బ్లాక్ అండ్ అన్ బ్లాక్ - ఇందుచంద్రన్

Block and unblock

సాయంత్రం ఆరవుతోంది...

బ్లాక్ చేయడం మళ్లీ అన్ బ్లాక్ చేసి మెసేజులేమైనా వచ్చాయా? అని చెక్ చేసి మళ్లీ బ్లాక్ చేయడం వారం రోజులుగా ఇదే తంతు. అన్ బ్లాక్ చేసి నాలుగు గంటలైనా ఒక్క మెసేజీ కూడా రాకపోవడంతో చిర్రెత్తుకొచ్చి కేవలం తనకి మాత్రం కనిపించేలా వాట్సప్ లో స్టేటస్ పెట్టి పదే పదే చూసుకుంటున్నాను. లాస్ట్ సీన్ మారుతూ ఉంది కాని నా వాట్సప్ స్టేటస్ మాత్రం చూడలేదు. చూడలేదా? లేక చూడాలనుకోలేదా అని కాసేపు నా బుర్ర లోతుగా ఆలోచిస్తూ ఉంది. ఆరో గంటకి పది నిమిషాల స్టేటస్ ముందు చూసినట్టు కనిపించింది.చూసి కూడా ఒక్క మెసేజీ పంపలేదు.

“అసలీ మనుషులు ఎందుకు ఇలా ఉంటారో ?” అని కోపమొచ్చింది దాని వెంటే తోక లాగా ఏడుపు కూడా వచ్చింది.

సర్వ సాధారణంగా ఏడుపు రాని నాకు ఇప్పుడు వాడి విషయంలో మాత్రం ఏడుపే ముందుకొచ్చి కూర్చుంటుంది. ప్రేమలో పడితే అంతెనేమో !

మొన్నటివరకు గొడవపడి మాట్లాడకపోతే వేరే నంబర్ల నుండి ఫోన్స్ చేసి, వేరే సోషల్ యాప్స్ నుండి మెసేజులు పంపేవాడు. చివరకి ఆన్లైన్ బ్యాంక్ యాప్స్ ని కూడా వదిలి పెట్టేవాడు కాదు.

అవేవి వర్కవుట్ అవకపోతే ఆఫీసు ముందు ప్రత్యక్షమయ్యేవాడు. బుజ్జగించేవాడు,బ్రతిమలాడేవాడు, ఏదో మాయ చేసి నన్ను ఒప్పించేవాడు.

ఇప్పుడు గొడవ తర్వాత కనీసం ఒక్క ముక్క సారీ కూడా లేదు. రాజీ పడి చెప్పాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకునే ఈగో ని పక్కన పెట్టేసి మాట్లాడేసున్నా. మాట్లాడకుండా ఉండలేకపోతున్నా కూడా.

అయినా రిలేషన్ షిప్ లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి? వాడే నేనూ, నేనే వాడూ అయితేనూ.

ఏడ్చి ఉబ్బిన మొహాన్ని కడుక్కుని బుగ్గల ఎరుపుని మ్యాచ్ చేస్తూ లిప్ స్టిక్ పెట్టుకుని ఆఫీస్ నుండి బయటకొచ్చేసాను.

"అయినా గొడవలు లేని బంధాలు ఏముంటాయి?" ఎంత గొడవ జరిగితే అంత దగ్గరవుతున్నట్టు అనిపిస్తుంది.నాలుగు రోజులు మాట్లాడకపోతే ఐదో రోజు ఆ ప్రేమని మూటగట్టుకుని ముందు వాలిపోతాడు.

ఆఫీస్ దగ్గరకి వచ్చి ఎక్కడైనా నా కోసం ఎదురు చూస్తున్నాడేమో అని చుట్టూ చూసాను. ఎక్కడా కనిపించలేదు. వాడి కోసం ఎదురు చూస్తున్నానా? అనిపించి,

ఈ సారి కాళ్లు పట్టుకున్నా సరే అస్సలు కరిగిపోకూడదు అనుకుంటూ రోడ్ దాటేసి ఆటో కోసం నిలబడ్డా. దూరంగా ఆటో వస్తుంది ఆ ఆటోని క్రాస్ చేసుకుంటూ వచ్చి న బైక్ నా ముందు బ్రేక్ వేస్తూ ఆగింది.

హెల్మెట్ తీసాడు. నా వైపు చూసాడు. చిన్నగా నవ్వాడు.

పొద్దున్నుండి వాడి ఆలోచనల మధ్య నలిగిన నాకు చూడగానే మొదట కోపమే వచ్చింది. నా చేయి పట్టుకుని బైక్ ఎక్కమని సైగ చేసాడు.గాలి తగిలిన ఐస్ ముక్కలా కరిగిపోయా. పూర్తిగా కరిగే లోపే బైక్ ఎక్కేసాను.

ఇద్దరం కాఫీ షాప్ లో కూర్చున్నాం.

మాములుగా అయితే పక్క పక్కనే కూర్చునే వాళ్లం. ఈ సారి ఎదురుగా కూర్చున్నా. కాఫీ వచ్చే లోపు ముందు జరిగిన గొడవ గురించి మాట్లాడుకున్నాం,మళ్లీ పోట్లాడుకున్నాం. అది మాకు మాములే. ఇప్పుడు ఒకరికి ఒకరు సారీ లు చెప్పుకోవడం మానేసాం.

