చదువుకుంటాను నాన్నా - B.Rajyalakshmi

Chaduvukuntaanu naanna

శివ అప్పుడే బడి నించి వచ్చాడు ,చెప్పులు వదిలి కాళ్లూచేతులూ కడుక్కుని బట్టలు మార్చుకుని గబగబా అమ్మదగ్గరికి వెళ్లాడు .అమ్మ వొళ్లోని చెల్లాయిని తనవొళ్లో కూర్చోపెట్టుకుని ఆడుకుంటాడు ,ఆడిస్తాడు .ఏడాది పాపాయి కూడా అన్నయ్యను చూస్తూ నవ్వుతూ చిన్నిచేతులతో శివ జుట్టుతో ఆడుకుంటుంది .వాళ్లిద్దరినీ చూస్తూ అమ్మ మంగళ మురిసిపోతుంది .ప్రతిరోజూ దినచర్య అది .నాన్న శంకరం ఆ పల్లెటూళ్లోచిన్న బట్టలకొట్లో గుమస్తా .కొద్దిపాటి జీతం అదికూడా క్రమంగా యివ్వరు .రెండుగదుల చిన్నపెంకుటిల్లు రెండు గేదెలు వున్నాయి కాబట్టి ఆ కుటుంబం పరువుగా సాగిపోతున్నది .పెరట్లో కాయగూరలు ఆకుకూరలు పండించుకుంటారు .మంగళ కూడా పొదుపుగా ఒద్దికగా సంసారం తీర్చిదిద్దుకుంటున్నది .శంకరం వుదయం పదిగంటలకల్లా కారియర్ తీసుకుని వెళ్లి రాత్రి తొమ్మొదిగంటలకు వస్తాడు .శివ బడి యింటికి దగ్గరే అవడం వల్ల అమ్మకు చేదోడు వాదోడుగా సాయం చేస్తాడు .అమ్మ వంట చేస్తుంటే చెల్లాయిని ఆడిస్తాడు .శివ ఒకటి తరగతి చదువుతున్నాడు శివ చదువుతున్న బళ్లో ఫీజులు పెంచారు .శంకరం ఫీజులు కట్టలేకపోతున్నాడు .అందుకని శివను ఒకసంవత్సరం బడి మాన్పిద్దామని అనుకున్నాడు .

ఒకరోజు బళ్లో శివ స్నేహితుడు రఘు “శివా రేపు మన బళ్లో సర్కస్ వాళ్లు వచ్చి రకరకాల ఫీట్లు చూపిస్తారుట అందరినీ తలా యాభై రూపాయలు తెమ్మన్నారు నీకు తెలుసా “అన్నాడు .
“నాకు తెలుసు కానీ మా నాన్నదగ్గర డబ్బులు లేవు అందుకే నేను రేపు బడికి రాను “అన్నాడు శివ.రఘు శివ మంచి ఫ్రెండ్స్ .రఘు మంచి మంచి చొక్కాలు నిక్కర్లు వేసుకొస్తాడు .శివ చొక్కాలకు నిక్కర్లకు అన్నీ చిల్లులే అన్నీ కుట్లే .శివ చదువులో అందరికన్నా ఫస్ట్ టీచర్లందరికీ శివ అంటే యిష్టం .శివ బడి మానేస్తాడని యెవరికీ తెలియదు .ఆ రోజు శివ పొద్దున్నే నాన్న దగ్గరకు వచ్చి “నాన్నా నేను చదువుకుంటాను బడికి వెళ్తాను “అంటూ యేడుపు ముఖం పెట్టాడు .శంకరం తండ్రి హృదయం కరిగింది ,”శివా ఫీసుకట్టకపోతే బళ్లో చదవనివ్వరు పంపించేస్తారు నాదగ్గర డబ్బులులేవురా ,యీ సంవత్సరం డబ్బులు పోగుచేసుకుని వచ్చేసంవత్సరం చేరుస్తాను బంగారూ”అన్నాడు నాన్న శంకరం .
ఇంతలో మంగళ “వాడు బుధ్హిమంతుడు ,బళ్లో అన్నీ ఫస్ట్ మార్కులు వస్తున్నాయి ,యెలాగయినా వాణ్ణి బడికిపంపాల్సిందే నండీ,మనకష్టాలు యెల్లకాలం వుండవు ,సమయం ,వయసు చేతినించిజారిపోతే మళ్లీ మళ్లీ రావండీ,యివాళ మీరు బడికి వెళ్లి ప్రధాన ఉపాధ్యాయులు గారితో మాట్లాడండి ,”అన్నది .

