ఫోన్ పోయింది - జి.ఆర్.భాస్కర బాబు

Phone poyindi

ఆరోజు నెలాఖరు కావటంతో వరదరాజు మనసు డోలాయమానంగా ఉంది.కారణం ఇవాళే జీతం వచ్చింది కానీ మిగిలేది ఏమీ లేదు.ఇంటి ఖర్చు, బుడ్డొళ్ళ ఫిజులు ,మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం , మందుల ఖర్చు,కారు ఇఎమ్మయ్,ఇలా ఖర్చులన్నీ బుర్రలో గిరగిరా తిరుగుతున్నాయి. వరదరాజు ఓ ప్రయివేటు ఆఫీసులో పని చేస్తున్నాడు.

చాలా కష్టపడి పనిచేస్తాడేమో అతనికి ఆ ఆఫీసులో మంచి పేరు ఉంది.అతని ఆఫీసు ఇంటిదగ్గరనుండి ఓ పాతిక మైళ్ళ దూరంలో ఉంది. కొద్దిరోజులు మోటర్ సైకిల్ మీద వెళ్ళాడు కానీ అలావెళ్ళిరావటం అతనికి ఇబ్బందిగా అనిపించింది.అంతసేపు ఆ ట్రాఫిక్ లో బండి నడపటం నరకంగా అనిపించింది.కొద్ది రోజులు కాబ్ లో వెళ్ళాడు. కాని అదికూడా చాలా సమయాన్ని తినేస్తోందని గమనించి అదికూడా మానేశాడు.

చివరికి శ్రీమతి సలహాతో లోకల్ ట్రైన్లో వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.కాని అతనికి ఒక సమస్య ఎదురయింది.అతని ఆఫీసు ఉదయం పది గంటలకు మొదలవుతుంది.ఆటైమ్ కి అక్కడికి చేరుకోవాలంటే లోకల్ ట్రైన్ లేదు.ఒక గంట ముందు అయినా అవుతుంది లేదా ఓ అరగంట ఆలస్యం అయినా అవుతుంది.అందువల్ల అతను ఆఫీసు కి అరగంట ఆలస్యంగా వెళ్ళటానికి పర్మిషన్ తీసుకుని ఇంటికి రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరే వాడు.మానేజ్మెంట్ కూడా రెండు గంటలు ఎక్కువ పని చేస్తుండటంతో ఏమీ అనలేదు.

“ఏం వరదా,ఇంకా బయలు దేరి లేదా?”అడిగాడు మానేజర్. “ఇదిగో, అయిపోయింది సార్, మీరు పదండి మీ వెనకే నేనూ వస్తాను “అన్నాడు వరదరాజు. “సరే,నేను కా‌స్త ఏటియం దాకా వెళ్ళాలి”అన్నాడు మానేజర్ “నేను బయలు దేరతాను”. వరదరాజు చాలావరకు ఆన్ లైన్ లో నే లావాదేవీలు చేస్తాడు.అన్నీపోగా మిగిలిన డబ్బును అతని భార్యకు ఎకౌంట్ ట్రాన్స్ఫర్ పెడతాడు.అతని సొంతానికి ఒకటి రెండు వేలు మిగిలుతాయి. ఇవన్నీ ఆలోచిస్తూ అన్యమనస్కంగానే ఇంటికి బయలుదేరాడు. ప్లాట్ఫారం మీదకు చేరి ట్రైన్ కోసం ఎదురు చూడసాగాడు.ఆరోజు ఎందుకో చాలా హడావుడిగాఉంది. వరదరాజు కి ఇయర్ ఫోన్ పెట్టుకుని పాటలు వినటం అలవాటు.మామూలుగా అయితే అతని సెల్ ఫోన్ లో ఉన్న పాత, కొత్త పాటలు పెట్టుకుని మార్చి మార్చి వింటూంటాడు.

సెల్ఫోన్ మన నిత్య జీవితంలో ఓ భాగం అయిపోయింది.రేడియో, సినిమా, టేప్ రికార్డర్, గడియారం, కెమెరా,కాలిక్యులేటర్,.... ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది.ఈమధ్య ఏ ఐ అంట మన ప్రమేయం లేకుండా చాలా చాలా పనులు చేసుకునే అవకాశం ఉందట అది ఫోన్ లో ఉంటే. మరీ అంతలా కాకపోయినా వరదరాజు కూడా ఫోన్ చాలా ఎక్కువ వాడుతుంటాడు. అలాంటిది ఆరోజు ఎందుకో పాటలు వినాలనిపించలేదు. పాటలు కాదు ఏపనీ చేయాలని అనిపించటం లేదు. అతని మనసంతా ఆరోజు వచ్చిన జీతం సర్దుబాటు గురించే ఆలోచిస్తూంది.

