సరళమైన ధ్యాస - బివిడి ప్రసాద రావు

Saralamaina dhyasa
రాము, గిరిలు మంచి స్నేహితులు. ఇద్దరూ ఏడవ తరగతి చదువుతున్నారు.
దసరా సెలవుల్లో.. రాము, గిరిలు పక్క ఊరిలో ఉన్న ఉద్యానవనము సందర్శించాలి అనుకున్నారు. తమతో పాటు కొందరిని కూడా కూడతీసుకు వెళ్లాలి అనుకున్నారు. ఆ ప్రయత్నంలో వారికి శేఖర్, సోములు, ప్రణవ్ లు సమ్మతి తెలిపారు.
రాము, గిరిల స్నేహం, ధైర్యం, చొరవ, బుద్ధి తెలిసిన పెద్దలు వారి ప్రతిపాదనకు అనుమతించారు. మర్నాడు ఆ ఐదుగురు పక్క ఊరికి బయలుదేరారు.
ఉద్యానవనములోని ప్రకృతి అందాలను ఆనందంగా, అబ్బురంగా చూస్తున్నారు వాళ్లు. ఆ సందడిలో వాళ్లు వేళలను గమనించనే లేదు. పైగా తమతో తెచ్చుకున్న తిళ్లును కూడా తినక గందికగా కేరింతలతో కాలాన్ని సునాయసంగా గడిపేసారు. చీకటి పడుతోంది. ఆకలై గబగబా తిళ్లను తినేసారు.
అప్పటికే బెంబేలు పడుతున్న మిగతా ముగ్గురును సముదాయిస్తూ రాము, గిరిలు తిరిగి తమ ఊరి దారి పట్టారు.
"తోవలోని చింత చెట్టు మీద దయ్యాలు ఉంటాయటగా." సోములు భయం భయంగా నడుస్తూనే గుణుస్తాడు.
"ఏమీ కాదు. మనం గుంపుగా ఉన్నాంగా." ధైర్యం చెప్పాడు గిరి.
ఐనా.. సోములు మాటలు విన్నాక.. శేఖర్, ప్రణవ్ లు కూడా భయ పడుతూనే ఉన్నారు. నక్కి నక్కి నడుస్తున్నట్టే కదులుతున్నారు.
ఇవి గమనించిన గిరి.. "రాము తప్ప.. మిగతా వారిలో ఎవరైతే మంచి కథ చెప్పుతారో వారికి రేపు పావలా పెట్టి పుల్ల ఐస్ ఇప్పిస్తాను." చెప్పాడు.
మిగతా వారిలోని భయం పోగొట్టాలనే గిరి పుల్ల ఐస్ ఎర విసిరాడని రాము గ్రహించాడు.
"నేను కూడా మంచి కథ చెప్పిన వారికి కాటు బెల్లం ముక్క కొనిస్తాను." చెప్పాడు.
శేఖర్ ఆశ పడ్డాడు. కథ చెప్పడం ప్రారంభించాడు.
ఆ కథ ఆసక్తిగా ఉండడంతో.. చెవులు రిక్కించి ఆ కథ వినుటలో పడ్డారు సోములు, ప్రణవ్ లు.
ఆ ఐదుగురూ సాఫీగా నడుస్తూనే ఉన్నారు.
తమ పథకం పారుతున్నందుకు రాము, గిరి ముఖాలు చూసుకొని నవ్వుకున్నారు.
శేఖర్ కథ చెప్పుతూనే ఉన్నాడు. తనకే పుల్ల ఐస్, కాటు బెల్లం ముక్క దక్కాలని మరియు మిగతా వారికి కథ చెప్పే అవకాశం ఇవ్వకూడదని శేఖర్ తన కథని మరింత సాగ తీస్తూ చెప్పుతున్నాడు.
అలా వాళ్లు ఆ మర్రి చెట్టు దాటి ఊరిలోకి వచ్చేసారు.
"ఇక కథ ఆపేయ్ శేఖర్. చూసావా సోములు.. ఆ చెట్టు దాటేసి మనం ఎంచక్కా ఊరిలోకి వచ్చేసామో. ఏమైనా ఐందా. సరళమైన ధ్యాస ఎట్టి భయానైనా ఇట్టే పారదోలేస్తోంది." చెప్పాడు గిరి.
"అంతేగా మరి. సరే ఇప్పటికి ఎవరిళ్లకు వాళ్లం వెళ్దాం. రేపు మనం కలిసి పుల్ల ఐస్ లు.. కాటు బెల్లం ముక్కలు తిందాం." చెప్పాడు రాము.
"అవును. వాటిని నేను కొని పెడతాను." చెప్పాడు గిరి.
"సర్లేవోయ్." సరదాగా గిరి భుజం తట్టాడు రాము.
పిమ్మట వారంతా హుషారుగా తమ తమ ఇళ్లను చేరిపోయారు.
***

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