దశరథరావుకు నలుగురు కొడుకులు. ఉద్యోగ విరమణ చేశాక ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేసి 'మనవల చదువుల కోసం ఖర్చు పెట్టుకోండర్రా' అని పిల్లలకు సమానంగా పంచి ఇచ్చేసాడు.
" మీరేమీ ఉంచుకోకుండా అంతా మాకే ఇచ్చేస్తే ఎలా నాన్నగారు? " అని పిల్లలు ప్రశ్నించారు.
" రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లాంటి నలుగురు పిల్లలు నాలుగు స్తంభాలుగా నాకు అండగా ఉండగా మాకు లోటు ఏమిటిరా? ఇప్పుడు నేను పోయాక ఈ ఆస్తులు ఇచ్చే కంటే ఈ వేళ మీ పిల్లల చదువులకు ఉపయోగపడతాయి. ఇక మీ నలుగురు చూడరు అనే బాధ మాకు లేదు. ఒకవేళ చూడకపోయినా నా ఉద్యోగ పింఛను మా ఇద్దరికీ సరిపోతుంది. ఒకవేళ అంతగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం అనిపిస్తే ఆనాడే వృద్ధాశ్రమంలో చేరుతాము. మీకు ఏమి అభ్యంతరం లేదుగా? " కొడుకులు కోడళ్ళు అందరి సమక్షంలో చెప్పాడు.
తమ పెద్ద దిక్కుగా ఆయన తీసుకున్న నిర్ణయానికి వారందరూ సర్వ విధాల సంతోషించారు.
మూడేసి నెలలు ఒక్కొక్క కొడుకు ఇంట్లో మనముల ముద్దు ముచ్చట్లతో ఆ దంపతులకు ఏడాది కాలమంతా నవవసంతంలాగే ఉండేది.
వృద్ధాప్యం వల్ల వచ్చిన అనారోగ్యంతో దశరధరావు భార్య కాలం చేసింది. భార్య జ్ఞాపకాలతో కొంతకాలం బాధపడినా ఏ కొడుకు దగ్గర ఉంటే ఆ కొడుకు ఇంటి దగ్గరలోని ప్రతిరోజు పార్కుకి వెళ్లడం అలవాటు చేసుకున్నాడు దశరథ రావు.
వెళ్లిన వారం రోజుల్లోనే 'వీళ్లంతా నా పార్కులో స్నేహితులమ్మా!' వారందరినీ టీ కి ఇంటికి ఆహ్వానించి కొడుకుకి కోడలికి పరిచయం చేసేవాడు.
తమ ఊరిలోనే తమకు తెలియని చుట్టుపక్కల పెద్దలందరూ తమ ఇంటికి ఇలా రావడం ముందుగా చిరాకు అనిపించినా దశరథరావు మాటలు కొడుకు కోడల్ని సంతృప్తి పరిచాయి.
" అమ్మాయి! నా పార్కు స్నేహితులు వచ్చినప్పుడు టీ కి అని, స్నాక్స్ కనీ ఎంతో కొంత ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి. ఈ వయసులో మీ మీద ఆధారపడకుండా నా పింఛన్ తో నేను బతుకుతున్నాను అనేటువంటి సంతృప్తి నాకు మిగలనివ్వండి. ఎటొచ్చి మీరు చేయవలసింది కొద్దిపాటి సేవ మాత్రమే. ఆ సేవ చేయడం మీకు బాధ అనిపించిననాడు నిర్మొహమాటంగా చెప్పండి. నేను వెళ్లి వృద్ధాశ్రమంలో చేరతాను. మీ ఇంట్లో నేను ఉంటే మీకు పెద్ద దిక్కు. నన్ను మీ ఇంట్లో ఉంచుకుంటే తల్లిదండ్రులని వృద్ధాప్యంలో సాకిన పిల్లలుగా మీకు గౌరవం.. పదిమందికి ఆదర్శం! ఏమంటారు? "
ఆయన మాటలలోనే తార్కితకకు ఆయన పట్ల ఆయన పిల్లలందరకు మరింత భక్తిప్రపత్తులు వాళ్లకి పెరిగాయనే చెప్పాలి.
అనుకోకుండా మూడో కొడుకు భార్య నడివయసులో గుండెపోటుతో హఠాత్తుగా మరణంతో ఆయన తుఫానులో ఆకులా విలవిల్లాడిపోయాడు.
మిగతా ముగ్గురు పిల్లల్ని పిలిచి "అబ్బాయిలు! మూడో వాడికి రాకూడని కష్టం వచ్చింది. నేను ఇక వాడి దగ్గర శాశ్వతంగా పెద్దదిక్కుగా ఉండాలి అని అనుకుంటున్నాను. మీరు తరచుగా వచ్చి మా ఇద్దరిని చూసి వెళుతూ ఉంటే నేను చాలా సంతోషిస్తాను." అన్నాడు
దశరథ రావు.
" మీరు వాడితో ఉండడమే కాదు. వాడి పిల్లలు చిన్న పిల్లలు. వాడికి తగిన అమ్మాయిని చూసి మళ్ళీ పెళ్లి చేయండి. మా వంతు సహకారం మేము అందిస్తాం"అన్నారు.
ప్రతి ఊరిలోనూ ఆయన పార్కు స్నేహితులందరూ మూడవ కొడుకుకు పెళ్లి సంబంధాలు వెతకడంలో పడ్డారు. ఏడాది గడిచిన వెంటనే ఆ స్నేహితులలో ఒక బంధువు కుమార్తెను ఇచ్చి మూడో కొడుకు వివాహం తిరిగి చేయించాడు దశరథరావు.