ఆ సంవత్సరం టాక్స్ సరిగా ప్లాన్ చేయకపోవడం వల్ల జీతంలో చాలావరకు టాక్స్ కే పోతూంది.వచ్చే నెల కూడా ఇలాగే ఉంటుంది.అది తలచుకుంటేనే భయంగా ఉంది.కిందటి నెల ఎలాగోలా గడిపేశాడు.కిందటి నెలలోనే తక్కువ జీతం ప్రభావం ఏంటో చూశాడు.ఈ నెల ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావటంలేదు. ట్రైన్ వస్తున్నట్లు ఎనౌన్స్ మెంట్ వినిపిస్తోంది.అందరూ హడావిడి గా లేచి సర్దుకోసాగారు.డౌన్ ట్రైన్ కి కూడా ఎనౌన్స్ చేసారు. ఒకేసారి అప్ & డౌన్ ట్రైన్లు వస్తుండటంతో అంతా కంగాళీగా తయారయింది ఆ ప్రదేశమంతా.వరదరాజు కూడా తను ఎక్కాల్సిన ట్రైన్ కోసం ఎదురు చూడసాగాడు.

జనాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తోసుకోసాగారు.”ఈ జనాలకి ఎప్పుడు బుధ్ధి వస్తుందో కదా”అనుకుంటూ అతను కూడా తోసుకుంటూనే ఎక్కటానికి ప్రయత్నం చేయసాగాడు.ఓ బుజానికి ఆ లాప్ టాప్ బాగ్,ఓ చేతిలో టిఫిన్ బాక్సు మొత్తానికి అభిమన్యుడి లా యుద్ధం చేస్తున్నాడు.పాంట్ జేబు దగ్గర ఏదో మెత్తగా తగులుతూంది.అతను ఎలర్ట్ అయ్యేలోపు ఏదో జరిగిన ఫీలింగ్.మొత్తానికి అతను కంపార్ట్ మెంట్ లోకి తోయబడ్డాడు.అతని అవతారమే మారిపోయింది. క్రాఫ్ చెరిగి పోయింది,బట్టలు నలిగి పొయాయి.అతను అప్రయత్నంగా జేబు తడుముకున్నాడు.

ఒక్క సారిగా గుండె ఝల్లుమంది.ఫోను ఉన్న జేబు ఖాళీగా ఉంది.ఒక్క నిమిషం మెదడు మొద్దుబారి పోయింది.ఏంచేయాలో అర్ధం కాలేదు.అంతలోనే ట్రైన్ కదిలింది.వెంటనే అతను దిగాలని ప్రయత్నం చేశాడు.కుదరలేదు.పక్కన ఎటూ కదిలే పరిస్థితి కనపడలేదు.ఎవరి గొడవలో వాళ్ళున్నారు. పక్కనున్న పాసింజర్ అడిగాడు “ఏం అయింది సార్?” “నా ఫోన్ పోయింది” చెప్పాడు వరదరాజు. “ఫోన్ ఒక్కటేనా, ఇంకా ఏమయినా పొయాయా?ఒక సారి చూసుకోండి” వెనుక జేబు తడుముకుంటున్నాడు వరదరాజు పర్సు భద్రంగానే ఉంది.

వెంటనే దాన్ని తీసి పైన చొక్కా జేబులో పెట్టుకున్నాడు. ఇంతలో పక్క స్టేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు వరదరాజు అక్కడ దిగిపోదామని అనుకున్నాడు. దానికీ చాలానే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. స్టేషన్లో దిగి అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్లోకి నడిచాడు వరదరాజు. అక్కడ ఉన్న పోలీస్ తో “నా ఫోన్ పోయిందండి, కంప్లైంట్ ఇవ్వాలంటే ఎలా”అడిగాడు. “అరెరే అలాగా లోపల రైటర్ గారికి చె‌ప్పండి”అంటూ అతను కూడా వరదరాజు వెంట లోపలికి వచ్చాడు. “సార్ ఫోన్ పోయింది, కంప్లైంట్ ఇవ్వాలని వచ్చారు”చెప్పాడు. “అయ్యో, రండి కూర్చోండి సార్”అని రైటర్ ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు.

