పిల్లలు - యజమాని - బివిడి ప్రసాద రావు

Pillalu-Yajamani
ఆ ఊరి పొలిమేరన ఏపైన తోట ఒకటి ఉంది. దానిలో రకరకాల పండ్ల చెట్లు ఉన్నాయి. అవి పండ్ల పంటతో నిగనిగ లాడుతున్నాయి.
ఆ తోట పక్కన ఖాళీ జాగాలో ఊరి పిల్లలు కొందరు పాఠశాల సెలవులు రావడంతో.. సాయంకాలం పూట ఆటలకై వచ్చారు. ఆడుకుంటున్నారు.
ఆ తోట యజమాని ఆ పిల్లల్ని అదిలిస్తాడు. తోటలో పండ్లు కాసున్నాయి.. ఇటు రావద్దని గట్టిగా అడ్డు చెప్తాడు. పిల్లలు ఉసూరమంటూ వెనుతిరిగారు.
మరో రోజు.. మళ్ళీ తోట వైపు వెళ్లి ఖాళీ జాగాలో ఆడుకోబోయారు ఆ పిల్లలు. ఈ మారు ఆ తోట యజమాని కర్రతో వెంబడించడంతో.. ఆ పిల్లలు తమ తమ ఇళ్ల వైపుకు పడుతూ లేస్తూ పొలాల గట్ల వెంట పరుగులు తీసారు.
ఆటలపై పిల్లల యావ తీరక, ఊరిలో తమ ఆటలకై తగు జాగా లేక.. ఆ పిల్లలు తర్జనభర్జనల్ని చేపట్టారు. చివరికి ఓ యోచన చేసారు. పిమ్మట తమ పెద్దలకు తమ సమస్య విన్నవించుకుంటూ.. తమను అటు ఆడుకోడానికి తోట యజమాని అడ్డు పడకుండా చూడమని వేడుకున్నారు.
పెద్దల చొరవతో.. తన తోటలోకి పిల్లలు రాకూడదనే ఆంక్షతో.. ఆ తోట యజమాని సమ్మతించాడు. అటుపై ఆ ఖాళీ స్థలంలో ఆ పిల్లలు చక్కగా ఆటలు ఆడుకుంటున్నారు.
ఆ సాయంకాలం.. ఆ పిల్లలు ఆటల్లో ఉండగా.. చినుకులు మొదలయ్యాయి. ఆ వెంబడే.. ఆ చినుకులు వానగా మారాయి.
తప్పనిసరై ఆ పిల్లలు తోట లోకి దూరారు. ఏపైన చెట్ల కింద గుంపులు గుంపులుగా నిలిచారు. ఐనా వాళ్లల్లో భయం ఉంది. తోట యజమానికై అటు ఇటు చూస్తున్నారు. ఆ యజమాని తోట మధ్యన ఉన్న మంచె కింద వానకు ముడ్చుక్కూర్చున్నాడు.
బెదురుతోనే యజమానికై వెతుకుతున్న ఓ గుంపు పిల్లలకు యజమాని అగుపించాడు.
యజమాని ముసలివాడు. చలికి, వానకి బాగా వణికిపోతున్నాడు. అది గమనించిన ఆ పిల్లలు యజమాని అవస్థకు జాలి పడ్డారు. ఆ పిల్లలు యజమానిని చేరారు. అతడి మీద వాన పడకుండా యజమాని చుట్టూ గుండ్రంగా నిలిచి తమ తమ ఒళ్లుల్తో గొడుగులా మారారు. అలాగే మిగతా పిల్లల్ని కూడా కేకలతో పిలిచారు. వాళ్లూ వచ్చారు. ఆ అంతా ఆ యజమాని చుట్టూ మూగారు. ఆ పిల్లల నైపుణ్యం మూలంగా యజమాని వణుకు నుండి ఉపశమనం పొందగలిగాడు.
వాన ఆగింది.
ఆ తోట యజమాని తేరుకుంటూ పిల్లల్ని దండించక తోట నుండి కావలసిన పండ్లను కోసుకొని వాళ్లని తినమన్నాడు.
పిల్లలు సంబరమయ్యారు.
***

మరిన్ని కథలు

Spandana
స్పందన
- Doctor Bokka Srinivasa Rao
Amma sakshigaa
అమ్మ సాక్షిగా..
- బంటుపల్లి శ్రీదేవి
Nee nagumomu naa kanulara
నీ నగు మోము నా కనులారా....
- సిహెచ్. వెంకట సత్యసాయి పుల్లంరాజు
Bharya anukoolavathi shatru
భార్యా అనుకూలవతీ శత్రుః
- జి.ఆర్.భాస్కర బాబు
Mosam
మోసం
- వెంపరాల దుర్గా ప్రసాద్
Kapati
కపటి
- Viswanath coushik