ఓ అనుభవం - జి.ఆర్.భాస్కర బాబు

O anubhavam

అతను గబగబా హాస్పిటల్ లోకి వచ్చాడు. అక్కడ ఉన్న వైటల్స్ పరిక్ష చేసే నర్సు దగ్గరకు వెళ్ళాడు. మనిషి ఆపాదమస్తకం వణికిపోతున్నాడు. అతనిని చూడగానే నర్సు “ఏమయింది సార్”అంటూ సాయం చేసి కుర్చీ లో కూర్చోపెట్టింది. “ నా పేరు లింగేశ్వర్, పక్కనున్న ఆఫీసు నాదే.ఏమయిందోఏమో సిస్టర్, ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి ఒక నిమిషం తరువాత షివరింగ్ మొదలయింది”కంగారుగా చెప్పాడు. “మంచి నీళ్ళు తాగుతారా? బీపీ షుగర్ లెవెల్స్ పరీక్ష చేస్తాను”అంటూ వెంటనే టెస్టు చేసింది. ఆలోగా డ్యూటీడాక్టర్ కి కూడా ఫోన్ చేసింది. డ్యూటీ డాక్టర్ వచ్చి చూసి వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టాడు. “మీ వెంట ఎవరయినా వచ్చారా”అడిగాడు డ్యూటీ డాక్టర్. “నా డ్రయివర్ ఉన్నాడు,అతను బయట బెంచి మీద కూర్చుని ఉన్నాడు”చెప్పాడు లింగేశ్వర్. “సిస్టర్ ఈయన్ని అబ్జర్వేషన్ లోకి మార్చండి.నేను సార్ తో చెప్పి వస్తాను”అంటూ హడావుడిగా వెళ్ళాడతను. నేను ఓపీ లో కూర్చుని ఉన్నాను.అబ్జర్వేషన్ బెడ్లు పక్కనే ఉంటాయి.అడ్డుగా ఒక్క తెరే అడ్డు. అది పెద్ద హాస్పిటల్ ఏమీ కాదు. అది ఎంబీబీఎస్ చేసిన ఓ డాక్టర్ పెట్టిన ప్రయివేటు హాస్పిటల్. అతని హస్తవాసి మంచిదవటంతో అనతి కాలంలోనే మంచి సంపాదించుకుంది.చుట్టుపక్కల ఉన్న మిడిల్ క్లాస్ కాలనీ వాసులకు బాగా ఉపయోగపడుతుంది.ఫీజులు అవీ పెద్దగా ఉండవు కానీ మంచి వైద్యం దొరుకుతుంది. లింగేశ్వర్ కి వైటల్స్ అన్ని బాగానే ఉన్నాయి. డ్యూటీ డాక్టర్ వెళ్ళి పెద్ద డాక్టర్ కి చెప్పాడు.ఆయన వెంటనే వచ్చి చూసి రెండు ఇంజెక్షన్లు ఇచ్చాడు. ఓం ఐదు నిమిషాలు గడిచాక లింగేశ్వర్ నార్మల్అయాడు. బైట కూర్చున్న డ్రైవర్ ఫోన్ తెచ్చి అతనికి ఇచ్చాడు. “ఆ హలో బేటా,అలాగా అతనికి చెప్పు ఆ నాలుగు లక్షలు ఇంకో గంటలోగా ఇవ్వక పోతే ఇచ్చిన ఐదు లక్షలు మర్చి పొమ్మని చెప్పు.నేను ఓ గంటలో ఇంటికి వస్తాను.అమ్మ ఏం వంట చేసింది,ఆ అట్లాగే” అంటూ ఫోన్ పెట్టేసాడు. మళ్ళీ పెద్ద డాక్టర్ వచ్చి చూశాడు. “అంతా బాగానే ఉంది.ఎనిమిక్ గా ఉన్నారు మందులు రాసిస్తాను వాడండి.”అంటూ డ్యూటీ డాక్టర్ వంక చూస్తూ “ఈయన్ని పంపించేయండి.”అన్నాడు. అప్పటి దాకా అన్నీ గమనిస్తున్న నేను ఒక్క సారిగా మ్రాన్పడి పోయాను. అరగంట కిందట చూసిన మనిషేనా ఇతను అనిపించింది. “అయ్యా బైలుదేరదామా,”అడిగాడు డ్రైవర్ “ఆ పద బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయి బిల్లు కట్టేసెయ్”అంటూ కుర్చీ లోంచి లేచాడతను. “అయ్యా మీకు బాగానే ఉంది కదా”అడిగాడు డ్రైవర్. “బాగానే ఉంది పద, అయినా డెబ్భై ఏళ్ళ వయసులో ఇవన్నీ మామూలే”అన్నాడు “మనం ఇక్కడే ఉంటే మన పని ఎవరు చేస్తారు? రేపు జీతాలు కూడా ఇవ్వాలి.పద పద”అంటూనే బయలు దేరాడు. నాకు జ్ఞానోదయం కలిగినట్లు అయింది. రిటైర్ అయిన తరువాత రోగాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అనిపించింది.లేని రోగం ఉన్నదనుకోవటం కూడా ఒక రోగమేనేమో.కిందటి వారమే హాస్పిటల్ కి వచ్చాను. “మీరు వందశాతం ఆరోగ్యంగా ఉన్నారు రావుగారూ, మందులు వాడటం మానుకోకండి చాలు”అని చెప్పాడు డాక్టర్ గారు. ఉదయం ఒంట్లో నలతగా అనిపించింది. “హాస్పిటల్ కి వెళ్ళి వస్తా”అంటే “మీకేమీ కాలేదు బాగానే ఉన్నారు”అని శ్రీమతి అంటున్నా వినకుండా వచ్చాను. ఇక్కడ లింగేశ్వర్ నుంచి చూసిన తర్వాత నేను అనవసరంగా కంగారు పడుతున్నాననిపించింది. నా రిటైర్మెంట్ రోజున మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. “మీరు ఇంతకాలం చాలా కష్టపడి పనిచేశారు.ఇంక మీరు రెస్ట్ తీసుకునే సమయం అనుకుంటున్నారని నాకు తెలుసు.కాని పనిలేకుండా ఉండటం ప్రమాదకరమని మీకు తెలుసా? మీకు వయసైపోయిందని మీరు అనుకోవచ్చు.కాని మీరు జీవితాన్ని ఎంజాయ్ చేసే వయసు ఇదేనని గ్రహించండి.బాధ్యతలు పెద్దగా ఉండి ఉండవనే అనుకుంటాను.మీకోసంమీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బ్రతికే సమయం ఇదేనని తెలుసుకోండి.ఆల్ ది బెస్ట్” “ఆరోగ్యానికి మరీ అంతలా ఇబ్బంది అయితే అప్పుడు చూసుకోవచ్చులే , అయినా ఏమీ సమస్య లేదని అంటూంటే నాకేమిటి భయం”అనుకుంటూ హాస్పిటల్ బైటకు నడిచాను.

మరిన్ని కథలు

Navvina naapachenu pandindi
నవ్విన నాపచేను పండింది
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Raaju oudaryam
రాజు ఔదార్యం!
- బోగా పురుషోత్తం
Kurchee
కుర్చీ
- జి.ఆర్.భాస్కర బాబు
Evari viluva vaaridi
ఎవరి విలువ వారిది
- కందర్ప మూర్తి