ఇద్దరికి సమంగా . - సృజన.

Iddarikee samamgaa

" తెల్లవారుతూనే వచ్చిన కుందేలును చూసిన కోతి " ఏంటి మామ

పొద్దున్నేవచ్చావు ?" అన్నాడు "

" ఆకలిగా ఉంది అల్లుడు ఈరోజు ఏది లభించినా చెరిసగం పంచుకోవాలి, పద వేటకు వెళదాం " అన్నాడు కుందేలు.

కోతి,కుందేలు కొంతదూరం ప్రయాణించేసాక వారికి కొద్దిదూరంలో ఎలుగుబంటి కనిపించింది " కుందేలు మామా ఈఎలుగుబంటివాడు దుష్టుడు మనల్ని ఏదోవిధంగా తన్నాకుండా వదలడు వాడు ఏమన్నా మాట్లాడకుండా మౌనంగా నాతోరా " అన్నాడు కోతి.

తలఊపాడు కుందేలు .

కుందేలు ,కోతి తన చేరువగా రాగానే "ఎక్కడికో ఉదయాన్నే బయలుదేరారు మామా ,అల్లుళ్ళు " అన్నాడు ఎలుగుబంటి .

మౌనంగా నడవసాగారు కుందేలు,కోతి . " ఏమిటి నేను అడుగుతుంటే సమాధానం ఇవ్వరా " అని అందుబాటులోని చింతబరికతో కుందేలుకు రెండు తగిలించాడు ఎలుగుబంటి. మంటపుట్టిన ఒళ్ళు రుద్దుకుంటూ,

" ఎలుగుబంటి అన్నా నీకు మాకోతీ అల్లుడు అంటే భయమే అందుకే వాడి జోలికి వెళ్ళలేదు "అన్నాడు కుందేలు. " వాడికి నేను భయపడటమా? ఇదిగో చూడు నీకు రెండు అయితె వాడికి నాలుగు " అని కోతికి చేతిలోని చింతబరికతో నాలుగు తగిలించాడు ఎలుగుబంటీ. ఏడిస్తే అవమానం కనుక బాధ ఓర్చుకుంటూ మౌనంగా ముందుకు వెళ్ళారు కుందేలు,కోతి.

" అప్పటిదాకా ఏడుపు ఆపుకున్న కోతి ఒక్కసారిగా బావురుమని "దుష్టులతో ఇదేబాధ మాట్లాడినా,మాట్లాడకపోయినా తన్నులు తప్పవు " అన్నాడు కోతి. తలఊపాడు కుందేలు.

అలా కొంతదూరం వెళ్ళగానే బండపైన ఆడుకుంటున్న సింహరాజు గారి కుమారుడు రెండు నెలల పిల్ల సింహరాజు కాలుజారి బండపై నుండి దొర్లుకుంటు కిందకువచ్చి ,కోతి కాళ్ళవద్ద పడి ఏడవసాగాడు. భయపడుతూనే పిల్ల సింహరాజును తన చేతుల్లోనికి తీసుకుని సముదాయించ సాగాడు కోతి. అదిచూసిన మంత్రి నక్క " ఏయ్ కోతి ఎంత ధైర్యం నీకు సింహరాజు గారి బిడ్డనే ఎత్తుకుంటావా " అని అందుబాటు లోని వేప బరికతో కోతి వీపుపైన బలంగా ఒక దెబ్బలు వేసాడు. ఆదెబ్బకు తట్టుకోలేని కోతి ,పిల్లసింహరాజును తనచేతుల్లోనుండి నేలపైకి వదిలింది. "అరెరే ఎంత ధైర్యంనీకు ఏడుస్తున్నరాజుగారి బిడ్డను నేలపై పడేస్తావా " అని మరో దెబ్బవేసాడు నక్క. తనకి తన్నులు తప్పినందుకు కుందేలు లోలోపలే సంతోషించింది. "మంత్రివర్య ఎంతైనా మాకుందేలు మామ అంటే మీకుభయమే కదా అందుకే అతన్ని ఏమి అనలేదు " అన్నాడు కోతి. " వాడికి నేను భయపడటం ఏమిటి,వాడికేమన్నాకొమ్ములున్నాయా ?" అని చేతిలోని వేప బరికతో కుందేలుకు నాలుగు తగిలించి, నేలపై ఉన్నపిల్ల సింహరాజును తీసుకుని వెళ్ళాడు మంత్రి నక్క.

దెబ్బలనుండి తేరుకున్న కుందేలు మండుతున్న వంటిపైన నీళ్ళు చల్లుకుంటూ " అల్లుడూ నువ్వంటే గతంలో తప్పులు చేసావు కనుక నీకు దెబ్బలు నాపాటికినేను మౌనంగా ఉన్నాకదా నాపేరు నక్కమంత్రికి చెప్పి ఎందుకు నన్ను తన్నించావు " అన్నాడు. " మామా నాతోనువ్వు ఉన్నందుకు ఎలుగుబంటి దగ్గర నాకు తన్నుల వాటా ఇప్పించావే అందుకు , పైగా ఈరోజు ఏమి దొరికినా చెరి సగం పంచుకోవాలి కదా అందుకే చెరి ఆరు దెబ్బలు సరిపోయాయి "అన్నాడు కోతి.

" ఓహొ దుష్టులకు దూరంగా ఉండాలి అని పెద్దలు చెప్పింది ఇందుకా ,మనం ఏతప్పు చేయకున్నా దుష్టునితో ఉన్నందుకు ఇదా ఫలితం ,వద్దు ఎవరి ఆహరం వాళ్ళే సంపాదించుకుందాం ,ఇకముందు ఎన్నడూ ఏవిషయంలోనూ పొత్తులు వద్దు ఎవరి బ్రతుకు వారే బ్రతుకుదాం ,నాదుంప,గడ్డి నాదే,నీకాయా, పండు నీదే " అని కుందేలు వెనుతిరిగి వెళ్ళాడు, "అలాగే "అని మండుతున్న వంటిపైన నీళ్ళు చల్లుకోసాగాడు కోతి.

మరిన్ని కథలు

Pillalu-Yajamani
పిల్లలు - యజమాని
- బివిడి ప్రసాద రావు
Spandana
స్పందన
- Doctor Bokka Srinivasa Rao
Amma sakshigaa
అమ్మ సాక్షిగా..
- బంటుపల్లి శ్రీదేవి
Nee nagumomu naa kanulara
నీ నగు మోము నా కనులారా....
- సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు
Bharya anukoolavathi shatru
భార్యా అనుకూలవతీ శత్రుః
- జి.ఆర్.భాస్కర బాబు
Mosam
మోసం
- వెంపరాల దుర్గా ప్రసాద్
Kapati
కపటి
- Viswanath coushik