప్రేరణ లాంగ్ డ్రైవ్ కి వెళ్లారు. చెరో కార్లో నగరం అంతా చక్కర్లు కొట్టారు. చివరిగా ఒక చోట ఆగి కార్లోనే కబురులు చెప్పుకోసాగారు. ఇక ప్రవీణ్ అరుణ చేయిని మెల్లగా స్పృశించి..

"అరుణ నువ్వంటే నాకు చాల ఇష్టం. నీ అందం ఎవరికీ లేదు. నువ్వు నా సొంతమైతే ప్రపంచం నా సొంతం అయినట్లే.. నా లోకం నువ్వే.. నువ్వు లేని నేను లేను అన్నాడు..

అరుణ: ప్రవీణ్ నువ్వంటే నాకు కూడా చాల ఇష్టం. నువ్వు నా పక్కన ఉంటె ప్రపంచం గుర్తుకు రాదు. తెలియని మైకం నన్ను ఆవరిస్తుంది.

ప్రవీణ్ అరుణకు దగ్గరగా వచ్చాడు.. నెమ్మదిగా తన బుగ్గలు నిమురుతూ.. కళ్ళలోకి చూస్తూ అమాంతం తన పెదవులతో అరుణ పెదవులను ముడివేసాడు. ఒక పది నిముషాలు అరుణ తన అధరామృతం మొదటిసారి ప్రవీణ్ కు అందించింది. తనకే తెలియకుండా ప్రవీణ్ ఫోటోలు తీసాడు అన్న విషయం తెలియక. ఆ తరువాత సిగ్గుతో ప్రవీణ్ కు దూరంగా జరిగింది. ప్రవీణ్ తన చేతితో అరుణ నడుము చుట్టూ చేయి వేస్తూ..

ప్రవీణ్: ఏంటి అరుణా ఎలా ఉంది మన మొదటి అనుభవం? నువ్వు నా దానివి.. నువ్వు నాకే సొంతం.. నీ పెదవులు ఎంత బాగున్నాయో తెలుసా? నీతో నా తొలిముద్దు నాకొక తీయని జ్ఞాపకం అన్నాడు.

అరుణ కూడా : సిగ్గుతో ఔను అన్నట్లు సైగ చేసింది.

ఇక ఇంకో పక్కన రాజీవ్ ప్రేరణ కూడా ఒక చోట ఆగారు. ఆబగా ఒక్కసారి కౌగిలించుకున్నాడు ప్రేరణను రాజీవ్. ఆ మొదటి స్పర్శతో మత్తు ఎక్కింది ప్రేరణ కి. తాను కూడా తన చేతులు చాపి ఆ కౌగిలింతకు లొంగిపోయింది. మెల్లగా తన మెడకు చెంపలను దాటి పెదవులను చేరి చుంబించాడు రాజీవ్. అదంతా కూడా ప్రేరణకు తెలియకుండా కెమెరాలో బంధించాడు. ఇద్దరు ఆలా మైకం లో చాలాసేపు తేలియాడారు.

తర్వాత రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరారు ప్రేరణ అరుణ. ప్రశ్నించిన తగిన సామాధానం రాలేదు కూతుర్ల వద్ద నుండి శ్రీధర్ శకుంతలకు. మౌనమే తప్ప ఏమి తోచలేదు వారికి. ఆ రాత్రి అంత అరుణ ప్రేరణ, ప్రవీణ్ రాజీవ్ ల తలపులతో గడిపేశారు. ఇక్కడ అరుణ ప్రేరణ ఇలా ఉంటె.. అక్కడ ప్రవీణ్ రాజీవులు తాము తీసిన ఫోటోలు చూస్తూ ఒకరకమైన పైశాచిక ఆనందం పొందుతూ.. వాళ్ళు చేసిన ఘనకార్యాలు గురించి మాట్లాడుకుంటూ నిదరపోయారు.

మరునాడు పొద్దున్న సూర్యుడు ఆకాశాన అయితే వచ్చాడు కానీ వెలుగు అనేది అరుణ ప్రేరణ జీవితాల్లోకి రాలేదు. సోషల్ మీడియాలో ప్రవీణ్ రాజీవ్ లు పెట్టిన ఫోటో లు చూసి అరుణ ప్రేరణకి మతి పోయినట్లు అయింది. వాళ్ళ మధ్య జరిగిన దానిని నలుగురిలో పెట్టిన ప్రవీణ్ రాజీవ్ ల నిజ స్వరూపం అప్పుడు కానీ వాళ్లకు అర్ధం కాలేదు. వెంటనే ప్రవీణ్ రాజీవులకు ఫోన్ చేశారు. కానీ వారి దగ్గర నుండి ఏ స్పందన లేదు. లిల్లీ సుమన లను కలిసి..

"అరుణ ప్రేరణ: ఏంటిది? మా వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియా లో పెట్టడం ఏమిటి? అసలు అర్ధం ఉందా? నలుగురూ మా గురించి ఏం అనుకుంటారు? మా పరువు పోతుంది. ఇదే నా వాళ్ళు మమ్మల్ని ప్రేమించే విధానం?"

