నవ్విన నాపచేను పండింది - కాశీవిశ్వనాధం పట్రాయుడు

Navvina naapachenu pandindi

పూర్వం కాంచీపురంలో వేలు అనే యువకుడు నివసించేవాడు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి మెట్టు భూమిని చదును చేయడం ప్రారంభించాడు. ఆ దారంట వెళ్ళే వారంతా “నీకేం మతి సుతి లేదా అది బీడు నేల, ఏ మొక్కా మొలవదు, నీ శ్రమ వృధా అవుతుంది. మీ నాన్న అందుకే ఆ భూమిని వదిలేశాడు.” అని చెప్పేవారు.

మరి కొందరైతే ఎగతాళి చేసేవారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా తనపని తాను చేసుకుపోయేవాడు. వర్షాకాలం రాగానే టేకు, జీడి మామిడి మొక్కలు నాటాడు. అనతి కాలంలోనే ఆమొక్కలు పెరిగి పెద్దవయ్యాయి. ఫలసాయం కూడా లభించడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన కైలాసం “నవ్విన నాపచేను పండింది.” అన్నాడు వేలుతో. “అంటే ఏంటో వివరంగా చెప్పవా కైలాసం మావా.” అన్నాడు వేలు. వెనకటికి చొక్కలింగం అనే రైతు వరి పంట పండించాడు.

వరికోత,నూర్పు అయ్యింది. ధాన్యం గాదెలో నిల్వచేశాడు. చుట్టుపక్కల వాళ్ళంతా మినప, పెసర విత్తనాలు చల్లారు. వ్యవసాయ పనులు మొదలుపెట్టారు… చొక్కలింగానికి మినప, పెసర విత్తనాలు కొనే స్థోమత లేక పొలాన్ని అలాగే వదిలేశాడు. కొద్దిరోజులకు వర్షం పడింది. కోసి వదిలేసిన వరి మోడులు మళ్ళీ చిగురించాయి. చెను ఏపుగా పెరిగింది.

చొక్కలింగం చేనుకు సంరక్షణ చేయడం మొదలుపెట్టాడు. ఇలా మోడు నుంచి వచ్చిన మొక్కల్ని నాప మొక్కలు అంటారు. నాప అంటే వ్యర్ధమైనదనీ, పనికిరానిదని అర్ధం. అలాంటి చేనుకు చాకిరి చేస్తున్న చొక్కలింగాన్ని రైతులంతా హేళన చేసారు. కాలం గడిచింది. పనికిరాదు అనుకున్న, అందరూ నవ్విన నాప చేను పండింది. అధిక దిగుబడి నిచ్చింది. అప్పటి నుంచి ‘నవ్విన నాపచేను పండింది’ అనే జాతీయం వాడుకలోకి వచ్చింది. ఎవరినీ చేతకానివారని, తెలివితక్కువ వారని, పనికిరాని వారని, నిందించకూడదు, హేళన చెయ్యకూడదు.

ఏమో! ఏ పుట్టలో ఏ పాముందో! ఎవరికి తెలుసు? ఇలా పనికిరానివారనుకున్నవారు, హేళన చేయబడినవారు ప్రయోజకులైనవారు ఎందరో ఉన్నారు. అలాగే నీ ప్రయత్నం కూడా ఫలించింది. అందుకే అలా అన్నాను. ఒక యువకుడు కరువు కాటకాల్లో ఉన్న తన ఊరిని చూసి చలించిపోయాడు. ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా, ఎంతమంది నవ్వినా, ముప్పై ఏళ్ళు శ్రమించి తానొక్కడే చెరువును తవ్వాడు. నవ్వినోళ్ళ నోళ్ళు మూయించాడు. నాడు నవ్వినవారు కూడా, నేడు ఆ చెరువును ఉపయోగించుకుని పంటలు పండించి హాయిగా జీవిస్తున్నారు. మరొక యువకుడు రహదారి సౌకర్యం లేక సకాలంలో వైద్యం అందక తన భార్య మరణించిందని, ఆ పరిస్థితి ఇతరులకు రాకూడదని దృఢ సంకల్పంతో కొండను తవ్వి రోడ్డు వేశాడు. గొప్పతనాన్ని గుర్తించడానికి కూడా ఎంతో కొంత గొప్పతనం కావాలి. జనంచే నిరాదరణ చేయబడినదాన్ని, విపరీతమైన కృషి చేత మంచి ఫలితం వచ్చేట్లు చేసే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతున్నాము.” అని వివరించాడు కైలాసం. “ఓహో అదా సంగతి! అందుకా అలా అన్నావు.” అన్నాడు వేలు.

మరిన్ని కథలు

Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్