“నేను ధాన్యం మిల్లు రెడ్డిని, డాక్టర్ బాబుని కలవాలి”
“మీరు వచ్చేరని ఫోన్ చేసి డాక్టర్ గారితో చెప్తాను కూర్చోండి” అని, రిసెప్షన్ లో అమ్మాయి డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పింది.
రెండు నిమిషాలలో డాక్టర్ శ్రీకాంత్ వచ్చి రెడ్డి గారిని సాదరంగా తన గదిలోకి తీసుకొని వెళ్ళేడు.
“మీరు నన్ను క్షమించాలి. మా రిసెప్షన్ లో అమ్మాయికి మీరెవరో తెలియక బయట కూర్చోబెట్టింది”
“ఫరవాలేదు డాక్టర్ బాబూ”
త్వరత్వరగా నగరవాసనలు అందుకుంటున్న ఈ పల్లెలో, నెల క్రితం శ్రీకాంత్ తన ఆసుపత్రి పెట్టి దానికి రెడ్డి గారి చేతనే ప్రారంభం చేయించేడు.
“మీరు పేషెంట్ గా వచ్చినట్టైతే, ముందుగా మీ వయసు చెప్పి మీ సమస్యలు వివరాంగా చెప్పండి రెడ్డిగారు”
“నాకు రెండు నెలల్లో 60 నిండుతాయి డాక్టర్ బాబూ. సుమారు ఆరు నెలలుగా ఉదయం లేవగానే తల తిప్పుతున్నట్టుగా ఉంటుంది. నెలలో సుమారు పాతిక రోజులు రొంప పట్టే ఉంటుంది. రాత్రి పడుకుంటే, గొంతుక అదే పనిగా ఎండిపోయినట్టు ఉంటుంది. విరోచనం అవడం చాలా కష్టంగా ఉంటుంది. తిన్నది సులువుగా అరుగుతునట్టు కూడా లేదు. మూత్రం కూడా సుమారు ప్రతీ గంటకి వస్తూ ఉంటుంది. వంద అడుగులు నడిచేసరికే ఆయాసం అనిపిస్తూ ఉంటుంది. ఈమధ్య రెండు మోకాళ్ళు చాలా నొప్పి పెడుతూ, పది అడుగులు వేయడం కూడా కష్టంగా ఉంటుంది. రెండు కాళ్ళు వాచినట్టుగా ఉండి పాదాలు పొంగి ఉంటున్నాయి. రెండు కాళ్లలో నరాలు ఉబ్బినట్టుగా పైకి కనిపిస్తున్నాయి. ఆ మధ్యన పట్నంలో నా కళ్ళు చూసిన కంటి డాక్టర్ ఎడమ కంట్లో గ్లూకోమా వచ్చేటట్టు ఉంది, ప్రతీ ఆరు నెలలకొకసారి నా ఎడమ కన్ను చూపించుకోవాలని చెప్పేడు. ఎలాగా పట్నం వెళ్ళేను కదా అని పంటి డాక్టర్ కి పళ్ళు చూపించుకుంటే, ఆరు పళ్ళు పుచ్చిపోయేయి అని, అవి తీసి కట్టుడు పళ్ళు పెట్టాలి అని చెప్పి, వచ్చే ముందర ఫోన్ చేసి రమ్మన్నాడు. వచ్చే వారం వెళ్లాలనుకుంటున్నాను. ఇవన్నీ మీకోకసారి చెప్తే మంచిది అని మా ఆడది అంటే వచ్చేను. అంతే, మరేమీ సమస్యలు లేవు”
“మీ ఇంటికి రేపుదయం ఏడో గంట లోపల నా మనిషిని పంపుతాను. అతను వచ్చేవరకూ మీరేమీ త్రాగకుండా తినకుండా ఉండండి. మీ రక్తం పరీక్షించడానికీ నమూనా తీసుకొని వస్తాడు. ఏమీ ఆలోచించక మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఎల్లుండి మీరు ఇదే సమయానికి వచ్చేరంటే, మీ రక్తపరీక్ష ఫలితాలను బట్టి, మీకు ఏమైనా మందులు అవసరముంటే చెప్తాను. పథ్యం ఏమైనా చేయవలసి ఉంటే కూడా చెప్తాను. అవసరంగా ఎవరైనా పెద్ద డాక్టర్ ను కలవడం మంచిదనిపిస్తే కూడా చెప్తాను. ప్రస్తుతానికి వెళ్ళి రండి” అని రెడ్డిగారితో కూడా బయటకు వచ్చిన డాక్టర్ శ్రీకాంత్ ఆయనకు వీడ్కోలు పలికేడు.
*****