కుర్చీ - జి.ఆర్.భాస్కర బాబు

Kurchee

కుర్చీలు చాలా రకాలే ఉన్నాయి. చెక్క కుర్చీ, ఇనుప కుర్చీ, ప్లాస్టిక్ కుర్చీ,మడత కుర్చీ, కుషన్ కుర్చీ ఇవి కాదు నేను చెప్పాలనుకున్నది. అధికారం కుర్చీ, పెద్దరికం కుర్చీ, మమకారం కుర్చీ, సెంటిమెంట్ కుర్చీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కుర్చీలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునేది సెంటిమెంట్ కుర్చీ గురించి. సరే ఇక కథ లోకి వస్తే…..

రవిబాబు అలసటగా ఇంటికి వచ్చాడు. కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. అతని భార్య లీల మంచి నీళ్ళు తెచ్చింది. “ఏంటి అలా ఉన్నారు,”అడిగింది. “ఏం లేదు,పని చాలా ఎక్కువయింది అంతే”అన్నాడతను. “ఆ కుర్చీలోంచి లేచి రండి వడ్డించేస్తాను” అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళింది లీల. “ఆ మళ్ళీ ఏం లేస్తానూ,ఆ కొంచెం ఇలా ఇవ్వు, ఇక్కడే తినేస్తాను”అన్నాడు రవిబాబు కుర్చీలో నుండే. రవిబాబు ఓ ప్రయివేటు ఫాక్టరీ లో పని చేస్తున్నాడు.పెద్దగా చదవక పోయినా మంచి ఉద్యోగమే చేస్తున్నాడు.తండ్రి కట్టిన ఇంట్లోనే ఉంటున్నాడు. ఇల్లంటే చిన్నదేంకాదు,అతని తండ్రి మంచి ఉద్యోగమే చేసి పెద్ద ఇల్లే కట్టాడు.రవిబాబు అన్న వేరే ఊళ్ళో ఉండటంతో రవిబాబు ఒక్కడే ఆయింట్లో ఉంటున్నాడు. ఇంట్లో చాలా ఫర్నిచర్ కూడా ఉంది. ఫర్నిచర్ ఉన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆ ఇంట్లో ఉన్న చెక్క కుర్చీ గురించే.అతని తండ్రి ఎప్పుడు ఆ కుర్చీలోనే కూర్చునే వాడు.ఇప్పుడు రవిబాబు ఆ కుర్చీలోనే కూర్చుంటున్నాడు. అదొక సెంటిమెంట్ .

అతని తండ్రి ఆ కుర్చీ గురించి చెప్తూండేవాడు అతనితాతగారు లక్ష్మీకాంతం గారు ఆ కుర్చీ చేయించారట. ఆ కుర్చీ మండువా లోగిలి ఇంటివసారా లో ఉండేదిట. ఆ కుర్చీలో కూర్చుని ఆయన వ్యవహారాలు చక్కబెట్టే వారట.ఆయన ఉన్నన్ని రోజులూ ఆ ఇల్లు చాలా హడావుడిగా ఉండేదిట.ఆయన భార్య శాంతమ్మ గారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు వంటలు చేయించటం, కాఫీ టిఫిన్లు సరఫరా చేయటం తోనే సరిపోయేది. ఆవిడ బైట కనుపించే సందర్భాలు బహకొద్ది. ఆ తరువాత రవిబాబు తాతగారు రామశేషయ్య గారి హయాంలో ఆ ప్రభ తగ్గింది.కారణం ఆస్తులు కరిగిపోవటమే.ఆయన కూడా ఆకుర్చీలోనే కూర్చునే వారు.ఆస్తులు అనుభవించటం పోయి ఉద్యోగాలు చేసే పరిస్థితి ఏర్పడింది.రవిబాబు తండ్రి రామ్మూర్తి గారు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేశారు.పెద్ద ఇల్లు కట్టుకుని బాగానే బ్రతికాడు.ఆయన కూడా ఆ కుర్చీని మాత్రం తన వెంట తెచ్చుకున్నాడు. రామ్మూర్తి గారికి ఇద్దరూ మగపిల్లలులే.రవిబాబు పెద్ద సంతానం కావటంతో కాస్త గారాబం ఎక్కువయి చదువు అంతంత మాత్రంగానే సాగింది.చిన్నవాడు సూర్యనారాయణ పూనా లో స్థిరపడ్డాడు.ఆ విధంగా ఆ ఇంట్లో రవిబాబు కుటుంబం మాత్రమే ఉంటున్నారు. అతను ఆ కుర్చీ లోనే కూర్చుంటున్నాడు.అందుకే అది ‌సెంటిమెంట్ కుర్చీ అయిపోయింది.