అన్ని వివరాలు రాసుకుని “ఫోను దొరికే అవకాశం ఉంది సార్,కాని టైం పడుతుంది “చెప్పాడు రైటర్. “కొంచెం త్వరగా అయేట్టు చూడండి,ఫోను కాదుగానీ సిమ్ కార్డ్ త్వరగా రావాలంటే ఎఫ్ఐఆర్ కాపీ కావాలి అంటారు కదా” అడిగాడు వరదరాజు. “అవును మేము మా ప్రయత్నం చేస్తాము.మీకు ఎఫ్ఐఆర్ కాపీ రేపు దొరుకుతుంది.మా సార్ రాగానే చెప్పి కాపీ రెడీ చేస్తాము”చెప్పాడు రైటర్. ఇంకా అక్కడే ఉండి చేసేంది ఏమీ లేదని అర్థం అయింది వరదరాజుకి.

అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఫోన్ తీసుకుని అతని నెంబర్ కొట్టి చూశాడు.ఫోన్ స్విచ్ ఆఫ్ అని వినిపించింది. “ఇంకా ఫోన్ ఆన్ చేసి ఎందుకు పెడతాడు సార్,ఆదొంగ నాయాలు, ఎప్పుడో ఆఫ్ చేసి ఉంటాడు.రేపు మీరు వస్తూ మీ ఫోన్ కొన్నప్పుడు ఇచ్చిన రసీదులు అవీ పట్టుకుని రండి.మా సార్ మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు”అన్నాడతను. ఈసురో మంటూ ఇంటికి బయలు దేరాడు. ఇంట్లో శ్రీమతి తో ఈ విషయం చెప్పాడు. “అయ్యో,అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా?ఒకటా రెండా ఎన్ని వేలు పోసి కొన్నాం ఆ ఫోను.అయినా మీరు పోలీస్ రిపోర్టు ఇచ్చామంటున్నారుగా దొరకవచ్చు లెండి,మరి అప్పటిదాకా ఎలా మానేజ్ చేస్తారు? అసలే మీకు ఫోన్ లేకపోతే రోజు గడవదయిపోయా”అంతం లేకుండా మాట్లాడుతునే ఉంది ఆమె. “నీకు చెప్పాను చూడు తల్లీ “అంటూ విసురుగా అక్కడినుండి వెళ్ళిపోయాడు

వరదరాజు. ఇంకా ఆ రాత్రి నిద్ర పట్టలేదు అతనికి. ఉదయిన్నే ఓ సారి ఫోన్ రింగ్ అవుతుందేమో చెక్ చేశాడు. “మీరు డయల్ చేస్తున్న నెంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది”అని వినిపించింది. అతను ఆ ఫోన్ కి సంబంధించిన కాగితాలు,ఐ ఎమ్ ఇ ఐ నెంబర్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. అప్పటికి ఇంకా ఇన్స్పెక్టర్ రాలేదు, ఆలోగా రైటర్ వివరాలు రాసుకుని రిపోర్టు తయారు చేశాడు. ఇంతలో ఇన్స్పెక్టర్ రావటంతో అతనికి వివరాలు చెప్పాడు రైటర్. “సారీ అండీ, మేం తప్పకుండా మీకు సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం.మీ ఫోన్ పోయినట్టు ఇదిగోండి రిపోర్టు. దీని ద్వారా మీరు మీ సిమ్ కార్డు త్వరగా పొందవచ్చు”అన్నాడు అతను. ఇన్స్పెక్టర్ కి ఓ నమస్కారం పెట్టి బయటకు నడిచాడు వరదరాజు. “అప్పుడే ఫోన్ పోయి రెండురోజులు అయిపోయింది.ఆఫీసులో ఈ విషయం చెప్పి ఓ రోజు శెలవు తీసుకుని సిమ్ కార్డు తీసుకోవాలి.ఇప్పటికే ఎంత మంది ఫోన్లు చేసి ఉంటారో”అనుకుంటూ ఆఫీసు కి వెళ్ళి మానేజర్ నుంచి కలిసి విషయం చెప్పి బయట పడ్డాడు. అక్కడ నుంచి సిమ్ కార్డు ఆఫీసు కి వెళ్ళాడు.అక్కడ మరో ప్రహసనం మొదలయింది.ఆధార్ కార్డ్, డిక్లరేషన్, ఇంకా ఏవేవో కాగితాలమీద సంతకాలు తీసుకుని రెండు రోజుల సమయం పడుతుందని చెప్పారు.ఇక చేసేది ఏమీ లేక ఆరోజుకి ఇంటికి వెళ్ళిపోయాడు.