కాసేపటికి కాఫీ కప్పులు మా మధ్యన కూర్చున్నాయి.

“ఇంకా ఎన్ని రోజులు ఇలా?” అన్నాను.

సమాధానం తెలియని చూపొకటి చూసి ఊరుకున్నాడు.

“ఇలా ఎక్కడి వరకు వెళ్తాం” అన్నాను అసహనంగా.

“పెళ్లి ఫిక్స్ అయ్యింది” అన్నాడు ఒక్క ముక్కలో ముగిస్తూ

ఆ మాట విన్నాక ఏం అడగాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయా.

“ఇంట్లో వాళ్లే ఫిక్స్ చేసేసారు,హడావిడిగా నిశ్చితార్థం జరిగిపోయింది. ఆ తర్వాత నెల పెళ్లి” అని చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు.మళ్లీ నన్ను చూసి ఆగిపోయాడు.

“మరి మన సంగతి ?” అన్నాను కోపం కన్నా ముందు బయటకొస్తున్న కన్నీళ్లని ఆపుకుంటూ.

మళ్లీ సమాధానం లేని అదే పిచ్చి చూపులు చూస్తూ ఉన్నాడు. ఏదో విధంగా మాట్లాడి నన్ను కరిగించడానికి నా పక్క కుర్చీలో కూర్చున్నాడు.అందరి మీద ఇంతెత్తున ఎగిరిపడే నా కోపం వీడి ముందు మాత్రం బాధ ని ముందుకి నెట్టేసి ఆగిపోతుంది. నా కళ్లలో నీళ్లు టేబుల్ మీద రాలిపోతున్నాయి. ఎవరూ చూడకముందే అద్దాలు పెట్టుకో అని నా సెల్ఫ్

రెస్పెక్ట్ హెచ్చరిస్తూ ఉంది.

అద్దాలోంచి చూస్తే టేబుల్ మీద కాఫీ చారలతో ఉన్న కప్ వెక్కిరిస్తున్నట్టు అనిపించింది.

“యు నో రైట్...మన గురించి చెప్పినా అర్థం చేసుకునే రకం కాదు మా పేరెంట్స్. ప్రేమ విషయాన్నే ఒప్పుకోరు అలాంటిది నీ డివోర్స్ గురించి తెలిస్తే అసలు ఒప్పుకోరు” అన్నాడు అరచేతుల్ని పట్టుకుని.

మౌనంగా వింటూ ఉన్నా.

“ఈ పెళ్లి కూడా నాకిష్టం లేదు, కాకపోతే ఇంట్లో వాళ్ల పోరు పడలేక” అన్నాడు వేళ్లని ముడివేస్తూ.

వాడి చేతికి ఉన్న నిశ్చితార్థం ఉంగరం తళుక్కుమని మెరిసింది. ఉంగరాన్ని చూడగానే నా చేతిని వెనక్కి తీసుకున్నాను.

“నా బాధ నీకు తప్ప ఇంకెవరికి అర్థం కాదు, చెప్పుకోలేను కూడా” అన్నాడు బాధగా చూస్తూ.

అడగడాటిని చాలా ప్రశ్నలున్నాయి కాని వాడి దగ్గర సమాధానాలుండవని అర్థమయ్యింది.అలా వాడిని చూడలేనని కూడా అనిపించింది.

“నీకెప్పుడు ఏ అవసరమున్నా, ఏం కావాలన్నా...ఐ విల్ బి దేర్” అన్నాడు మళ్లీ చేతులు పట్టుకుని.

ఈ సారి చేతులు విడిపించుకోలేదు, ఎలాగు వాడే వదిలేస్తాడని తెలుసు కాబట్టి.

చాలా సేపు నన్ను ఓదార్చడానికి, ఒప్పించడానికి చాలానే చెప్పాడు. అందులో కొన్ని నా చెవిలోకి ఎక్కలేదు కూడా.

టేబుల్ మీదున్న వాడి ఫోన్ మోగుతూ కనిపించింది.

పేరు మాత్రం మసగ్గా పక్కనున్న హార్ట్ సింబల్ మాత్రం స్పష్టంగా కనిపించింది. ఫోన్ తీసుకుని వెళ్లిపోతూ వెనక్కి తిరిగి బై అని సైగ చేసాడు.

వాడు వెళ్లిన కాసేపటికి కాఫీ కప్పులు కూడా వెళ్లిపోయాయి.

అప్పుడొచ్చింది కోపం, టేబుల్ బద్దలు కొట్టాలనిపించింది. కాస్త ముందొచ్చు కదా అని ఏడుస్తూ బాధ పడ్డాను.

ఫోన్ తీసుకుని వాడి నంబర్ బ్లాక్ చేసాను మళ్లీ.

****

ఏడాది తర్వాత వాడి నంబర్ అన్ బ్లాక్ చేసా.

డీపి లో వాడి పక్కన భార్య,వాళ్లిద్దరి చేతిలో నెలల బిడ్డ ఉన్న ఫోటో కనిపించింది.

ఆలోచనలు నన్ను చుట్టు ముట్టే లోపే మళ్లీ బ్లాక్ చేసా.


మరిన్ని కథలు

Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్