పొద్దున్నే లేచి రవిబాబు ఆ కుర్చీలో కూర్చునే కాఫీ తాగుతాడు.సెల్ఫోన్లో గుడ్ మార్నింగ్ మెసేజ్ లు పెడతాడు.ఆరోజు పేపర్ చదువుతాడు.ఆ తరువాత ఆఫీసు కు తయారయి ఆ కుర్చీలోనే కూర్చుని టిఫిన్ తింటాడు.ఆఫీసు నుండి వచ్చిన తరువాత ఆ కుర్చీ లో కూర్చొనే మళ్ళీ కాఫీ తాగుతాడు.ఇలా రవిబాబు కు ఆ కుర్చీతో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. కాలం కదిలిపోయింది.

రవిబాబు రిటైర్ అయ్యాడు.అతని ఒక్కగానొక్క కొడుకు రాము ఉద్యోగం చేస్తున్నాడు. రవిబాబు దినచర్య కూడా మారింది.ఉరుకుల పరుగుల రోజులు పోయి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో అతను తాపీగా నిద్రలేవడం ఆ కుర్చీలో కూర్చుని కాఫీ తాగటం, కుదిరితే నడక మరో సారి ఆ కుర్చీలోనే కాఫీ, స్నానం చేసి టిఫిన్ ఆ కుర్చీలోనే. అటు తరువాత చిన్న కునుకు.ఆసరికి లంచ్ టైం అవుతుంది.లంచ్ కూడా ఆ కుర్చీలో కూర్చునే టీవీ చూస్తూ తినేస్తాడు.కాస్త భుక్తాయాసం తీర్చుకుని మళ్ళీ ఓ కునుకు.నాలుగు గంటలకు కాస్త కాఫీ తాగటం తరువాత నడక, రాత్రి పది గంటలకు నిద్ర. రోజులో ఎక్కువ శాతం అతను ఆ కుర్చీలోనే కూర్చుని ఉంటాడు. లీల చాలా సార్లు అనేది”మరీ ఆ కుర్చీకి అంటుకు పోకండి”అని.అయినా అతను ఏమీ మారలేదు. ఒకరోజు రవిబాబు ఉన్నట్టుండి కుర్చీ లో కూర్చున్నవాడు కూర్చున్నట్టే కిందపడ్డాడు.వెంటనే అతన్ని హాస్పిటల్ లో చేర్పించారు.

ఆ పట్టు పట్టు హాస్పిటల్ లోనే పది రోజుల పాటు ఉంచాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అతను పడక గదిలోనే పడుకోవాల్సి వచ్చింది. ఓ నెల తర్వాత అతను మెల్లగా హాల్లోకి వచ్చాడు.అక్కడ కుర్చీలో కూర్చున్న రాము “రండి నాన్నా” అంటూ లేచి అతన్ని కూర్చోపెట్టాడు. ఆ తర్వాత చాలా సార్లు అట్లాగే జరిగింది. రవిబాబు ఆరోగ్యం కుదుట పడింది. కాని రాము ఆ కుర్చీలో కూర్చోవడం మానలేదు. “ఏంటోయ్, ఇంట్లో రాజ్యం మారిందా?”అన్నాడు రవిబాబు. “అదేంటి అలా అడిగారు”అంది లీల “మరి నేనెక్కడ కూర్చోవాలి?” చిన్నపిల్లాడిలా అడిగాడు. అయోమయంగా చూసింది లీల. “మరేం లేదు నా సీటు నీ కొడుకుతీసుకుంటేనూ”అన్నాడు రవిబాబు. ఇంకాస్త అయోమయంగా చూస్తూ ఉంది లీల ”మరీ అంతలా చూడకు”,నవ్వేశాడు రవిబాబు”రేపటి నుంచి నా సీటు నీ కొడుక్కి ఇచ్చేస్తా లే” అప్పుడే అక్కడికి వచ్చిన రాము “అదేం లేదు నాన్నా,ఆ కుర్చీ జాయింట్లు అన్నీ లూజ్ అయ్యాయి, మళ్ళీ మీరెక్కడ కింద పడతారో అని నేను కూర్చుంటున్నా, రేపోమాపో అది బాగుచేయిస్తాను”అన్నాడు “లేదురా రిపేరు చేయించినా నువ్వే అందులో కూర్చో,నేను ఏమీ ఫీల్ అవటం లేదు”రామారావు నవ్వుతూ అన్నాడు”నా తరువాత నీవేగా అందులో కూర్చోవాల్సింది” తరంమారిందనటానికి సంకేతంగా రామారావు పలితకేశం మెల్లగా నవ్వింది.

మరిన్ని కథలు

Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్