అయినా ఆయన మూడో కొడుకుని విడిచిపెట్టి వెళ్ళలేదు.
ఆయన ప్రతి సాయంత్రం పార్కుకి వెళ్ళగానే, వ్యాఁహాళికి వచ్చిన అందరిని నవ్వుతూ పలకరిస్తూ, కొత్తవారిని పరిచయం చేసుకుంటూ, అటు ఇటు అడ్డదిడ్డంగా పరిగెడుతున్న పిల్లలకు జాగ్రత్తలు చెబుతూ, తన వయసు వారి ఆరోగ్య సమస్యలకు తాను వాడుతున్న హోమియోపతి మందులు ఉచితంగా అందజేస్తూ,తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అనుక్షణం ఆహ్లాదంగా ఉంచే దశరధరావుని చూస్తూనే పార్కులో ప్రతి ఒక్కళ్ళు చేతులెత్తి నమస్కరించేవారు.
పార్కు తోటమాలికి 'మీ పిల్లలకి ఏమన్నా పని పెట్టవయ్యా' అని పండగలప్పుడు కొద్ది డబ్బు ఇవ్వడంతో అతనికి కూడా ఆయనంటే ప్రత్యేకమైన అభిమానం.
ఒకరోజు పార్కులో మిత్రులతో కూర్చుని ఉండగా ' పార్కులు సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి?' ఒక టీవీ ఛానల్ బృందం అక్కడికి విచ్చేసింది.
ఆ ఛానెల్ కెమెరామెన్ యొక్క దృష్టి, అంత వృద్ధాప్యంలో కూడా ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ అందరి మధ్య కూర్చుని చక్కగా కబుర్లు చెబుతున్న దశరధరావు మీద పడింది. వెంటనే బెంచీలో కూర్చున్న ఆయన వద్దకు వచ్చి 'సార్ మీ ఫోటో ఒకటి కావాలి' అని ఆయన ఒక్కరినీ ప్రత్యేకంగా ఫోటో తీశాడు.
అనంతరం ఆ బృందం తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఉత్సాహంగా ముందుకు చెప్పే వ్యక్తుల అందరి దగ్గర అభిప్రాయ సేకరణ చేశారు.
ఆ తర్వాత టీవీ ఛానల్ బృందం వారితో పార్క్ కమిటీ చైర్మన్ ఇలా అన్నారు.
'గత రెండు సంవత్సరాలుగా మా పార్కు స్తబ్దంగా, కళ తప్పినట్టుగా ఉండేది. కానీ మా అందరికీ పెద్దదిక్కుగా మా సార్ దశరథరావు గారు ఈ పార్క్ లో అడుగు పెట్టినప్పటి నుంచి మా పార్కుకే కళ వచ్చేసింది. ఎన్నో విషయాల్లో ఆయన సూచనలు అనుసరించడం వల్ల మా పార్కు ఎంతో అందంగా, తయారవ్వడమే కాదు... సాయంత్రం ఎప్పుడవుతుందా? ఎప్పుడు పార్కుకి వెళ్దామా అనే వాతావరణం ఆయన వల్లే నెలకొంది. ఆయన ఇక్కడికి అడుగు పెట్టేవరకు ఎవరో మాకు తెలియదు. ఈరోజు మా అందరి కుటుంబాలలో దాదాపు ఆయన ఆత్మబంధువు లాంటి గొప్ప స్నేహితుడు. ఒక్క మాటలో చెప్పాలంటే 'స్నేహం అంటే ఇలా చేయాలి'అనడానికి ఆయన ప్రత్యేక ఉదాహరణ.''
" మీలాంటి గొప్ప వ్యక్తిని కలుసుకోగలగటం నిజంగా మా అదృష్టం. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ " అని ఆ టీవీ ఛానల్ కెమెరామెన్ మరో మూడు రోజుల తర్వాత
తాను దశరథరావుకు తీసినటువంటి ఫోటోను అందమైన ప్రేమలో బిగించి తీసుకొచ్చి ఇస్తూ అన్నాడు.
" మనం ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు బాబు. వెళ్లిపోయేటప్పుడు కూడా ఏమి తీసుకు వెళ్ళలేము. కానీ ఇక్కడ ఉన్నంతకాలం కల్మషం లేని మనసుతో ఎదుటివారిని పలకరించడం, చిరునవ్వుతో మనకి తోచిన సేవ చేయడం ఇవి రెండే మనకి, మన తోటి వారికి ఆనందాన్ని మిగులుస్తాయి అని చిన్నప్పుడు మా అమ్మగారు నేర్పారు. నేను అదే ఆచరిస్తున్నాను తప్ప ఇందులో నాకు గొప్పతనం ఏమీ లేదు బాబు " అన్నాడు దశరథ రావు.
ఆ ఇంటర్వ్యూ ని చూసిన దశరథరావు పిల్లలందరూ తమ పిల్లలతో...'చూశారా స్నేహమంటే అలా చేయాలి! మీరు అలాంటి స్నేహం చేసి మంచి పేరు తెచ్చుకుంటారు కదూ!' అని తమ పిల్లలకు చెప్పడం విని దశరథరావు ' మన చుట్టూ ఉన్న పదిమందితో స్నేహ పరిమళం పంచుకున్న నాడే మనమందరం బాగుంటాం... అని మీరు గ్రహించాలన్నదే నా ఉద్దేశం " అనుకున్నాడు దశరథరావు సంతృప్తిగా!
సమాప్తం