రాజు ఔదార్యం! - బోగా పురుషోత్తం

Raaju oudaryam


పూర్వం తిరువళ్లూరును తిప్పేశ్వరుడు పాలించేవాడు. అతనికి నల్గురు భార్యలు వున్నారు. వారందరికీ రాజు అంటే ఎంతో మక్కువ. కానీ వారికి ఎన్ని ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదు. మంత్రిని పిలిపించి రాజ్యంలో వున్న గొప్ప జ్యోతిష్కులకు రప్పించి గొప్పగా పుత్ర కామేష్టి యాగం చేసి అందరికీ గొప్ప కానుకలు పంచాడు. ఎంత ప్రయత్నించినా పిల్లలు పుట్టలేదు.
రాజు, రాణులు చింతించలేదు. వృద్ధాప్యం సమీపించింది. ఇక లాభం లేదనుకుని రాజ్యంలో అనాథలుగా వీధుల్లో తిరుగుతున్న వంద మంది పిల్లల్ని తిసుకొచ్చి రహస్యంగా కొద్ది రోజులు పెంచాడు. వారికి వయసు పెరుగుతుండడంతో విద్యాబుద్ధులు నేర్పించడానికి ఓ మంచి గురుకుల ఆశ్రమంలో చేర్చాడు. వారు తన దత్తత పిల్లలు అని తెలియకూడదని గోప్యంగా వుంచాలని రాజు గురుకుల గురువును ఆజ్ఞాపించాడు.
గురుకుల గురువు ప్రజ్ఞానందుని శిక్షణలో పిల్లలందరూ అన్ని విద్యల్లోనూ నిష్ణాతులయ్యారు. రోజులు గడిచే కొద్దీ పిల్లలు గురువును మించిన శిష్యులయ్యారు.
ఓ రోజు తిప్పేశ్వరుడు గురుకులానికి వచ్చాడు. గురువుకు ఇవ్వాల్సిన జీతభత్యాలు, గురుదక్షిణగా విలువైన బంగారు ఆభరణాలు సమర్పించుకుని తన గురుభక్తిని చాటుకున్నాడు.
రాజ మర్యాదలకు ప్రజ్ఞానందుడు ఎంతో సంతోషించాడు. విలువిద్యలో పిల్లలందరూ చాలా పరిజ్ఞానం పొందారని ఇక రాజ్యానికి తీస్కెళ్లవచ్చని రక్షక కవచంలా కంటికి రెప్పలా కాపడుతారని హితవు పలికాడు.
రాజు వారికి గురుకులంలోనే రహస్యంగా వుంచండి..! తిండి, ఇతర ఖర్చులు ఇప్పిస్తాం..అత్యవసర సమయాల్లో వారిని వినియోగించుకుంటాం..’’ అని పలికి సెలవు తీసుకున్నాడు.
రాజ్యంలో మంత్రి మాధవయ్య వృద్ధాప్యంలో వున్న రాజును చూసి బాధపడేవాడు. అప్పటికే పిల్లలు లేరని తెలియడంతో పొరుగు రాజుల కన్ను తిప్పేశ్వరుడిపై సింహాసనంపై పడిరది. దండయాత్ర చేయడానికి పలుమార్లు ప్రయత్నించారు. మంత్రి మాధవయ్య చాకచక్యంగా నిలువరించాడు.
‘‘ ప్రభూ ఇక రక్షించడం నా వల్ల కాదు.. అలసిపోయాను..వయసు మీద పడుతోంది.. మీకు వారసులు లేరని తెలిసి పొరుగు రాజ్యాల రాజులు మీపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. అప్రమత్తంగా వుండాలి..’’ అని హెచ్చరించాడు.
తిప్పేశ్వరుడు అదేమీ పట్టించుకోలేదు. మంత్రి ఆందోళనగా చూశాడు. ఒక్కసారిగా నల్గురు పొరుగు రాజులు సైన్యంతో విరుచుకుపడ్డారు. మంత్రి వెన్నులో భయం పుట్టుకుంది. రాజు ఏమాత్రం బెదరలేదు. పొరుగు రాజుల సైన్యం రాజభవనాన్ని చుట్టుముట్టింది. ఇక తిరువళ్లూరు రాజ్యం పరరాజుల పాదాక్రాంతమయ్యిందనుకున్నాడు మంత్రి.
అదే సమయానికి ఓ వందమంది రాజభవనం బయటి నుంచి అత్యంత చాకచక్యంగా పొరుగు రాజుల పరాక్రమాన్ని అణచివేశారు. క్షణాల్లో పట్టి బందించి రాజు తిప్పేశ్వరుడి కాళ్ల వదద పడవేశారు. ‘‘ నాన్నా మీకు ద్రోహం తలపెట్టిన వాళ్లకు ఏ శిక్ష వేస్తారో వెయ్యిండి..’’ అన్నారు.
ఎదురుగా జరుగుతున్న హఠాత్పరిణామాన్ని ‘కల, నిజమా?’ అని విస్తుపోయి చూశాడు మంత్రి. వారసులు లేని రాజుకు ఇంత మంది పిల్లలు వుండడం ఏమిటి?’ ఆశ్చర్యంతో చూశారు అందరూ.
‘‘ భళా..భళా.. పిల్లలూ.. మీ అసమాన నైపుణ్యం అద్భుతం.. పిల్లలు లేరన్న అపకీర్తిని పోగొట్టారు.. అదే మాకు చాలు.. ఇక ఈ రాజ్యాన్ని..ప్రజలను మీరే రక్షించుకోండి..’’ అని పాలనా బాధ్యతలు వారికి అప్పగించి విశ్రాంతి తీసుకున్నాడు రాజు.
అనాథలకు ఆశ్రయమిచ్చి రాజు దేశభక్తిని ఎలా నేర్పాడో పొరుగు రాజులకు అర్థమైంది. పిల్లలు లేని వాడని హేళనచేసే పొరుగురాజులు సైతం రాజు కన్న బిడ్డల్లా అనాథలకు ఆశ్రయమిచ్చి తీర్చిదిద్దిన ఔదార్యాన్ని చూసి వేనోళ్ల పొగిడారు.

మరిన్ని కథలు

Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్