“నిజమే ! నువ్వన్నవన్నీ ఒప్పుకుంటాను ,నాకుమాత్రం బడి మాన్పించాలని వుంటుందా ,బట్టలకొట్లో జీతం తక్కువ ,అదికూడా సరిగా యివ్వడం లేదు ,సరేలే మానప్రయత్నం చేద్దాం ,మధ్యాహ్నం కొట్లో పర్మిషన్ తీసుకుని బడికి వెళ్తాను ,శివా బెంగపెట్టుకోకు ,నిన్ను బడి కి పంపుతాము ,నీ యీడు పిల్లలందరూ బడికి వెళ్తుంటే నిన్నుఆపెంత మూర్ఖుడిని కాదు మంగళా శివను తయారుచెయ్యి ,నేను దింపేసి కుదిరితే యిప్పుడే వాళ్లతో మాట్లాడుతాను “అన్నారు శంకరం .


తండ్రి మాటలకు శివ మొహం వెలిగిపోయింది .మంగళ మొహం లో ఆనందం కన్నీటిచుక్కలయి శివను ముద్దాడింది .పాపాయి నవ్వుతూ నాన్నను చూసింది .శివ గబగబా తయారయ్యి బడికి తండ్రితో వెళ్లాడు .శంకరం గారు ఆఫీసుగదిలో కూర్చున్నారు .పిల్లలంతా వాళ్ల వాళ్ల తరగతి గదుల్లోకి వెళ్లాక హెల్డ్మాస్టర్ గారు తనఆఫీసులోకి వచ్చారు .శంకరం గారు లేచి నమస్కారం చేసారు .
“నేను ఒకటో తరగతి చదివే శివ నాన్నను “శంకరం గారు యింకా చెప్పబోతుంటే హెడ్మాస్టారు గారు “శివ నాన్నగారా మీరు ?చాలాసంతోషం ,మీ అబ్బాయి చాలాబుద్ధిమంతుడు ,చురుకువాడు ,బాగాచదువుతాడు ,మా టీచర్లందరికీ వాడంటే మహాయిష్టం “అంటూ అయన మహా సంబరం గా చెప్పుకుపోతున్నారు .
“అవునండీ ,మా వాడు చదువులో చురుకు ,యింట్లో వయసుకు మించిన పుస్తకాలూ చదువుతున్నాడు కానీ నా ఆర్థికపరిస్థితి వల్ల చదివించలేనేమో అని భయం వేస్తున్నది “అన్నారు శంకరం .

“శంకరం గారూ ,శివ మా విద్యార్థి ,అలాంటి వాణ్ణి మేమొదులుకుంటామా ,డబ్బు ఫీజు మీరు కంగారుపడకండి ,శివ చదువు కు ఆటకం లేకుండా ఉపకారవేతనం యేర్పాటు చేస్తాం .మీ పని వాణ్ణి బడికి పంపడమే !బట్టలు పుస్తకాలూ ఫీజు అన్నీ అన్నీ మేం చూసుకుంటాం ! వాడు మా బడికి ఒక గిఫ్ట్ .”అంటున్న హెడ్మాస్టరుగారి నీ చూస్తూ శంకరం. గారు అయన పాదాలకు నమస్కరించారు .

నిజం గా మన సమాజం లో తెలివి చురుకుతనం వున్న విద్యార్థిని ప్రోత్సహిస్తే మనకు యెన్నో యెన్నో ఆణిముత్యాలు . కేవలం డబ్బులులేక విద్యార్థి బంగారు భవిష్యత్తు ఆగిపోకూడదు .

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న