తగిన శాస్తి - Naramsetti Umamaheswararao

Tagina saasti

తగిన శాస్తి (కథ) ------ నారంశెట్టి ఉమామహేశ్వరరావు
ఒక చిట్టడవిలో కాకి, కోతి, నక్క స్నేహంగా ఉండేవి. మూడూ చెడ్డగుణం కలిగినవే కావడంతో వాటి స్నేహం చాలా కాలం నిలబడింది. అవి దారిన వెళ్లే బాటసారులను రకరకాలుగా ఏడిపించేవి. బాటసారుల చేతి సంచిని లాక్కుని చెట్టెక్కేది కోతి. అందులో తినుబండారాలుంటే తీసుకుని తినేసి సంచిని విసిరేసేది. సంచికోసం వచ్చిన బాటసారుల మీదు రెట్ట వేసేది కాకి. ధ్వన్యనుకరణ విద్య నేర్చుకున్న నక్క వచ్చిన బాటసారులను పులిలా గాండ్రించి భయపెట్టేది. అలా చాలా కాలం జరిగింది.
ఒకసారి అడవికి ప్రక్కనే ఉన్న ఊరి రైతు రామయ్య, తన కూతురి పెళ్లి కోసం నగలు కొనడానికి ఆ దారిలో వెళుతుంటే అతడిని చూసింది కోతి. వెనుకే వెళ్లి అతడి చేతి సంచి లాక్కుని చెట్టెక్కింది. అందులో తినవలసిన పదార్థాలేవీ లేకపోవడంతో సంచిలో ఉన్న డబ్బు కాగితాలను చింపి కింద పడేసింది. కళ్ళ ముందే కూతురు పెళ్లి నగల కోసం దాచిన డబ్బుని కోతి చింపి పడేస్తుంటే కోపం ఆపుకోసేకపోయాడు రామయ్య. కోతిని బెదిరించి అయినా ఆపాలని కర్ర కోసం చుట్టూ చూసాడు. దగ్గర్లో ఒక చెట్టు కింద కనబడిన కర్రని తీయబోతుంటే కొమ్మల్లో దాక్కున్న కాకి ఎగురుతూ వచ్చి అతడి నెత్తి మీద రెట్ట వేసింది. అది చాలదన్నట్టు ఇంకో చెట్టు చాటుకెళ్లి పులిలా గాండ్రించింది నక్క.
పులికి చిక్కితే ప్రాణానికే ప్రమాదమని భయపడిన రామయ్య ఊళ్లోకి పరిగెత్తాడు. చెట్టు దగ్గర జరిగిందంతా గ్రామస్తులకు చెప్పాడు .
రామయ్యని గ్రామస్తులంతా ఓదార్చి అతడి కూతురు పెళ్లికి సాయం చేస్తామని చెప్పారు. వారిలో ఉన్న ఒక యువకుడు ముందుకు వచ్చి “తనకి తెలిసిన గారడివాడు ఉన్నాడని, అతడి సాయం తీసుకుని వాటికి తగిన శాస్తి చేద్దామని” వారితో చెప్పాడు.
రామయ్యని గారడివాడు దగ్గరకు యువకుడే తీసుకెళ్లాడు. అతడితో జరిగిందంతా చెప్పాడు రామయ్య.
“చిట్టడవిలో పులి ఉండదు. ధ్వన్యనుకరణ తెలిసిన మరొక జంతువేదో అలాచేసి ఉంటుంది. నాకు మంత్ర విద్యలు కూడ వచ్చు. అక్కడేం జరుగుతుందో రహస్యంగా కనిపెడతాను . తరువాత వాటికి తగినశాస్తి చేస్తాను” అని మాట ఇచ్చాడు.
వారితో చెప్పినట్టే చెట్టు దగ్గర జరుగుతున్న దంతా రహస్యంగా గమనించాడు గారడివాడు .అతడికి మొత్తం బోధపడింది.
దాంతో ఒక రోజు కాకి, కోతి, నక్కలు ఉండే చెట్టు దగ్గరకు వెళ్లాడు. చేతిసంచితో తమ వైపు వచ్చిన గారడివాడిని ముందుగా చూసింది కోతి. అతడి చేతి సంచిని అందుకోవాలని గబుక్కున చెట్టు మీద నుండి దుమికి, సంచి మీద చెయ్యి వేసింది. అంతే దాని చెయ్యి సంచికి అతుక్కుంది.
కోతికి జరిగింది చూసిన కాకి గారడివాడి మీద రెట్ట వెయ్యలని ఎగిరింది. కానీ దాని రెక్కలు కదపలేకపోయింది. దబ్బున నేల మీద పడింది. తన మిత్రులు కాకి, కోతికి జరిగిందంతా వేరే చెట్టు చాటు నుండి చూసింది నక్క. వెంటనే పులిలా గాండ్రించాలనుకుని నోరు తెరచింది. కానీ దాని గొంతు పెగల్లేదు.
అప్పుడు కానీ తమ దగ్గరకి వచ్చిన వాడు మామూలు వాడు కాడనీ, అతడికేవో మంత్రశక్తులున్నాయని అర్ధమవ్వలేదు. దాంతో వాటికి బుద్ధి వచ్చింది. తమ వల్ల తప్పయిపోయిందని క్షమించమని అడిగాయి.
వాటిని చూసి నవ్వాడు గారడివాడు . “ఈ రోజు నుంచి మీ మూడూ నాతోనే ఉండాలి. నా బరువులన్నీ మొయ్యాలి నక్క. నేను చెప్పినట్టల్లా ప్రజల ముందు ఆటలాడి వినోదం పంచుతూ డబ్బు సంపాదించాలి కోతి. చనిపోయిన వాళ్లకి ఎవరు ఎక్కడ పిండాలు పెట్టినా అవి తిని బతకాలి కాకి. అక్కడేవైనా నాణాలు దొరికితే తెచ్చివ్వాలి. నేను చెప్పినట్టు చెయ్యకపోతే నా మంత్రవిద్యల సంగతి తెలుసుకదా. మిమ్మల్ని బంధించి చిత్రహింసలు పెడతాను” అని వాటికి గట్టిగా బుద్ధి చెప్పాడు.
చేసేది లేక అలాగేనంటూ తలూపాయి మూడున్నూ.
ఆ రోజు నుండి బాటసారులకు వాటి బెడద తీరిపోయింది. గారడీవాడికి ధన్యవాదాలు చెప్పారు గ్రామస్తులు. మొత్తానికి రామయ్య వల్లనే మూడింటి ఆట కట్టిందని అతడనీ మెచ్చుకున్నారు.
— --****------

మరిన్ని కథలు

Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్