రెండో రోజు సిమ్ కార్డు ఆఫీసు కి ఫోన్ చేశాడు. “మీ ఆధార్ కార్డు తో మీ పేరు కలవటం లేదు,ఆ పేరు తో కలిసే ఐడీ ప్రూఫ్ ఉంటే ఇవ్వండి మీకు సిమ్ కార్డు నాలుగు గంటల్లో ఇస్తాం”అన్నారు. “ఆ పేరు మీరు రాసిందే కదా, దాంట్లో నా ఫోటో, అడ్రస్, ఫోన్ నంబర్ అన్నీ కలుస్తూనే ఉన్నాయి కదా”అన్నాడు వరదరాజు. “మా బాక్ఎండ్ ఆఫీసు వాళ్ళు తప్పు చేయరు కదా.వాళ్ళు ఈ కొర్రీ వేసీ మీ అప్లికేషన్ ఆపేశారు”అని చావుకబురు చల్లగా చెప్పారు. “సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు?ఆ నెంబర్ నా ఎకౌంట్లు అన్నిట్లో ఉంది.ఇప్పుడు అవి అన్నీ మార్చాలంటే చాలా ఇబ్బంది అవుతుంది”అన్నాడు వరదరాజు. “మీరు మా జోనల్ ఆఫీసు కి వెళ్ళి ప్రయత్నం చేయండి,అక్కడయితే త్వరగా అవ్వొచ్చు “అన్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి అక్కడ మేనేజర్ని కలిశాడు వరదరాజు. “మేం ప్రయత్నం చేస్తామండి”అన్నారు వాళ్ళు కూడా “బహుశా మీ పని అయిపోవచ్చు” తరువాత రోజు పండుగ శెలవు ఆ మరుసటి రోజు ఆదివారం కావడంతో అతని పని ఇంకో రెండు రోజులు వాయిదా పడింది.

సోమవారం ఉదయం పది గంటలకు అతను ఆ జోనల్ ఆఫీసు కి వెళ్ళాడు.అక్కడున్న మానేజర్ అతన్ని కూర్చుండబెట్టి అతని మెయిల్ మళ్ళీ పంపాడు.గంటలు గడుస్తున్నా ఏం విషయం చెప్పలేదు.నాలుగ్గంటల తర్వాత “మీ పని అవదు సార్ మా ఆఫీసు వాళ్ళు ఒప్పు కోవటం లేదు”అని చెప్పాడు మానేజర్. గుండెల గునపం దించినట్లు అయింది వరదరాజుకి. ఇంకా ఎప్పటికీ ఆ నెంబర్ వాడలేననుకుంటే బాధగా అనిపించింది అతనికి. ఇంకా చేసేది ఏమీ లేదని అర్థం అయింది. పాత సిమ్ బ్లాక్ అయింది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. అతను వెళుతూ ఆలోచిస్తున్నాడు “ఈ పని గురించి ఇప్పటికి ఎన్ని రోజులు తిరిగాను! అయినా దాని గురించి అంతగా ఆలోచించటానికి ఏమీ లేదు.వేరే నెంబర్ తీసుకుని అందరికీ అప్ డేట్ చేస్తే సరి.కొద్దిగా ఇబ్బంది అయినా అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు.ఈ విషయం లో ఎవరినీ తప్పు పెట్టటానికి లేదు కదా.ఫోన్ పోవటం దురదృష్టం.మిగిలినవి అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి.ఆల్ ఇన్ గేమ్.కొత్త టెలీఫోన్ కంపెనీ వాడు తెగ తిరుగుతున్నాడు సిమ్ ఇవ్వటానికి.వాడికొకసారి ఫోన్ చేస్తే ఈ సిమ్ గోల పోతుంది.చవకలో ఓ ఫోన్ కొనుక్కోవాలి.పండగల సీజన్ కదా తక్కువ లోనే దొరకవచ్చు.” తేలిక పడిన మనసుతో ఫోన్ ల షోరూం లోకీ నడిచాడు వరదరాజు.

మరిన్ని కథలు

Saralamaina dhyasa
సరళమైన ధ్యాస
- బివిడి ప్రసాద రావు
Praptam
ప్రాప్తం
- బోగా పురుషోత్తం.
Amma
అమ్మ
- B.Rajyalakshmi
Prema oka natakam
ప్రేమ ఒక నాటకం
- బొబ్బు హేమావతి
Vupayam tho tappina apaayam
ఉపాయంతో తప్పిన అపాయం!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Pillalu-Yajamani
పిల్లలు - యజమాని
- బివిడి ప్రసాద రావు