లిల్లీ సుమన: షట్ అప్ యార్.. ఇదంతా కామన్.. సిల్లీ గ మాట్లాడకండి.. మీకు ఇపుడు భలే ఫాలోయింగ్ పెరుగుతుంది చూడండి.. మీరు ఫేమస్ అయిపోతారు.. మీకోసం నలుగురూ ఎగబడతారు"

అరుణ ప్రేరణ: ఛి.. అమ్మ నాన్న చెప్పింది వినకుండా మీరు చెప్పింది విని మా జీవితాలకి మేమె మసి పూసుకున్నాం, మా గోతి మేమె తవ్వుకున్నాం. విచక్షణ లేక మమ్మల్ని మెం కోల్పోయాం. అని అక్కడ నుండి వెళ్లిపోయారు.

రోడ్ మీద వెళ్తున్న వాళ్ళిద్దర్నీ చూసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకోసాగారు. కొంత మంది ఆకతాయిలు అసభ్యంగా మాట్లాడారు. కొంతమంది జాలి పడ్డారు. కొంత మంది "ఇవేం పనులమ్మ? అసలు ఆడపిల్లలేనా ? " అని ఈసడించారు. కొంతమంది తల్లితండ్రుల పెంపకం గురించి నానా మాటలన్నారు. సోషల్ మీడియా నిండా వీరి మీద అసభ్య కామెంట్లు వెల్లువెత్తాయి..

శ్రీధర్ శకుంతల గుండెలు పగిలిపోయాయి.. ప్రాణప్రదంగా సంస్కారవంతంగ పెంచిన కూతుర్ల గురించి నలుగురు నోటికొచ్చినట్లు వాగుతుంటే.. ప్రాణం తోడేసినట్లు అనిపించింది. నలుగురిలో తల ఎత్తుకుని తిరిగేదెలా అని మదనపడిపోయారిద్దరు. కూతుర్లను ఓదార్చలేక వారిని వారే సముదాయించుకోలేక.. సతమతం అయిపోయారు. ఆ రాత్రి చీకటి వారికి ఇంకా గాఢంగా తోచింది. నిదుర రాలేదు.. కనుమూస్తే జరిగిందా ఉదంతమే కనిపించింది. ఎప్పటికో కానీ కునుకు పట్టలేదు.

పొద్దున్న లేచారు. తమ కూతుర్లకు ధైర్యం చెప్పి.. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని తిరిగి పాత మార్గంలో పయనించాలని చెప్పాలని నిర్ణయించుకున్నారు. శకుంతల కాఫీ తీస్కుని కూతుర్ల గది తలుపు వద్దకొచ్చింది.. తలుపు వార వాకిలిగా మాత్రమే వేసిందని అర్ధం అయ్యింది. తలుపును నెమ్మదిగా తోసి. లోపలికోచ్చింది.. అక్కడ దృశ్యం చూసి బిగ్గరగా అరిచింది.

శ్రీధర్ ఆ అరుపు విని.. " ఏమైంది శకుంతల" అంటూ వచ్చాడు. అక్కడ తమ కూతుర్లు జీవం లేకుండా విగత జీవల్లా పది ఉండడం చూసి వెక్కి వెక్కి ఏడ్చాడు.
శ్రీధర్ శకుంతల కళల సౌధాలు కూలిపోయాలి. వారి హృదయాలు బద్దలైపోయాయి. సోషల్ మీడియా అనే మహమ్మారి తమ కూతుర్లను మింగేసింది. చెడు స్నేహం, సోషల్ మీడియా లో పరిచయాలపై నియంత్రణ లేకపోవడంతో.. వారి కూతుర్లకు ఈ పరిస్థితి వచ్చింది అని వాపోయారు. తమ ఆరోప్రాణాలని భావించిన కూతుర్లు ఇక లేరని..జరిగినదంతా ఒక పీడకల అయితే బాగుండు కదా అని విలపించారు. తిరిగిరాని లోకాలకు చేరిన కూతుర్ల జ్ఞాపకాలే ఇక వాళ్లకు ఊపిరి..!! వాళ్ళ కూతుర్ల లాంటి ఎందరో పిల్లలను సోషల్ మీడియా ఈ మహమ్మారి నుండి రక్షించడమే వాళ్ళ జీవితం యొక్క గురి..!! అదే బాటగా పయనించారు. ఒక సంస్థను స్థాపించి, నిపుణుల సహాయంతో పిల్లలకు కౌన్సిలింగ్, వర్కుషాప్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మంది పిల్లలను సోషల్ మీడియా నుండి కాపాడారు శ్రీధర్ శకుంతల దంపతులు.

సోషల్ మీడియా ను పరిమితితో పరిణితితో ఎలా వాడుకోవాలో చెప్తూ.. పేరెంట్స్ కు అవగాహన కలిగిస్తూ.. తమకు కలిగిన నష్టం ఇంకొకరికి కలుగకుండా చూసుకోవాలనే లక్ష్యంతో చివరిదాకా సాగింది శ్రీధర్ శకుంతల ల పయనం..!! అద్భుతం వారి గమనం.. అజరామరం వారి చక్కటి ప్రయత్నం..!!

మరిన్ని కథలు

Pillalu-Yajamani
పిల్లలు - యజమాని
- బివిడి ప్రసాద రావు
Spandana
స్పందన
- Doctor Bokka Srinivasa Rao
Amma sakshigaa
అమ్మ సాక్షిగా..
- బంటుపల్లి శ్రీదేవి
Nee nagumomu naa kanulara
నీ నగు మోము నా కనులారా....
- సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు
Bharya anukoolavathi shatru
భార్యా అనుకూలవతీ శత్రుః
- జి.ఆర్.భాస్కర బాబు
Mosam
మోసం
- వెంపరాల దుర్గా ప్రసాద్
Kapati
కపటి
- Viswanath coushik